Home » VASUNDHARA » Vasundhara Kadhalu - 15
ఆశ్చర్యంగా వింటున్నాను. కామిని ఏం చెప్పబోతోందో నాకు తెలుసుకోవాలని చాలా కుతూహలంగా వుంది. మరొక్కసారి చూసి ఆ ఫోటోను కామిని తిరిగి ఇచ్చేశాను. ఫోటోను తిరిగి వ్యానిటీ బ్యాగులో పెట్టుకుంటూ అంది కామిని "డబ్బు కక్కుర్తి ఉంటె తప్ప, ఈ ఫోటో చూసిన ఏ ఆడపిల్ల తండ్రీ తన కూతుర్ని మోహన్ కివ్వడానికి సిద్దపడడు."
ఆ మాటలు సూటిగా నాకే తగిలాయి. రామావతి మోహన్ ల ప్రేమ కధ ఈమెకు తెలుసా? జైలు నించి విడుదలయ్యేక మోహన్ నా ఇంటల్లుడు కావచ్చునని తెలిసే నాకా ఫోటో చూపించిందామె.
"మీరిద్దరూ శివరావు దగ్గరకు వెళ్ళేక ఏం జరిగింది?' అనడిగాను.
"అనుకోనిదే జరిగింది. అక్కడ సంభాషణ తప్పుద్రోవ తొక్కింది. ఆవేశంలో మోహన్ శివరావు ను హత్య చేశాడు."అంది కామిని.
"నేను నమ్మను"అన్నాను. ఎలా నమ్ముతాను? నా కళ్ళారా చూసిన దృశ్యం వేరే ఉంది మరి!
"ఎందువల్ల?" అందికామిని అదోలా నా వంక చూస్తూ.
హటాత్తుగా నేనేదో ట్రాన్ లో పడుతున్నానెమో నని తోచింది. ఒకసారి రామారావు పేరుతొ నకిలీ డిటెక్టివ్ వచ్చి వెళ్ళాడు. అప్పుడు నోరు జారినందుకు నన్ను చంపడానికి ప్రయత్నం జరిగింది. ఇప్పుడు మళ్ళీ అటువంటి ప్రయత్నమేదయినా జరుగుతోందా? తెలివిగా నా చేత నిజం చెప్పించాలని చూస్తున్నారా? ఈసారి ఇది మాధవరావు తరపున డిటెక్టివ్ రామారావు వేసిన పదకమేమో.
నన్ను నేను తమాయించుకుని "హంతకుడేవరో తెలుసుకోవాలని పోలీసులు నానా అవస్థలు పడుతున్నారు. నీ సాక్ష్యం వాళ్ళ పని సులభం చేస్తుంది. అదీకాక నీ స్నేహితుడు శివరావును చంపిన దుర్మార్గుడికి శిక్ష పదాలని తాపత్రయం నీకుండాలి. అదేమీ లేదు కాబట్టి" అని సూచిస్తున్నట్లుగా ఆగిపోయాను.
కామిని చాలా అందంగా నవ్వి "మేస్టారూ , మీరు మీకులా ఆలోచిస్తున్నారు. నాకులా ఆలోచిస్తే అన్నీ మీకు అర్ధమవుతాయి. శివరావు నాకు స్నేహితుడే కావచ్చు. కానీ బాగా అత్యాశాపరుడు, అతని కారణంగా నా కస్టమర్స్ తగ్గారు. చాలామంది భయపడు తున్నారు కూడా నా దగ్గరకు రావడానికి. అతనికీ నాకు సంబంధం లేదని నమ్మించడం కాస్త కష్టంగానే ఉంది. శివరావు రంగంలో నించి తప్పుకుంటే అది నాకు మంచిదే . అదలా ఉందండి. శివరావుకు మోహన్ ని గురించి ఎవ్వరూ ఊహించలేని మరో రహస్యం తెలిసింది. అది చెప్పినప్పుడే మోహన్ ఆవేశపడి , అతన్ని చంపేశాడు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. అ నిజానికి నేను ప్రత్యక్ష సాక్షిని"అంది.
"మేష్టారు , ఈ విషయం నేను పోలీసుల కెందుకు చెప్పాలి? మోహన్ ప్రానాలిప్పుడు నా గుప్పిట్లో ఉన్నాయి. మోహన్ తండ్రి లక్షాధికారి. అందుకే ఆయనతో బేరం పెట్టాను. నేనీ రహస్యాన్ని దాచినందుకు లక్ష రూపాయలు కావాలన్నాను. మొదట్లో మాధవరావు మాగారంగీకరించేటట్లే కనపడ్డాడు. కానీ, ఎలా దొరికేరో ఆయనకు మీరు దోరికారు.దాంతో లక్ష రూపాయల బేరమూ ఎగురిపోయేలా ఉంది. చూస్తూ చూస్తూ లక్ష రూపాయల నేలా వదులు కోగలను? అందుకే మీ దగ్గర కొచ్చాను."
"నావల్ల ఏమిటి నీకు ప్రయోజనం!"
"ఈ కేసులో మీరు సాక్ష్యం చెప్పడం ద్వారా -- నాకు లక్ష రూపాయలు నష్ట వస్తుంది. ఆ తర్వాత మీది తప్పుడు సాక్ష్యమని నేను రుజువు చేయగలను. అప్పుడు మీ పరువు గంగ పాలవుతుంది. మీ ఉద్యోగం, మీ రూపం చూస్తుంటే మీరు చాలా నీతి పరుల్లా కనబడుతున్నారు. ఒక నిర్దోషి ని ప్రమాదం నుంచి రక్షించదల్చుకున్న పక్షంలో ఎలాగూ ఇప్పుడు ప్రాసేక్యూషన్ కేసంత బలంగా లేదు. నేనూ మాధవరావు గారు బేరం సెటిల్ చేసుకున్నాక అతనేలాగూ తప్పక విడుదల చేయబడతాడని నాకు నమ్మకముంది. అందువల్ల ఏవిధంగానూ కూడా మీరీ కేసులో జోక్యం చేసుకో వలసిన అవసరం నాకు కనబడడం లేదు' అంది కామిని.
క్షణం అలోచించి "నువ్వు చెప్పేది అబద్దం. శివరావు ను చంపినా వాణ్ణి నేను కళ్ళారా చూశాను. ఆ నిజాన్ని అబద్దంగా రుజువు చేయడం వల్ల నీవల్ల కాదు" అన్నాను.
"హత్య ఎందుకు, ఎప్పుడు , ఎలా జరిగిందో వివరంగా తెలిసినదాన్ని హెచ్చరిస్తున్నాను, అనవసరంగా తొందరపడి నవ్వుల పాలు కాకండి. ఇది చెప్పడానికే వచ్చాను...." అంటూలేచింది కామిని. నేనూ లేచాను.
వెళ్ళిపోతూ మళ్ళీ అంది కామిని. "నాలాంటి దానికి పరువు గురించిన బాధ లేదు. మీ గురించి నాకు బాధగా ఉంది. నా మాటలు గుర్తుంచుకోండి వస్తాను...."
11
"ఆ కామినికీ భూమ్మీద నూకలు చెల్లిపోయినట్లే మీరేమీభయపడకండి, సంగతి నేను చూసుకుంటాను. మీరు మాత్రం సాక్ష్యం మివ్వడానికి జంకకండి. ఎందుకంటె మీరలా సాక్ష్యం పలకడం ద్వారా ఈ కేసు శాశ్వతంగా మూతబడిపోతుంది. మీరు చెప్పిన మనిషి వాళ్ళ కెలాగూ దొరకడు. అటు మోహన్, ఇటు నేనూ కూడా రక్షించబడతాం" అన్నాడు శేషగిరి.
"అసలు చెప్పకుండా ఊరుకోడానికి బాగానే వుంది. కానీ ప్రత్యక్ష సాక్షి నంటూ ముందుకు వచ్చి అబద్దం చెప్పడానికి భయంగా ఉంది....' అన్నాను సంకోచిస్తూ.
'అప్పుడప్పుడు ఆశ్వర్ధామ హతః కుంజరః లాంటి నిజాలు చెబుతూ ఉండాలి. మాబోటి వాళ్ళ కోసం . ఇలాంటి వాళ్ళకి సాక్షాత్తూ శ్రీ కృష్ణుడు మద్దతు ఉందనుకొండి" అన్నాడు శేషగిరి.
సమయానుకూలంగా పురాణ గాధల్నుపయోగించుకో గల శక్తి ఉన్న శేషగిరి ఆ పురాణాల్లోంచి నేర్చుకున్న దేమిటి? నా కళ్ళముందు శివరావు గుండెల్లో కత్తి పిడిని తుడుస్తున్న శేషగిరి కనిపించాడు.
ఎటొచ్చీ అంతా మిస్టరీ గా కనబడింది నాకు. నేను చూసిన హత్యకు తను ప్రత్యేక్ష సాక్షి నంటుంది కామిని. హత్య ప్రదేశంలో నేను శేషగిరి ని చూస్తె తను మోహన్ హత్య చేసాడంటుంది. ఎంత బరితెగించిన అబద్దాలు?
శేషగిరితో మాట్లాడి బయట పడ్డాక ఒక పర్యాయం మాధవరావు గారింటి కూడా వెళ్ళి రావాలనిపించింది. కామిని చెప్పిన నిజాన్నాయనకూ తెలియబర్చాలని అనుకున్నాను. నేను వెళ్ళేసరికి మాధవరావు గారింట్లోంచి యేవో మాటలు వినపడి గుమ్మం దగ్గరే ఆగిపోయాను" ఆ మాటలు నా గురించే --
"చూస్తూ చూస్తూ ఆ దరిద్రపు కొంపనుంచి తెచ్చుకో మంటారా ఈ యింటి కోడల్ని..." మాధవరావు కోపంగా అంటున్నాడు.
దానికి సమాధానంగా మరో కంఠం "కంగారుపడకండి యేరు దాటాక బోడి మల్లయన్న సామెత ఉండనే ఉంది. ఇది కేవలం శివశంకరం గారిని బుట్టలో వేసుకునేందుకు నేను వేసిన పధకం. ఆ అమ్మాయి నా దగ్గరకు వచ్చినప్పుడు నేనామెతో వివరంగా మాట్లాడి మోహన్ లాంటి నిర్దోషి ని కాపాడడానికి తన సహకారం కొంతవరకూ కావాలని చెప్పాను. ఆమె అంగీకరించింది. ఆమెను మోహన్ మీద ఏమీ ఆశలు లేవు. ఎటొచ్చీ శివశంకరం గారికి తెలిసిన నిజం బయట పడడం కోసం ఆమె తాత్కాలికంగా అబద్ద మాడ్డానికి ఒప్పుకుంది...." అంది.
"అసలా అమ్మాయి మీ దగ్గర కెందు కొచ్చింది?"
సమాధాన మిస్తున్నది రామారావు కంఠమని తెలుస్తూనే ఉంది. "ఆ రాత్రి వాళ్ళ నాన్న మీద హత్యా ప్రయత్నం జరిగిందని ఆ అమ్మాయికి తోచింది. అదే రోజు సాయంత్రం నకిలీ డిటెక్టివ్ రావడం ఆమె అనుమానాన్ని పెంచింది . దాంతో తండ్రికి చెప్పకుండా నా దగ్గరికి వచ్చేసింది . అప్పుడే నేనో పధకం వేశాను. మోహన్ కూడా తన పాత్రను రక్తి కట్టించాడు. ఇంక ఒకటి రెండ్రోజుల్లో శివశంకరం గారి నోటి వెంట రహస్యం బయట పడగలదని ఆశిస్తున్నాను. చేసిన సహాయానికి ప్రతిఫలంగా ఆయనకు కొంత డబ్బు ముట్ట చెప్పవచ్చు...."
"మోహన్ విడుదలవుతాడంటారా?"
'అతన్ని హంతకుడి గా నిరూపించడం కష్టమే! డైరెక్ట్ ఎవిడెన్స్ లేకుండా ఊహతో ఒక మనిషిని హంతకుడి గా నిరూపిస్తే చట్టం అంగీకరించదు. ప్రాసిక్యూషన్ ఎంత బలంగా కేసు తయారు చేసుకున్నా శివశంకరం గారి సాక్ష్యం దాన్ని చిన్నాభిన్నం చేసేయగలదు...."అన్నాడు రామారావు.
వారి సంభాషణను నేనింక వినదల్చుకోలేదు. నన్ను పీడిస్తున్న కొన్ని సందేహాలకు వాళ్ళ ప్రషణలో సమాధానాలు లభించాయి. రామావతి కి, మోహన్ కి పూర్వ పరిచయం లేదు. మోహన్ రామవతి ని ప్రేమిస్తున్నాడన్నది అబద్దం. మోహన్ తన ఇంటల్లుడు కావడం అసంభవం!
తేలిగ్గా నిట్టుర్చాను. నేను, కానీ నా బలహీనత నాధారం చేసుకుని నన్ను మోసం చేయడానికి ప్రయత్నించిన డిటెక్టివ్ రామారావంటే నాకు చాలా కోపంగా ఉంది. ఆశ పెట్టడానికి నేనేమైనా చంటి పిల్లడినా? అతను నన్నే విధంగా అంచనా వేశాడు.
అప్పటికి టైము ఏడు గంటల ముప్పై నిమిషాలయింది. నేను నా కలవాటైన కిళ్ళీ దుకాణం ముందు కాసేపు ఆగాను. ఆ కిళ్ళీ దుకాణములో చాలా వార్తా పత్రికలూ, పుస్తకాలూ కూడా అమ్ముతారు. ఏదైనా వార్తా పత్రికను తీసుకుని ఓసారి పేజీలు తిరగేసి మళ్ళీ అక్కడ పెట్టేసే చనువూ స్వతంత్యమూ నాకా దుకాణం లో ఉన్నాయి.





