Home » VASUNDHARA » Vasundhara Kadhalu - 12


 

    సుబ్బయ్య భార్య బిడ్డలను ట్రెయిన్ ఎక్కించిన రోజున ఆఫీసుకు ఒకరోజు సెలవు పెట్టాడు. స్టేషనుకు కృష్ణ కూడా వచ్చాడు. మర్నాడాయన ఆఫీసుకు వెళ్ళినపుడు పక్క సీట్లోని కరుణాకరం --"మీకు కృష్ణ ఎలా  తెలుసు ?" అన్నాడు.
    "బాగుంది. ఎలాగో తెలుసు. కానీ మీకెలా తెలుసు?"
    "అతను ఊళ్ళో బాగా డబ్బున్నవాళ్ళలో ఒకడు. కానీ ఆ డబ్బు దొంగతనాలు చేసి సంపాదిస్తాడంటారు. పేరుకు మాత్రం వడ్డీ వ్యాపారమోకటుంది. స్త్రీ లోలుడని కూడా చాలా మంది అంటుంటారు" అన్నాడు కరుణాకరం.
    సుబ్బయ్య- "కృష్ణ సంగతి మీకు తెలియదు. అతనికి మాతో కొన్ని నెలలుగా పరిచయముంది. ఆడవాళ్ళ వంక కన్నెత్తి చూడడు. పెద్దలంటే బాగా వినయవిధేయతలు, ఇటీవల ఓ పెద్దమనిషి తన కూతురు చేసిన తప్పును, ఇతని మీద నెట్టి వేయడానికి ప్రయత్నించి విఫలుడై ఆఖరికి ఓ దొంగతనం నేరంలో ఇరికించాలని చూస్తున్నాడు. అది పేపర్లలో చదవడం వల్ల మీకలాంటి దురభిప్రాయం కలిగి ఉండవచ్చును కానీ -- తనలాంటి వాడంటే నేను నమ్మను...." అన్నాడు.
    "మీరు చెబితే నమ్మాల్సిందే మరి - చూశారా నిజానికీ గాలి వార్తలకూ ఎంత దూరముంటుందో ...." అన్నాడు కరుణాకరం. తన మాటలను కరుణాకరం నమ్మినందుకు సుబ్బయ్య చాలా సంతోషించాడు మనసులో. తనకు చాలా గౌరవమున్నట్లుంది - అందుకే కృష్ణ తన సాక్ష్యం అడుగుతున్నాడు.
    ఆరోజు మధ్యాహ్నం ఆఫీసులో హటాత్తుగా హడావుడి ప్రారంభమైంది. మర్నాడే దో స్పెషల్ ఇన్ స్పెక్షన్ జరుగుతుందిట. దాని గురించి ఫైల్సు కొన్ని కంప్లీట్ చేయాలి.
    రాత్రి ఇంటికి వచ్చేసరికి కాస్త ఆలశ్యం కావచ్చునని సుబ్బయ్య ఇంటికి ఫ్యూన్ చేత కబురంపించాడు.

                                       3
    "నాన్నాగారింట్లో లేరు ...." అంది పార్వతి.
    "అరె -- అప్పుడే అరైపోయింది. ఈపాటికీ ఆఫీసు నుంచి వచ్చేసి ఉంటారనుకున్నానే ...." అన్నాడు కృష్ణ.
    "మాములుగా అయితే రావాల్సిందే. ఈవేళ ఇంటి కొచ్చేసరికి కాస్త ఆలశ్యం కావచ్చునని నాన్నగారు కబురంపించారు ...." అంది పార్వతి.
    'అలాగా ...." అన్నాడు కృష్ణ ఆలోచిస్తూ. పార్వతి ఇబ్బందిగా అతని వంకే చూస్తూ ఉండిపోయింది.
    కృష్ణ క్షణం అలోచించి - "మీ నాన్నగారు నా గురించి కోర్టులో సాక్ష్యమివ్వబోతున్నారు. నా మీద , నా ప్రవర్తన మీద అయన ఎంతో నమ్మకం కలిగి ఉన్నట్లూ -- మీ ఇంట్లో నాకెంతో చనువు ఉన్నట్లూ అయన చెప్పబోతున్నారు. అటువంటప్పుడు నేను మీ ఇంటికి వచ్చి అయన లేరని వెంటనే వెళ్ళిపోతే ఏం బాగుంటుంది? నామీద మీకు నమ్మకం లేదని నేననుకుంటూన్నట్లే కదా...." అన్నాడు.
    'అబ్బే అదేం లేదు. కాసేపు కూర్చుని వెళ్ళండి -" అంది మొహమాటపడుతూ పార్వతి.
    కృష్ణ లోపలకు వచ్చి కూర్చున్నాడు. పార్వతి లోపలకు వెళ్ళబోగా - "మీరూ కూర్చోండి - కాసేపు ఏమైనా కబుర్లు చెప్పండి -" అన్నాడు.
    "నాకట్టే మాట్లాడడం రాదు..." అంది పార్వతి.
    "పోనీ - నేను మాట్లాడతా వినండి ...." అన్నాడు కృష్ణ.
    పార్వతి నవ్వింది. కృష్ణ కబుర్లు మొదలు పెట్టాడు.
    ఎదుటి వాళ్ళకు విసుగు కలిగించకుండా కబుర్లాడడంలో కృష్ణ ఉద్దండుడు లాగున్నాడు. పార్వతి చాలా కుతూహలంగా కృష్ణ కబుర్లు వింటోంది.
    "మీ నాన్నగారితో నా పరిచయం చాలా అదృష్టమనుకుంటాను ...." అన్నాడు కృష్ణ.
    "ఎందుకని ?"
    "మీ అంత అందమైన అమ్మాయితో పరిచయమైంది."
    పార్వతి కొద్దిగా సిగ్గుపడింది. ఎక్కువగా భయపడింది.
    తర్వాత కృష్ణ మళ్ళీ కబుర్లు మొదలెట్టాడు. ఒకసారి వాళ్ళింట్లో దొంగ ప్రవేశిస్తే వాన్నేలా పట్టుకున్నదీ అభినయ పూర్వకంగా చెప్పేసరికి పార్వతికి నవ్వాగలేదు. కొందరి సమక్షమే అటువంటిది. పాత కొత్తల ధ్యాసలేకుండా చేస్తుంది.
    "మీరు సినిమానటులు కావాల్సింది -" అంది పార్వతి నవ్వుతూ .
    "కావాలనుకుంటే నేనే స్వంతంగా సినిమా తీసి అందులో హీరోని కాగలను. అయితే ఫీల్డు లో ఉన్న హీరో యిన్లెవ్వరూ నాకు నచ్చలేదు. మీరు ఊ అనండి రేపే మనమిద్దరం కలిపి ఒక సినిమా మొదలు పెడదాం...." అన్నాడు కృష్ణ.
    ఇదివరకటి కంటే కాస్త ఫ్రీగా నవ్వింది పార్వతి.
    "నేను కాదు . మీరు -- సినిమానటి కావాలి. మీ ఒక్క నవ్వు చాలు సినిమా హిట్ కావడానికి ...." అన్నాడు కృష్ణ.
    పార్వతి సిగ్గుపడినా అతని దగ్గర కాస్త చనువు పెరిగింది. అలా కాసేపు సంభాషణ జరిగేక కృష్ణ తనను వలలో వేసుకునేందుకు ప్రయత్నించిన ఒకరిద్దరు ఆడవాళ్ళ ప్రసక్తి తీసుకువచ్చి - " మీరోసారి లేచి నిలబడితే - ఓ చిన్న తమాషా విషయం చెబుతాను -" అన్నాడు.
    "చెప్పండి ._ అంది పార్వతి లేచి నిలబడి.
    "నాతొ కబుర్లు చెబుతూ వనజ ఒకసారి ఇలా నన్ను కౌగలించుకుంది -" అంటూ అతనామెను బలంగా కౌగలించుకున్నాడు.
    పార్వతి నివ్వెరపోయింది. తడబడింది. కంగారు పడింది. భయపడింది. హడిలి పోయింది. అతన్ని విడిపించుకుని దూరంగా తొలగిపోయింది.
    'అప్పుడు నేనూ అంతే చేశాను ....' అన్నాడు కృష్ణ తను చేసినదంతా కధలోని భాగమే అన్నట్లు.
    'ఇంక మీ కబుర్లు వినలేదు. మీరు వెళ్ళిపొండి ---" అంది పార్వతి.
    "పార్వతి -- తొలిచూపులోనే నేను మిమ్మల్ని ప్రేమించాను. పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. కేసులోంచి బయటపడగానే నేను మీ నాన్నగారికి విషయం చెప్పేస్తాను. కానీ నేను అంతవరకూ ఆగలేను. భగవంతుడు మనకోసం కావాలని ఈ అవకాశం కల్పించాడనిపిస్తోంది. పెళ్ళికి ముందే ఒకరినొకరు బాగా అర్ధం చేసుకునే అపూర్వావకాశం మరి. మీకు నామీద నమ్మకం లేకపోతె ఒక కాగితం రాసిస్తాను. నా సంతకం పెట్టేస్తాను. మనం ప్రేమించుకున్నామనీ, వయసు ప్రోత్సాహంతో మన తనువులు కలిశాయనీ - ఈరోజు నుంచే నువ్వు నాకు భార్యవైనా వనీ రాసి కాగితం సంతకం చేసి ఇస్తాను. నన్ను నమ్మాలి. నన్ను నమ్మక తిరస్కరిస్తే తెల్లారే వరకూ నేను బ్రతికుంటానని తోచదు...." అన్నాడు కృష్ణ.
    అప్పుడు పార్వతి ఇంట్లోని గోడ గడియారం ఏడున్నరయిందన్న సూచనగా గంట కొట్టింది. సుబ్బయ్య ఇంకా రాలేదు.
    
                                   4

    సరిగ్గా తొమ్మిదిగంటల పదిహేను నిముషాలకు సుబ్బయ్య వచ్చేసరికి కృష్ణ నడవలో కూర్చుని ఉన్నాడు.
    "ఎంతసేపయింది వచ్చి ?" అంటూ పలకరించాడు సుబ్బయ్య.
    "మూడు గంటలకు పైగా - "అన్నాడు కృష్ణ . "ఒక్కణ్ణి కూర్చోవడం చాలా బోరు కొట్టింది. ఏ క్షణంలో నైనా మీరు రావచ్చునేమోనన్న  ఆశతో అలా అలా టైము గడిపేశాను. కాలక్షేపంగా కాసేపైనా కబుర్లు చెబుతుందేమోనని పిలిచిచింది. చూడండి ఎన్ని పుస్తకాలు చేరాయో -"
    బల్ల మీద పుస్తకాల లెక్క పెట్టి, కనీసం పదిసార్లయినా అమ్మాయిని పిలిచాడన్నమాట అని మనసులో అనుకున్నాడు సుబ్బయ్య.
    కృష్ణ కాసేపు అవీ ఇవీ కబుర్లు చెప్పి వెళ్ళిపోయాడు. కృష్ణ వెళ్ళిపోయాక - "కుర్రాడేమీ అల్లరి చిల్లరిగా ప్రవర్తించలేదు కదా -...." అన్నాడు కూతురితో సుబ్బయ్య.
    పార్వతి చిన్నగా నవ్వి ఊరుకుంది.
    రోజులు త్వరగా గడిచిపోయాయి. గౌరీపతి తిరుపతి నుంచి తిరిగి వచ్చి ఉద్యోగంలో జాయినయ్యాడు. చూస్తుండగానే కృష్ణ గురించి కేసు విచారణ జరగవలసిన రోజు వచ్చింది. లోలోపల భయపడుతూనే బోనేక్కాడు సుబ్బయ్య.
    సాక్షిగా తనకున్న విలువ సుబ్బయ్య కారోజే తెలిసివచ్చింది. దేవుడి ఎదుట ప్రమాణం చేసి చెబుతున్నాను. అడిగిన ప్రశ్నలకన్నింటికీ సమాధానంగా నిజమే చెబుతాను- అబద్దం చెప్పనని అయన అన్నప్పుడు పెదవులు చేతులు కూడా వణికాయి. అయినప్పటికీ ప్రశ్నలకు సమాధానాలు మాత్రం చాలా బాగా ఇవ్వగలిగాడు. పెద్ద ఎత్తున జరిగిన క్రాస్ ఎగ్జామినేషన్నాయన అవలీలగా తట్టుకున్నాడు.
    సుబ్బయ్య సాక్ష్యం వ్యవహారం చివరి క్షణం వరకూ చాలా రహస్యంగా ఉంచబడింది. కృష్ణ ఇటువంటి ఎత్తు వేస్తాడని ఊహించని చంద్రశేఖరం చిత్తైపోయాడు. కేసు ఆరోజే కృష్ణకు అనుకూలంగా కొట్టివేయడం జరిగింది. అందుక్కారణం కేవలం సుబ్బయ్య సాక్ష్యమని చెప్పవచ్చును.
    సుబ్బయ్యకు డైరీ రాసే అలవాటుంది. కృష్ణ కోసం అయన ఒక రోజల్లా కష్టపడి కూర్చుని తన ఇంటికి కృష్ణ రాక చాలా కాలంగా జరుగుతున్నట్లు అందులో రాశాడు. ముఖ్యంగా ఏప్రిల్ 24 వ తేదీన కృష్ణ గురించి చాలా ప్రత్యేకించి రాశాడు. వాస్తవికత చెడకుండా ఉండడానికానీ ఆ తర్వాత కూడా మరి కొన్ని తేదీలలో కూడా కృష్ణ రాక గురించి ప్రత్యేకంగా రాశాడు. డైరీ రాయడంలో చాలా వరకూ కృష్ణ సూచనల ప్రకారం నడుచుకున్నాడు.




Related Novels


Vasundhara Kadhalu - 15

Vasundhara Kadhalu - 14

Vasundhara Kadhalu - 13

Vasundhara Kadhalu - 12

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.