Home » VASUNDHARA » Vasundhara Kadhalu - 13
"కలలోకి రఘు వచ్చాడు...." అని ఆగిపోయింది కళ్యాణి.
"రఘు ఎవరు?"
"కాలేజీలో మాకు సీనియర్...." అంది కళ్యాణి. "మనిషి సినిమా హీరోలకంటే బాగుంటాడు!"
"చంద్రమ్మ అనే ముసలిది కల్లోకి రాలేదా?" అనడిగింది విమల.
"ఛీ-మా కల్లో అసలు ముసలాళ్ళే లేరు. మొత్తం మేమిద్దరమే! ఆ కల కూడా కలలా లేదు. అచ్చం నిజంగా జరిగినట్లే వుంది-" అంది కళ్యాణి. ఆమె బుగ్గలు ఎందువల్లనో ఎరుపెక్కాయి.
"అచ్చం జరిగినట్లే వుందా-ఏం జరిగిందేమిటి?" అంది విమల.
"ఛీ-ఎలా చెప్పేది ఆంటీ...." అంది కళ్యాణి సిగ్గుపడుతూ.
"సిగ్గెందుకు? రాత్రి నాకూ కల వచ్చింది. అదీ జరిగినట్లే వుంది. కల అంటే ఇప్పటికీ నమ్మబుద్ధి కావడం లేదు-...." అంది విమల.
"మీకు అంకుల్ వచ్చారా కలలోకి-" అంది కళ్యాణి.
"కాదు-చంద్రమ్మ అనే ముసలిది...."
"వచ్చి ఏం చేసింది?"
"తను మోహినీ పిశాచాన్నని చెప్పింది...."
"అమ్మ బాబోయ్-ఇంకెప్పుడూ మీ యింటికి వచ్చి పడుకోను-" అంది కళ్యాణి భయంగా.
"మధ్య నీకు భయమెందుకు? పిశాచి నా కల్లోకే గానీ నీ కల్లోకి రాలేదు గదా-" అంది విమల.
"ఏమో- ఈ రోజు నీ కల్లోకి వచ్చింది-రేపు నా కల్లోకి రావచ్చు...."
"వస్తేరాని- కలలోకే గదా-భయమెందుకు?"
"ఏమో నాకు పిశాచాలంటే భయం-" అని కళ్యాణి వెళ్ళిపోయింది.
విమలకు ఏం చేయాలో పాలుపోలేదు. తనకు వచ్చినది కలలాలేదు. కల ఇంత ఖచ్చితంగా రెండు రోజులపాటు కొనసాగదు. కల్యాణిని తను సాయపడుకోబెట్టుకొనడం వల్ల ప్రయోజనమేమీ కనబడలేదు.
ఇప్పుడు తనేం చేయాలి?
మరో రాత్రి మళ్ళీ ఆ పిశాచి దర్శనం చేసుకోవాలా?
విమలకు వళ్ళు జలదరించింది. తను నిజంగా పిశాచితో మాట్లాడిందా - లేక ఎవరో పిశాచినని తన్ను భ్రమపెడుతున్నారా లేక మొత్తమంతా తన ఊహా సంజనితమా?
అది ఊహ కాకపోతే?
పిశాచికి తన భర్తను అప్పగించాలా?
విమల మనసు బాధగా మూలిగింది. అది అసాధ్యం! ఆ పని తనవల్ల కాదు.
మరి తానీ పిశాచి బారినుండి తప్పించుకోవాలంటే వేరే ఏదైనా ఉపాయామున్నదా?
తనీ ఇంటిని ఆవహించుకుని ఉన్నాననీ-ఆ యిల్లు వదిలి వేరెక్కడకూ రాలేననీ ఆ పిశాచి అన్నది తను ఇల్లు మారితే ప్రయోజనముంటుందా?
మోహినీ పిశాచి కన్ను తన భర్త మీద పడింది. అది తమను వదిలిపెడుతుందా? ఏదో విధంగా అది తన భర్తను ఆకర్షించుకుని తనవద్దకు రప్పించుకోదా?
విమలకు ఏం చేయాలో పాలుపోలేదు.
తన భర్త సోమవారం మధ్యాహ్నానికి వస్తాదు. ఈ రోజింకా గురువారం. ఇక్కడుంటే రోజూ రాత్రి తనకు ఆ చంద్రమ్మ దర్శనం తప్పదు.
విమలకు భయం తక్కువే! కానీ చంద్రమ్మ గురించి ఆలోచిస్తూంటే భయం వేస్తోంది. ప్రతిరోజూ రాత్రి ఆమె తనముందు ప్రత్యక్షమవుతున్నది. ఎలా వస్తున్నదో తెలియడంలేదు. మానవాతీత శక్తి అనే అనిపిస్తున్నది. అందుకే భయం వేస్తున్నది.
మానవాతీత శక్తులను నమ్మకపోవడం వేరు. వాటిలో ప్రత్యక్షానుభవం పొందడం వేరు.
విమల ఆ పూటే పుట్టింటికి ప్రయాణం కట్టింది. ఆమె పుట్టిల్లు ఆ ఊర్నించి మూడు గంటలు ప్రయాణం మాత్రమే!
6
"పందెంలో నేను పాతికరూపాయలు గెల్చుకున్నాను, ఎవరికేం కావాలో చెప్పండి-కొనిస్తాను-" అన్నాడు రమేష్.
"ఏమి పందెంరా అది-" అంది రమేష్ తల్లి సుందరమ్మ.
"ఏ సినిమాలోనైనా సరే ఒక నిమిషానికి మించి కనిపించిన ఏ నటుడి పేరైనా నేను చెప్పగలనన్నాను. నా స్నేహితుడు పాతిక రూపాయలు పందెం కాశాడు. ఆ పందెం నెగ్గాను నేను-" అన్నాడు రమేష్.
"బాగుంది. ఈ తెలివితేటలు చదువులో చూపిస్తే బాగుండేది-" అంది సుందరమ్మ.
"చదువులో మాత్రం నేను తక్కువేం చేశాను! క్లాసులో ఫస్టు వచ్చానుగా-"
సుందరమ్మ మాట తప్పిస్తూ-"పాహిక రూపాయలకు ఏమొస్తాయిరా?" అంది.
"మిమ్మల్నందర్నీ సినిమాకు తీసుకుని వెడతాను. హాల్లో కూల్ డ్రింక్సు ఇప్పిస్తాను. సాయంత్రం నాన్నగారాఫీసు నుంచి తిరిగివచ్చేలోగా మనమంతా మ్యాట్నీకి వెళ్ళి వచ్చేద్దాం-" అన్నాడు రమేష్.
"అలా చేద్దామే అమ్మా-" అంది రమేష్ చెల్లెలు స్మిత.
"మీరు వెడితే వెళ్ళండి. నేను రాను..." అంది సుందరమ్మ.
"నాకంటే పెద్దవాళ్ళోకరూ-చిన్నవాళ్ళొకరూ-ఇద్దరుంటే బాగుంటుందని అనుకున్నాను. అమ్మా-నువ్వెప్పుడూ అంతే! నా పథకాలన్నీ పాడుచేస్తూ వస్తావు. అక్కయ్యున్నా బాగుండేది...." అన్నాడు రమేష్.
"అరే-అంతా ఇంట్లోనే వున్నారా-ఏరా స్కూల్సుకిప్పుడు సెలవా ఏమిటి?" అంది విమల అప్పుడే ప్రవేశిస్తూ.
"అక్కయ్యొచ్చిందోవ్-" అంది స్మిత ఉత్సాహంగా.
"అక్కా-ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నాం. నీకు వెయ్యేళ్ళాయుష్షు..." అన్నాడు రమేష్.
"ఏమిటే-హఠాత్తుగా ఇలా వచ్చావ్....కొంపదీసి అల్లుడుగారితో ఏమైనా గొడవ పడలేదుగదా-" అంది సుందరమ్మ కంగారుగా.
"అదేం లేదమ్మా-ఆయనూళ్ళో లేరు. సోమవారం దాకా రారు. ఒక్కదానికీ అక్కడ తోచడంలేదు. వెంటనే బయల్దేరి వచ్చేశాను....." అంది విమల.
"మంచి పని చేశావక్కా-పద-సినిమాకు పోదాం.." అన్నాడు రమేష్.
"సినిమా ఏమిట్రా!" అంది విమల.
రమేష్ తన పందెం గురించి చెప్పాడు.
"ఇప్పుడే ప్రయాణంచేసి వచ్చిందా-అది సినిమాకేం వస్తుందిరా-" అంది సుందరమ్మ కొడుకుని మందలిస్తూ.
"ఓస్-మూడు గంటల ప్రయాణం కూడా ఓ ప్రయాణమేనా?" అన్నాడు రమేష్ తీసిపారేస్తూ.
"ప్రయాణం సంగతికేంగానీ-నువ్వు అక్కాచెల్లెళ్ళతో కలిసి చూడ్డానికి వీలుపడే సినిమాలేమైనా అసలూళ్ళో ఆడుతున్నాయా?" అంది విమల.
"బాగుంధక్కా - నాయకులు చెడ్డవాళ్ళని దేశం వదిలిపెట్టి పోతామా? సినిమాలు నీటుగా లేవని మనం చూడ్డం మానేస్తామా?" అన్నాడు రమేష్.
"సినిమాలు మారేదాకా మనం చూడ్డం మానేయాలి-" అంది విమల.
"సినిమాలు మారవక్కా! మనమే మారాలి.....అనవసరంగా కాలయాపన చేయకు. అవతల టైమైపోతోంది. శంకరాభరణంలాంటి సినిమాకు తీసుకుని వెడతాను. సరా?" అన్నాడు రమేష్.
మొత్తంమీద ఆ ముగ్గురూ సినిమాకు బయల్దేరారు.
ముగ్గురూ కాస్త పాత సినిమాకే వెళ్ళారు.
సినిమా చూస్తూండగా విమల ఉలిక్కిపడింది. అందులో ఆమెకు చంద్రమ్మ కనబడింది.





