Home » VASUNDHARA » Vasundhara Kadhalu - 13
"థాంక్సు నేనే నీకు చెప్పాలి-" అందావిడ.
"అదేంటండీ?" అంది విమల ఆశ్చర్యంగా.
"అవునమ్మా-అబ్బాయేమో పొరుగూళ్ళో, ఇంజనీరింగు చదువుతున్నాడు. అమ్మాయికి పధ్నాలుగేళ్ళొచ్చి గుర్రంలా ఎదిగింది. ఆయనేమో పగలంతా అతలాకుతలమై రాత్రింటికొస్తారు. యింట్లో వున్నవి రెండు గదులు. పెద్ద పెద్ద అద్దెలు పోసి ఎక్కువ గదులుండే ఇళ్ళు తీసుకోలేము. ఏదో నీలాంటివాళ్ళు పిల్లను సాయం పేరు చెప్పి తీసుకుని వెడితే తప్ప మాకూ కాస్త ఏకాంతంలో అచ్చటా ముచ్చటా చెప్పుకునే వీలేదీ-అందుకే నీకు థాంక్సు చెబుతున్నాను. నేను మర్చిపోయినా నువ్వే గుర్తుచేసి దాన్ని తీసుకువెళ్ళాలి సుమా!" అందావిడ.
"ఛీ-ఈవిడకి బొత్తిగా సిగ్గులేదు-" అనుకుంది విమల.
"ఏమ్మా-మాట్లాడవు...." అందావిడ.
విమల నవ్వుతూ-"నో మెన్ షన్!" అని అక్కన్నించి వెళ్ళిపోయింది.
4
రాత్రి కళ్యాణి తన ఇంటికి వచ్చేలోగా విమల ఇల్లంతా మరోసారి పరిశీలించి చూసి జరిగినదంతా మరోసారి గుర్తు తెచ్చుకుంది. అసలేం జరిగింది?
రాత్రి తను పుస్తకం చదువుతూ నిద్రపోయింది. అంటే లైటువేసే పడుకుని వుంటుంది. అయితే చంద్రమ్మ ఉన్నప్పుడు గదిలో బెడ్ లైటు వెలుగుతోంది. అదెలా జరిగింది? చంద్రమ్మ అసలు దీపం ఆర్పి బెడ్ లైట్ వేసిందా? బెడ్ లైటు వేయడంలో ఆమె ఉద్దేశ్యమేమిటి? తను గుర్తింపబడకూడదనా?
అలా అనుకునేందుకూ లేదు. చంద్రమ్మ రూపం తన మనసులో స్థిరపడిపోయింది. ఆమెనిప్పుడు తను మరెక్కడ కనిపించినా గుర్తించగలదు.
ఇంతకీ ఆ చంద్రమ్మ ఎవరు? మనిషా, దయ్యమా?
ఆమె తనను ఏదో కోరాలనుకుంటున్నది. అందకు మళ్ళీ వస్తానన్నది. ఆమె కోరిక ఏమిటో తెలుసుకోవాలి. తను తీర్చాలనుకుంటే తప్ప చంద్రమ్మ తన కోరిక ఏమిటో చెప్పదు. అందువల్ల తీర్చుతాననడం మంచిది.
ఇంతకీ చందమ్మ మళ్ళీ వస్తుందా?
తను నిజంగా చందమ్మను చూసిందా లేక కల గన్నదా?
విమల ఆలోచనల్లో వుండగానే కళ్యాణి వచ్చింది. విమల ఆమెకు తన అనుభవం గురించి సుతరామూ చెప్పలేదు. ఇద్దరూ చాలాసేపు పిచ్చాపాటీ మాట్లాడుకున్నారు.
కల్యాణి విరిసీ విరియని మొగ్గ. ఆమెలో ఎన్నో సందేహాలున్నాయి. తల్లి నడగడానికి మొహమాట పడుతుంది. విమలను ఆమె చాలా కాలంగా అడగాలనుకుంటున్న ప్రశ్నలు కొన్ని వున్నాయి. ఒక ఆడపిల్ల అయిన వారందర్నీ వదిలి మరో పురుషుడివెంట ఎలా వెళ్ళగలుగుతుంది? కళ్యాణి కళ్ళతో చూసిన కొత్త దంపతులందరూ సంతోషంగానే కనిపించారు. అందుకు కారణం తెలుసుకోవాలని ఆమె తహతహలాడుతున్నది.
విమల ముందామెకు ఓపికగానే జవాబు చెప్పింది. కానీ కొంతదూరం వెళ్ళేసరికి విమలకా సంభాషణ నచ్చలేదు.
"చూడు కళ్యాణీ! అడిగి తెలుసుకునేవి కొన్ని వుంటాయి. అనుభవంతో తెలుసుకునేవి కొన్ని వుంటాయి. పెళ్ళి గురించి ఇంక నువ్వేమీ నన్నడక్కూడదు-" అంటూ ఆమె సంభాషణ త్రుంచివేసింది.
ఇద్దరూ రాజకీయాల గురించి మాట్లాడుకోబోయారు. కళ్యాణి ఆవులించింది.
ఇద్దరూ తొందరగానే నిద్రకుపడ్డారు. ఇద్దరికీ కూడా వళ్ళు తెలియకుండా నిద్రపట్టింది. ఒక రాత్రివేళ ఎవరో వీపు తట్టినట్లయి విమలకు మెలకువవచ్చింది. ఆమె కళ్ళకు ఎదురుగా చంద్రమ్మ.
విమల కళ్యాణిని నిద్రలేపబోయింది.
"ఆమెను లేపి ప్రయోజనం లేదు. నా ప్రభావంతో నిద్ర పోతున్నదామె. మాట్లాడుకొనవలసింది మనమిద్దరమూ. నీ నిర్ణయం ఏమిటి?" అంది చంద్రమ్మ.
కలా, నిజమా అన్న సందిగ్దంలో విమల కొద్ది క్షణాలపాటు మాట్లాడకుండా వుండిపోయింది.
"నీ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నాను" మళ్ళీ అన్నది చంద్రమ్మ.
"నీ కోరిక తీరుస్తాను-" అన్నది విమల.
చంద్రమ్మ చటుక్కున వంగి విమల బుగ్గమీద ముద్దు పెట్టి-"నువ్వు నా బంగారు తల్లివి!" అంది.
"నీ కోరికేమిటో చెప్పు!" అనడిగింది. విమల.
"నేనొక దురదృష్టవంతురాలను. పెళ్ళయిన నాటి నుంచీ నా భర్త నాకు దూరంగా వున్నాడు. కట్నమివ్వలేదని కోపం. చివరకు ఆ కోపంతోనే రెండో పెళ్ళి కూడా చేసుకున్నాడు. ఆయన ఆదరణ లభించక, వేరే పురుష సంపర్కం పెట్టుకోలేక-మ్రోడువారిన జీవితం అనుభవించి అదృష్టవశాత్తూ చావు పరిచయంగా ఇప్పుడిలా మోహినీ పిశాచినయ్యాను. నా కోరిక తీరితే తప్ప నేను ఈ రూపం నుంచి విముక్తి పొందలేను. ఒక్కసారి ఏ పురుషుడికైనా నా సాంగత్యం లభించిందంటే వాడు నాకోసం పిచ్చివాడౌతాడు. నేను లేనిదే బ్రతకలేడు.
అందుకని నేను నిన్ను బ్రతిమిలాడుకుంటున్నాను. నావల్ల ఎవరి జీవితాలూ నాశనం కాకూడదన్నది నా కోరిక. కాబట్టి నువ్వు కొన్ని రాత్రులు నన్ను నీ స్థానంలో నీ భర్త పక్కన మసలనివ్వాలి. నీ భర్తకు తాననుభవిస్తున్నది నన్నని తెలియదు. అందువల్ల నా కోసం పిచ్చివాడయ్యే బాధ లేదు. నేను మానవ స్త్రీని కాను. కాబట్టి నీ భర్త శీలం చెడిందన్న బాధ నీకులేదు. మోజు తీరేదాకా సుఖాలనుభవిస్తే నాకు మోక్షం లభిస్తుంది. నువ్వు తప్పక అంగీకరిస్తావు కదూ!" అంది చంద్రమ్మ.
విమల ఆమె కథను ఆశ్చర్యంగా విన్నది. ఏదో కాశీ మజిలీ కథ చదువుతున్నట్లున్నది. మోహినీ పిశాచి ఏమిటి? తన గదిలోనికి రావడమేమిటి? వచ్చి ఇలా కోరడమేమిటి?
"ఈ ప్రపంచంలో ఎక్కడా పురుషులే లేనట్లు నువ్వు నా భర్తనే కోరుకోవడమేమిటి?" అంది విమల ఆశ్చర్యంగా.
"నేనీ యింటినే అవహించుకుని వున్నాను. ఈ ఇల్లు దాటి బయటకు రాలేను నేను. అందుకే నేను ఈ ఇంట్లో వున్న నీ భర్తను కోరాను-" అంది చంద్రమ్మ.
"ఏ ఆడదీ చూస్తూ చూస్తూ తన భర్తను పరాయి ఆడదానికి అప్పజెప్పలేదు. నువ్వు మానవ స్త్రీవి కాక పోయినా ఈ పని నావల్ల కాదు-" అంది విమల.
"మాటిచ్చావు-" అంది చంద్రమ్మ.
"దానిదేముంది-ఇప్పుడు మాట తప్పుతాను" అంది విమల.
"నేను మాట తీసుకున్నదెందుకు? నీ సచ్చీలతను నమ్మడంవల్ల ఒకసారి నువ్వు మాటిచ్చాక నీ భర్త నా వశమైనట్లే! జగన్మోహినీ రూపంతో అతణ్ణి నేను సులభంగా వశపర్చుకోగలను. ఎటొచ్చీ ఆపైన అతడు నీకు ప్రాణాలతో దక్కడు. నా మోహంలో పడిపోయి ఈ ప్రపంచాన్నే విస్మరిస్తాడు. అందుకే నీమీద అభిమానంతో నేను నేనని తెలియకుండా అతడి పొందు లభించే ఉపాయం నీకు చెబుతున్నాను. అంతా నీ ఇష్టం, బాగా ఆలోచించుకో, పండంటి కాపురాన్ని చేజేతులా పాడు చేసుకోకు. నేను నిన్ను మళ్ళీ కలుస్తాను. ప్రస్తుతానికి సెలవు-" అంది చంద్రమ్మ.
ఉన్నట్లుండి విమలకు నిద్ర ముంచుకువచ్చింది.
5
కళ్యాణి, విమల-ఇద్దరు కూడా కాలింగ్ బెల్ విన్నాకనే లేచారు.
"అబ్బా - మొద్దు నిద్దర పట్టేసింది-" అంది కళ్యాణి.
"నాకూ అంతే...." అంది విమల. అప్పుడామెకు తన కల గురించి గుర్తుకు వచ్చింది. కళ్యాణి వంక చూస్తూ "రాత్రిగానీ నీకు ఆసక్తికరమైన కలేధైనా వచ్చిందా?" అనడిగింది.
"ఆఁ" అంది కళ్యాణి.
"ఏమిటది?" కుతూహలంగా అడిగింది విమల.





