Home » VASUNDHARA » Vasundhara Kadhalu - 15
రామావతి ముఖం లో కాస్త ధైర్యం కనిపించింది. "ఒకసారి నాకతను ప్రేమలేఖ అందించాడు. అతని కళ్ళ ముందే చింపి పారేశాను. తర్వాత నన్ను కలుసుకుని ప్రేమిస్తున్నా నన్నాడు. ప్రేమంటే అర్ధం తెలియదన్నాను. పెళ్ళి చేసుకుంటా నన్నాడు. నిన్నడగమన్నాను. చదువుకోమని నన్ను నువ్వు కాలేజీకి పంపిస్తున్నావు. చదువుకోవడం నా విధి, బాధ్యత . నీకు తెలియకుండా ఇంకేమీ చేయడం లేదు."'
"నేను చెప్పానుగా -- ఇందులో అమ్మాయిదేం తప్పు లేదు. అన్నీ మీ ఇష్టాయిష్టాలమీద ఆధారపడి వున్నాయి. ఏది ఏమైనా మోహన్ ని రక్షించడం విషయంలో మీరు బాగా ఆలోచించాలి."
"ఆలోచిస్తాను. కనీసం రెండు రోజుల వ్యవధి కావాలి నాకు" అన్నాను.
'సరే - మీరు ప్రత్యక్ష సాక్షి అన్న అబద్దం - ఒక మనిషి ప్రాణాల్ని కాపాడుతుందని మాత్రం మరిచిపోకండి" అంటూ లేచాడు రామారావు.
కానీ, నేను ప్రత్యక్ష సాక్షి అన్న నిజం మరో మనిషిని జైలు పాలు చేస్తుందన్న విషయ మతనికి తెలియదు.
8
"ఇదీ పరిస్థితి శేషగిరి గారూ. మీతో మాట్లాడే వరకూ నేనేమీ చేయదల్చుకోలేదు"అన్నాను.
"పోలీసుల దృష్టిలో పడ్డావంటే మనమిలా మాట్లాడుకోవడం కూడా ప్రమాదకరం" ఆన్నాడు శేషగిరి కంగారుగా.
"అందుకే కదండీ రెండ్రోజుల వ్యవధి అడిగింది. నిన్న ఆదివారం. ప్రయివేటుకు సెలవు. ఈరోజు ప్రయివెట్ల పేరుతొ మీ ఇంటికొచ్చినప్పుడీ విషయం స్వయంగా మాట్లాడదామని వచ్చాను"అన్నాను.
శేషగిరి ముఖం గంభీరంగా అయిపొయింది. "ఈ కేసు గురించి నాకన్ని వివరాలు తెలుసు. నిన్ను ప్రత్యక్ష సాక్షిగా వాళ్ళు నిరూపించా లేరు. ఏ తలుపుల మీదా నీ వేలిముద్రలు పడడం గానీ, పోలీసులు తీస్కోడం గానీ జరుగలేదు. ఇది కేవలం డిటెక్టివ్ ఆడుతున్న నాటకం. మావాడు చేసిన పొరపాటు, మీ అమ్మాయి తొందరపాటు కలిసి మనల్నిబ్బంది లో పెట్టేశాయి. ఇప్పుడు నువ్వు పోలీసుల దృష్టిలో పడ్డట్లే లెక్క. తప్పించుకోడాని కొక్కటే మార్గముంది. హత్య కళ్ళారా చూశానని ఒప్పెస్కో. రామారావు చెప్పినట్లే నీకు తోచిన రూపాన్ని వర్ణించు. చంపేస్తానని బెదిరించాడను. పోలీసు రక్షణ కోరు. అన్ని సవ్యంగా ముగుస్తాయి. అలా కాక నా పీకెల మీదకు, తీసుకొచ్చేవా, ఏ పోలీసులూ నిన్ను రక్షించలేరని మాత్రం గుర్తుంచుకో."
భయంగా తలడించాను. "ఇంద - ఇవి ఖర్చుల కుంచుకో" అంటూ శేషగిరి పది వందరూపాయల నోట్లు నాకందించేడు. పైకి గంబీరంగా వున్నప్పటికీ శేషగిరి బాగా భయపడుతున్నాడని అర్ధమయింది నాకు. ఒక రకంగా నేనూ బ్లాక్ మేయిలర్నయ్యా నెమో ననిపించింది. కానీ, ఆ డబ్బు కాదనలేదు. అందుకుని జేబులో కి తోసేసి -" మీరు చెప్పినట్లే చేస్తాను" అని అక్కణ్ణించి బయటపడ్డాను.
రోడ్డు మీదకు వచ్చేక రకరకాల ఆలోచనలు ఈగల్లా ముసురుకున్నాయి.
నేనిప్పుడెక్కడున్నాను, ఏం చేయబోతున్నాను.
ఏమీ అర్ధం కావడం లేదు నాకు. హత్యా ప్రదేశంలో శేషగిరి ని కళ్ళారా చూశాను. కత్తి పిడి మీద వేలిముద్రలు తుడుస్తున్నా డతను. ఆవిధంగా ఈ హత్యకు నేను ప్రత్యక్ష సాక్షిని. శేషగిరి పేరు తీసుకు రాకుండా, మరెవరో నాకు తెలియని వ్యక్తిని అక్కడ చూసినట్లు నేనిప్పుడు పోలీసులకు చెప్పాలి. అలా చేస్తే మోహన్ రక్షించబడతాడు. ఆ మోహన్ నా కూతుర్ని పెళ్ళి చేసుకుందామనుకుంటున్నాట్ట. అతను లక్షాధికారి బిడ్డ. నేను బడుగు బడి పంతుల్ని!' ఈ పెళ్ళికి నేనంగీకరిస్తానా? డబ్బున్న చోట కులం ప్రసక్తి యుండదా? కొన్నాళ్ళు జల్సాలకు అలవాటు పడ్డ మోహన్ ఎల్లకాలం బుద్ధిగా ఉంటాడా?"
ఏదేమైనా నా కూతురి కారణంగా నేనుచిక్కుల్లో పడతానేమోనని భయంగా ఉంది. దాని మూలంగా డిటెక్టివ్ రామారావుకు నా సంగతి తెలిసిపోయింది. దాని మూలంగానే మోహన్ ని రక్షించవలసిన బాధ్యత నామీద పడింది.
అసలీ మోహన్ ఎవరు? అతగాడి జీవిత మెలాంటిది?
ఇంతవరకూ నేను విన్నది కాక స్వయంగా అతని గురించి తెలుసుకోవాలి . అతని నిజస్వరూపం తెలుసుకున్నాకనే రామావతి పెళ్ళి విషయంలో ఏ నిర్ణయమైనా తీసుకోవాలి. ఐనా, ఇప్పుడు మోహన్ మృత్యు;ముఖం లో వున్నాడు. నేను రక్షించకపోతే మృత్యువతన్ని కబళిస్తుంది. అటువంటి వాడిని రామవతి భర్తగా ఊహించడం కూడా తప్పు.
ఒక పర్యాయం మోహన్ ని చూడాలనిపించింది. అతనిప్పుడేక్కడ వున్నాడో నాకు తెలియదు. అందుకే తిన్నగా ఆ పోలీస్ స్టేషన్ కు వెళ్ళాను. నేనెవరినో తెలిసేక, అతన్ని నేనెందుకు చూడాలను కుంటున్నానో తెలుసుకో గోరాడు ఇన్స్ పెక్టర్.
"మా అమ్మాయి , అతనూ ఒకే కాలేజీలో చదువు కున్నారు. ఇద్దరికీ తగు మాత్రం పరిచయముంది. చాలా బుద్దిగా కనబడే ఆ కుర్రాడు హత్య చేశాడంటే నేను నమ్మలేకపోతున్నాను. ఒక పర్యాయం అతన్ని కలుసుకుని మాట్లాడాలని వుంది" అని చెప్పాను. ఏ కళ నున్నాడో అంగీకరించాడా ఇన్ స్పెక్టర్.
మొదటిసారిగా చూశాను మోహన్ ని. ఇరవై కి లోపే వయసు. ఆరోగ్యంగా, దృడంగా వున్నాడు. ప్రస్తుతం కళా విహీనంగా వున్నప్పటికీ, ముఖం అందమైనదే , అందమైన ఆ ముఖానికి అమాయకత్వం వన్నె తెచ్చింది. ఆ ముఖం నిండా దిగులు పరుచుకుని వుంది ప్రస్తుతం.
"నన్ను శివశంకరం అంటారు. నువ్వు నన్నేరుగవు కానీ, నేను నిన్నేరుగుదును" అన్నాను.
"శివశంకరం అంటే, రామవతి నాన్నగారా మీరు" అన్నాడతను.
'అవును."
అతను నాకు చేతులు జోడించి నమస్కారం చేశాడు. 'అదృష్టం బాగుండి వుంటే మనం మరోలా కలుసుకుని వుండేవాళ్ళం. మీ అమ్మాయి రామవతి దేవత. అటువంటి ఆమెను కన్న మిమ్మల్ని చూసినందుకు నా జన్మచరితార్ధమైంది."
ఆశ్చర్యంగా చూశాను నేనతని వంక.
'అన్నిరకాల అలవాట్లూ వున్నాయి నాకు. వాటికి బానిసనై పోయాననే భావించాను. కానీ, రామావతి గురించి అన్నీ వదులుకోగలిగాను. నేనే ఆశ్చర్య పోయే విధంగా మారిపోయాను. ఇంతా చేసి ఆమెకూ, నాకూ అట్టే పరిచయం లేదు. ఆమెలో ఏదో దైవత్వముంది. ఆ దేవతతో పరిచయం పెంచుకునే ముందు నన్ను నేను సంస్కరించుకోవాలని గ్రహించాను. ఆ ప్రయత్నాల్లో నేనుండగా, విజయం సాధిస్తుండగా విధి నన్ను వెక్కిరించింది." విషాదంగా అన్నాడు మోహన్.
సినిమా డైలాగుల్లా అనిపించాయి నాకు. ఒక అందమైన ఆడపిల్లను చూసి, ఆమె ఏమీ చెప్పకుండానే తన పాడు అలవాట్లన్నీ వదిలిపెట్టే, ధనవంతుల అబ్బాయి సినిమాల్లో తప్ప వుండడని నా అభిప్రాయం. అందువల్లనే అతని మాటలు సినిమా డైలాగుల్లా అనిపించాయేమో!
"నిజంగా నువ్వు హత్య చేయలేదా?' తెలియనట్లు అడిగాను.
"హత్యా -- నేనా?' అతను సినిమా హీరో లాగానే నవ్వాడు. 'ఆపిల్ కోయడాని కూడా కత్తి వాడను నేను. రక్తం కళ్ళబడితే -- జ్వరం వస్తుంది నాకు. ఆలోచనల్లో కూడా హత్య చేయలేని నన్ను పోలీసులు హంతకుడంటున్నారు."
"కానీ, హత్యా ప్రదేశంలో నీవున్నట్లు రుజువులు దొరికాయి. అక్కడున్న కుర్చీ మీద నీ వ్రేలిముద్రలు దొరికాయి."
'అది నా దురదృష్టం. అక్కడికి నేను వెళ్ళాను. బ్రతికున్నంత కాలం నన్ను సాధించిన శివరావు , చచ్చేక నాకు బ్రతుకున్నది లేకుండా చేశాడు" అన్నాడతను.
అతనింకా ఏదో చెపుతాడని గ్రహించి మాట్లాడలేదు. అనుకున్నట్లు గానే అతను మళ్ళీమొదలు పెట్టాడు. "వయస్సు, డబ్బు, మితిమీరిన గారాబం నన్ను చెడు ద్రోవలో నడిపించాయి. అవే నన్ను శివరావు లాంటి బ్లాక్ మెయిలర్ గుప్పెట్లోకి నడిపించాయి. నామానాన నన్ను బ్రతకనివ్వమనీ నేను మారేననీ, నన్నింక వేదించవద్దని, చెప్పడానికి నేను శివరావు దగ్గరకు వెళ్ళాను. నేను చేసిన తప్పల్లా అక్కడికి వెళ్ళడమే. శివరావును కలుసుకుని మాట్లాడి వెళ్ళిపోయాను. తర్వాత కొద్ది సేపట్లో అతను అక్కడ హత్య చేయబడినట్లు విన్నాను. కొద్ది వారాల అనంతరం ఆ హత్యా నేరం నామీద మోపబడింది."
"నీ రహస్యమేదో శివరవుకు తెలుసునన్నమాట , అదేమిటి?" అన్నాను.
మోహన్ నా వంక దీనంగా చూసి"మీవంటి ఉత్తముడికి చెప్పదగ్గ రహస్యం కాదది. అది నాకూ కామినీకీ సంబంధించిన విషయం. కామిని గుడి వీధిలో ఉంటుంది" అన్నాడు.
గుడి వీధిలో కామినీ అంటే నా కర్ధమైంది. ఆ ఊళ్ళో గుడి వీధిలో గుడి అంటూ ఏమీ లేదు. ఆ పేరెందుకు కొచ్చిందో తెలియదు కానీ, వ్యభిచారానికి మాత్రం అలయమా వీధి. నేనింకేమీ మాట్లాడలేదు. నాకివ్వబడిన టైము పూర్తీ కావస్తోందేమో , "నీకు విడుదల లభించగలదని ఆశిస్తున్నాను" అని అక్కణ్ణించి ఇంటికి కదిలాను.





