Home » VASUNDHARA » Vasundhara Kadhalu - 2



    "కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుంది. ఆ క్రోటన్సు ఆకు అదేనని ఏం చెప్పగలం?" అన్నాడు ఇన్ స్పెక్టర్.
    "ఒకటి రెండు విశేషాలు కాకతాళీయంగా జరుగవచ్చు. కానీ అన్నీ కాకతాళీయంగా జరుగుతాయంటే నేను నమ్మలేను. ఆ ఇంటిలోంచి ఆరుగంటల ప్రాంతాల ఓ మనిషి బైటకురావటం కొందరు చూశారు. అదే రూపురేఖలతో ఉన్న వ్యక్తిని ఆ వీధి సందు మొగలోని ఒక రిక్షావలా అన్నపూర్ణా హోటలు దగ్గర దిగవిడిచాడు. అదే రూపురేఖలు గల వ్యక్తి అన్నపూర్ణా హోటల్లో పదకొండో నెంబరు గదిలో బసచేశాడు. ఆ గదిలో ఓ క్రోటన్సు ఆకు వుంది. ఇదంతా చూస్తే మీకు శశికాంత్ కథ నమ్మాలనిపించటంలేదూ?" అన్నాడు వెంకన్న.
    ఇన్ స్పెక్టర్ ఆరాధనా పూర్వకంగా వెంకన్న వంక చూసి-"మీ పరిశోధనా చాతురిని అభినందించకుండా ఉండలేను. అయితే నాదొక్క సందేహం. మీరు శశికాంత్ హంతకుడిని చూసినట్లు భావిస్తున్నారు. కానీ శశికాంత్ రాఘవరావుని చూశానంటున్నాడు. అతడు నిజమే చెబుతున్నాడనుకుందాం. శశికాంత్ ఆరుగంటలకు చూసిన రాఘవరావు మూడు గంటలకే ఎలా చచ్చిపడున్నాడు?" అన్నాడు.
    "అలా అడగండి-చెబుతాను-" అన్నాడు వెంకన్న-"హంతకుడికి శశికాంత్ రాఘవరావు ఇద్దరూ బాగా తెలుసు. అతడు రాఘవరవుని హత్యచేశాక రాఘవరావులా కాసేపు నటించాడు. అది శశికాంత్ కోసం. శశికాంత్ నమ్మకం పెంచడం కోసమే అతడు క్రోటన్సు ఆకుని త్రుంచాడు. ఆ ఆకే తనకు ప్రాణాంతకమవుతుందని అప్పటిలో అతనికి తెలియదు-"
    "మీ కథనం బాగానే ఉంది. అయితే ఈ క్రోటన్సు ఆకుతో మనమేం సాధించగలమో చెప్పండి!" అన్నాడు ఇన్ స్పెక్టర్.
    "విజ్ఞానశాస్త్రం మారణాయుధాలను తయారుచేస్తోందనేతప్ప అది మనుషుల దుష్టత్వానికి మారణాయుధంగా ఎలా పనిచేస్తోందో మీలో చాలామందికి తెలియదు. ఈ పార్సిల్ విప్పి చూడండి. ఈ ఉత్తరంలోని వివరాలు చదవండి-" అన్నాడు వెంకన్న-ఓ కాగితాన్ని ఇనస్పెక్టర్ కి అందిస్తూ.
    ఓ పది నిమిషాలసేపు ఇన్ స్పెక్టర్ అవన్నీ పరీక్షించి "బాప్ రే!" అన్నాడు.
    మనుషుల చేతి వేలిముద్రలు చూడ్డానికి ఒక్క లాగునే కనబడవచ్చాను. కానీ ఈ ప్రపంచంలో ఏ యిద్దరు మనుషుల వేలిముద్రలూ ఒకేలాగున ఉండవు. అది సృష్టి విచిత్రం. ప్రొఫెసరు భూషణరావు ఈ విచిత్రాన్ని మొక్కల విషయంలో పరిశోధిస్తూ చాలా విశేషాలు తెలుసుకొనడమేకాక కొన్ని కొత్త పరికరాలు కూడా కనిపెట్టాడు. ఆయన వృక్షశాస్త్ర నిపుణుడు. ఆయన పరిశోధనల గురించి ఆసక్తిగా చదివే వారిలో వెంకన్న ఒకడు.
    చూడ్డానికి అన్ని ఆకులూ ఒకేలాగున ఉండవచ్చును. కానీ ఓ ఆకు ఫలానా చెట్టునుంచి త్రుంచబదిందా లేదా అన్న విషయం తెలుసుకోడానికి కొన్ని పద్ధతులున్నాయి. అదే విధంగా ఆకు మొక్కనుంచి త్రుంచబడినాక దానిలో వచ్చే మార్పులను బట్టి అది త్రుంచబడి ఎంతసేపయిందో చెప్పవచ్చును.
    క్రితం రోజు ఉదయం వెంకన్న ఆ ఆకును తీసుకొని ప్రొఫెసరు భూషణరావు వద్దకు వెళ్ళి తన సమస్య చెప్పుకున్నాడు. ఈ కేసులో ప్రొఫెసరుకూ ఆసక్తి కలిగింది. అయన ఆ ఆకుపై పరీక్షలు జరిపి అది రాఘవరావు ఇంటిలో క్రోటన్సు మొక్కనుంచి హత్య జరిగిన రోజు సాయంత్రం అయిదుకూ, ఆరుకూ మధ్య త్రుంచబడిందని ధృవీకరించాడు. అందుకు తానేమేం పరీక్షలు చేశాడో వివరంగా వ్రాశాడాయన. ఆ క్రోటన్సు మొక్కకు చెందిన మరో నాలుగు ఆకులు కూడా పార్సిల్లో వున్నాయి.
    "వెంకన్నగారూ- మీ పరిశోధనా సామర్ధ్యానికి నా జోహార్లు. నేను పోలీసు ఉద్యోగినని చెప్పుకునేందుకు సిగ్గుపడుతున్నాను...." అన్నాడు ఇన స్పెక్టర్.
    "ఇందులో సిగ్గుపడవలసినదేమీ లేదు. ప్రభుత్వోద్యోగులకూ, ప్రయివేటు అంగం వ్యక్తులకూ ఆ తేడా ఎప్పుడూ ఉంటున్నదే!" అన్నాడు వెంకన్న.
    "ఇప్పుడేం చేయాలంటారు?" అన్నాడు ఇన్ స్పెక్టర్.
    "ఈ వేలిముద్రల కాపీ ఒకటి మీ దగ్గరుంచండి. ఇవి హంతకుడి వేలిముద్రలనడానికి ఏ మాత్రమూ సందేహం లేదు. ఇంక మనం హంతకుడిని పట్టుకోవాల్సి వుంది- అన్నాడు వెంకన్న.
    "అందుకూ ఏదైనా పథకం వేశారా?" అన్నాడు ఇన స్పెక్టర్.
    "క్రోటన్సు ఆకు గురించి పేపర్లో ప్రకటించానుగాదా-అతడు మళ్ళీ హోటలుకు తప్పక వెడతాడని నా నమ్మకం. అతడా గదిని తన గురించి నాలుగు రోజులు బుక్ చేశాడు...." అన్నాడు వెంకన్న-"మీరూ వస్తే రండి-ఇప్పుడు నేను అన్నపూర్ణా హోటలుకు వెడుతున్నాను-...."
    ఇన స్పెక్టర్ లేచి నిలబడి-"అఫీషియల్ గా నాకు ఈ ఇన్వెస్టిగేషన్ తో సంబంధంలేదు. నాకు సంబంధించి నంతవరకూ ఈ హత్య కేసు తేలిపోయింది. హంతకుడు దొరికేశాడు. కానీ మీ పరిశోధన చాలా ఆసక్తికరంగా ఉన్నది. చూస్తాను-" ఆనందు.
    "యూ ఆర్ వెల్ కం. కానీ తొందరపడి శశికాంత్ పై ఛార్జి షీట్ ఫైల్ చేయకండి. కొద్ది రోజులు వేచి చూడండి. నా పరిశోధన మన పరిశోధనగా మార్చడానికి నాకు అభ్యంతరం లేదు-" అన్నాడు వెంకన్న.
    "థాంక్యూ-" అన్నాడు ఇన స్పెక్టర్.
    ఇద్దరూ కలిసి అన్నపూర్ణా హోటలు చేరుకున్నారు. అక్కడ మేనేజరు వారిద్దరికీ స్వాగతం పలికాడు. వెంకన్న వంక చూస్తూ- "నమస్కారమండీ! అతను వచ్చాడు. ప్రస్తుతం రూంలోనే ఉన్నాడు-" అన్నాడు.
    వెంకన్న కళ్ళు పెద్దవయ్యాయి. ఇంత సులభంగా అతడు తమకు దొరుకుతాడని అనుకోలేదు.
    "ఎంతసేపయిందతడు వచ్చి?" అన్నాడు వెంకన్న.
    "అయిదు నిమిషాలయింది. మీకు ఫోనుచేద్దామనుకుంటూండగా మీరే వచ్చారు-" అన్నాడు మేనేజరు.
    "అయితే అర్జంటుగా వెళ్ళి అతణ్ణి కలుసుకోవాలి" అన్నాడు వెంకన్న.
    ముగ్గురూ బయల్దేరి రూం నెంబరు పదకొండు చేరుకున్నారు.
    తలుపులు దగ్గరగా వేసి వున్నాయి.
    మేనేజరు తలుపు తోశాడు. గదిలో ఎవరూ లేరు. అతడు చటుక్కున బాత్రూంలోకి వెళ్ళి చూశాడు అక్కడా ఎవ్వరూ లేరు.
    వెంకన్న వంగి పరిశీలించడం అయింది. అతడు తిరిగి వచ్చిన మేనేజరు వంక చూసి-"అతడు వచ్చిన పని అయింది. క్రోటన్సు ఆకు తీసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనం త్వరగా అతడేమైనాడో తెలుసుకోవలసిఉంది-" అన్నాడు.
    విచారించగా అతడు గది తలుపులు తెరిచిన రెండు క్షణాల్లోనే వెళ్ళిపోయినట్లు తేలింది.
    "అతడు క్రోటన్సు ఆకుకోసం వచ్చాడు. మరింకేం పనీ లేదతడికి. క్షణం కూడా ఇక్కడుండటం ఇష్టంలేదతడికి. వచ్చిన వెంటనే వెళ్ళిపోతే అనుమానించడం జరుగుతుందని భయపడి మేనేజరుకు తెలియకుండా వెళ్ళి పోయాడు. అయితే హంతకుడు తను తప్పించుకున్నాననే అనుకుంటున్నాడు. అందువల్ల అతడు కాసేపాగి మీకు ఫోనుచేసి తను గది ఖాళీ చేస్తున్నానని చెప్పవచ్చు. అతడిని పట్టుకునేందుకదే ఓ పెద్ద ఆధారం కాగలదు. నేనీరోజు మీ దగ్గరే కాపలాకాస్తాను" అన్నాడు వెంకన్న ఏదో ఆలోచిస్తూ.
    ఇన స్పెక్టర్ వెంకన్న భుజం తట్టి-"అమూల్యమైన మీకాలం వృధాచేయకండి. ఈ రోజు ఈ మేనేజరుకు వచ్చిన ఫోనుకాల్సన్నీ ఎక్కణ్ణించి వస్తున్నాయో తెలుసుకునే ఏర్పాటు చేస్తాను. మనక్కావలసిన కాల్ రాగానే క్షణాలమీద ఆ మనిషిని పట్టిస్తాను-" అన్నాడు.




Related Novels


Vasundhara Kadhalu - 15

Vasundhara Kadhalu - 14

Vasundhara Kadhalu - 13

Vasundhara Kadhalu - 12

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.