Home » VASUNDHARA » Vasundhara Kadhalu - 2



                                శాపగ్రస్థుడు
                                                             ---వసుంధర


    గుబురుగా వున్న క్రోటన్స్ మొక్కల వెనుక కూర్చుని వున్నాడతను. అతడి చేతిలో కత్తివుంది.
    రాఘవరావు దొడ్లో పడక్కుర్చీలో కూర్చుని వున్న వాడల్లా వున్నట్లుండి లేచి క్రోటన్సు మొక్కల దగ్గరకు వెళ్ళాడు.
    అతడు ఊపిరి బిగబట్టాడు. కత్తివంక ఓసారి చూసుకుని-"అప్పుడే కాదు-" అనుకున్నాడు.
    రాఘవరావు మొక్క దగ్గర ఆగాడు. ఓ ఆకుత్రుంచాడు. దాన్ని సగానికి మడిచి వాసన చూశాడు.
    క్రోటన్సు ఆకు మధ్యకు మడిచినప్పుడు చిట్లుతుంది. అప్పుడదొకరకమైన వాసన వేస్తుంది. ఆ వాసన రాఘవరావుకెంతో ఇష్టం. ఆయనా ఆకుని తీసుకొని మళ్ళీ వెళ్ళి పడక్కుర్చీలో కూర్చున్నాడు.
    రాఘవరావు ఆకాశంకేసి చూస్తూ ఏమో ఆలోచిస్తున్నాడు.
    "ఎప్పటికీ ఆయనక్కన్నించి కదలడేం?" అనుకున్నాడతను. ఆయనింట్లోకి వెడితే తప్ప తనకూ అవకాశం రాదు. ఆయన చాలా సేపట్నుంచి అక్కడే కూర్చున్నాడు. అతడిలో సహనం చచ్చిపోతోంది.
    చేతిలో కత్తి వుంది. కాని తను హత్య చెయ్యడానికి రాలేదు. అది కేవలం ఆత్మరక్షణకు కూడా తెచ్చుకొచ్చాడు. ఇంట్లో యెవరికంటా బడకుండా లోపలకు వెళ్ళి తాననుకున్న పని సాధించాలి. సాధిస్తే!?    
    రాఘవరావు లేచాడు. ఇంట్లోకి వెళ్ళాడు.
    అతడికి తెలుసు. ఇంట్లో ఎవ్వరూ లేరు-ఆయనతఃప్ప!    
    ఇంట్లోకి ఎలా ప్రవేశించాలో కూడా అతడికి తెలుసు. అతడు చప్పున దొడ్లోంచి అటు పరుగెత్తి స్నానాల గది సమీపించాడు. స్నానాల గది కిటికీలోంచి అతడు లోపలకు గెంతాడు.
    లోపల అంతా పొడిగా వుంది.
    అతడికా యిల్లు క్షుణ్ణంగా తెలుసు. స్నానాల గది లోంచి ఓ మూలకు వెళ్ళాడు. అక్కణ్ణించి చూస్తూంటే మనిషి కనబడకపోయినా రాఘవరావెక్కడున్నదీ అలికిడి తెలుస్తుంది. రాఘవరావు ఇప్పట్లో ఇటు వచ్చేలాలేడు. అతడు చప్పున పక్కనే వున్న గదిలోకి దూరాడు.
    గదిలో అతడు చూసిన దృశ్యం...... .....
    మంచంమీద రాఘవరావు.....అతడి గుండెల్లో కత్తి..
    కెవ్వుమని కేక వేయబోయి ఆగాడతను.
    అతడి వెనుకనే ఆ గది తలుపులు మూసుకున్నాయి.
    
                                       2

    "నా పేరు శారద!" అన్నదా యువతి.
    సీతమ్మ, రాజమ్మ వెంటనే ఆ విషయం నోట్ చేసుకున్నారు.
    "శశికాంత్ కూ నాకూ పెళ్ళి నిశ్చయమయింది-" అందామె మళ్ళీ.
    వెంకన్న తమాషాగా తలూపి-"శశికాంత్ ఇప్పుడు పోలీసు కస్టడీలో ఉన్నాడు కదూ!" అన్నాడు.
    "అవునండి. కానీ అతడు అమాయకుడు. అన్యాయంగా ఎవరో అతన్నిందులో ఇరికించారు, అతడినిప్పుడు మీరు తప్ప యెవ్వరూ కాపాడలేరు...."
    "అతడు నిర్దోషికాని పక్షంలో నేనూ కాపాడలేను" అన్నాడు వెంకన్న.
    శారద నిబ్బరంగా చూసింది డిటెక్టివ్ వంక-"వెంకన్న గారూ-దోషులను కాపాడమని నేను మీకు చెప్పను. శశికాంత్ దోషి అయిన పక్షంలో అతడిని ప్రేమించినందుకు పశ్చాత్తాప పడతాను కూడా! అయితే ఈ ప్రపంచమంతా ఏకమై అతడు దోషి అని ఘోషించినా నేను నమ్మను. కానీ మీరు పరిశోధించి అదే విషయం ధృవపరిస్తే నమ్ముతాను. మీరిప్పుడు అతడిని రక్షించవద్దు. అతడి గురించిన నిజాన్ని తెలుసుకోండి-"
    "శభాష్!" అన్నాడు వెంకన్న. తన అసిస్టెంట్సువంక చూసి-"ఈమె అన్న మాటలు సాహిత్యంలో ఉంచదగ్గవి. సరిగ్గా నోట్ చేశారా?" అనడిగాడు. సీతమ్మ, రాజమ్మ తలలూగించారు.
    "అసలేం జరిగిందో చెప్పమంటారా?" అంది శారద.
    "అవసరం లేదు. నేను చెబుతాను. అంతా సావధానంగా విని-నా కథలో లోపాలుంటే నువ్వు చెప్పు-" అన్నాడు డిటెక్టివ్ వెంకన్న.
    శారద ఆశ్చర్యంగా అతడివంక చూసింది. అతడు చెప్పనారంభించాడు.
    
                               *    *    *

    శశికాంత్ రాఘవరావు మేనల్లుడు. బియ్యే ప్యాసయ్యాడు. మేనమామ కోరికమీద ఆయనకు ఆస్తి వ్యవహారాల్లో సాయపడడానికి ఆర్నెల్ల క్రితం ఈ ఊరు వచ్చాడు. రాఘవరావు కతడు నచ్చాడు. తన కూతుర్నిచ్చి పెళ్ళి చేయాలనుకున్నాడు. అతడంగీకరిస్తాడన్న నమ్మకంతో శశికాంత్ పేరున లక్షరూపాయల ఆస్థి రాశాడు. రాఘవరావు కొక్కగానొక్క కూతురు.
    ఈ ఊరొచ్చిన నెలరోజుల్లోనే శశికంత్ కి శారదతో పరిచయమైంది. అతడామెనీ, ఆమె అతడినీ ప్రేమించడం జరిగింది. శారద ఇంటర్మీడియేట్ ప్యాసై తర్వాత చదువు మానేసింది. ఆమె రోజూ పార్కుకి వస్తూంటుంది. అక్కడే శశికాంత్ ని కలుసుకుంటూండేది చాలా తరచుగా.
    రాఘవరావు కి శశికాంత్, శారదల వ్యవహారం తెలియడానికి కొద్ది నెలలు పట్టింది. తెలియగానే ఆయన తన మనసులోని ఉద్దేశ్యం గురించీ, వీలునామా గురించీ చెప్పాడు. వినగానే శశికాంత్ బుర్ర తిరిగిపోయింది.
    లక్షరూపాయల ఆస్థి అంటే అతడికి మాటలుకాదు. చూస్తూ చూస్తూ దాన్ని వదులుకోలేడు. అయితే రాఘవరావు కూతురు అతడికి బొత్తిగా నచ్చలేదు. బహుశా ఆమె ఏ మగవాడికీ నచ్చకపోవచ్చునని శశికాంత్ అనుమానం.
    అతడు నెమ్మదిగా తను శారదను ప్రేమించిన విషయం ఆయనకు చెప్పుకున్నాడు.
    "అన్నీ తెలిసే నిన్ను పిలిచాను. నీ మనసు మార్చుకోగలవేమో చెప్పు. లేనిపక్షంలో నా వీలునామా మార్చుకుంటాను-" అన్నాడు రాఘవరావు.
    శశికాంత్ వారంరోజుల వ్యవధి అడిగాడు. ఈలోగా రాఘవరావు కుటుంబం-బంధువుల పెళ్ళికి పొరుగూరు వెళ్ళారు.
    శశికాంత్ గడువు పూర్తికావడానికి ఆఖరిరోజున రాఘవరావు చనిపోయాడు. అది మామూలు చావుకాదు. హత్య! గదిలో ఆయన పక్కన శశికాంత్ వున్నాడు. అతడి గుండెల్లో దిగబడిన కత్తిమీది వేలిముద్రలు-శశికాంత్వి.
    ఎవరో శశికాంత్ ని చూశారు. గది తలుపులు వేసి పోలీసులకు ఫోన్ చేశారు.
    మేనమామ వీలునామా మారుస్తాడన్న భయంతో శశికాంత్ ఆయన్ను చంపేశాడు-అని పోలీసులంటారు.
    శశికాంత్ చెప్పే కధనం వేరుగా వుంది.
    నాలుగు రోజుల క్రితం ఓ వ్యక్తి అతడిని కలిశాడు. రాఘవరావు ఇంటిలో అతడికి కావలసిన ముఖ్యమైన కాగితాలేవో ఉన్నాయి. అవి సంపాదించి ఇస్తే పాతిక వేల రూపాయలిస్తానన్నాడాయన. ఆ ప్రకారం పోస్ట్ డేటెడ్ చెక్కు కూడా యిచ్చాడు. బ్యాంకులో విచారించగా ఆ అకౌంటులో డబ్బున్నట్లు తేలింది.
    శశికాంత్ ఆ కాగితాలు మేనమామ వద్దనుంచి సంగ్రహించి ఆ వ్యక్తికివ్వదలిచాడు. అయితే తనమీద మేనమామకు అనుమానం రాకూడదు. అందుకు మంచి ఉపాయం ఆ వ్యక్తి చెప్పాడు. శశికాంత్ ఆ రోజు ఊళ్ళో లేనట్లు తిరుగులేని సాక్ష్యాలు సృష్టించగలనని చెప్పాడు. ఆ రోజు ఉదయం అతడిని మేనమామతో ఏదో ఊరు వెడుతున్నట్లు చెప్పమన్నాడు. ఆత్మరక్షణకు కత్తి ఒకటి తీసుకుని-గుర్తు తెలియకుండా ముఖానికి ముసుగు వేసుకొని రమ్మన్నాడు.
    తీరా వెడితే జరిగినదిది!


                                               *    *    *




Related Novels


Vasundhara Kadhalu - 15

Vasundhara Kadhalu - 14

Vasundhara Kadhalu - 13

Vasundhara Kadhalu - 12

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.