Home » VASUNDHARA » Vasundhara Kadhalu - 15


 

    పేపరు చదువుతుండగా వెనక నుంచి ఎవరిదో చేయి నా భుజం మీద పడింది. ఉలిక్కిపడి వెనక్కి తిరిగాను  డిటెక్టివ్ రామారావు.
    అతను నావంక నవ్వుతూ చూసి "మీతో అర్జంటుగా మాట్లాడాల్సిన విషయముంది వస్తారా?'అనడిగేడు.
    చేతిలోని పేపరు తీసి మడత పెట్టి దొంతర లో పెట్టి కిళ్ళీ కొట్టతని దగ్గరసెలవు తీసుకుని రామారావుతో బయల్దేరాను. దగ్గర్లో ఉన్న పార్కుకి తీసుకు పోయాడతను.
    "మీరిప్పుడు మాధవరావు గారింటి దగ్గర్నుండే కదా వస్తుంట:అన్నాడు రామారావు.
    "అవును"
    "వచ్చిన వారు లోపలకు రాకుండా గుమ్మం లోంచే వెళ్ళిపోయారేం?"
    "మీరు నన్ను చూశారా?" అన్నాడు ఆశ్చర్యంగా.
    రామారావు నవ్వి "ప్రయివేట్ డిటెక్టివ్ అంత అజాగ్రత్తగా ఉంటారనుకోకండి. మీరు వస్తున్నది చూసేకనే మా సంభాషణ మీరు వినవలసిన టాపిక్ మారింది" అన్నాడు.
    "అంటే నేను వినాలనే అలా మాట్లాడేమంటారు"అన్నాడు అపనమ్మకంతో.
    "అనడం కాదు నిజమే. మీచేత సాక్ష్యం చెప్పించడం కోసం నేనాడిన అబద్దం ప్రమాదకరమైనదని తోచింది. మీవంటి సంస్కారవంతుల్నా అబద్దం ఎంతగా గాయపర్చగలదో ఊహించేక నా తప్పు నేను సవరించుకోవాలనుకున్నాను. అందుకే మాధవరావు గారితో మాట్లాడుతూ గుమ్మం దాకా వచ్చిన నాకు గేట్లోంచి ఏదో ఆలోచిస్తూ వస్తున్న మీరు కనిపించారు. వెంటనే సంభాషణ మార్చాను...."
    అ సందర్భంగా తోచాయి నాకు రామారావు మాటలు. నన్ను వాళ్ళు చూసి ఉండరన్న నమ్మకం బాగా ఉంది నాకు. తీరా నేను వెళ్ళిపోబోయే ముందు నన్ను చూసుంటాడు రామారావు. జరిగినది గ్రహించి వెంటనే నన్ను ఫాలో చేసి ఉంటాడు. ప్రతీ విషయం చాలా తికమక గా ఉంటోంది నాకు....
    "అది చెప్పడానికే ఇప్పుడు నన్ను కలుసుకున్నారా?" అన్నాడు.
    "కాదు. మీరేం చెప్పడానికి వచ్చేరో తెలుసుకుందుకు."
    అవును నేను మాధవరావు గారికి కామిని విషయం చెప్పాలని వెళ్ళాను. వాళ్ళ సంభాషణ విన్నాక నా మనసు చెదిరి అక్కణ్ణించి బయట పడ్డాను.
    "రామారావు గారూ మీరు ప్రయివేట్ డిటెక్టివ్ గా బాగా పేరు సంపాదించుకున్న వారయుండవచ్చు అంతమాత్రాన నాబోటి వాణ్ణి అవమానించడమే మీ పరిశోధనా విధానం చేసుకోవడం నేను హర్షించలేకుండా ఉన్నాను. నాకు చాలా బాధగా ఉంది."    
    "మీ మనసు నొప్పిస్తే అందుకు నన్ను క్షమించమని కోరుతున్నాను. నా ఆశయాన్ని దృష్టిలో ఉంచుకుని నా తప్పులన్నీ మన్నించాలి మీరు....' రామారావు వినయంగా అన్నాడు.
    'అన్నీ అబద్దాలే చెప్పారు మీరు నాకు. పోలీసుల దగ్గర ఆ ఇంటి తలుపుల మీద పడ్డ  నా వేలిముద్ర లున్నాయన్నారు. అది అబద్దం. తర్వాత మోహన్ నాకూతుర్ని ప్రేమిస్తున్నాడన్నారు. అది అబద్దమే! ప్రతివారూ నా దగ్గర అబద్ధాలాడే వారే ఈరోజు ఉదయం కామిని నా దగ్గరకు వచ్చి కూడా దారుణమైన అబద్దాలాడి వెళ్ళింది"అన్నాను విసుగ్గా ఉక్రోషంగా.
    "కామిని ఎవరు?' ఆశ్చర్యంగా అడిగాడు రామారావు.
    "ఈ కేసు చేపట్టిన మీరు కామిని తెలియకుండా ఉంటుందని అనుకోను....ఆమె గుడి వీధిలో ఉంటుంది. వ్యభిచార వృత్తి. మోహన్ కీ ఆమెకూ శారీరక సంబంధముంది. అందుకు సాక్ష్యంగా ఫోటోలున్నాయి. అఫోటోలు శివరావు దగ్గరున్నాయి. మోహన్ శివరావును హత్య చేయడం తను కళ్ళారా చూశానని కామిని అంటోంది"అన్నా గబగబా.
    రామారావా ఆశ్చర్యంగా అన్ని విని నోరావలించి "మీరు కాస్త వివరంగాచేప్పాలి...." అన్నాడు.
    నేను వివరంగా ఉదయం జరిగిందంతా చెప్పాను.
    రామారావు సావధానంగా అంతా విని 'చాలా ఆశ్చర్యంగా ఉంది. కేసు కొత్తమలుపు తిరుగుతోంది. ముగింపు ఎంతో దూరం లేదని తోస్తోంది నాకు. మాధవరావు గారు కామినికి సంబంధించిన రహస్యం నాదాకా రాకుండా జాగ్రత్త పడ్డాడంటే -- ఇందులో ఏదో తికమక నుందనిపిస్తోంది. ఇది చాలా సీరియస్ విషయం"అన్నాడు.
    "మీకు కామిని విషయం తెలియదంటే నాకు నమ్మకంగా లేదు" అన్నాను.
    "కామినీకి మోహన్ కి సంబంధ ముందని ఆ విషయంలో శివరావతన్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని నాకు తెలుసు. కానీ కామినీ మోహన్ చేసిన హత్యకు ప్రత్యక్ష సాక్షి అని అ విషయమై మాధవరావు గారిని బ్లాక్ మెయిల్ చేస్తోందని నాకు తెలియదు."
    "ఆమె మాధవరావు గారిని బ్లాక్ మెయిల్ చేస్తుందన్న విషయం నిజమో అబద్దమో నాకు తెలియదు. ఎందుకంటే అంతకు ముందామే చాలా అబద్దాలు చెప్పింది. శివరావు హత్యకు తను ప్రత్యక్ష సాక్షి నన్న ఆమె మాట ఏమాత్రం నిజం కాదు" అన్నాను ఆవేశంగా.
    రామారావు కుతూహలంగా నావంక చూసి "నాకు తెలుసు. ఆ హత్యకు మీరొక్కరే ప్రత్యక్ష సాక్షి !" అన్నాడు.
    నాల్కరుచుకున్నాను. రామారావు నేనుహించిన దానికంటే చాల తెలివైనవాడు. తమాషాగా నాచేత నిజం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. "నాకేం తెలియదు. నేనేమీ చూడలేదు...." అన్నాను చటుక్కున.
    "అయితే ఏ ఆధారంతో కామిని మాటలబద్దమని మీరంటున్నారో చెప్పాలి...." అన్నాడతను గంభీరంగా.
    ఏదో చెబుదామని నోరు తెరిచాను కానీ ఏం చెప్పాలో తెలియలేదు. రామారావు నన్ను బోల్తా కొట్టించాడనే అనాలి. ఒక్క నిమిషం ఆగి "ఏమో నాకలా అనిపించింది"అన్నాను.
    రామారావు నవ్వాడు. 'అలా అనిపించడానికేదో కారణముండి ఉండాలి. కామిని వేశ్య కావడం బహుశా మీకామే పై దురభిప్రాయాన్ని కలిగించి ఉండవచ్చు. కానీ నాకు కామిని మాటలు నిజమేనని పిస్తున్నాయి. మోహన్ తప్పక హంతకుడయుండాలి. నేరం రుజువు చేయడం నా కర్తవ్యం కానీ నేరస్తుడ్ని రక్షించడం నా అభిమతం కాదు. నేను మోహన్ తరపున స్వీకరించినప్పటికీ నేరస్థుడు మోహనే అయిన పక్షంలో అతన్ని నేను హంతకుడిగా పోలీసుల ముందు నిలబెడతాను. ఈ విషయం తెలిసే ఏమో మాధవరావు గారు నా దగ్గర రహస్యాన్ని దాచాడు."
    నేను సూటిగా రామారావు వంక చూసి"మీవృత్తిలో మీరేన్నడూ పొరపాటు అభిప్రాయాలు పడలేదనుకుంటున్నారా? మీరు హంతకుడి గా రుజువు చేసే ప్రతి ఒక్కడూ నిజామైన హంతకుడని మీరు నమ్ముతున్నారా ?' అడిగాను.
    "అవును" అన్నాడు నమ్మకంగా రామారావు.
    'అయితే మీరు మోహన్ ని హంతకుడిగా రుజువు చేసినప్పుడు మాత్రం జీవితంలో మొట్టమొదటి సారిగా తప్పు చేశానని గ్రహించండి...." అన్నాను.
    "అంటే మోహన్ హంతకుడు కాదంటారు .ఏ ఆధారంతో ఈ మాటలు చెబుతున్నారూ అంటాను నేను"
    "హత్యను కళ్ళారా చూసిన ఒక వ్యక్తిగా అన్నాను.
    "అయితే ఎవరు హంతకుడు."
    "అతనెవరో నాకు తెలియదు. కావాలంటే వర్ణించి చెప్పగలను." అంటూ శేషగిరి ని వర్ణించి చెప్పాను. ఎటొచ్చి శేషగిరికి లేని లాంగ్ హెయిర్, మీసాలూ మాత్రం కల్పించాను.




Related Novels


Vasundhara Kadhalu - 15

Vasundhara Kadhalu - 14

Vasundhara Kadhalu - 13

Vasundhara Kadhalu - 12

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.