Home » VASUNDHARA » Vasundhara Kadhalu - 12


 

                         కాగితం మీది భార్య !!

                                                                       వసుంధర

    సుబ్బయ్య గారు మధ్య తరగతి కుటుంబీకుడు. నాలుగొందలు నెలకు సంపాదిస్తూ ముగ్గురాడపిల్లనీ యిద్దరు మగపిల్లల్ని కన్నతండ్రి అయన. సంపాదన పెంచే తెలివి తేటలు లేవు. ఖర్చు తగ్గించుకునే క్రమశిక్షణా లేదు. నిత్యవసరాలన్నీ తీరుతుంటే జల్సాగా బ్రతుకుతున్నట్లు లెక్క.
    సుబ్బయ్య పెద్ద కొడుకు గౌరీ పతి బియ్యే పాసయ్యాడు. అతనికిప్పుడుద్యోగం దొరికే అవకాశం ఏర్పడింది. అందుకు వెయ్యి రూపాయలు లంచం ఇవ్వాలి. అంత డబ్బు సుబ్బయ్య తలతాకట్టు పెట్టినా దొరకదు. డబ్బు దొరక్కపోతే బంగారం లాంటి అవకాశం పోతుంది. మళ్ళీ అలాంటవకాశం వస్తుందని తోచదు.
    కొడుకు కంటే సుబ్బయ్య ఈ విషయం గురించి ఆలోచిస్తున్నాడు. ఆలోచిస్తున్నాడనడం కంటే తలబద్దలు కొట్టుకుంటూన్నాడనవచ్చు. కానీ అందువల్ల తలనొప్పి మినహా ఏమీ ప్రయోజనం లేకపోయింది.
    ఆఫీసులోనూ, చుట్టూ పక్కలూ సుబ్బయ్యకు మంచి వాడనీ,  నిజాయితీ పరుడనీ పేరూ, గౌరవమూ ఉన్నాయి. సుబ్బయ్య వీలున్నప్పుడల్లా కాస్తలో కాస్త నలుగురికీ సాయం చేసే తత్త్వం గలవాడు. ఇంట్లో ఏ రకం ఇబ్బంది ఉన్నా -- బైటకు ఏమీ తెలియకుండానే గుట్టుగా కాలం గడుపుతున్నాడు. ఆఫీసులో కూడా వేళకు వెళ్ళి సిన్సియర్ గా పనిచేస్తాడు. అతను పుచ్చుకుందామనుకున్నా లంచం దొరికే సీటు కాదతనిది.
    ప్రస్తుతానికి సుబ్బయ్యకు డబ్బు కావాలి. ఆయన ఇలాంటి ఆలోచనలో ఉండగా ఒకరోజు వెతుక్కుంటూ ఒక వ్యక్తీ వచ్చాడు సుబ్బయ్య ఇంటికి.
    ఆ సమయంలో ఇంట్లో సుబ్బయ్య ఒక్కడే ఉన్నాడు. మిగతా వాళ్ళందరూ సినిమాకు పోయారు. సుబ్బయ్యకు సినిమాలు చూసే అలవాటు లేదు. ఎప్పుడైనా ఇంటిల్లపాదీ బలవంత పెడితే ఏడాది కో అర్నేల్లకో ఓ సినిమా చూసి వస్తుంటాడు.
    వచ్చిన వ్యక్తీ -- "నమస్కారమండీ -- మీరేకదండీ సుబ్బయ్య గారు..." అన్నాడు.
    'అవును ....." అన్నాడు సుబ్బయ్య ఆ వ్యక్తిని ప్రశ్నార్ధకంగా చూస్తూ.
    "నా పేరు కృష్ణ -- మీ సాయం కోరి వచ్చాను ...." అన్నాడా వ్యక్తీ.
    సుబ్బయ్య మాట్లాడలేదు. చెప్పమన్నట్లు చూశాడు.
    కృష్ణ అక్కడున్న కుర్చీలో కూర్చున్నాడు -- " ఏప్రిల్ 24 వ తేదీ రాత్రి చంద్ర శేఖరం గారింట్లో దొంగతనం జరిగి యాభై వేల రూపాయల కాషు పోయింది. వినే ఉంటారు ?"
    "విన్నాను . ఎటొచ్చీ తారీఖు అంత ఖచ్చితంగా గుర్తు లేదు..."
    "ఆ డబ్బు నేను తీశానని చంద్ర శేఖరం గారనుమాన పడుతున్నారు. ఆ విధంగా అయన పోలీసు కంప్లయింటు చేస్తే పోలీసులు నన్నరస్ట్ చేశారు కూడా --' అన్నాడు కృష్ణ.
    "బాగుంది. అయన కంప్లయింట్ చేయగానే అరెస్ట్ చేసేయడమే -- అధారాలెం అవసరం లేదా --" అన్నాడు సుబ్బయ్య.
    "అన్నీ దొరికాయండీ. అయన తన దగ్గరున్న నోట్లన్నీంటి నెంబర్లూ పోలీసుల కిచ్చాడు. ఓ వందరూపాయల నోటుకు బ్యాంకులో చిల్లర  అడగటానికి వెళ్ళాను. బ్యాంకులో క్యాషియర్ ఆనోటు తీసుకుని, నంబరు పరీక్షగా చూసి - వెంటనే పోలీసులకు ఫోన్ చేశాడు. అలాంటి నోట్లు నా జేబులో మరో తొమ్మిది వున్నాయి. పోలీసులు ఎక్స్ ప్లనేషన్ అడిగారు. నేను డబ్బున్నవాడ్ని . ఆ నోట్లే ఎలా వచ్చాయీ అంటే చెప్పడం నా వల్ల కాదు. నేను డబ్బును మంచినీళ్ళలా ఖర్చు పెట్టె వాణ్ని. నా దగ్గరున్న ప్రతి నోటు చరిత్రా తెలుసుకుంటూ కూర్చోవడానికి నాకు వ్యవధి లేదు. అదే పోలీసులకు చెప్పాను. ఒక నోటైతే ఏమో గానీ పది నోట్లుండడం అనుమానించ దగ్గ విషయమేనన్నారు వారు. బెయిల్ మీద బయటకు వచ్చాను. చంద్రశేఖరం గారు నా మీద పటిష్టంగా కేసు తయారు చేస్తున్నాడని తెలిసింది. అందుకోసం చాలా తప్పుడు సాక్ష్యాలు సంపాదిస్తున్నాడు. అన్యాయంగా నన్ను జైలు పాలు చేయడానికి అయన ప్రయత్నిస్తున్నాడు ...." అన్నాడు కృష్ణ.
    "బాగుంది, అయానక్కావలసింది డబ్బు దొరకడం కానీ నిన్నన్యాయంగా జైలు పాలు చేస్తే  ఆయనకేం వస్తుంది...." అన్నాడు సుబ్బయ్య.
    "డబ్బు దొరికినా దొరక్కపోయినా ఆయనకు బాధ లేదు. నేను జైలు పాలవడమే అయన ముఖ్యోద్దేశ్యం. అయనకు నామీద పగ --...."
    "ఎందుకు ?"
    'అయన కూతురు నన్నో సారి రెచ్చకోట్టింది. నేను పెళ్ళి చేసుకోనని చెప్పినా ఫరవాలేదంది. నాదెం  పోయింది సరేనన్నాను. ఆ తర్వాత చాలాసార్లు కలుసుకున్నాం అమ్మాయికి కడుపోచ్చింది. చంద్రశేఖరం నన్ను కలుసుకుని కూతుర్ని పెళ్ళి చేసుకోమన్నాడు. నేను చేసుకోనన్నాను. వాదోపవాదాలు జరిగాయి. నా అంతు చూస్తానని కోపంగా వెళ్ళాడు చంద్రశేఖరం. తర్వాత ఆయనింట్లో యాభై వేల రూపాయలు పోయాయి. అందులో వెయ్యి రూపాయలు నా దగ్గర కొచ్చాయి....నేను చెప్పే కధ ఎవ్వరూ నమ్మడం లేదు. చంద్రశేఖరం గారి కధే అంతా నమ్ముతున్నారు...."
    "బాగుంది . అయితే ఇందులో నేను చేయగలిగినదేముంది ?"
    'చాలా ఉందండి. చంద్రశేఖరం గారు సేకరిస్తున్న సాక్షు లందరూ ప్రొఫెషనల్సు వాళ్ళ గురించి అందరికీ తెలుసు. అలాంటి వాళ్ళ సాక్ష్యాల్ని బద్దలు కొట్టడానికి -- మీలాంటి వాళ్ళ సాక్ష్యం ఒక్కటి చాలు...." అన్నాడు కృష్ణ.
    'అంటే?" అన్నాడు సుబ్బయ్య ఆశ్చర్యపోతూ.
    "మీరు నా తరపున సాక్ష్యమివ్వాలి " అన్నాడు కృష్ణ నెమ్మదిగా.
    "బాగుంది ముక్కూ, మొఖం తెలియని వాడి తరపున నేను సాక్ష్యమివ్వడ మేమిటి?" అన్నాడు సుబ్బయ్య చిరాగ్గా.
    "నేను మీకు ముక్కూ ముఖం తెలియనివాడిని కాదు. కొన్ని నెలలుగా మీకూ నాకూ పరిచయముంది. నేను చాలా మంచివాడిని. పలకరిస్తే తప్ప ఆడవాళ్ళ వైపు కన్నెత్తి చూడను. పెద్దలపట్ల వినయ విధేయతలతో ఉంటాను. తరచుగా మీ ఇంటికి వచ్చి వేడుతూంటాను. ముఖ్యంగా ఏప్రిల్ 24 వ తేది సాయంత్రం నేను మీ ఇంటికి వచ్చాను. కబుర్లతో గంటలు క్షణాల్లా దోర్లిపోతే ఆరాత్రికి నేను మీ ఇంట్లోనే ఉండిపోయాను. మర్నాడు ఉదయం లేచి స్నానం పూర్తీ చేసుకుని టిఫిన్ తీసుకుని మరీ బయటకు వెళ్ళాను ..." అన్నాడు కృష్ణ.
    'అంతా అబద్దం -" అన్నాడు కృష్ణ.
    "అవి మీరనకూడదు. నేను చెప్పినదంతా నిజమని మీరు చెప్పాలి. అలా చెప్పడం వల్ల నాకు జైలు శిక్ష తప్పడమే కాక సంఘంలో అవమానం కాకుండా రక్షించబడతాను. అందుకు మీకు ముందుగానే ప్రతిఫలం ముడుతుంది--"
    "ఎంత ?" అన్నాడు సుబ్బయ్య అప్రయత్నంగా.
    "రెండు వేలు -- ఒక వెయ్యి ఇప్పుడే అడ్వాన్సుగా ఇస్తాను...." అన్నాడు కృష్ణ. అంటూనే అతను జేబులోంచి వంద పది రూపాయలనోట్లు తీసి -- "చంద్రశేఖరం గారింట్లో పోయినవి అన్నీ వంద రూపాయల నోట్లు తీసి - "చంద్రశేఖరం గారింట్లో పోయినవి అన్నీ వంద రూపాయల నోట్లు . మీకు నేనిస్తున్నవి పది రూపాయల నోట్లు . కాబట్టి మీరేమీ భయపడనవసరం లేదు - " అన్నాడు.
    సుబ్బయ్య అప్రయత్నంగా ఆ డబ్బు అందుకున్నాడు.
    "చూడండి. కేసు నెల రోజుల్లో విచారణకు వస్తుంది. ఈ నెల రోజులూ నేను తరచుగా మీ ఇంటికి వచ్చి వెడుతుంటాను. నా గురించి మీరు బాగా తెలుసుకోవాలి. నా అలవాట్లను మీరూ -- మీ అలవాట్లను నేనూ బాగా పరిశీలించాలి. కోర్టులో ప్లీడర్లు ఎలాంటి ప్రశ్నలు వేసినా తట్టుకుని నిలబడాలి మన పరిచయం ...." అంటూ లేచాడు కృష్ణ.
    
                                     2
    గౌరీపతి ఆర్డరు కాగితం చూసుకుని మురిసిపోతున్నాడు. ఎన్నాళ్ళుగానో తను కలలు కంటున్నాడు. అవి ఈనాడు నిజమయ్యాయి. తనకు ఉద్యోగం దొరికింది.   
    తిరుపతి కెళ్ళి -- తలనీలాలు సమర్పించుకున్నాకనే నువ్వుద్యోగంలో జేరాలి -- " అంది రమణమ్మ. తల్లి మాటలను శిరసావహించదలిచాడు గౌరీపతి. ఇంట్లో తిరుపతి వెళ్ళవలసిన వాళ్ళు చాలా మందున్నారు-- ఒక పార్వతి తప్ప. ఆమె పెళ్ళికి సిద్దంగా ఉంది. తండ్రికి సాయంగా ఇంట్లో ఉండిపోయింది. సుబ్బమ్మ కుటుంబం తిరుపతి ప్రయాణం కొనసాగించడానికి గాను -- కృష్ణ ఇంకో అయిదు వందలు అడ్వాన్సు ఇచ్చాడు.




Related Novels


Vasundhara Kadhalu - 15

Vasundhara Kadhalu - 14

Vasundhara Kadhalu - 13

Vasundhara Kadhalu - 12

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.