Home » VASUNDHARA » Vasundhara Kadhalu - 12



    ఒక్క క్షణం ఆగి, "తెలివి తక్కువగా ముందుగా హెచ్చరించటానికి ప్రయత్నించవద్దు. అలా చేయడం వల్ల ఒక మామూలు చావును పోలీసులు హత్యగా పరిగణించే అవకాశముంది. అందువల్ల మొట్టమొదట పోలీసులు మిమ్మల్నే అనుమానిస్తారు. దాంతో మీ చరిత్రే బయట పడుతుంది. ఇటీవల మీ చరిత్ర నిండా మరణాలూ, అందువల్ల లాభాలు....' అన్నాడు.
    "నిజం నిలకడ మీద తెలుస్తుంది. నేను నిజంగా నిర్దోషిని. ఏ హత్యలూ చేయలేదు. అవన్నీ మీ కారణంగానే జారిగాయి. చిట్టచివరకు మీరు పట్టుబడక తప్పదు" అన్నాడు మురళి.
    జ్యోతిష్కుడు చిత్రంగా మురళి వంక చూశాడు. "ఏమిటీ నాకు ఇంతవరకూ జరిగాయనుకుంటున్న హత్యలు చేయడం వల్ల ప్రయోజనం ? మీకు డబ్బు చేరుతుంటే నాకేం ఒరిగింది! జరుగబోయేది నాకు తెలుస్తుంది కాబట్టీ, అందువల్ల మీకు ప్రయోజనముందని తెలుసును కాబట్టీ, నేను మీకు ముందుగా చెబుతాను. అందుకు మీరు నన్ను హంతకుడని భావిస్తే , మీ ఆలోచనల్లోని కల్మషత్వం బయటపడుతుంది. తప్పితే నేను హంతకుణ్ణి కాను."
    మురళి కూడా ఆశ్చర్యంగా జ్యోతిష్కుడి వంక చూసి, "నిజమే, ఏమిటి మీకు నావల్ల వున్న ప్రయోజనం?' అనడిగాడు.
    "నాకు జ్యోతిషం వచ్చు. కానీ, అది మీకే చెబుతున్నానంటే కారణమేమిటి? నేను మీ చెల్లెల్ని ప్రేమించాను. ఆమె లేనిదే నేను బ్రతకలేను. కాబోయే బావగారనే ఉద్దేశ్యంతో మీకు శుభవార్తలు ముందుగా అందిస్తున్నాను.
    మురళికి ఇంక వినాలనిపించలేదు. "తప్పకుండా అది కాదు. అంతకుమించిన ప్రయోజనమేదో మీరాశిస్తూన్నారు" అన్నాడు.
    "మీరేలాగనుకున్నా నా కభ్యంతరం లేదు, ప్రస్తుతానికి మీరు మీ మావయ్యకు రాబోయే చావు గురించి ఎవరికీ చెప్పకండి. మీ మనసులోనే వుంచుకోండి.. గుర్తుంచుకొండి, పద్దెనిమిదవ తేదీ రాత్రి...."

                                    13
    లలిత అసహనంగా తన గదిలో అటూ ఇటూ పచార్లు చేస్తోంది. ఆరోజు సినిమా కార్యక్రమముంది. సినిమాలకు వెళ్ళడం లలితకు కొత్తా కాదు, పెద్ద విశేషమూ కాదు. అయితే ఆరోజు సినిమాకు పట్టాభిరామయ్యకూడా వస్తున్నాడు. అదే పెద్ద విశేషం!
    వ్యాపార వ్యవహారాల్లో మునిగి తేలే పట్టాభిరామయ్యాకు సినిమాల పట్ల చెప్పుకోదగ్గ ఆసక్తి లేదు. ఎప్పుడైనా చూసినా తెలిసిన వాళ్ళెవరితోనో అనుకోకుండా వెళ్ళి చూసి వస్తాడు. అప్పుడైనా అంత ఆసక్తి గా చూడడు. తన స్నేహితుడితో వ్యాపార విషయాలు మాట్లాడుతుంటాడు. సకుటుంబంగా సినిమాలు చూసిన సందర్భాలు బహుతక్కువ.
    కాలేజీలో ఈ మధ్య ఉపన్యాసాల పోటీలో లలితకు మొదటి బహుమతి వచ్చింది. ఆ సందర్భంలో ఆమె తన స్నేహితురాళ్ళందరికి పార్టీ చేసి సినిమాకు తీసుకెళ్ళింది. ఆ సినిమా లలితకు బాగా నచ్చింది. అది ఇందుమించు పట్టాభిరామయ్యలాంటి వాడి కధ.
    సినిమాలో పట్టాభిరామయ్య దుర్మార్గుడు కాదు, కానీ, డబ్బు మనిషి. ఆయనకు బంధువులకన్నా, ఆత్మీయత కన్నా డబ్బు ముఖ్యం. లక్షలకు లక్షలు సంపాదిస్తున్నాడు. కానీ, జీవితంలో అసలైన సుఖమన్నది ఎరుగడు. తనెందుకు సంపాదిస్తున్నాడో, తన జీవితానికి అర్ధమేమిటోనని ఆయన ఆలోచించే క్షణం వస్తుంది. అప్పుడే ఆయన జీవితమూ ముగుస్తుంది.
    కధ చెప్పిన తీరు హృద్యంగా వుంది. సినిమా నీటుగా వుంది. ఇది తన తండ్రి చూసి తీరవలసిన చిత్రామని లలితకు తోచింది. అందువల్ల ఆమె తండ్రిని ఎలాగో అలా ఈ సినిమాకు తీసుకు వెళ్లాలని పట్టుబట్టింది. గత వారం రోజులుగా ప్రయత్నిస్తూ ఈవేళ కి ఆయన్నోప్పించగలిగింది.
    పట్టాభిరామయ్య సకుటుంబంగా సినిమాకు బయల్దేరాడు. పనివాళ్ళనందరినీ వెళ్ళిపోమని, ఇంటికి తాళం పెట్టి మరీ సినిమాకు బయల్దేరాడు.
    సినిమా హల్లో దీపాలారిపోయాక లలిత తండ్రిని మరీ హెచ్చరించింది. సినిమా చాలా శ్రద్దగా చూడమని. చిత్రంలోని ప్రతి సన్నివేశమూ అర్ధవంతమైనదని మరీమరీ చెప్పింది. ఆరోజు పట్టాభిరామయ్య  ఉత్సాహంగా ఉన్నాడు. అయన సినిమాను శ్రద్దగానే చూస్తున్నాడు.
    ఇంటర్వల్ కావడానికి ఓ పావుగంటుందనగా ఎవరో పట్టాభిరామయ్య భుజం తట్టారు. వెనక్కు తిరిగాడాయన. చీకట్లో ముఖం సరిగ్గా తెలియలేదు.
    "మీ కుర్చీ క్రిందగా పడున్నాయి. ఈ తాళాలు మీవేవనుకుంటాను" అంటూ అతను ఓ తాళం చెవులగుత్తిని ఆయనకు అందించాడు.
    ఆప్రయత్నంగా పట్టాభిరామయ్య జేబులు తడుముకున్నాడు. జేబులో తాళం చెవులు లేవు. చీకట్లో కూడా తన తాళం చెవుల గుత్తి గుర్తు పట్టాడు.
    శ్రద్దగా సినిమాను చూడడంలో గమనించలేదు ఎంత సేపట్నించి తన జేబులో తాళాలు లేవో ---
    పట్టాభిరామయ్య కు అనుమానం కలిగింది. తన తాళాల గుత్తి బరువైంది. క్రింద పడితే చప్పుడవాలి. ఆ చప్పుడు ఎంత ఆదమరుపుగా ఉన్నా సరే తనకు వినపడి తీర్తుంది. అది క్రింద పడి ఉండడానికి వీల్లేదు. జేబులోంచి క్రింద పడకుండా కుర్చీ క్రింద కేలా వచ్చాయి తాళాలు?
    అప్పుడే పట్టాభిరామయ్యకు మరో విషయం గుర్తు కొచ్చింది ఈరోజు తాళాలు తన కూతురి దగ్గరుండాలి. తాళాలు అన్ని బాధ్యతలూ నాకోదిలి పెట్టి మీరు జాగ్రత్తగా సినిమా చూడండి నాన్నా, అని చెప్పిందామే. తనకు సినిమా గురించి చెప్పాలన్న తాపత్రయంలో ఆమె సర్వమూ మరిచిపోయినట్లుంది.
    "ఇంటి తాళాలు జాగ్రత్తగా ఉన్నాయా లలితా!" అడిగాడు పట్టాభిరామయ్యగారు.
    "ఆ" అంటూ నడుం దగ్గర తడుముకుని ఉలిక్కిపడింది లలిత. ఆమె చటుక్కున లేవబోయింది. ఆమెను లేవకుండా అదిమి పట్టాడు పట్టాభిరామయ్యగారు.
    "కంగారు పడకు. రుమాలుకు కట్టి దొడ్లో దోపుకుంటే సరిపోయిందా , కాస్త జాగ్రత్తగా చూచుకోవద్దూ , సరదాకు నేనే నీ దగ్గర్నుంచీ తీశాడు. అయినా నీకు తెలియలేదు" అన్నాడు పట్టాభిరామయ్య.
    "భలేవారు నాన్నాఎంత మంచి సినిమాలో ఉన్నా మీకు తాళాలమీదే దృష్టి పోదు" విసుక్కుంది లలిత.
    పట్టాభిరామయ్యకు మరి సినిమా మీద దృష్టి లేదు. ఇంటర్వల్ అయేవరకూ అయన అసహనంగా హల్లో కూర్చున్నాడు. కూతురి బొడ్లో ఉన్న తాళాలు చప్పుడు కాకుండా తన కుర్చీ క్రిందకు వచ్చాయి. అవి క్రింద పడ్డ వన్న మాటలు అసత్యం. ఎవరో వాటిని కాలేసి తన ఇంటికి వెళ్ళి అందినంత దోచుకుని తిరిగి తాళాల నిక్కడ పారేసి వుండాలి.
    పట్టాభిరామయ్య ఇంకా ఆలోచిస్తున్నాడు. తన ఇల్లు మంచి సందడిగా ఉండే వీధిలో ఉంది. రాత్రి పది దాటినా వీధిలో జనం బాగా తిరుగుతుంటారు. ఎవరింటి రెవరోచ్చారో పట్టించుకునే వారెవ్వరూ లేరు. ఇంట్లో పని వాళ్ళెవరూ లేరు. ఎవడైనా ఇంటి తాళాలు సంగ్రహించి దొంగలా ఇంట్లో ప్రవేశించి అందినవి తీసుకుని పోవచ్చు. ఎవ్వరూ అనుమానించరు.
    నైట్ మాచ్ మాన్ రాత్రి పది గంటల ప్రాంతాల వచ్చి ఉదయం ఆరు గంటల వరకూ ఉంటాడు. ఇంట్లో ఇనప్పెట్టేలో రొక్కం మూడు వేలుంది. పాతిక వేలు విలువ చేసే నగలున్నాయి. ప్రమాదాన్ని శంకించి తనాట్టే క్యాషింట్లో ఉంచడు. చాలా వరకూ నగలు బ్యాంకు లాకర్సు లో భద్రపరిచాడు.
    ఇంటర్వల్ కాగానే పట్టాభిరామయ్య లేచి లలితతో "నేనొక పది నిమిషాలు ఆలశ్యంగా వస్తాను, కంగారు పడకు" అన్నాడు.
    "ఎక్కడకేడుతున్నారు నాన్నా?" అంది లలిత.
    'వచ్చేక చెబుతాను" అన్న అయన ముఖంలో అడుర్ధాను స్పష్టంగా చూడగలిగింది లలిత. కాని ఏం మాట్లాడలేదు. అంతవరకూ పట్టాభిరామయ్యకు అటూ ఇటూ కూర్చున్న లలిత, రాజేశ్వరమ్మలు పక్కపక్క సీట్లోకి మారారు.
    "నాన్న మీద ఈ సినిమా ప్రభావమట్టే ఉన్నట్లు లేదు. అయన మారతారేమోనన్న ఆశతో ఈ సినిమాకు తీసుకువచ్చాను" అంది లలిత తల్లితో.
    "ఆ' పుట్టుకతో వచ్చిన బుద్ది పుడకలతో కానీ పోదు లెద్దూ" అని నాల్కరుచుకుని లెంప లేసుకుంది రాజేశ్వరమ్మ.
        
                                  14
    పట్టాభిరామయ్య ఇంటి ముందు కారాపి దిగాడు' చెప్పుకోదగ్గ అనుమాన పరిష్టితులు ఇంటి ముందు కనబడలేదు. అయినా ఆయనకు ఆదుర్దాగా ఉంది. గబగబా గేటు తీసుకుని లోపల అడుగు పెట్టి వెళ్ళి ఇంటి తాళం తీశాడు. మధ్యహల్లో లైటు వేశాడు.
    ఇల్లు నీటుగా, నిర్మానుష్యంగా ఉంది.
    అక్కణ్ణించి అయన ఇనప్పెట్టె ఉన్న గదిలోకి వెళ్ళాడు. అదే అయన పడక గది!
    మనసులో దేవుణ్ణి స్మరించుకుని ఇనప్పెట్టె తలుపులు తీశాడు. ఎండురుగా రొక్కం కనబడింది. ఆత్రుతగా లెక్కపెట్టాడు. అయన గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. ఉండవలసిన దానికి ఒక్క రూపాయి కూడా తక్కువ కాలేదు. తర్వాత ఆయన నగలుండే సొరుగు తీశాడు. ఈసారి అయన గుండెలు మరింత వేగంగా కొట్టుకున్నాయి. కానీ అయన అనుమానం నిరాదారమే అయింది. నగలు చెక్కు చెదరలేదు. తేలిగ్గా నిట్టూర్చాడు పట్టాభిరామయ్య. 




Related Novels


Vasundhara Kadhalu - 15

Vasundhara Kadhalu - 14

Vasundhara Kadhalu - 13

Vasundhara Kadhalu - 12

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.