Home » VASUNDHARA » Vasundhara Kadhalu - 13
అదే రూపం, అదే వయసు, అదే నవ్వు, అదేమాట..
ఓ పల్లెటూర్లో హీరోకు ఆశ్రయమిస్తుందో వృద్దురాలు. ఆ వేషం చంద్రమ్మది.
అప్రయత్నంగా తమ్ముడి భుజం తట్టింది విమల.
"ఏంటక్కా!" అన్నాడు రమేష్ కాస్త విసుగ్గా.
"ఆమె ఎవర్రా?" అంది విమల.
"ఆమె అంటే?"
"అదే-చంద్రమ్మ!" అంది విమల.
"చంద్రమ్మెవరే?" అన్నాడు రమేష్.
విమల నాలిక్కరుచుకుని-"ఈ సినిమాలో ఆమె పేరు నర్సమ్మ-" అంది.
"ఓహ్-అదా-ఆమె పేరు భద్రమ్మ. చాలా సినిమాల్లో ముసలి వేషాలు వేసింది. నేను కాబట్టి చెప్పగలిగాను కానీ ఆమె పేరు ఎవ్వరికీ తెలియదు. వయసు ముప్పై కూడా ఉండదట. పాపం కొందరి అదృష్టం అలాంటిది. ఏ సినిమాలోనూ రెండుమూడు నిమిషాలకు మించి కనిపించదు...." అన్నాడు రమేష్.
"ఇంకా నటిస్తోందా?" అంది విమల.
"కొత్తగా రీలీజైన సినిమాల్లో కనబడ్డం లేదు. ఇప్పుడు మనం చూస్తున్న సినిమా మూడేళ్ళ క్రితంది-" అన్నాడు రమేష్.
"సరేలే-సినిమా అయ్యాక మాట్లాడుకుందాం-" అంది విమల. కానీ ఆమె సినిమాపైన దృష్టిని కేంద్రీకరించలేకపోయింది. ఆమెకు చంద్రమ్మ ముఖం బాగా గుర్తున్నది. నిస్సందేహంగా ఆ సినిమాలో మనిషి చంద్రమ్మే! మరి ఆ మనిషి రోజూ తనింట్లో యెలా కనబడుతున్నదో అర్ధం కావడంలేదు.
విమలకు తెలిసిన చంద్రమ్మ ఆ సినిమాలో రెండు మూడుసార్లు కొద్దిక్షణాలపాటు కనిపించడమే కాక చిట్ట చివర గ్రూపు ఫోటోలోకి కూడా వచ్చింది.
సినిమా పూర్తికాగానే-"నువ్వా భద్రమ్మ అడ్రసు సంపాదించగలవా?" అంది విమల.
"ఎందుకే?" అన్నాడు రమేష్.
"అన్నీ చెబుతాను. ముందు నాకు ఆమె వివరాలు కావాలి-"
"వివరాలు తెలుసుకొనడం పెద్ద కష్టం కాదు. అభిమాన సంఘాలవారి నడిగితే చెబుతారు-" అన్నాడు రమేష్.
"భద్రమ్మక్కూడా అభిమాన సంఘాలున్నాయా?" అంటూ విమల ఆశ్చర్యంగా అడిగింది.
"అభిమాన సంఘాలంటే ప్రత్యేకంగా అది కాదనుకో! ప్రముఖ హీరోలకీ హీరోయిన్ లకీ వేర్వేరుగా ఉంటాయి. అయితే పేరున్న దేవుళ్ళ గుళ్ళలో చిల్లర దేవుళ్ళకు స్థలాలు కేటాయించినట్లు ప్రతి అభిమాన సంఘం వాళ్ళకీ కూడా చిల్లర అభిమాన నటులుంటారు. ఆ విధంగా చూస్తే సినిమాల్లో కనబడ్డ ప్రతివాడికీ అభిమాన సంఘాలుంటాయి. మన ప్రజల సినిమా పిచ్చి నీకు తెలియందేముంది!" అన్నాడు రమేష్.
అతడు రాత్రికి రాత్రి భద్రమ్మ వివరాలు సంపాదించుకుని వచ్చాడు.
భద్రమ్మ 1970 లో సినిమాల్లో ప్రవేశించింది. సుమారురి పది సంవత్సరాల్లో రెండువందల చిత్రాల్లో నటించింది. వాటిలో నిమిషానికి మించి కనిపించిన సినిమాలు పన్నెండుంటాయి. వయసులో చిన్నదైనా అన్నీ వయసు మళ్ళీన పాత్రలనే ధరించింది. మంచి నటి. దురదృష్టం కొద్దీ పెద్ద నటి కాలేకపోయింది. రెండు సంవత్సరాల క్రితం ఆమె సినీ ఫీల్డును వదిలిపెట్టింది. ఏమైందో తెలియదు. ఆత్మహత్య చేసుకున్నదన్న పుకారు వుంది.
"ఈ భద్రమ్మను నేను రోజూ చూస్తున్నాను-" అంటూ విమల తమ్ముడికి తన అనుభవం చెప్పింది.
"చాలా చిత్రంగా ఉన్నదే!" అన్నాడు రమేష్.
"జరిగింది కలో, నిజమో కూడా నాకు తెలియకుండా పోతున్నది. కానీ ఈ రోజు సినిమాలో ఆమెను చూసేక ఏదో నాటకం జరుగుతున్నదని అనుమానం వస్తున్నది-" అంది విమల.
"గదిలో రెండో మనిషిని ఉంచుకుంటే!"
"అదీ చేశానుగా-కళ్యాణి వళ్ళు తెలియకుండా నిద్రపోతూ - వేరే కలలు కంటున్నది-" అంది విమల.
"గదిలో కాక గది బయటనుంచి చూస్తే!"
"అయిడియా-" అంది విమల-"అయితే ప్రస్తుతం నీకెలాగూ సెలవులే అంటున్నావు. మీ బావ వచ్చే వరకూ నువ్వు నాతో వచ్చి ఉండకూడదూ-"
రమేష్ ఉత్సాహపడ్డాడు. స్మిత కూడా వస్తానన్నది. కానీ ఆమె పిరికిది. అందుకని విమల ఆమెను మరోసారి తీసుకుని వెడతానన్నది.
మర్నాడుదయమే టిఫినుచేసి బస్సులో బయల్దేరారు అక్కాతమ్ముళ్ళిద్దరూ.
7
రమేష్ ఆ యింటినంతా ఒక డిటెక్టివులా పరిశోధించాడు.
అక్కా తమ్ముళ్ళిద్దరూ చాలాసేపు చర్చించారు.
ఇద్దరికీ దెయ్యాలమీద నమ్మకంలేదు. అందువల్ల చంద్రమ్మ మనిషే అయుండాలి. ఆమె మనిషే అయిన పక్షంలో ఆమెకూ కొన్ని పరిమితులుంటాయి. ముఖ్యంగా ఆమెకు రమేష్ ఇంట్లో వున్నట్లు తెలియకూడదు.
అందుకని ఆ రోజుకు రమేష్ బయటకు వెళ్ళిపోయి రాత్రికి రాదలిచాడు. రమేష్ కోసం విమల దొడ్డి తలుపు గడియవేయకుండా ఉంచుతుంది. రమేష్ వచ్చి అక్క గదిలో ఏం జరుగుతున్నదీ బయటనుంచి చూస్తాడు. అందు గురించి విమల తలుపుకు కన్నంచేసింది. ఆ కన్నం లోంచి అన్నీ స్పష్టంగా కనబడుతున్నదీ లేనిదీ ఇద్దరూ పరీక్షించి తెలుసుకున్నారు.
మామూలుగా రాత్రి అయింది. ఆపైన అర్ధ రాత్రి అయింది.
రమేష్ దొడ్డిదారిన ఇంట్లో ప్రవేశించాడు. ఎక్కడా చప్పుడవకుండా జాగ్రత్తపడ్డాడు. ఓపికగానూ, నిశ్శబ్ధంగానూ అక్క గదిలోనికి చూడసాగాడు.
టైము గడుస్తోంది.
గదిలో ప్రకాశవంతంగా బల్బు వెలుగుతున్నది. విమల మంచంపైన ఆదమరిచి నిద్రపోతున్నది.
"అక్కకు అంతలా ఎలా నిద్రపడుతోందో!" అనుకున్నాడు రమేష్.
ఇంతలో గదిలో మొత్తం చీకటైపోయింది. రమేష్ కళ్ళునులుముకున్నాడు. ఏం జరిగింది? కరెంట్ పోయిందా, లేక....
అతడాలోచిస్తూండగానే గదిలో బెడ్ లైట్ వెలిగింది. అప్పుడు లోపలి దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు రమేష్.
గదిలో ఒక ముసలిది అటూ యిటూ పచార్లు చేస్తున్నది.
రమేష్ గుండె ధైర్యం గలవాడు కాబట్టి కానీ మరొకరికైతే గుండెలవిసిపోయి వుండేవి.
ఆ ముసలిదాన్ని భద్రమ్మగా గుర్తించాడు రమేష్.
ఆమె గదిలోకి ఎలా వచ్చింది. యిట్లు వాటంతట ఎలా ఆరిపోయాయి? మెయిన్ స్విచ్ తనున్న చోటికి దగ్గర్లోనే వుంది. ఎవ్వరూ దాని జోలికి వెళ్ళలేదు. స్విచ్ నొక్కిన చప్పుడు కాకుండా గదిలోని దీపం ఆరిపోయింది. స్విచ్ నొక్కిన చప్పుడు కాకుండా గదిలో బెడ్ లైట్ వెలిగింది. కరెంట్ పోయిందనుకుందామన్నా ఏ చిరుసవ్వడీ లేకుండా ఓ దీపం ఆరి మరో దీపం ఎలా వెలిగింది? అంతా మిస్టరీగా వుంది.
రమేష్ గదిలోనికి చూస్తున్నాడు. ముసలిది పచార్లు చేయడం ఆపి విమలను సమీపించింది. ఆమె విమలకు ముక్కువద్ద ఏదో ఉంచుతోంది.
అప్పుడు విమల కాస్త కదిలింది.
ముసలిది విమలను తట్టి లేపింది.
విమల కళ్ళు నులుముకుంటూ లేచి-"నువ్వా, చంద్రమ్మా."
"ఏమిటో-రోజూ నువ్విలా కనబడుతూంటే నాకు భయం వేస్తోంది. నిన్న మా ఊరెళ్ళి వచ్చాను. నా తమ్ముణ్ణి సాయం తెచ్చుకున్నాను. కానీ వెధవ.....సినిమాకని పోయి ఇంతవరకూ రాలేదు...." అంది విమల.
"ఎవరు సాయం వచ్చినా ప్రయోజనముండదు. నేను మానవాతీత శక్తిని. నన్నెవ్వరూ ఏమీ చెయ్యలేరు. నువ్వు నాకు మాటిచ్చావు. ఆ మాట నిలబెట్టుకో. నాకు చాలా అనుమానంగా వుంది. నేనీ ఇల్లు వదిలి బయటకు రాలేని అసహాయురాలినని తెలిసి నువ్వీ ఇల్లే వదిలేప్రయత్నాలు చేస్తున్నావని. కానీ అది న్యాయంకాదు. నేను నిన్ను వేడుకుంటున్నాను. నువ్వలాంటి పని చేయవద్దు. ఈపాటికి నువ్వు గ్రహించే వుంటావు. ఒకరికి హాని చేసే స్వభావం కాదు నాది. లేకపోతే ఈపాటికి..." అని ఆగిపోయింది చంద్రమ్మ.





