Home » VASUNDHARA » Vasundhara Kadhalu - 12


 

    "కంగారు పడకండి. నేను మా పెద్దవాళ్ళను తీసుకునే వస్తాను. మీకూ, నాకూ కులం సరిపోతుంది. గోత్రం ఒకటి కాదు. అన్నివిధాలా పెళ్ళికి అనుకూలం. అలోచించి చెప్పండి.
    మురళికి ఆలోచన తెగలేదు. హాల్లోంచి యింకోసారి బెల్ మ్రోగింది.
    'ఆలోచిస్తుండండి , సినిమా అయ్యేక మళ్ళీ మాట్లాడుకుందాం" అన్నాడు జ్యోతిష్కుడు.
    ఇద్దరూ హాల్లోకి ప్రవేశించారు.
    మురళి కింకా సినిమా సరిగా బుర్రలోకి ఎక్కడం లేదు" జ్యోతిష్కుడు తమతో వియ్యమందాలనుకుంటున్నాడు" అతను చాలా ప్రమాదకరమైన వ్యక్తీ. హంతకుడేమో కూడా! అటువంటి వ్యక్తికీ ఇంట్లో బంధువుస్థానమివ్వడం ఊహల్లోనే భయంకరంగా వుంది.
    అమ్మలు చాలా అమాయకురాలు. జ్యోతిష్కుడి కామె నిచ్చి వివాహం చేయడం దారుణమైన అన్యాయమే అవుతుంది.
    సినిమా నడుస్తున్నంత సేపూ జ్యోతిష్కుడి కేలా సమాధానం చెప్పాలా అని ఆలోచిస్తూనే వున్నాడు మురళి. సినిమా అయిపోయేక అతను తల్లిని, చెల్లెలిని రిక్షాలో ముందుగా ఇంటికి పంపేశాడు. జ్యోతిష్కుడతనికోసం రోడ్డు మీద ఎదురుచూస్తున్నాడు.
    'అలోచించేరా?" అనడిగేడతను మురళిని చూస్తూనే.
    'ఆలోచించడాని కేముంది? నేను నిస్సహాయుడిని. రెండ్రోజుల క్రితమే చెల్లాయికో సంబంధం సెటిల్ చేసేశాం!" అన్నాడు మురళి బాధను నటిస్తూ.
    "మిస్టర్ మురళి అన్నీ నాకు తెలుసు. మీరు మొన్న పెళ్లి చూపులకు వచ్చిన వారి దగ్గర్నుంచి ఉత్తరం కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళు ఒకే అనే అవకాశాలు చాలా వున్నాయి. కానీ, మీరు కూడా ఒకే అంటే ఆపైన పెళ్ళి కొడుకు విషయంలో నేను జోస్యం చెప్పెయాల్సి వుంటుంది." అన్నాడు జ్యోతుష్కుడు తీవ్రంగా.
    "ఏమిటి మీరనేది?" అన్నాడు మురళి భయంగా.
    "తెలిసీ చెప్పకుండా ఎలా ఊరుకునేది? మీ చెల్లెలు జాతకానికి , మొన్న పెళ్ళి చూపులకొచ్చినతని జాతకానికి సరిపడదు. పెళ్ళి ముహూర్తం నిర్ణయించిన మూడో నాడు అతను మరణిస్తాడు. అతని ప్రాణాలు రక్షించాలనుకుంటే ఈ వివాహం ఆపాలి!" అన్నాడు జ్యోతిష్కుడు గంబీరంగా.
    ఈసారి మురళి నిజంగా వణికిపోయాడు. ఏదో అర్ధం కాని భయమతన్నావహించింది. "మీ విషయంలో ఏ నిర్ణయమూ తీసుకోడానికి నాకు వ్యవధి కావాలి" అన్నాడు.
    "ఎంతకాలమైనా ఆగుతాను , ఫరవాలేదు , కానీ ...." జ్యోతిష్కుడు మాట పూర్తీ చేయకుండా మురళి కళ్ళలోకి చూశాడు. మిగతా మాటలు అతని కళ్ళలో చూశాడు మురళి.

                                     11
    లలిత దగ్గర్నుంచి మురళికి ఉత్తరం వచ్చింది. అందులో విశేషాలేమీ వ్రాయలేదు. అర్జంటుగా అతన్ని బయల్దేరి రమ్మనమని వ్రాసిందామే.
    మురళి మనసు కీడును శంకించింది. అతను తక్షణం బయల్దేరి వాళ్ళ ఊరు కెళ్ళాడు.
    మురళి వెళ్ళిన సమయానికి పట్టాభిరామయ్యగారింట్లో లేరు. గుమ్మంలోనే లలిత ఎదురయింతనికి. మురళిని చూస్తూనే ఆమె ముఖం చాటంతయింది. "రా బావా, కూర్చో!' అందామె.
    'అత్తయ్యేది ?" అడిగేడతను.
    "వంటింట్లో వుంది. నాన్న పనిమీద పొరుగూరు వెళ్ళారు. సాయంత్రానికి వస్తారు" అంది లలిత.
    సోఫాలో చతికిలబడ్డాడు మురళి.
    "ఏమిటి సంగతి?' అడిగాడు మురళి.
    లలిత పరిస్థితులు వివరించింది. తండ్రి ఆమెకు వేరే సంబంధాలు చూస్తున్నాడు. ఇటీవలే ఒక సంబంధం వచ్చింది. అది పట్టాభిరామయ్యగారికి బాగా నచ్చింది. త్వరలో తాంబూలాలుచ్చుకుందా మనుకుంటున్నాడాయన.
    "చాలా పెద్ద ఇబ్బందిలో పడ్డాను బావా! నాన్నకు నీతో సంబంధం ఏమాత్రమూ ఇష్టం లేదు" అంది లలిత.
    "ఈ సమస్యకు ఒక్కటే పరిష్కారం. మనస్పూర్తిగా నన్ను ప్రేమిస్తున్నావనుకుంటే నాతొ వచ్చేసేయ్" అన్నాడు మురళి.
    లలిత బాధగా నవ్వి "ఒకప్పుడైతే అపనే చేసి వుండేదాన్ని. కానీ, ఇప్పుడు కుదరదు. నాన్నకు గుండెజబ్బుంది. ఆయన్నట్టే అవేశపరచకూడదని డాక్టర్ చెప్పాడు. నేను నీతో వచ్చేస్తే, ఆ షాక్ కి అయన కేదైనా అయితే" అంది.
    "నిజమే, ఆఖరు ప్రయత్నంగా మావయ్యతో మళ్ళీ మాట్లాడి చూస్తాను" అన్నాడు మురళి.
    'అందుకే నీకుత్తరం రాశాను. పెద్ద ఆశ లేకపోయినా మన ప్రయత్నాలూ మనకుండాలనే ఉద్దేశ్యంతో...." అంటూ ఆలోచనలో పడిపోయింది లలిత.
    ఆ సాయంత్రం పట్టాభిరామయ్య గారు వచ్చారు.
    "ఏరా, ఎప్పుడొచ్చావ్? మురళిని పలకరించాడు.
    "ఉదయం వచ్చెను మావయ్యా. ఏవో పనులుండీ ఊరు వచ్చాను. వచ్చేక నిన్ను కూడా చూసి పోదామని ఆగిపోయాను."
    'అంతా కులాసానా?"
    మురళి తలూపాడు. పట్టాభిరామయ్య, మురళి వంక పరీక్షగా చూసి నిట్టూర్చాడు. 'లలితకు సంబంధం నిశ్చయం చేశాను, విన్నావా?" అనడిగేడు.
    "విన్నాను మావయ్యా, కానీ, లలిత కిష్టం లేదటగా ."
    "ఏడిసింది. ఆమాట పెళ్ళైన ఏడాదిక్కనిపిస్తే అడిగి చూడు" అన్నాడు పట్టాభిరామయ్య.
    "ఏడాదిదాకా ఆగడమెందుకు మావయ్యా. ఇప్పుడే అడిగి చూడు. లలిత ఎవరంటే యిష్టపడుతుందో!" అన్నాడు మురళి ధైర్యం చేసి.
    పట్టాభిరామయ్య నవ్వాడు, "నాకు తెలుసురా, అన్నీ నాకు తెలుసు. కానీ , అలా జరగడం దేవుడి కిష్టం లేదు. అందుకే ఇల్లరికానికి నవ్వోప్పుకోలేదు."
    "ఇల్లరికం రావడాని కిప్పుడు నాకేం తక్కువయింది మావయ్యా, దేవుడు కరుణించి, నాకూ ఆస్తి కలిసొచ్చింది.లలితను నాకిస్తే అన్ని విధాలా సుఖపడుతుంది.'
    "ఒరేయ్ , లలితను చేసుకునే వాడికి వేరే ఆస్తి ఉండక్కర్లేదురా, దాన్ని చేసుకున్నవాడు ఆటోమేటిక్ గా ఆస్తిపరుడైపోతాడు. ఆ సంగతి నీకు తెలుసు" అన్నాడు పట్టాభిరామయ్య.
    "మరి....?"
    "నాకు మీ నాన్న తెలుసురా! ఆయనగారి మనసు నిండా జాలి , కరుణలే, ఫలితంగా అస్థంతా హారతి కర్పూరంలా హరించుకుపోయి, ఈ స్థితికి వచ్చేరు. నీక్కూడా అన్నీ మీ నాన్న పోలికలే. అందుకే ఆ రామయమ్మా ఆస్తి నీకిచ్చింది. మీలాంటి వాళ్ళ చేతుల్లోకి సంపద వస్తే సుఖపడేది లలిత కాదురా -- దరిద్రులు, ముష్టి వెధవలు, ఎందుకూ పనికిరాని సోమరిపోతులు! పదిలక్షలను, పాతిక లక్షలు చేయాలని తాపత్రయపడే నాకూ, కన్నీళ్ళ గాధలు విని లక్షలకు కరిగించుకునే మీకూ సరిపడదు. ఇల్లరికమంటే వేరు. అప్పుడీ ఆస్తి నీకు చెందదు. కేవలం దీనికి సంరక్షకుడివే అవుతావు."
    మురళికి పట్టభిరామయ్యా గారి అభిప్రాయం తెలిసి పోయింది. "ఒకళ్ళకు మించి చేయాలనుకోవడం తప్పవదు మావయ్యా. కానీ, తనకు మాలిన ధర్మానికి పోయేవాడిని కాదు నేను. నీ ఆస్తిని నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో. నాకు చిల్లిగవ్వ కూడా ఇవ్వకు. లలిత నాదగ్గర సుఖపడుతుందో లేదో- నీకు కాలమే ఋజువు  చేయగలదు."
    "లాభం లేదు. ఇల్లరికాన్ని కాదన్నరోజునే లలితను భార్యగా ఆలోచించే హక్కు కోల్పోయావు నువ్వు, ఈ విషయంలో ఇంక చర్చలకు తావులేదు.'
    తను ఇల్లరికాన్ని కాదనడమే అయన లలితకు వేరే సంబంధాలు చూడ్డానికి కారణమని అతనికి అర్ధమైంది.
    అయన ఆవేశ పడుతున్న ఛాయలు కనిపించి మరి మాట్లాడలేదు మురళి.

                                     12

    "నీకు, లలితకూ వివాహం జరిగి తీర్తుంది."
    ఆశ్చర్యంగా చూశాడు మురళి, జ్యోతిష్కుడి వంక .
    "ఎలా ?"
    "జ్యోతిష్కుడు నవ్వాడు. "మీ ఇద్దరి పెళ్ళికి ఇటూ అటూ కూడా కలిపి ఒకే ఒక ఆటంకముంది. ఆ ఆటంకం పేరు పట్టాభిరామయ్య , అవునా?"
    తల ఊపాడు మురళి.
    "జాతకాన్ని బట్టి చూస్తె ఆ ఆటంకానికి అయుషాట్టే లేదు" జ్యోతిష్కుడు ఆగాడు.
    మురళి కంగారుగా అతడి ముఖంలోకి చూశాడు.
    "ఈనెల ఇరవయ్యేడో తేదీన అయన పెళ్ళి తాంబూలాలుచ్చుకోవాలని అనుకుంటున్నాడు. ఈరోజు పదహారవ తేదీ. సరిగ్గా ఎల్లుండి అనగా పద్దెనిమిదవ తేదీ రాత్రి అయన మరణించబోతున్నాడు."
    మురళి ఉలిక్కిపడి, "ప్లీజ్, మావయ్యను హత్య చేయవద్దు" అన్నాడు.
    "హత్యలు నేనెందుకు చేస్తాను, కేవలం జోస్యం చెప్పాను." అన్నాడు జ్యోతిష్కుడు తాపీగా.
    "వద్దు, మీ జోస్యం నిజం కాకూడదు" అన్నాడు మురళి కంగారుగా.
    జ్యోతిష్కుడు తీక్షణంగా మురళి కళ్ళలోకి చూశాడు. "నా జ్యోస్యం అబద్దం కాదు, కాలేదు, విధిని ఎదిరించడం ఎవరికీ సాధ్యం కాదు. జరుగబోయేది చెప్పగలను , కానీ ఆపలేను."




Related Novels


Vasundhara Kadhalu - 15

Vasundhara Kadhalu - 14

Vasundhara Kadhalu - 13

Vasundhara Kadhalu - 12

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.