Home » VASUNDHARA » Vasundhara Kadhalu - 13
"నా భర్త సోమవారంనాడు వస్తాదు. దయచేసి అంతవరకూ నువ్వు నాకు కనిపించకూడదు...." అంది విమల.
"రోజు ఒకసారి కనబడి నిన్ను హెచ్చరించకపోతే నాకు మనఃస్థిమితం వుండదు. నువ్వు మాత్రం నా కోరిక తీర్చాలి-" అంది చంద్రమ్మ.
"అలాగే నన్నానుగా-" అంది విమల.
"రేపు మళ్ళీ వస్తాను...." అంది చంద్రమ్మ.
ఉన్నట్లుండి విమలకు రెప్పలు బరువెక్కాయి. చూస్తూండగా ఆమె వెనక్కు వాలిపోయి నిద్రపోయింది.
ఏం జరుగుతుందోనని రమేష్ ఆత్రుతగా చూస్తున్నాడు.
గదిలో బెడ్ లైట్ ఆరిపోయింది. అంతా చీకటి!
కొద్ది క్షణాల్లో మలేలే బెడ్ లైట్ వెలిగింది.
గదిలో ముసలమ్మలేదు. వేసిన తలుపులన్నీ వేసినట్లే వున్నాయి.
ఆమె ఎలా మాయమయిందో రమేష్ కు అంతుబట్టలేదు.
కొద్ది క్షణాలాగి అతడు దబదబా తలుపులు బాదాడు. విమల కదల్లేదు. అక్కా, అక్కా అని పిలిచాడు. ఆమె కదల్లేదు. అయిదు నిమిషాల సేపు నిర్విరామంగా ప్రయత్నించి అలసిపోయి రమేష్ తన ప్రయత్నం విరమించుకుని దొడ్డిదారిన మళ్ళీ వీధిలోనికి వచ్చి కాలింగ్ బెల్ అదే పనిగా మ్రోగించాడు.
ఆఖరుకు విమల లేచి తలుపు తీసింది.
"అబ్బ-ఏం నిద్ర నీది! ఇందాకట్నుంచి చస్తున్నాను" అన్నాడు రమేష్.
"ఏమోరా-చీమ చిటుక్కుమంటే లేచే స్వభావం నాది. నీకు తెలియదు గనుకనా-ఈ దెయ్యం కనబడ్డం ప్రారంభించినప్పట్నించీ ఇలా నిద్ర పట్టేస్తోంది-" అంది విమల.
"నీకు వస్తున్నది కలకాదక్కా-నీ గదిలో ముసలి దాన్ని నేనూ చూశాను. అది నీతో మాట్లాడిన మాటలన్నీ కూడా విన్నాను. గదిలోకి చూస్తూండగా లైట్లు ఆరిపోయాయి. ఆ తర్వాత ఏ చప్పుడూ లేకుండా బెడ్ లైట్ వెలిగింది. ముసలిది గదిలో పచార్లు చేస్తోంది. దాన్నలా చూస్తూంటే నాకు గుండెలవిసిపోయాయనుకో" అంటూ తను చూసిందంతా విమలకు చెప్పాడు రమేష్.
చంద్రమ్మను చూడడం తన మనసు కల్పించిన భ్రమకాదని తెలియగానే ఆమె మనసు రవంత తేలికపడింది.
"వ్యవహారం చూస్తూంటే ఇది నాటకంలా లేదు. ఆ భద్రమ్మ చచ్చి దెయ్యమయిందేమోనని నాకు అనుమానంగా వుంది-" అన్నాడు రమేష్.
"అయితే ఏం చేయాలంటావ్!" అంది విమల.
"ఈ ఇల్లమ్ముకుని పోవడం మంచిది-"
"బాగుందిరా-అమ్ముకుంటే మళ్ళీ ఇలాంటిల్లు దొరుకుతుందా-ఆ దెయ్యం బాధైనా ఎలాగో భరిస్తాను కానీ ఈ ఇల్లు వదిలిపెట్టలేను-" అంది విమల.
"నాకు మాత్రం ఈ యిల్లు వదిలిపెట్టడమే మంచిదని పిస్తోంది. దెయ్యాలతో వ్యవహారం మాటలుకాదు. మనుషులైతే ఎప్పుడేం చేస్తారో ఊహించుకొనవచ్చును. కానీ దెయ్యాలకు అపూర్వ శక్తులుంటాయి. తిక్క రేగిందంటే అవి తమ శక్తుల్ని ఉపయోగించడం మొదలుపెడతాయి. ఇంతకాలం నేను దెయ్యాలు లేవనే నమ్ముతున్నాను. ఈ దెబ్బతో ఆ నమ్మకం అదిరింది. నా మనసు బెదిరింది.....మతి చెదిరింది" అన్నాడు రమేష్.
"ఏరా-నువ్వు నన్ను బెదరగొట్టాలనుకుంటున్నావా-దెయ్యాల్ని నమ్ముతున్నావా?" అంది విమల.
"నువ్వు నమ్ముతున్నావో లేదో చెప్పు!" అన్నాడు రమేష్.
"నమ్మాలో నమ్మకూడదో తెలియడంలేదు. నాకేమీ పాలుపోవడంలేదు...." అంది విమల.
"మన నమ్మకం సంగతి ఎలాగున్నా-ముందీ సమస్యకు పరిష్కారం చూడాలిగదా-" అన్నాడు రమేష్.
"ఎలా?"
"ఎవరైనా డిటెక్టివును ఆశ్రయిస్తే!" అన్నాడు రమేష్.
"ఏమో-వాళ్ళెంతలేసి ఫీజులు అడుగుతారో ఏమో" అంది విమల.
"పోనీ-పోలీసులకు చెబితే-"
"అదేదో ఆయనకు చెప్పకుండా చెయ్యడం నాకిష్టం లేదు. పోలీసులతో వ్యవహారం మరీ ప్రమాదమని పత్రికల్లో చదవడం లేదూ నువ్వు!"
"అయితే ఈ కేసును మనమే పరిశోధిద్దాం-" అన్నాడు రమేష్.
"ఎలా?"
"ముందా దెయ్యం ఈ గదిలో ఎలా ప్రవేశిస్తున్నదీ తెలుసుకోవాలి-" అన్నాడు రమేష్.
"అది దెయ్యమే అయితే ఎలాగైనా ప్రవేశించగలదు...."
"అది దెయ్యం కాదనుకుంటేనే మన పరిశోధన ముందుకు వెడుతుంది-" అన్నాడు రమేష్.
"అది వచ్చేముందు గదిలో దీపాలు ఆరిపోతున్నాయి. స్విచ్ నొక్కిన చప్పుడు కావడంలేదు. తర్వాత ఏ స్విచ్చీ నొక్కకుండానే గదిలో బెడ్ లైట్ వెలుగుతున్నది. ఆ సమయానికి నాకు అంతులేని నిద్ర వస్తున్నది. అదే నన్ను తట్టి లేపుతున్నది. ఆ తర్వాత మళ్ళీ నాకు అంతులేని నిద్రవస్తున్నది. అది దెయ్యంకాదని అనుకోవడం ఎలాగో చెప్పు-" అంది విమల.
"పరిశోధించకుండా ఎలా చెప్పేది?" అన్నాడు రమేష్.
"పరిశోధన ఎలా మొదలెడుతావో చెప్పు-" అన్నది విమల.
"చెబుతాను. కానీ ఇక్కడ కాదు. ఇప్పుడు పడుకుని లేచి భోజనాలయ్యాక మనం బయటకు పోదాం-" అన్నాడు రమేష్ తగ్గు స్వరంతో.
ఇద్దరూ నిద్రకు పడ్డారు. పెందరాళే లేచారు. పదయ్యేసరికల్లా వాళ్ళ భోజనాలై పోయాయి.
ఇద్దరూ బజార్లోకి వచ్చేక రమేష్ విమలతో అన్నాడు "మనింట్లోనే ఆ ముసలిది ఎక్కడో రహస్యంగా వుంటున్నదని నా అనుమానం. అది ఇంట్లోకి ఎలా వస్తున్నదో కనిపెట్టాలి. వచ్చేముందు దీపాలారిపోతున్నాయి. ఎవరూ చూడకుండా అది గదిలో ప్రవేశించాలనుకుంటున్నది. అంటే అది దెయ్యం కాదు. కరెంటు పోయినా సరే గదిలో వెల్తురుండాలి. అందుకు మనమేదైనా ఏర్పాటు చేయాలి-"
"ఏం చేయాలో చెప్పు-" అంది విమల.
"నువ్వు నీ గది తలుపులు గడియవేయకూడదు. నీ గదిలో దీపాలు ఆరగానే నేను బ్యాటరీ లైతుతో ప్రవేశిస్తాను...." అన్నాడు రమేష్.
"నువ్వూ నాతోపాటు గదిలోనే పడుకోనవచ్చుగా" అంది విమల.
"ఏమో-అలాగైతే నాకు నిద్ర వస్తుందేమోనని భయం. నీహోపాటు కళ్యాణి పడుకుంటే ఏం జరిగిందో చూశావుగా-ఆమె నిద్రపోయింది. నువ్వు మాత్రమే దెయ్యాన్ని చూశావు-" అన్నాడు రమేష్.
"నీవి నిజంగా అద్భుతమైన తెలివితేటలు-" అంది విమల.
"అందుకేగా-ఆ దెయ్యం ఇంట్లో మన మాటలు వినేస్తుందని ఈ వివరాలన్నీ బయట చెబుతున్నాను-" అన్నాడు రమేష్.
"అంతా బాగానే ఉందికానీ-అది దెయ్యంకాక నిజంగా మనిషే అయితే-" అంది విమల.
"దాని నాటకం బయటపెడతాం-"
"ఆ విషయం బాగానే వుంది. అది ఇంత తెలివిగా నాటకమాడుతున్నదంటే బాగా తెగించినదై వుండాలి. మనం దాన్ని పట్టుకోగలమా? అలా పట్టుకోవడానికి ప్రయత్నిస్తే ప్రాణప్రమాదం కలగదు కదా-" అంది విమల.
"నువ్వు చెప్పినంత దూరం నేనాలోచించలేదే అక్కా! అయినప్పటికీ ఇలాంటి విషయాల్లో తెగింపు అవసరం. ధైర్యేసాహసే లక్ష్మీ అన్నారు పెద్దలు. నాకు చాలా ఉత్సాహంగా వుంది-" అన్నాడు రమేష్.
"అది కాదురా-దాని వెనుక ఓ పెద్ద ముఠా వున్నదేమో!" అంది విమల.
"ముఠా వుంటే నిన్న నేను రహస్యంగా చూసినప్పుడెందుకూరుకుంటారు? నా ఉద్దేశ్యంలో అది ఒక్కత్తే ఈ పని చేస్తోంది. ఎందుకు చేస్తోందో సరిగ్గా చెప్పలేను కానీ దీనివల్ల ఏదో ప్రయోజనముంది. ఆ వివరాలు ఈ రాత్రికే తెలుసుకుందాం. నువ్వు భయపడి-నన్ను భయపెట్టవద్దు. సరేనా?" అన్నాడు రమేష్.
సరేనంది విమల.
8
మళ్ళీ అర్ధ రాత్రి.
రమేష్ బ్యాటరీ లైటు చేత్తో పట్టుకుని అక్కపడుకున్న గదిలోనికి చూస్తున్నాడు.
గదిలో దీపం ప్రకాశవంతంగా వెలుగుతున్నది. అది ఎప్పుడు ఆరుతుందా-తానెప్పుడు గదిలో ప్రవేశిద్దామా అని ఎదురుచూస్తున్నాడు రమేష్.
బయట చీకటి బాగా చిక్కబడింది.
ఉన్నట్లుండి గదిలోని దీపం ఆరిపోయింది. రమేష్ ఒక్క ఉదుటున తలుపులు తోసుకుని గదిలో ప్రవేశించి బ్యాటరీ లైటు వేశాడు.





