Home » VASUNDHARA » Vasundhara Kadhalu - 13
కిడ్నాపర్స్ గ్యాంగ్
---వసుంధర

అతడి పేరు విశ్వంభరం. వయసు యాభై అయిదు. తెల్లటి మీసాలు, జుత్తు! మనిషిని చోదోఅగానే ముసలివాడనిపిస్తుంది. అతడికి పెళ్ళయింది. భార్యాబిడ్డ లున్నారు. కూతురికి మంచి సంబంధమే చేశాడు. కొడుకులిద్దరూ మంచి ఉద్యోగాల్లో వున్నారు. భార్య కొన్నాళ్ళు పెద్దకొడుకు దగ్గరా, కొన్నాళ్ళు చిన్నకొడుకు దగ్గరా వుంటూంటుంది.
కొడుకులు తమవద్దకు వచ్చి ఉండవలసిందిగా విశ్వంభరాన్ని అడుగుతూంటారు. కానీ చిన్నప్పట్నించీ ఆయన తరహా వేరు. ఇంట్లో అందరి సరదాలూ, అవసరాలూ తీరగా మిగిలిన డబ్బు తను ఖర్చు చేసేవాడు. నిలవల గురించి యెప్పుడూ ఆలోచించేవాడు కాదు, క్లబ్బులూ, నైట్ క్లబ్బులూ ఆయన హాబీ! పేకాట, ఆడవాళ్ళు ఆయన అవసరం!
యాభై అయిదేళ్ళొచ్చినా యిప్పటికీ ఆయనకా అవసరాలలాగే వున్నాయి. సంసారం కంటే వీటితోనే ఆయన జీవితం ఎక్కువగా ముడిపడింది.
విశ్వంభరం దగ్గర డబ్బెప్పుడూ నిలవుండదు. కానీ ఆ విషయం యెవ్వరికీ తెలియదు. యెందుకంటే యెంత డబ్బు అవసరమైనా అయన అప్పటికప్పుడు ఎలాగో పట్టుకొచ్చే వాడు. ఆయన యెక్కడో డబ్బు దాస్తున్నాడనే భార్య అనుకునేది. పేకాటలో తను బాగా సంపాదిస్తున్నానని ఆయన భార్యకు చెప్పేవాడు.
పేకాటలో విశ్వంభర డబ్బు సంపాదింఛే మాట నిజం అయితే పేకాట డబ్బు పెకతకు తప్ప ఎందుకూ ఉపయోగపడదన్నది అందరకూ తెలిసిన నిజం. విశ్వంభరం డబ్బు సంపాదించే పద్ధతి వేరే వుంది. ఆయనకు ఓ కిడ్నాపర్సు గ్యాంగుతో పరిచయముంది.
ఆ గ్యాంగులో మొత్తం అయిదుగురు. విశ్వంభరం ఆరోవాడు. అంతా ఆయనలాంటివాళ్ళే! వాళ్ళ అవసరాలు మరీ పెద్దవికాదు. అప్పుడప్పుడు యింటి ఖర్చులు తట్టుకోవడం కోసం వాళ్ళు మనుషుల్ని ఎత్తుకొస్తూంటారు. వచ్చిన డబ్బుని అంతా పంచుకుంటారు.
వాళ్ళలో మంచి అవగాహన కూడా వుంది. ఒకరికోసం ఒకరు త్యాగాలు చేస్తూంటారు. విశ్వంభరం కూతురి పెళ్ళికి పాతికవేలు అవసరమయ్యాయి. పెళ్ళికావలసిన ఓ ధనికుడి పిల్లని కిడ్నాప్ చేశారు. పాతికవేలే అడిగారు. పోలీసుల జోలికి వెళ్ళినా, తమ ఆచూకీ తెలుసుకునేందుకు ప్రయత్నించినా ఆ పిల్ల జీవితం నాశనం చేయగలనని బెదిరించారు. పాతికవేలూ పుచ్చుకుని పిల్లని వదిలేశారు. ఆ పాతిక వేలూ విశ్వంభరం ఒక్కడికే వెళ్ళాయి.
వాళ్ళలో వాళ్ళకి అకౌంట్స్ లేవు. ఎవరికి అవసరమయినా మిగతావారంతా సహాయపడతారు.
ఆరుగురిలో ఒకడు వేషాలు మార్చడంలో దిట్ట. వాడి అసలు వేషమేమిటో వాడికీ తెలియదనిపిస్తుంది. ఎత్తు కొచ్చిన మనుషుల్ని దాచడానికి రెండిళ్ళున్నాయి.
వీళ్ళడిగే మొత్తాలు చిన్నవి. అడిగేది మధ్యతరగతి కంటే ఓ మాదిరి మెరుగయినవాళ్ళని వ్యవహారం ఎంతో మర్యాదగా వుండేది! హెచ్చరిక దారుణంగా వుండేది.
ఈ కారణాలవల్ల వీళ్ళ వ్యవహారం ఎన్నో ఏళ్లుగా నిరాటంకంగా కొనసాగిపోతోంది. అసలు వీళ్ళ గురించి పెద్ద ప్రచారం కూడా లేదు.
ప్రజలకు పిరికితనం వుండడం, పోలీసులు వారి పిరికితనాన్ని పోగొట్టేంత సామర్ధ్యాన్ని కలిగి వుండక పోవడం-యిలాంటి నేరస్థులకు వరాలుగా ఉపయోగపడుతున్నాయి.
ప్రస్తుతం విశ్వంభరానికి కొడుకుల దగ్గర్నుంచి కొంత డబ్బు వస్తోంది. ఆయన ప్రయివేటు కంపెనీలో ఉద్యోగం చేశాడు. మూడేళ్ళ క్రితం వాళ్ళాయన్నుద్యోగం నుంచి తప్పుకోమన్నారు. అందువల్ల పెన్షనులాంటిది వేరే యేమీలేదు. ఆ ఊళ్ళో ఆయనకు రెండిళ్ళున్నాయి. ఓ యింటికి నెలకు ఆరువంధాలు అద్దెవస్తూంది. రెండో యింట్లో ఆయన ఉంటున్నాడు. అప్పుడప్పుడు వచ్చిపోయే కుటుంబ సభ్యుల కోసం అది అద్దెకివ్వకుండా అలాగే వుంచేవారు.
తనకు వచ్చేదికాక సుమారు మరో వెయ్యి రూపాయలు అవసరపడుతూంటుంది విశ్వంభరానికి. ఆయనకు కొన్ని ఆదర్శాలున్నాయి. తను అప్పు చెయ్యదు. ఎవర్నీ డబ్బు కావాలని అడగడు. అవసరమైన డబ్బు సంపాదించి ఖర్చు చేయడమే ఆయన పద్ధతి.
ఆ నెలలో విశ్వంభరానికి కాస్త యిబ్బంది వచ్చింది.
నైట్ క్లబ్బుకొక కొత్తపిట్ట వచ్చింది. ఆమె విశ్వంభరానికి బాగా నచ్చింది. ముసలివాళ్ళకు ఆమె రేటు ఎక్కువ పెట్టింది. ఒక వారంరోజులు ఆయనతో గడపడానికి ఆ పిట్ట ఒప్పుకుంది. అందుకు అయిదువేలు అడిగింది.
విశ్వంభర తన అవసరం గురించి కిడ్నాపర్సు గ్యాంగుకి చెప్పుకున్నాడు. వెంటనే వాళ్ళు రంగంలోకి దిగారు.
ఓ పెద్ద కేసునేపట్టి అంతా తలో అయిదువేలు అయినా సంపాదించాలని వాళ్ళు అనుకున్నారు. అయితే టైము యెంతోలేదు. విశ్వంభరానికి నచ్చిన పిట్టి ఆ ఊళ్ళో రెండు వారాలు మాత్రమే వుంటుంది. వచ్చి అప్పుడే రెండ్రోజులయింది. ఆమెతో ఆయనకు వారంరోజులైనా గడిపే అవకాశం రావాలి.
కంగారుపడితే ఆలస్యం పెరిగిపోతుంది. ఓ పట్టాన మంచి కేసు దొరకలేదు. అప్పుడు వాళ్ళో నిర్ణయానికి వచ్చారు పెద్ద కేసు సంగతి తర్వాత చూడవచ్చును. ముందు విశ్వంభరానికి అవసరమయిన అయిదువేలూ దొరికే కేసైనా చాలును.
ఈ నిర్ణయానికి రాగానే వాళ్ళ అవకాశాలు పెరిగాయి. యాభై వేలు ఇచ్చుకోగల వారికంటే-అయిదువేలిచ్చుకోగల వారెలాగూ ఎక్కువే వుంటారు.
వేషాలు మార్చగల కిడ్నాపర్ వుత్సాహంగా బయల్దేరాడు. అతడి చేతిలో చందాల పుస్తకం వున్నది. అది తీసుకుని యింటింటికీ వెడుతున్నాడు. వారి పరిస్థితి అంచనా వేస్తున్నాడు. ఎవరెవరు ఎంతివ్వగలరు? ఎవరెవరింట్లో ఎవర్ని కిడ్నాప్ చెయ్యవచ్చు?-అన్నవి అతడు పరిశీలించే అంశాలు.
అయితే కిడ్నాపింగుకి అతడికి వచ్చిన అవకాశాలు చాలా తక్కువ. అప్పుడు స్కూళ్ళకు సెలవు కూడా కానీ అతడి అనుభవం!
ఓ యింట్లోంచి పనిపిల్ల రెండేళ్ళ కుర్రాడిని ఎత్తుకుని బయటకు ర్వడం చూశాడు. ఆ కుర్రాడు బొద్దుగా, ముద్దుగా-ఎంతో బాగున్నాడు. అందులోనూ పనిపిల్ల చంకలో మరింత మెరిసిపోతున్నాడు. ఆ పిల్ల నల్లగా వుంది. ముఖం కళగానే వున్నా బట్టల కారణంగా మరింత జిడ్డుగా అగుపిస్తోంది ఆ పిల్ల రోడ్డుమీదకు వచ్చేక కిడ్నాపర్ ఆమెను పలకరించాడు.
"పాపా-ఈ బాబు మీ తమ్ముడా?"
"కాదండి-" అందామె.
"అరే-అచ్చం నీకులాగే వుంటేనూ-" అన్నాడు కిడ్నాపర్.
పనిపిల్ల సిగ్గుపడింది. కానీ తను పనిపిల్లనని చెప్పలేదు. దానికి బహుశా పధ్నాలుగేళ్ళ వయసుంటుందేమో! నీటుగా కనబడే ఓ మనిషి-తనను ఆ బాబుకు అక్కగా గుర్తించినందుకు ఆ పిల్లకు ఆశ్చర్యానందాలతోపాటు సిగ్గు కూడా కలిగింది.




