Home » VASUNDHARA » Vasundhara Kadhalu - 12
మరోక్కప్పుడైతే ఏ రామాయమ్మ అని అడిగి ఉండేవాడే మురళి. కానీ ఇప్పుడతనికి ప్రతి క్షణం ఆవిడే గుర్తుకొస్తోంది.
జ్యోతిష్కుడు చెప్పిన ప్రకారం ఆవిడ చనిపోయి రెండు వారాలు దాటి వుండాలి. కాని తనకింత వరకూ ఏ కబురూ రాలేదు, స్వయంగా కబురు తెలుసుకునేందుకు భయంగా ఉంది, తర్వాత తను చిక్కుల్లో పడతాడేమో నని.
"నేను మీకిప్పుడు రెండు వార్తలు తీసుకొచ్చాను. అందులో ఒకటి దుర్వార్త!' అన్నాడు రమణారావు.
మురళి బాధగా ముఖం పెట్టి "ఇటీవల నేను వింటున్న వన్నీ దుర్వర్తలే " అన్నాడు.
'అయినా తొంబై ఏళ్ళు నిండినావిడ పోయారంటే అది పెద్ద దుర్వార్త అనుకోను. ఎటొచ్చీ ఇంకా కాలూ చేయి బాగానే ఉండగా, ఎన్నో మంచి పనులు చేస్తున్న ఒక గొప్ప మనిషి మరి భూమ్మీద లేదని బాధపడాలి.'
"ఏమిటి మీరనేది లాయరు గారూ రామాయమ్మ...." అన్నాడు మురళి.
"అవును, ఆవిడ ఇంక లేరు.--" అంటూ రమణరావు రామాయమ్మ పోయిన వైనం చెప్పేడు. అయన చెప్పిన తేదీని గుణించుకుని సరిగ్గా జ్యోతిష్కుడు చెప్పినట్లే అయింది" అనుకున్నాడు మురళి.
తను వచ్చిన పని క్లుప్తంగా వివరించాడు రమణరావు. రామాయమ్మ గారు తన అనంతరం తన ఆస్తి తను ఖర్చు చేసే పద్దతుల్లోనే ఖర్చు చేయాబదాలని కోరుకుంది. ఆవిడ దృష్టిలో ఆ ప్రకారం ఆస్తిని సద్వినియోగం చేయగల వాళ్ళిద్దరే ఉన్నారు. ఒకరు సుధాకరరావు , రెండు మురళి. ఆస్తి అంతా సుధాకరరావుకే చెందాలని అతడు మరణించిన పక్షంలో , మురళికి చెందాలని ఆవిడ వీలు వ్రాసింది. ప్రస్తుతం సుధాకరరావు బ్రతికి లేడు. ఆ కారణంగా రామాయమ్మగారి ఆస్తికి మురళి వారసుడయ్యాడు.
"మీ నాన్నగారి ధర్మ గుణం గురించి ఆవిడ తరచుగా చెబుతుండే వారు. దానధర్మాలతో మీ కుటుంబం సుసంపన్న స్థాయి నుంచి మధ్యతరగతి స్థాయికి దిగిపోయిందని కూడా ఆవిడా ఎన్నో సార్లు నా దగ్గర బాధపడ్డారు" అన్నాడు రమణరావు.
మురళి అయన మాటలు వినడం లేదు. జ్యోతిష్కుడు పెదనాన్నగారి మరణం గురించి చెప్పాడు. తనకు యాభై వేలోచ్చాయి. సుధాకరరావు రామాయమ్మగార్ల మరణం గురించి చెప్పాడు తనకిప్పుడు పెద్ద ఆస్తి వస్తోంది.
ఇదంతా ఎందుకు జరుగుతోంది? జ్యోతిష్కుడికి తన వల్ల ప్రయోజనమేమిటి? తనకోసం ఇన్ని హత్యలేందుకు చేస్తున్నాడు?
"ఒక చిన్న సందేహం - ఒక వేళ నేను కూడా బ్రతికి ఉండకపోతే ఈ ఆస్తి ఎవరికి చెందుతుంది?' అనడిగేడు మురళి అనుమానంగా.
రమణారావు నవ్వి "ప్రభుత్వానికి" అన్నాడు.
మురళి ఏదో ఆలోచిస్తూ "వీలునామా చాలా రహస్యంగా వ్రాయబడిందనుకుంటాను. కారణమేమిటి?" అన్నాడు.
'ఆస్తికోసం ఆవిడ చుట్టూ చేరిన వారు చాలా మందిన్నారు. ఆవిడ వీలు వ్రాసినట్లు ఎవ్వరికీ తెలియదు. తెలిస్తే రోజూ ఆవిడ మీద ఒత్తిడి తీసుకుకోస్తుండే వారు . అదలా గుంచి వారసుల క్కూడా ముందు నించీ ఆ విషయం తెలియడమిష్టం లేదు. తన మానాన తను బ్రతుకుతూ తను పోయేక తన ఆస్తి మీకివ్వడమే ఆవిడ ఉద్దేశ్యం!"
'రామాయమ్మగారిలా వీలు వ్రాసినట్లు ఇంకా ఎవరికి ముందుగా తెలుసు?"
రమణరావు ఆశ్చర్యంగా మురళి వంక చూశాడు. "మీకీ పశ్నలన్నీ ఎందుకడుగుతున్నారో నాకాశ్చర్యంగా ఉంది. ఈ వీలునామా సంగతి నాకు తప్ప మరెవ్వరికీ తెలియదు" అని 'అన్నట్లు ఇందులోని దస్తూరీ ఆ ఊరి కరణం గారిది, ఆయనక్కూడా ఈ వీలునామా విషయం తెలుసు " అన్నాడు.
"నేనిలా అడుగుతున్నానని మరోలా అనుకోకండి. ఇలా అనుకోకుండా ఆస్తి కలిసి రావడం నాకాశ్చర్యం గా ఉంది. ఇంకా నమ్మలేకుండా వున్నాను. రామాయమ్మకు ఇంత అభిమానముందని నాకు తెలియదు. ఆవిడ అభిమానాన్ని నాపై ఇలా చూపించగలదని అనుకోలేదు. ఏ అడ్డంకులూ లేకుండా ఆవిడ అభిమానం ఆస్తి రూపంలో మీద్వారా నన్ను చేరుకోగలగడమూ ఆశ్చర్యమే! బహుశా ఆ కరణం గారీ విషయాన్ని చాలా గోప్యంగా ఉంచగలిగారనుకుంటాను. అయన వయసేమాత్రముంటుందో!"
రమణరావు ముఖంలో ప్రశ్నార్ధకం స్పష్టంగా కనపడింది. 'తప్పకుండా యాభై ఏళ్ళకు పైగా ఉంటుంది" అన్నాడు. మురళి కాసమాధానం రుచించలేదు.
అతనికి ఖచ్చితంగా తెలుసు, రామాయమ్మ గారు హత్య కావించబడింది. కానీ ఆ హత్య వల్ల తనకు మినహాగా మరెవ్వరికీ ప్రయోజనం లేదు. అటువంటప్పుడీ హత్య ఎందుకు జరిగింది?
10
తల్లిని, చెల్లిని తీసుకుని ఆరోజు మురళి సినిమా కెళ్ళాడు.
సినిమా హల్లో ఇంటర్వల్లో ఎవరో భుజం తట్టి పిలిచారు మురళిని, వెనక్కు తిరిగాడు మురళి.
"ఒక్కసారి బయటకు వెడదాం వస్తావా?" అన్నాడు జ్యోతిష్కుడు. మురళి అతనితో మాట్లాడకుండా, వస్తానని చెల్లెలికి చెప్పి, బయటకు నడిచాడు.
సినిమా హాలు బయట ఆవరణలో ఇద్దరూ ఒకచోట ఆగారు.
"పాపం, రామాయమ్మగారు " అన్నాడు జ్యోతిష్కుడు పెదవి విరిచి.
'అవును, విన్నాను, కానీ, ఆవిడ ఎప్పుడు ఏ క్షణన పోతారో హంతకుడికి తెలిసినంత ఖచ్చితంగా, మీకూ తెలుసు" అన్నాడు మురళి, హంతకుడన్న పదాన్ని నొక్కి పలుకుతూ.
"నిజమే , కానీ, ఆవిడ పోవడం ద్వారా హత్య గురించి కూడా సందేహించ నవసరం లేనంత ఆస్తి మీకు కలిసిందని విన్నాను" అన్నాడు జ్యోతిష్కుడు హత్య అన్న పదాన్ని నొక్కి పలుకుతూ.
మురళి గతుక్కుమన్నాడు. జ్యోతిష్కుడు ఉద్దేశ్యమతని కర్ధం కాలేదు. అతను తీక్షణంగా జ్యోతిష్కుడు వంక చూసి, "ఇంకా ఎంతమంది చావుల గురించి జోస్యం చెప్పదలచుకున్నారు?' అనడిగేడు.
'అది మీ ప్రవర్తన మీద ఆధారపడి వుంది" అన్నాడు జ్యోతిష్కుడు.
'అంటే?"
"ఏమీ లేదు. నేను మీ కెన్నో మంచి జోస్యాలు చెప్పాను. అందుకు నాకు ప్రతిఫలం కావాలంటే ఇస్తారా?
"నేనుమిమ్మల్ని జోస్యం చెప్పమని అడగలేదు , ఐనా మీరు చెప్పారు. దానికి నేనేం చేసేది?"
జ్యోతిష్కుడు నవ్వాడు. "ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ జరుగబోయేది తెలుసుకొవాలనుంటుంది. అందు గురించే అందరూ తహతహలాడుతుంటారు. జరగబోయేది ఖచ్చితంగా చెప్పగలగడం ఎంతోమందికి సాధ్యపడదు. అందుకు ఎంతో అనుభవం కావాలి. శ్రమ కూడా వుంటుంది.
అనుభవం , శ్రమ రెండూ ఉపయోగించి నేను మీకు జోస్యం చెప్పాను. అందువల్ల కొన్ని విషయాలు మీకు ముందుగానే తెలిశాయి. కొంతమంది చావుల గురించి మీకు ముందుగానే తెలిసింది. నా జోస్యం తప్పదని అనుభవ పూర్వకంగా మీరు తెలుసుకున్నారు. అయినప్పటికీ విని ఉపేక్షించి ఊరుకున్నారు. అంటే అర్ధమేమిటి? చనిపోయిన వ్యక్తులను రక్షించే ఉద్దేశ్యం మీకు లేదనేగా?"
మురళి ఉలిక్కిపడి , "వాళ్ళను నేనెందుకు రక్షించాలి?" అన్నాడు.
"చాలా బాగా అడిగారు. వాళ్ళని మీరెందుకు రక్షించాలి? అందులోనూ వాళ్ళ చావు వల్ల మీద లాభం చేకూరుతున్నప్పుడు ....!" అన్నాడు జ్యోతిష్కుడు.
"నా ఉద్దేశ్యమది కాదు" అన్నాడు మురళి తడబడుతూ "నా మానాన నేను బ్రతుకుతున్నాను. ఎవరో చెప్పిన మాటలు విని రక్షించడానికి , పరుగెత్తడానికి నాకు సమయమూ లేదు, నేను పోలీసు అధికారినీ కాను "
రక్షించాలనుకుంటే, ఇదేమీ అవసరం లేదు. ఒక చిన్న హెచ్చరిక -- చాలు , వాళ్ళు జాగ్రత్తపడి వుండేవారు."
మురళికి జవాబు తోచలేదు.
"మీ భయం నాకు తెలుసు. మీరు హెచ్చరిక పంపితే అనవసరంగా మీ పేరు పోలీసుల దృష్టిలోకి వస్తుంది. ఎలాగూ మీరు నా జోస్యాన్నబద్దం చేయలేరు. పైగా పోలీసుల అనుమానం మీ మీదకు వస్తుంది. అందుకే గన్ చిప్ గా ఊరుకున్నారు. మీరు చాలా పిరికివారు. కానీ, మీ పిరికితనానికి అర్ధముంది. పోలీసు అసాధ్యులు, అతి చిన్న విషయం బయటపడ్డా, అంతా మీ పీకకు చుట్ట బెట్టగలడు. నా సంగతి వేరు, నాకు పోలీసులంటే భయం లేదు. అయినా జోస్యం చెప్పుకుని బ్రతికేవాణ్ణి , నాకు పోలీసు అంటే భయమెందుకు?"
ఏం మాట్లాడాలో మురళికి తోచలేదు. "ఇందాకా మీరేదో ప్రతిఫలం గురించి మాట్లాడేరు."
'ఆ అదే మీరు గుర్తు చేసేక అడుగుదామని చూస్తున్నారు. ఇస్తారా చెప్పండి."
'అసలు మీరేం కావాలో చెప్పండి. దాన్ని బట్టి ఆలోచించాలి!"
"చాలా సింపుల్. మీ చేతుల్లో వున్నదే" అన్నాడు జ్యోతిష్కుడు.
'చెప్పండి " అన్నాడు మురళి భయంభయంగా.
"ఏమీ లేదు. మీ చెల్లెల్ని నాకిచ్చి పెళ్ళి చేయండి" అన్నాడు జ్యోతిష్కుడు.
"వ్వాట్ " ఉలిక్కిపడ్డాడు మురళి.
ఇంటర్వల్ పూర్తయినట్లుంది. హాల్లోంచి బెల్ మ్రోగింది.





