Home » VASUNDHARA » Vasundhara Kadhalu - 15



    "మీమాట నమ్మాలంటారు!"అన్నాడు రామారావు.
    "నమ్మండి నమ్మకపోండి -- యిదే నేనివ్వబోయే సాక్ష్యం" అన్నాను.
    "గుడ్ , నా మాట నింత కాలానికి మన్నించినందుకు థాంక్స్. ఒక నిర్దోషి కి శిక్ష పడకూడదనే అభిప్రాయంతో మీ సాయం కోరాను. కానీ, ఒక దోషిని రక్షించడాని కుపయోగాపడేట ట్లయితే , నేను మీ సాక్ష్యాన్నా మోదించను సరిగదా , మీరు నా మాట కాదని సాక్ష్యానికి సిద్దపడితే, తప్పని రుజువు కూడా చేస్తాను. ఏ విషయమూ నేను కామిని తో మాట్లాడేక తేలుస్తాను"అన్నాడు రామారావు.
    "నా సాక్ష్యం నిజం. దాన్నబద్దమని మీరు రుజువు చేయలేరు" అన్నాను నమ్మకంగా.

                                  12
    కాంపోజిషన్ పుస్తకాలు   దిద్దుకుంటున్నాను. టైము తొమ్మిది ఇరవై దాటింది. ఇంక నిద్ర వచ్చేలాగుందనుకుంటుండగా ఎవరో తలుపు తట్టారు. వెళ్ళి తలుపు తీశాను.
    "శివశంకరం గారి దేనాండి" అంటూ లోపలకు ప్రవేశించాడో ఆపరిచితుడు.
    అతన్ని నేనంతముందేన్నడూ చూడలేదు. మనిషి బక్కపలచగా వున్నాడు. కాస్త పొడుగే అని చెప్పవచ్చు. వయస్సు సుమారు ముప్పై ఏళ్ళు ఉండవచ్చు.
    "ఇదే, నేనే శివశంకరాన్ని, మీరెవరో తెలుసుకోవచ్చా?"
    అతను నవ్వి, "నా పేరు శివరావు!" అన్నాడు.
    నేను తుళ్ళి పడ్డాను. "శివరావంటే."
    'అదే సుబ్రహ్మణ్యం గారింట్లో హత్య చేయబడ్డ శివరావును నేనే"అన్నాడతను.
    ముందు మతిపోయినట్లనిపించింది. తర్వాత చిరాకేసింది.
    "చూడు మిస్టర్, నేను నీకు కొత్తవాడ్ని . నీకంటే పెద్ద వాడ్ని. నాతొ నువ్వు పరాచికాలాడ్డం ఏం బాగోలేదు" కోపంలో ఏక వచన ప్రయోగం చేశాను.
    "నిజమే కానీ, నేను మీతో పరచి కాలడుతున్నానని ఎందు కనుకుంటున్నారు?" అన్నాడతను నిబరంగా.
    "పరాచికాలు కాకపొతే నిక్కాస్త పిచ్చి వుందనుకోవాలి."
    "చచ్చిపోయినవాణ్ణి నాకెందుకు సార్, అవలక్షణా లంటగడతారు?" అన్నాడు శివరావు.
    నాకు తిక్క రేగింది, "నీ మాటలు వినడానికి నాకు తీరుబడి లేదు. బయటకు వెళ్ళొచ్చు" అన్నాను.
    "మీరలాగంటే ఎలాగండీ, నా హత్యకు మీరు ప్రత్యక్ష సాక్షి. మీరిప్పుడు ప్రమాదంలో వున్నారు. నన్ను చంపిన హంతకుడు బయటపడే వరకూ మీ ప్రాణాల్ని రక్షించాల్సిన బాధ్యత నామీద లేదూ?" అన్నాడతను.
    అతను వెటకారమాడుతున్నడో, నిజం చెబుతున్నాడో తెలియని అయోమయ పరిస్థితిలో పడ్డాను. "శివరావు నంటావు. చచ్చిపోయినవాడినంటావు--నీ మాటల కర్ధమేమిటనుకోవాలి" అడిగాను తీవ్రంగా.
    "మీ అందరి దృష్టిలో నేను చనిపోయిన వాణ్ని, కానీ, నేను చావలేదు, కత్తిపోటు తిని కూడా బ్రతికాను. నేను జీవించడం వైద్య విజ్ఞానానికే ఒక సవాల్"అన్నాడు శివరావు.
    "బ్రతికే వుంటే ఇంతకాలం ఏం చేస్తున్నావు?"
    "పోలీసులీ రోజే నన్నొదిలి పెట్టారు. నన్ను చంపిన హంతకుణ్ణి పట్టుకోడానికి నేనే బయలుదేరాను. ఈ విషయంలో మీరు బాగా సహకరించగలరని తెలిసింది."
    "ఇంకా నా సహకార మెందుకూ....నువ్వే సాక్ష్య మిచ్చు కోవచ్చు"అన్నాను వెటకారంగా. కానీ విషయమేమిటో నాకర్ధం కాకుండా వుంది.
    అసలిప్పుడు వచ్చినతను నిజంగా శివరావేనా?
    మా ఇంటికి దగ్గర్లో ఒక పబ్లిక్ టెలిఫోన్ బూత్ వుంది. అక్కణ్ణించి శేషగిరి కి ఫోన్ చేసి విషయం చెప్పాలనుకున్నాను.
    "కావాలండీ, మీ సహకారం కావాలి. ఎంతమంది సాక్ష్యమిస్తే అంత బలపడుతుంది కేసు" అన్నాడతను.
    "అలాగే తప్పకుండా ఇస్తాను. నిన్ను చంపిన హంతకుణ్ణి నేను చూడడమైతే చూశాను కానీ, యెవరో తెలియదు, తెలియజెప్పి వాణ్ని మళ్ళీ చూపించావంటే నీ కేసు మిస్టరీ తెల్తుంది. నాకు మనశ్శాంతి లభిస్తుంది" అన్నాను చిరాగ్గా.
    "మంచిది. మీరు కోరుకున్నవన్నీ జరుగుతాయి. పునర్జన్మ నెత్తిన ఈ శివరావు అండ మీకు లభించింది. ఇంకేం భయపడకండి"అన్నాడు శివరావు.
    'చాలా థాంక్స్. నువ్వు చెప్పదలచుకున్నది పూర్తయింది కాబట్టి , ఇంక వెళ్ళిపోతావనుకుంటాను. నాకూ నిద్ర వస్తోంది" అన్నాను నిర్మొహమాటంగా.
    "క్షమించాలి. నేను వెళ్ళడానికి రాలేదు. రెండు మూడ్రోజులు మీ యింట్లో వుండడానికే వచ్చాను" అన్నాడు శివరావు.
    "నా యింట్లో నా?" అన్నాను కంగారుగా. "ముక్కూ మొహం తెలియని వాళ్ళ కింట్లో స్థానమివ్వడం నాకిష్టం లేదు. అందులోనూ నేను ప్రమాదంలో వున్నానని నువ్వే అంటున్నావు. ఆ ప్రమాదం నీవల్లనే కాకూడదని లేదు కదా!"
    శివరావు నవ్వి , "నేను బయటకు పోవడం ద్వారా మళ్ళీ హత్య చేయబడే అవకాశముంది. మీ యిల్లే నాకు శ్రీరామ రక్ష. నేను మీ యింట్లో లేకపోవడం ద్వారా మీరు కూడా హత్య చేయబడే అవకాశముంది. అందుకే నన్ను మీ యింట్లో వుండనిస్తే ఉభయ తారకంగా వుంటుంది" అన్నాడు.
    "మన్నించాలి. నువ్వు మరెక్కడి కైనా వెళ్ళు. మా యింట్లో మాత్రం ఉండొద్దు."
    శివరావు ఓ క్షణం అలోచించి, "పోనీ, నా గురించి డిటెక్టివ్ రామారావు కి ఫోన్ చేసి కనుక్కోండి. అయన ఫోన్ నంబరు మీ దగ్గరున్నదని నా అభిప్రాయం" అన్నాడు.
    నిజమే ననిపించింది. డిటెక్టివ్ రామారావుది కాక, శేషగిరిది కూడా నా దగ్గర ఫోన్ నెంబరు ఉంది. ఇద్దరికీ ఫోన్ చేసి ఈ విషయం చెప్పాలనుకున్నాను.
    "నువ్వు చెప్పింది బాగానే ఉంది" అంటూ లోపలకు వెళ్ళాను. టెలిఫోన్ నంబర్లు నోట్ చేసుకున్న పుస్తకం చూడటానికి. నా కదలికను గమనిస్తూనే శివరావు ఉత్సాహంగా ఈల వేశాడు.
    టెలిఫోన్ నంబర్స్ ఓ కాగితం మీద నోట్ చేసుకుని, నువ్వు కూడా వస్తావా?' అన్నాను.
    "వస్తానండి , ఇంట్లో ఉంటే మీకేమైనా అనుమాన ముండవచ్చు" అంటూ తనూ లేచాడు శివరావు.
    ఇద్దరం బూత్ దగ్గరకు వెళ్ళాం. శివరావు బయట నిలబడ్డాడు. నేను లోపలకు వెళ్ళి తలుపులు వేసుకుని ముందుగా శేషగిరికి ఫోన్ చేశాను. శేషగిరి షాక్ తిన్నాడని పించిందతని మాటలు వింటుంటే, నిజమే మరి తన చేతుల్తో తను హత్య చేసిన శివరావు మళ్ళీ తిరిగి వచ్చేడంటే ఎలా నమ్మగలడు?
    ఆ వచ్చిన తను శివరావో కాదో తెలుసుకున్నాక ఏం చేయాలో నిర్ణయించుకుంటానని చెప్పి ఫోన్ పెట్టేశాడు శేషగిరి, తర్వాత డిటెక్టివ్ రామారావు కు ఫోన్ చేసి విషయం చెప్పాను, ఆటను నవ్వి కంగారు పడద్దనీ అతనికి ఆశ్రయ మివ్వవలసిందని నా ప్రాణాలకు తన ప్రాణం అడ్డు వేస్తాడనీ చెప్పాడు. అయినా నాకు భయంగానే ఉంది. కానీ మరి మాట్లాడలేదు . కంగారులో చేత్తో పట్టుకున్న నా పెన్ను జారి కింద పడిపోయింది. తీసుకోవడానికి వంగుతున్నాను, అప్పుడు నన్నాకర్షించింది ఒక వస్తువు, అంతవరకూ నేను దాన్ని చూడలేదు.

                                    13
    సిగరెట్ పెట్టెకు రెట్టింపు సైజులో ఉన్న ఆ వస్తువు ఒక టేపు రికార్డర్ అని తెలుసుకునేందుకు నాకెంతో సేపు పట్టలేదు.
    ఆ టేపు రికార్డర్ ఇంకా అన్ పొజిషన్ లో ఉంది. అధక్కడ ఎవరు పెట్టారు? నేనెవరితో మాట్లాడతానో తెలుసుకునేటందుకే అక్కడ అది పెట్టబడిందా?
    చటుక్కున దాన్నందుకుని జేబులో పెట్టుకున్నాను. నేను బూత్ లోంచి బయటకు రాగానే "మేస్టారూ మీ పరిశీలనా శక్తి బాగానే ఉంది కాని, టేప్ రికార్డర్ ఇలాగిచ్చేయండి" అన్నాడు.
    "అయితే అదక్కడ నువ్వే పెట్టావా?" అన్నాను కోపంగా.
    "నేను కాదు నా మనిషి. మీ యింట్లో ఉండగా ఇందాకా నేనో ఈల వేశాను చూశారా అది వినగానే నా మనిషిక్కడ టేపు రికార్డర్ పెట్టి చుట్టుపక్కల కాచు కూర్చున్నాడు. అది మీ దృష్టిలో పడుతుందని అనుకోలేదు. కానీ, ఒకోసారి అనుకోనివి జరుగుతాయి. ముందా టేపు రికార్దరిలాగిచ్చేయండి " అన్నాడు శివరావు.
    నాకు భయం వేసింది. శరీరంలో వణుకు ప్రారంభమయింది. శేషగిరి పేరు నా నోటి నుంచి బయట పెట్టించడానికి శివరావు పేరుతొ వచ్చి నతను వేసిన ట్రిక్కు ఫలించింది. నన్నింక శేషగిరి బ్రతకనివ్వడు.
    నేను చటుక్కున శివరావు చేయి పట్టుకున్నాను నెమ్మదిగా అతనితో "శివరావు హత్య నేను చూశాను, నేను చూసేసరికి శివరావు చచ్చిపడి ఉన్నాడు. అతని గుండెల్లో కత్తి దిగబడి ఉంది. శేషగిరి ఆ కత్తి పిడి మీద జేబురు మాలతో తుడుస్తున్నాడు. ఈ విషయం నేను చూశానని శేషగిరి కి తెలుసు. నా మూలంగా అతని పేరు బయటకు వచ్చిందని తెలుస్తే నన్నింక నామరూపాలు లేకుండా నాశనం చేసేస్తాడు. నువ్వే నన్ను రక్షించాలి అన్నాను.
    శివరావు కళ్ళు ఉత్సాహంగా మెరిశాయి. "ముందా టేపు రికార్డరిలాగివ్వండి మేస్టారూ!" అని అడిగి తీసుకున్నాడు. "నేను ముందే చెప్పాను గదా మీకీరోజు ప్రమాద ముందని, అందుకే నేను మీ యింట్లో ఉండదల్చుకున్నాను. మీరేమీ భయపడకండి. ఈ శివరావుండగా ఈగ కూడా వాలదు మీమీద"
    నాకు భయం భయంగా వుంది. నేనిప్పుడు శేషగిరి తో పాటు శివరావు క్కూడా భయపడుతున్నాను. ఇద్దరం మళ్ళీ మా యింటికి వెళ్ళాం.
    ఇద్దరం ఇంటికి వెళ్ళి కూర్చున్నాం ఓ పది నిమిషాల సేపు, నాకు ధైర్యం చెప్పాడు. అతనికి మాములుగా పక్క ఏర్పాటు చేశాను వరండాలో. "మీరు వెళ్ళి గదిలో తలుపులు బిదాయించుకుని పడుకోండి"అన్నాడు శివరావు.
    సరిగ్గా అప్పుడే ఎవరో తలుపు తట్టారు. నేను వెళ్ళి తలుపులు తీశాను.
    వచ్చిన వ్యక్తీ నాకు తెలుసు "గుర్తుపట్టారా డిటెక్టివ్ రామారావు మీ యింటికి రావాల్సోచ్చింది" అన్నాడతను.
    డిటెక్టివ్ రామారావు పేరుతొ మొట్టమొదట నా ఇంటికి వచ్చిన నకిలీ డిటెక్టివ్ అతను.




Related Novels


Vasundhara Kadhalu - 15

Vasundhara Kadhalu - 14

Vasundhara Kadhalu - 13

Vasundhara Kadhalu - 12

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.