Home » VASUNDHARA » Vasundhara Kadhalu - 15
నేను ఇంటికి వెళ్ళేసరికి మళ్ళీ ఒక అపరిచిత వ్యక్తీ నా కోసం ఎదురు చూస్తున్నాడు. నన్ను చూస్తూనే అయన లేచి నిలబడి "శివశంకరం గారంటే మీరే ననుకుంటాను" నా పేరు మాధవరావు. శివరావు హత్య కేసులో ఇరుక్కున్న మోహన్ తండ్రిని"అన్నాడు.
9
"అన్నీ నాకు రామారావు గారు చెప్పారు. మీరే ఇప్పుడు మా వాణ్ణి రక్షించాలి" అన్నాడు మాధవరావు.
నేనిబ్బందిగా ముఖం పెట్టి, "రామారావు గారు మాట్లాడే తీరు నాకు నచ్చలేదు. అయన ఈ కేసులో విజయం సాధించగలడనీ నాకు తోచదు. మీరు మరి కాస్త మంచి డిటెక్టివ్ ను కుదుర్చుకుంటే మంచిది" అన్నాను.
'ఎందుకలాగంటున్నారు?"
"అయన నన్నేన్ను కోవడంలో ఉంది తిరకసంతా ! నేనో సామాన్య మధ్య తరగతి మనిషిని. నామాన నన్ను బ్రతకనివ్వక ఇలా హత్య కేసులో దొంగ సాక్ష్యాలు చెప్పమని నన్ను ప్రోత్సహించడం నాకు నచ్చలేదు. ఇలాంటి విషయాల్లో ఆరితేరిన వాళ్ళు బోలెడు మందున్నారు. దొంగ సాక్ష్యాలు చెప్పడమే వృత్తిగా గలవారు చాలా మందున్నారు. అటువంటి వాళ్ళను వదిలి పెట్టి నా దగ్గర కాయన రావడం, వృత్తిలో ఆయనకు అనుభవం చాలదని తెలుపుతుంది."
"ఇలాంటి కేసులో, మీ లాంటి వారి సాక్ష్యమే పనికొస్తుంది. మీలాంటి వారి సాక్ష్యాని కున్న విలువ మరి దేనికీ ఉండదు. మిమ్మల్నేన్నుకోవడం లోనే రామారావు గారి అనుభవం వ్యక్తమవుతుంది. అందులోనూ అయన సామాన్యులు కారనడానికి సాక్ష్యం , నా స్నేహితుడు శెషగిరి అతన్ని రికమెండ్ చేయడమే!"అన్నాడు మాధవరావు.
"ఏమిటి, డిటెక్టివ్ రామారావును మీకు శేషగిరి గారు కుదిర్చి పెట్టేడా?" అన్నాను ఆశ్చర్యంగా.
'అవును, అనుకోని ఈ చిక్కు ఎదురయ్యే సరికి ఏం చేయాలో పాలుపోక మారిపోయి కూర్చున్నాను నేను. ఆపద్భాంధవుడిలా శేషగిరి వచ్చి, డిటెక్టివ్ రామారావు గురించి చెప్పాడు. ఈయన కారణంగా ఎంతో మంది నిర్దోషులు రక్షించబడ్డారుట. హైదరాబాద్ నించి ప్రత్యేకంగా రప్పించామియాన్ని" అన్నాడు మాధవరావు.
"శేషగిరి అసాధ్యుడు' అనుకున్నాను. తను చేసెన హత్య కేసులో మరొకతను ఇరుక్కున్నాడు. అతన్ని రక్షించిడాని కోక ప్రఖ్యాత డిటెక్టివ్ ని హైదరాబాద్ నుంచి రప్పించాడు. ఏమిటి ఇతని ధైర్యం! రామారావు పరిశోధించి నిజాన్ని బయట పెట్టగలిగితే శేషగిరి ఏం చేస్తాడు!
ఆలోచించగా రెండే రెండు అవకాశాలు కనిపిస్తున్నాయి. రామారావు పరిశోధన సరిగ్గా నడిపించడు, తన ప్రయత్నాలు తను చేస్తున్నట్లు కనబడుతూనే మోహన్ మీద కేసు మరింత బలపడేటట్లూ చూస్తాడు. మోహన్ కు ఉరిశిక్ష పడితే నలుగురి తో పాటు తనూ ముసలి కన్నీళ్లు కారుస్తాడు. ఏ పరిస్థితుల్లోనూ శేషగిరి మీదకు అనుమానం రాదు. అందుకే తన మనిషిని పరిశోధనలోకి దింపాడు. డిటెక్టివ్ రామారావు శేషగిరి మనిషయుండాలి.
రెండవది శేషగిరి కి నామీద పూర్తీ నమ్మకం ఏర్పడి ఉండాలి. శివరావు హత్యకు నేను ప్రత్యక్ష సాక్షిని. నేను చెప్పేవరకూ శేషగిరి మీదకు ఎవరి అనుమానమూ పోదు.
"డిటెక్టివ్ రామారావు గురించి శేషగిరిగారి కేలా తెలుసు?' అనడిగాను. సమాధానం గురించి చాలా కుతూహలంగా ఎదురు చూస్తున్నాను.
"ఇదివరలో ఒక పర్యాయం రామారావు హైదరాబాద్ లో ఇబ్బందిలో ఇరుక్కున్న శేషగిరిని రక్షించేడుట. అది స్వానుభవమునుకోండి. లేకపోతె రామరావు గారు దేశంలో చాలామందికి తెలుసు. దొంగలకూ, హంతకులకూ అయన సింహ స్వప్నం" అన్నాడు మాధవరావు.
అందులోని నిజానిజాలు నాకు తెలియవు. నేనెప్పుడూ డిటెక్టివ్ రామారావు పేరు వినలేదు. అయినా హత్యలూ పోలీసులూ, డిటెక్టివ్ లూ వగైరా విషయాల మీద నాకాట్టే ఆసక్తి లేదు. అందువల్ల నేను వినకపోయినప్పటికీ అయన గొప్ప వాడ యుండవచ్చు. అయన నిజంగానే గొప్పవాడైన పక్షంలో శేషగిరి వ్యవహారం కొరివితో తల గోక్కున్నట్లే అవుతుంది.
"ఈ విషయంలో మీరేమీ దిగులు పడకండి. నేను చేయగలిగింది నేను చేస్తాను. అవసరపడే పక్షంలో మీ అబ్బాయి ప్రాణాలు రక్షించడం కోసం చిన్న అబద్దం కూడా చెబుతాను" అన్నాను ఆలోచిస్తూ.
"మీ మేలు మరిచిపోలేను. ఒక్కగానొక్క కొడుకు " అంటూ కళ్ళనీళ్ళు వోత్తుకున్నాడు మాధవరావు.
10
స్కూలు కు బయలు దేరబోతుండగా మా యింటికో అమ్మాయి వచ్చింది. మనిషి వన్నెల విసన కర్రలా ఉంది. ముఖంలో అందముంది. వయస్సు ఇరవై కి లోపుండదని నాకు తోచింది.
"మీరే శివశంకరం మేస్టారనుకుంటాను" అందామె.
"అవును - నువ్వెవరు?' అనడిగాను.
"మరోలా అనుకోకపోతే ఒక అయిదు నిముషాలు మీతో మాట్లాడాలి" అందామె.
వాచీ చూసుకుని "అలాగే కానీ, ముందుగా మీరెవరో తెలుసుకోవచ్చ్హా?" అనడిగాను.
"నన్ను కామినీ అంటారు. గుడి వీధిలో కామిని మేడంటే అందరికీ తెలుసు" అందామె సంకోచంగా.
ఆ అందరిలో నేనూ ఉన్నానని ఒప్పుకునేందుకు సిగ్గేసింది. "నీ మేడ సంగతి తెలియదు కానీ, గుడి వీధి గురించి ఆనోటా ఈనోటా విన్నాను" అన్నాను వెనకడుగు వేస్తూ.
ఇద్దరం చెరో కుర్చీలో కూర్చున్నాం.
'ఇక్కడికి రావడంలో నా స్వార్ధం మాత్రమేకాక మీ మేలు కోరడం కూడా ఉన్నదని మనవి చేసుకుంటున్నాను" అంది కామిని.
"ఏమిటో త్వరగా చెప్పు. అవతల స్కూలుకు టైము కావస్తోంది " అన్నాను.
"ఏమిలేదు, మోహన్ ని నిర్దోషిగా నిరూపించడానికి మీరు తప్పుడు సాక్ష్య మివ్వబోతున్నట్లు తెలిసింది. అలా చేయడం వల్ల మీకే నష్టమని హెచ్చరించడానికి వచ్చాను" అంది కామిని.
ఆశ్చర్యపోయాను.అప్రయత్నంగా 'ఈ విషయం నీదాకా ఎలా వచ్చింది?' అని నాలిక్కరుచుకున్నాను. నా ప్రశ్న లోనే ఆరోపణ నంగీకరించడం జరిగిపోయింది.
కామిని నవ్వింది. :నాది మీకులా సాఫీ అయిన జీవితం కాదు. నా బాట నలుగురూ నడిచేది కాదు. ఇంకోలా చెప్పాలంటే నలుగురు నడిచే బాటను నేను" అని ఒక్క క్షణం ఆగిందామె. "కాలు జారిందని బాధ పడనవసరం లేకుండా, క్రింద పడ్డ నాచేతికి రత్నాలు దొరికాయి, అప్పుడు నీనదే నా వృత్తిగా స్వీకరించాను. వృత్తి లోకి దిగేక విలాసాలు పెరిగాయి. ఖర్చులూ పెరిగాయి. అందుకని సంపాదించడానికి రకరకాల మార్గాలేన్నుకున్నాను.
అ మార్గాల్లో ఒకటి శివరావు స్నేహం. పేరు పొందిన ధనిక వ్యక్తుల్ని బ్లాక్ మెయిల్ చేసే అవకాశం నా ద్వారా శివరావుకు లభించింది. నాకు అందచందాలున్నాయి. వయసుంది. వయసుకు తగ్గ వంపులున్నాయి. ఆ వంపు సొంపులను సొమ్ము చేసుకునే తెలివి తేటలున్నాయి. నా వంటి ఆడది, పురుషలోకాన్నో ఊపు ఊపగలదనడానికి నేనే సాక్ష్యం! ముసలి వాళ్ళే నాకు లొంగి పోయినప్పుడు యువకులో లెక్క కాదు. అలాంటి కొంతమంది యువకుల్లో మోహన్ ఒకడు."
నేను వాచీ చూసుకున్నాను.
కామిని మళ్ళీ నవ్వింది. "కంగారు పడకండి మేష్టారు . ఒకపూట బడికి ఆలశ్యంగా వెడితే ఏదైనా సమాధానం చెప్పుకోవచ్చు. కానీ నేను చెప్పేది వినకపోతే జీవితాంతం విచారించవలసి ఉంటుంది."
"చెప్పదలచుకున్న దేదో త్వరగా చెప్పొచ్చుగా" అన్నాన్నేను కాస్త విసుగును ప్రదర్శిస్తూ. కానీ, నాకు వినాలని మనసులో చాలాకుతుహలంగా ఉంది.
"చెబుతున్నానుగా" అంది కామిని. ఆమె తన వానిటి బ్యాగులోంచి ఒక ఫోటో తీసి నాకు అందించింది. చూసి అదిరిపడ్డాను. అందులో మోహన్, కామిని సభ్య ప్రపంచం హర్షించని అసభ్య కరమైన విధంగా వున్నారు. ఆ ఫోటో నాకు కామిని ఎందుకు చూపించిందో అర్ధం కాలేదు. నా ముఖ భావాలను గమనించడానికి కాసేపు ఆగి మళ్ళీ మొదలు పెట్టింది కామిని.
"ఇదీ మోహన్ చరిత్ర . అతని చర్యను నేను దృశ్య కావ్యంగా మలిచాను. ఈ ఫోటో బయటపడితే నాకేం ఫరవాలేదు. నా బ్రతుకు నలుగురికీ తెలిసినదే కాని, మోహన్ వ్యభిచారం చేసినట్లు తిరుగులేని ఋజువు దొరుకుతుంది. తప్పులు చేయకుండా ఉండలేని ఈ శ్రీమంతుని బిడ్డకు చేసిన తప్పు బయటపడితే మాత్రం పరువు పోతుందిట. ఆ పరువులు కాపాడు కొనడం కోసం శివరావు కతను నాలుగైదు వేల వరకూ చెల్లించుకున్నాడు. అందులో నాకూ వాటా వుండి వుండాలని అనుమానించాడు. నేను నిర్దోషి త్వాన్నభినయించాను. అతను నమ్మలేదు. నా సహకారం లేకుండా నాయింట్లో ఫోటో నేలా తీయగలడని అడిగేడు. ఆ శివరావెవరో నాకు తెలియదని, కావాలంటే అతని ఎదురుగానే నా నిర్షోషిత్వాన్ని నిరూపించుకుంటానని అన్నాను. ఆ ప్రకారం ఒకరోజు మోహన్, నేను కలిసి వెళ్ళాం. శివరావుతో మాట్లాడడానికి...."





