Home » VASUNDHARA » Vasundhara Kadhalu - 15


 

    గవర్రాజు నా ముఖంలోనే పరీక్షగా చూస్తూ "ఎప్పుడైనా ఎవరైనా మీ దగ్గరకు వచ్చి నిన్న మనిషి అడిగిన విధంగా ప్రశ్నలు వేస్తె తట్టుకుని బయట పడగలగాలి. ఏ పరిస్థితుల్లోనూ శేషగిరి గారి పేరు బయటకు రాకూడదు. పోలీసులు అసాధ్యులు. నిన్న మా మనిషి కంటే కూడా తెలివైన ప్రశ్నలు వేసి మిమ్మల్నిరుకులో పెట్టగలరు. కానీ ఒక్క విషయం మీరు గుర్తుంచుకోండి. మీరు సుబ్రహ్మణ్యం ఇంటికి ఎప్పుడూ వెళ్ళలేదు. శివరావు హత్యను చూడలేదు. ఈ నిజాన్ని నమ్మినంత కాలం ఏ చిక్కు ప్రశ్నలూ మిమ్మల్ని బాధించవు. ఎవరూ మిమ్మల్నేమీ చేయలేరని నేను హామీ యిస్తున్నాను. ఈ విషయం చెప్పడానికే పిలిచాను వస్తాను మరి!" అన్నాడు.
    అతను వెళ్ళిపోయాక తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాను. ఇప్పుడెం చేయాలీ అని ఆలోచించాను. ఆ మోహన్ ఏమైతే నాకేం, ఆ డిటెక్టివ్ ఏమైతే నాకేం, తన్ను మాలిన ధర్మం లేదు. తిన్నగా ఇంటికి వెళ్ళిపోవడం నా వంటికి మంచిది. వచ్చేటప్పుడు బజార్లో కూరలు తెమ్మని అనసూయ చెప్పింది. అందుకని కూడా సంచీ కూడా తెచ్చాను.
    కూరల మార్కెట్లో కూరలు కొనుక్కుని నేనింటికి వెళ్ళేసరికి ఇంట్లో నా గురించి ఓ అపరిచిత వ్యక్తీ ఎదురు చూస్తున్నాడు. నన్ను చూస్తూనే లేచి నిలబడి నమస్కారం చేసి, "నమస్కారం సార్, నన్ను రామారావంటారు. నేను ప్రయివేటు డిటెక్టివ్ ను" అన్నాడు.
    నా చేతిలోని కూరల సంచీ జారిపోయింది.
    

                                    7
    తనే పరిస్థితుల్లో మా యింటి కొచ్చిందీ రామారావు వివరించి చెప్పాడు.
    రామావతి స్వయంగా వెళ్ళి ఆయన్ను కలుసుకుని నిన్న మా యింటి కొచ్చిన నకిలీ డిటెక్టివ్ సంగతీ, రాత్రి జరిగిన హత్య ప్రయత్నం గురించీ చెప్పిందిట. శివరావు హత్య కేసులో తలాతోకా దొరక్క నానా అవస్థా పడుతున్న ఆయనకు, కాస్త ఆధారం దొరికినట్లయింది. క్షణాల మీద మా యింటికీ కొచ్చేసాడు.
    "ఎంత పని చేసింది రామావతి?'అనుకున్నాను.
    "మా అమ్మాయి తరపున మీకు క్షమార్పణలు చెప్పుకుంటున్నాను. అది మీకు లేనిపోని ఆశలు కల్పించింది. నిజానికీ నాకీ కేసు గురించి ఏమీ తెలియదు. ఏదో పేపర్ల లో చదివాను. అంతే !" అన్నాను.
    రామారావు ముఖంలో నిరుత్సాహం కనబడలేదు. "మీకేవో తెలుసునని భావించడం లేదు. నిన్న జరిగిన దంతా విన్నాక నాకో అద్బుతమైన పధకం తట్టింది. అది అమలు జరపడానికి మీ సహకారం కావాలి" అని ఆగి నా ముఖంలోకి చూశాడు.
    "క్షమించండి. ఏదో నామానాన నేను బ్రతుకుతున్నాను . ఇలాంటి కేసుల్లో జోక్యం చేసుకోలేను. మీరు మరెవ్వరి సహాయాన్నయినా అపెక్షించండి" అన్నాను.
    'శివశంకరం గారూ! అలా అంటే లాభం లేదు. మోహన్ ని రక్షించవలసిన బాధ్యత నాకే కాదు, మీకూ ఉంది"అన్నాడు రామారావు.
    "పిల్లలకు పాఠాలు చెప్పడం నా బాధ్యత . అది నేను సక్రమంగా నిర్వహిస్తూనే ఉన్నాను."
    'అంతేనా, ఒక నిర్దోషి అన్యాయంగా శిక్షించబడుతుంటే అతన్ని రక్షించగల్గి వుండీ , పట్టనట్లూరుకోవడం మీ బాధ్యత అవుతుందా?" అన్నాడు రామారావు.
    ఇవే మాటలు నిన్న ఒక మనిషి అన్నాడు. తను డిటెక్టివ్ రామారావు నన్నాడు. తను లొంగిపోయి, మోసపోయి, నిజం చెప్పేశాడు. ఫలితంగా ప్రతిఫలముంటుందన్నాడు. ఆ రాత్రీ తన మీద హత్యా ప్రయత్నం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఇతను.
    "ఇంతకీ మీరు డిటెక్టివ్ రామారావని నమ్మక మేమిటి?" అన్నాను. నన్ను పరీక్షించడానికి మళ్ళీ శేషగిరి ఎవరినైనా పంపి వుండవచ్చునని నాకు తోచింది.
    అతను నవ్వి, "మీ అమ్మాయి నన్ను గుర్తు పట్టగలదు. ఇంకా సాక్ష్యాలు కావాలంటే, పోలీస్ స్టేషన్ కు వెడదాం" అన్నాడు.
    "అయన డిటెక్టివ్ రామారావు గారే నాన్నా" అంది రామావతి కాస్త గట్టిగా లోపల్నుంచి.
    రామావతీకీ ఈ కేసంటే చాలా ఆసక్తి ఉన్నట్లుంది, అన్నీ శ్రద్దగా వింటోంది. నేను ఒక్క క్షణం అలోచించి ' ఇంతకీ నేనేం చేయాలో చెప్పండి" అన్నాను.
    "శివరావు హత్యను మీరు కళ్ళారా చూసినట్లు సాక్ష్యం చెప్పాలి."
    ఆశ్చర్యంగా 'అదెలా సాధ్యం" నేనా హత్యను చూడలేదే" అన్నాను.
    "మీరు చూడలేదు. ఒక నిర్దోషి ని రక్షించడానికి ఒక అబద్దం చెప్పాలి."
    "అబద్దాలు చెప్పడం నా వల్ల కాదు" అన్నాను నా మాట అబద్దమని తెలుసుండీ కూడా.
    "మీరబద్దమాడడం లేదు. ఆరోజు సుబ్రహ్మణ్యం ఇంటికి వెళ్ళారు. మీరు చూస్తుండగా  హత్య జరిగిపోయింది. మీరు హంతకుణ్ణి చూశారు. హంతకుడు కూడా మిమ్మల్ని చూశాడు. అతనెవరో మీకు తెలియదు. కానీ మిమ్మల్నతను బెదిరించి వెళ్ళిపోయాడు. మీరు బాగా భయపడి పోయారు, కానీ ఇప్పుడు నిర్దోషి ని రక్షించడం కోసం ముందుకు వచ్చారు."
    "బాగుంది , ఈ అబద్దం మోహన్ ని రక్షించగలదను కుంటున్నారా , అదే నిజమైన పక్షంలో నేనే ఎందుకు ఈ అబద్దం చెప్పాలి? మరెవరి నైనా ఇందు కెన్ను కోవచ్చు కదా" అన్నాను.
    "శివశంకరం గారూ . అందుకు చాలా కారణాలున్నాయి" అన్నాడు రామారావు. "మీరు హత్య చూశారో లేదో తెలియదు కానీ , హత్య జరిగిన నాడు మీరా ప్రదేశంలో ఉన్నారన్నది నిజం. దుమ్ము కొట్టుకున్న ఆ గది తలుపులు మీరు తోసి ఉండాలి. ఆ తలుపుల మీద వెలుముద్రలు ఫోటో తీయబడ్డాయి. అది మీరే అయుండాలని నిన్న మీరు నకిలీ డిటెక్టివ్ తో మాట్లాడిన దాన్ని బట్టి తెలుస్తోంది. ఆ సంభాషణంతా నాకు మీ అమ్మాయి పూర్తిగా చెప్పింది.
    దాన్ని బట్టి హత్యా ప్రదేశంలో ఏదో ఒక దృశ్యం మీ కళ్ళ బడిందని అది మీకే కాక మరొక వ్యక్తికీ కూడా తెలిసి ఉండాలని అర్ధమయింది నాకు. రాత్రి మీమీద హత్యా ప్రయత్నం జరిగిందంటే మీరు చాలా ప్రమాదంలో ఉన్నారని తెలుస్తోంది. జరిగిన వాటిని బట్టి మోహన్ ని రక్షించగల రహస్యం మీదగ్గరుంది. అసలు హంతకుడి పేరు బయట పెట్టడానికి మీరు భయపడుతున్నారు. కాబట్టి మీకూ మాకూ ప్రమాదం లేని పనేమిటంటే .... హత్యను చూసినట్లూ, హంతకుడు మోహన్ కాదనీ, చెప్పటం . అందువల్ల కేసు కొత్త మలుపు తిరుగుతుంది. హత్యా ప్రదేశంలో మోహన్ ఉన్నాడని తప్పితే, అతనే హత్య చేసినట్లు సరైన ఋజువు లేదు, ఆ ఋజువు లేకుండా అతను హత్య చేశాడనగల వారు  మీ సాక్ష్యాల్ని నమ్మాలి."
    "మోహన్ ఆ గదిలో ఉన్నట్లు సాక్ష్యం లభించింది. అయినా అతను నిర్దోషి అని నమ్ముతున్నాను. కానీ అదే గది తలుపుల మీద నా వ్రేలిముద్రలుంటే నేను హత్య చూశానని ఎలా చెప్పగలను?'    
    'చూశారని నేననడం లేదు. చూసినట్లు చెప్పండి చాలు. మీ సాక్ష్యాన్నేలా ఉపయోగించుకోవాలో నే చూసుకుంటాను. ఈ సాక్ష్యం మివ్వడం ద్వారా మీకు మరో గొప్ప ప్రయోజనముంది. మొదట్లో జులాయి గా తిరిగే మోహన్ ఒక అందమైన అమ్మాయిని చూసి మారిపోయాడు. ఆ అందమైన అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలని అతను నిశ్చయించుకుని ఒకో చెడు అలవాటుకీ స్వస్తి చెబుతూ వచ్చాడు. అతని దురదృష్టం కొద్ది జైలు పాలయ్యాడు కానీ ఈ పాటికా అమ్మాయి తలిదండ్రులతో సంప్రదింపులు జరిపి ఉండేవాడు."    
    "ఎవరండీ ఆ అమ్మాయి" అన్నాను అనుమానంగా .
    "మీ అమ్మాయి , రామావతి " అన్నాడు రామారావు తాపీగా.
    ఉలిక్కిపడ్డాను . అప్రయత్నంగా "రామావతీ!" అని గట్టిగా కేక పెట్టాను.
    "ఆ అమ్మాయిని మీరు పిలవ నవసరం లేదు. ఇది ఏక పక్ష ప్రేమ వ్యవహారం. మోహన్ ఆమెను ప్రేమిస్తున్నాడు. అతనా విషయంన్నామెకు తెలియబరిస్తే ప్రేమంటే తనకు తెలియదనీ, పెళ్ళి గురించయితే తన తండ్రిని కలుసుకోమని, తండ్రి మాట తనకు వేదమనీ , ఇంకెన్నడూ తన వెంట పడవద్దనీ ఆమె అతనికి చెప్పేసింది. అతను బాగా అలోచించి మీ దగ్గరకు వద్దామని నిర్ణయం తీసుకునేసరికి , పోలీసులతన్ని పట్టుకున్నారు."
    నా బుర్ర తిరిగిపోయింది. నాకు తెలియకుండా ఎన్ని రహస్యాలున్నాయి. నా కూతురు ప్రేమ వ్యవహారం నడుపుతోందా? నా కంటికి అమాయకురాలిలా కనిపిస్తున్నది.
    "పిలిచేవా నాన్నా!" అంది రామావతి.
    పరీక్షగా దాని ముఖంలోకి చూశాను. ముఖంలో రవంత భయం తొంగి చూస్తున్నప్పటికీ నిష్కల్మషంగా వున్నాయి దాని కళ్ళు. కానీ, ఎంత అందం దానిది? ఒక లక్షాధికారి ఏకైక పుత్రుడు వ్యసనాలకు స్వస్తి చెప్పేలా చేసిన ఆ అద్భుత సౌందర్యానికి నేను తండ్రిని! ఇంత కాలం నేను దాన్ని నా కూతురిగా గురించాను తప్పితే ఒక అందాలరాశి గా గుర్తించలేదు.
    "అన్నీ వినే వుంటావు . ఈయన చెబుతున్న మాటలు నిజమేనా?"




Related Novels


Vasundhara Kadhalu - 15

Vasundhara Kadhalu - 14

Vasundhara Kadhalu - 13

Vasundhara Kadhalu - 12

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.