Home » VASUNDHARA » Vasundhara Kadhalu - 2



    "ఎలా తెలుసు మీకు?" అన్నాడు కిల్లర్ ఆశ్చర్యం నటిస్తూ.
    సునీత చటుక్కున తడబడింది-"ఏమో నా కలా గనిపించింది-...." అందామె.
    "సెలవు సునీతా! చాలా థాంక్స్-...." అన్నాడు కిల్లర్.
    కాసేపటికి మొబైల్ వ్యాన్ ఢిల్లీ నుంచి తెలుగు దేశానికి తిరిగింది.
    "మనం బయల్దేరి దెందుకు? తెల్సుకున్న దేమిటి?" అన్నాడు రామచరణ్ సింగ్ అతడి కంతా అయోమయంగా ఉంది.
    "శ్రీమన్నారాయణ సునీతను చెరిచాడు. వాళ్ళింట్లో శ్రీమన్నారాయణంటే యెలాంటి అభిప్రాయముందో తెలుసుకుందుకు నే నాయన్ని పొగిడితే అసలు కథ బయటపడింది. సునీత భరించలేక నిజాన్ని కొంత బైట పెట్టింది. నరసింగరావుకు శ్రీమన్నారాయణ దారుణ కృత్యం తెలిసివుంటుంది. అతడు అమృతసర్ ప్రయాణం వంకతో తప్పు టెర్రరిస్టులమీద తోసేయొచ్చునన్ని శ్రీమన్నారాయణ ను పంజాబులో చంపాడు. నిజం కూతురి క్కూడా చెప్పలేదు.
    మహావీర్ సింగ్ కొడుకుల రూపం వర్ణించి కూతురికి చెప్పివుంటాడు. ఆమె వారిపట్ల ఆరాధనా భావంతో బొమ్మగీసింది. నరసింగరావును హంతకుడిగా నిరూపించడం కష్టంకాదు. హత్య అతడు చేశాడో, మహావీర్ సింగ్ కొడుకులు చేశారో నేను తెలుసుకోదల్చుకోలేదు. ఎందుకంటే శ్రీమన్నారాయన తన బుద్దికి తగ్గ చావేచచ్చాడు. అలాంటి స్నేహితుడు చచ్చినందుకు నువ్వు విచారించా నవసరంలేదు. ఆ కుటుంబంతో నీకు స్నేహసంబంధాలు నశించినా బాధపడకు. నేను మాత్రం నీ ప్రమేయం లేకుండా విడిగా వెళ్ళి వాళ్ళింట్లో శ్రీమన్నారాయణ ఎలా చచ్చాడో ఎందుకు చచ్చాడో చెబుతాను-" అన్నాడు కిల్లర్.
    "అందువల్ల ప్రయోజనం?" అన్నాడు రామ్ చరణ్ సింగ్.
    "వాళ్ళింట్లో వాళ్ళు ఆయన పోయినందుకు బాధ పడుతూ ఉంటారు. ఆ బాధ కాయన అర్హుడు కాదు-...."
    "నాకు తెలిసిన శ్రీమన్నారాయణ యెంతో మంచి వాడు....."
    కిల్లర్ నవ్వి-"మంచితనం పైకి కనపడవచ్చు. సునీత వంటి చిన్న అమ్మాయిని బలాత్కరించినవాడు స్వతహాగా చెడ్డవాడై ఉండాలి.....అలాంటి బుద్ధి ఒక్కరోజులో ఏర్పడేది కాదు...."
    "ఏమో-ఆ అమ్మాయి ఎలాంటిదో?" అన్నాడు రాంచరణ్ సింగ్.
    "ఆ అమ్మాయెలాంటిదైనా శ్రీమన్నారాయణ దుర్మార్గం ఋజువు చేయడాని కొక్క తిరుగులేని సాక్ష్యముంది-"
    "ఏమిటది!"
    "సునీత గీసిన బొమ్మ.....ఆ బొమ్మలో ముగ్గురు హంతకులున్నారు. వారికళ్ళలో పవిత్రకార్యం నిర్వహించినవారి లక్షణాలున్నాయి. త్యాగశీలత, ధైర్య సాహసాలు......అవన్నీ ఆమెకు శ్రీమన్నారాయణపట్ల గల ద్వేషాన్ని తెలియబర్చుతాయి...."
    "నీవు చెప్పినది నిజమే! నేనైతే యింత దూరం ఆలోచించలేను. కానీ యిలా జరిగిందంటే యెవరు నమ్ముతారు?" అన్నాడు సింగ్.
    "నువ్వు చెబితే యెవరూ నమ్మరు. కానీ నేను చెబితే నమ్ముతారు. శ్రీమన్నారాయణ కుటుంబంలో అంతా ఆయనవంటి వారేమో నాకు తెలియదు. వారెలాంటి వారైనా ఆయన గురించిన నిజం తెలుసుకోవడం మంచిది."
    "తెలుసుకుంటే నరసింగరావు నురికంబ మెక్కించాలనుకుంటారు!"
    "నరసింగరావు ఉరికంబ మెక్కాలంటే-శ్రీమన్నారాయణ అసలు రంగు బయటపడుతుంది...."
    సింగ్ తల పట్టుకుని-"ఇప్పుడేం జరుగుతుంది!" అన్నాడు.
    "అసలు కథ తెలుసుకున్నాక ఆ యింట్లో యెవరి కైనా వెధవ బుద్దులుంటే మానుకుంటారు. మంచి బుద్ధి ఉంటే నీ బోటివారితో తిరిగి స్నేహం చేస్తారు...."
    "శ్రీమన్నారాయణ ఎలాంటివాడైనా నాకు బాభీజీ అంటే ఇష్టం. ఆమె మంచిది. ఆ కుటుంబంతో స్నేహసంబంధాలు కోరుతున్నాను నేను.....నేను కోరినిది జరిగితే-నువ్వు కోరిన ఫీజు నిస్తాను....."
    "టెర్రరిజాన్ని నిరసించే సిక్కుగా పేపర్లో కెక్కు. నీవారినందర్నీ అందుకు ప్రోత్సహించు, నీ నుంచి నేను కోరే ఫీజు అదే!" అన్నాడు కిల్లర్.
    ఆ తర్వాత మూడు రోజులకి శివరాజు సింగ్ ఇంటికి వెళ్ళాడు.
    "ఇంట్లోనే ఉన్నావా? ఎప్పుడొచ్చావ్?" అని స్నేహపూర్వకంగా పలకరించాడతడు.
    "నాతో నీ కేమిటి పని?" అన్నాడు సింగ్.
    "నాకేం పనిలేదు. బాభీజీ నిన్ను టీకి రమ్మని పిలిచింది. చెప్పడానికి వచ్చాను...." అన్నాడు శివరాజు.
    రామచరణ్ సింగ్ కళ్ళలో మెరుపు! మనసులో కిల్లర్ కి ధన్యవాదాలు!


                                              -:అయిపోయింది:-




Related Novels


Vasundhara Kadhalu - 15

Vasundhara Kadhalu - 14

Vasundhara Kadhalu - 13

Vasundhara Kadhalu - 12

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.