Home » VASUNDHARA » Vasundhara Kadhalu - 12
అప్పుడే ఆయనకు స్పురించింది. కూతురు తాళాలను బొడ్లో దోపుకుంది. తనకు కుడివైపున కూర్చుంది. లలిత, ఎడమ వైపు బొడ్లో దోపుకుని ఉంటె, క్రింద పడడంలో రుమాలు కారణంగా చప్పుడు కాస్త తక్కువగా అయుండవచ్చు. తాళాలు తన సీటు క్రిందకు దగ్గర్లో పడే అవకాశమూ ఉంది. అయినా వెనకాల కూర్చున్నవాడు లలిత సీటు క్రింద తాళాలు చూసి ఆడపిల్లను పలకరించడం బాగుండదనిపించి తన్ను పలకరించి తాళాలిచ్చి వుండవచ్చు. ఏది ఏమైనప్పటికీ తన ఇంట్లో దొంగతనం జరుగలేదు.
పట్టాభిరామయ్య ఇనప్పెట్టె తలుపులు మూశాడు. తాళం వేసి లేచి నిలబడ్డాడు. అయన పడక గదిలో గోడ లకు చుట్టూ దేవుడి పటాలున్నాయి. ఒక్కొక్క దేవుడి పటానికీ నమస్కరించుకుంటూ వస్తూ ఒక వైపుగా చూసి మ్రాన్పడిపోయాడు.
లయకారకుడైన పరమశివుడి పటం క్రింద ఒక కుర్చీలో ఒక భయంకర మైన ఆకారం కూర్చుని ఉంది. పొడుగాటి జుట్టు వికృతమైన ముఖం నోట్లోంచి పొడవుగా వచ్చిన రెండు కోరపళ్ళు , నిలువునా నల్లటి రోమాలు, నోట్లో సిగరెట్ పొగ గుప్పుగుప్పుమని వదుల్తోంది.
పట్టాభిరామయ్య తన్ను చూడగానే ఆ ఆకారం పైకి లేచి నిలబడింది.
పట్టాభిరామయ్య వణుకుతున్నాడు. అయన మెదడు పనిచేయడం మానేసింది. శరీరం నిండా అంతులేని భయం. ఆ ఆకారం నెమ్మదిగా మరో రెండడుగులు వేసింది.
పట్టాభిరామయ్య నోటమాట రాలేదు. ఆకారం మరో అడుగు వేసేలోగా అయన కుప్పగా కూలిపోయాడు.
ఆ ఆకారం పట్టాభిరామయ్యను సమీపించి అతని చేయి పట్టుకు చూసింది. సంతృప్తిగా తలాడించి ఆయన్ను ఎత్తుకుని మంచం మీద పడుకోబెట్టి భయాన్ని వ్యక్తపరుస్తూన్న అయన కంటి రెప్పలకు మూసింది.
తర్వాత తన ముఖానికున్న మాస్కును తొలగించింది. ఒంటి మీద వున్న నల్లని రోమాలు గల దుస్తులను తీసింది. పాంటు జేబులో ఒక ప్లాస్టిక్ సంచీ తీసి దాంట్లో వీటిని ఉంచి అక్కణ్ణించి దొడ్డి దారిన బయటపడింది.
నీలం రంగు పాంటు మీద తెల్ల షర్టు టక్ చేసుకుని ఒక లాంగ్ హైర్ యువకుడు పట్టాభిరామయ్య ఇంట్లోంచి బయటకు రావడాన్ని ఆ హడావుడి వీధిలో ఎవ్వరూ ప్రత్యేకంగా గమనించలేదు.
15
"గుండె జబ్బు కాదు లలితా ఒక హంతకుడు మీ నాన్న గారి ప్రాణాలు బలిగోన్నాడు! అనుకున్నాడు మురళి బాధగా లలిత రాసిన ఉత్తరాన్ని మడిచి జేబులో పెట్టుకుంటూ.
అయితే అతని విషయాన్ని తన ప్రాణానికి ప్రాణంగా భావించే లలిత వద్ద ఆమెను కలుసుకున్నప్పుడు కూడా బయట పెట్టలేదు.
పట్టాభిరామయ్య వ్యాపార బాధ్యతలు స్వీకరించవలసి రావడంతో మురళి ఉద్యోగాన్ని వదిలిపెట్టి తన మకాం లలితా వాళ్ళ నగరానికి మర్చవలసోచ్చింది . తన తెలివి తేటలతో రెండు, మూడు నెలలోనే అతను అన్నీ ఆకళింపు చేసుకోగలిగాడు.
పట్టాభిరామయ్య ఆస్తినంతా రాజేశ్వరమ్మ పేరనే ఉంచి ఆమె తదనంతరం లలితకు చెందేలా వీలు వ్రాయించాడు. తను వారి ఆస్తికి కేవలం సంరక్షకుడిగా ఉంచదల్చాడు. ఈ విషయంలో ఆస్తినంతా మురళి పేరుకు మార్చాలన్న లలిత, రాజేశ్వరమ్మ ల మాటలనతడు త్రోసి పుచ్చాడు.
'డబ్బు పాపిష్టితట్టయ్యా అది నా మనసు నెలాగైనా మార్చవచ్చు. నేను మగవాడిని ఎలాగైనా సంపాదించగలను. మీరు ఆడవాళ్ళు కాబట్టి మీకు రక్షణ అవసరం" అన్నాడు మురళి.
"బ్రతికుండగా సాధించలేనిది చచ్చి సాధించారు మీ మామయ్య. నీ విషయంలో ఒకప్పుడాయన కోరినదిదే" అంది రాజశ్వరమ్మ కళ్ళ నీళ్ళు తుడుచుకుంటూ.
లలితకూ, మురళికి వివాహం కావడానికిప్పుడు కేవలం ముహూర్తాలూ మాత్రం అడ్డుగా నిలిచాయి.
ఒకరోజు మురళి బజార్లో ఉండగా "హల్లో మురళీ!" అన్న పరిచితమైన కంఠం వినపడింది. అటు తిరిగిన మురళికి జ్యోతిష్కుడు కనబడ్డాడు.
మురళి అతన్ని చూస్తూనే భయపడ్డాడు. అతను కనబడినప్పుడల్లా ఎవరో చావు గురించి జోస్యం చెప్పడమూ జరుగుతుంది. ఈ పర్యాయం అతనిం కేవరి చావు గురించి చెప్పదల్చుకున్నాడో అని భయపడ్డాడు మురళి.
"పాపం మిమ్యవయ్య గుండె జబ్బుతో పోయారటగా" అన్నాడు జ్యోతిష్కుడు పలకరింపుగా.
'అవునట" అన్నాడు మురళి ముక్తసరిగా.
"మిస్టర్ మురళి మికిప్పుడే రకమైన ఇబ్బందీ లేదు, ఇంకా మీ చెల్లెలి వివాహాన్ని వాయిదా వేయడం ఒక మంచి ఆన్న లక్షణం కాదు" అన్నాడు ఏ ఉపోద్ఘాతమూ లేకుండా.
మురళి నవ్వి ఊరుకున్నాడు.
జ్యోతిష్కుడు మురళి వంక చూసి -"ఒక తేదీ చెప్పండి పిల్లని చూసుకుందుకు నాన్న గారితో పాటు బయల్దేరతాను" అన్నాడు.
'అయ్యామ్ సారీ మిస్టర్ -- మా చెల్లెల్ని మీకిచ్చే ఉద్దేశ్యం నాకు లేదు " అన్నాడు మురళి తాపీగా.
"ఎందువల్ల?"
"అది ఒక మంచి అన్న లక్షణం కాదు కాబట్టి!" మురళి మరింత తాపీగా.
జ్యోతిష్కుడి ముఖంలో రంగులు మారాయి. 'డబ్బు మనిషికి బలాన్నివ్వగలదేమో -- మనిషి ప్రాణాలను కాపాడలేదు" అన్నాడు.
మురళి తీవ్రంగా జ్యోతిష్కుడి వంక చూశాడు. "నా ముఖంలోకి చూసి చెప్పండి. మీ జ్యోతిషం ప్రతిభ నేను అనుభవ పూర్వకంగా తెలుసుకున్నాను కాబట్టి అడుగుతున్నారు. నేనింకా ఎంతకాలం బ్రతుకుతాను?"
జ్యోతిష్కుడు క్షణం పాటు తడబడ్డాడు. తర్వాత నెమ్మదిగా "మీ విషయంలో జ్యోస్యం చెప్పడం నాకిష్టం లేదు. నా బావగారు పదికాలాల పాటు సుఖంగా జీవించాలన్నదే నా అభిమతం" అన్నాడు.
"మీ అభిమతం తప్పక నేరవేర్తుంది. మీరు నా చెల్లెలి ప్రసక్తి లేకుండా ఉంటె "- అన్నాడు మురళి. జ్యోతిష్కుడు తన చెల్లిలిని వివాహం చేసుకొని, తనకు చావు జోస్యం చెప్పడని నమ్మకం ఏమిటి? అందువలన అతనిని గట్టిగా ఎదిరించడానికే నిశ్చయించుకున్నాడు మురళి.
"పదండి పక్కనున్న పార్కులోకి పోయి మాట్లాడుకుందాం. మీతో చాలా మాట్లాడాలి" అన్నాడు జ్యోతిష్కుడు.
ఇద్దరూ పార్కులోకి వెళ్ళి కూర్చున్నాక జ్యోతిష్కుడు అన్నాడు "మీకు నేను చెప్పిన ప్రతి జోస్యమూ జరిగింది. ప్రతి దానివల్లనూ మీకు లాభించింది. ఆ విషయం మీరు గుర్తుంచుకోవాలి --"
"గుర్తుండడం వల్లనే కదా మా చెల్లెలు గొంతు కోయలేనంటున్నాను" అన్నాడు మురళి.
"నిస్వార్ధ బుద్దితో మీకు సహాయపడినందు కైనా మీరు నాకు మీ చెల్లెల్నిచ్చి వివాహం చేయాలనుకోవడం లేదు, ఇది చాలా" అన్నాడు జ్యోతిష్కుడు.
"నిస్వార్ధ బుద్దితో సహాయం చేస్తే మళ్ళీ నా చెల్లెల్ని పెళ్ళి చేస్కోవాలన్న స్వార్ధమేమిటి?" తీవ్రంగా అడిగాడు మురళి.
జ్యోతిష్కుడు తమాషాగా నవ్వి "అది స్వార్ధం కాదు. మిమ్మల్ని రక్షించాలన్న తాపత్రయం. మీ చెల్లెలికి వివాహమైన వారం రోజులకు మీకు మరణగంధముంది. నా జీవితంలో బావగారికి కతాయుస్షుంది. మీ చెల్లెలి జాతకం కంటే నా జాతకం బలమైనది. అకారణంగా మీ ప్రాణ గండం తీసుకుంది. మీ క్షేమం కోరేవాణ్ణి కాబట్టి ఈ వివాహం చేసుకోదల్చాను" అన్నాడు.
అతని మాటల్లోని సారాంశం మురళికి అర్ధమైంది. అతను మాటలు కాదని తను బ్రతకలేడు.
"ఎన్నో హత్యలు తెలివిగా చేశారు మీరు. కానీ నన్ను మీకంత సులభంగా హతమార్చలేరు. ముందుగానే పోలీసుల రక్షణ కోరతాను నేను" అన్నాడు మురళి.
జ్యోతిష్కుడు నవ్వి " అయితే కంచే చేను మేస్తుందని మీకు తెలియదా?" అనడిగాడు.
మురళికి జ్యోతిష్కుడి మాటలు అర్ధమైనట్లు లేదు. అతను ప్రశ్నార్ధకంగా జ్యోతిష్కుడి కళ్ళలోకి చూసి "కంచె చేను మేసే మాటయితే చేనుకు కంచే ఎందుకు?' అన్నాడు.





