Home » VASUNDHARA » Vasundhara Kadhalu - 12


 

    కృష్ణ సుబ్బయ్య నెంతగానొ   అభినందించడం మాత్రమే కాక, మరో వెయ్యి రూపాయలు అదనంగా కూడా ఇచ్చాడు.
    
                                   5
    సుబ్బయ్య తన కళ్ళను తనే నమ్మలేక పోయాడు. మరోసారి కళ్ళు నులిముకుని చూసినప్పటికీ ఆమె పార్వతి కాకుండా పోదు. అది కృష్ణ ఇల్లు కాకనూ పోదు. అయితే కృష్ణ ఇంట్లోంచి పార్వతి ఎందుకు బయటకు వస్తుంది?
    సుబ్బయ్య త్వరాత్వరగా ఇల్లు  చేరుకున్నాడు. ఇల్లు చేరగానే భార్యను కూతురి గురించి అడిగాడు.
    "పార్వతి సినిమాకు వెళ్ళిందండీ" అందావిడ.
    'అలాగా" అని అప్పటికి ఊరుకున్నాడు. సుబ్బయ్య .
    మ్యాట్నీ షో వదిలిపెడితే ఎన్నింటి కిల్లు చేరుకుంటారో ఆ టైము కింటికి వచ్చింది పార్వతి.  
    "ఏం సినిమా కెళ్ళావ్?" అడిగాడు సుబ్బయ్య.
    తడబడకుండా చెప్పింది పార్వతి. ఆశ్చర్యంగా కూతురి ముఖంలోకి చూస్తూ - "పావు తక్కువ అయిదింటికి నువ్వు కృష్ణ ఇంట్లోంచి బయటకు రావడం చూశాను. ఆ టైముకు ఏ సినిమా విడిచి పెట్టారు. కృష్ణ ఇల్లు సినిమా దియేటర్ కాదు...." అన్నాడు.
    పార్వతి తడబడి - "నేనేమీ తప్పు చేయలేదు ...." అంది.
    "అబ్ద్దమాడడం కూడా ఒక తప్పే!" ---అన్నాడు సుబ్బయ్య.
    "కృష్ణ నన్ను పెళ్ళి చేసుకుంటాడు" అంది పార్వతి కాస్త ధైర్యం చేసి.
    ఆ మాటలు సుబ్బయ్య ధైర్యాన్ని పూర్తిగా పోగొట్టేశాయి. ఆడపిల్ల ఇలాంటి మాట అన్నదంటే కాలు జారిందనే అనుకోవాలి.
    'అవసరం తీరేదాకా మగాళ్ళలాగే అంటారు...." అన్నాడు సుబ్బయ్య.
    పార్వతి మాట్లాడకుండా లోపలకు వెళ్ళిపోయింది. సుబ్బయ్యకు కర్తవ్యం తోచలేదు. అయన ఆలోచన లోక స్వరూపం దాల్చకుండానే పార్వతి ఒక కాగితం తీసుకువచ్చి తండ్రికిచ్చింది. సుబ్బయ్య దాన్నందుకుని చదివాడు.
    "నేనూ, పార్వతి ప్రేమించుకున్నాం. అతి త్వరలో వివాహం చేసుకోబోతున్నాం. నామీద కేసు కొట్టేయగానే సుబ్బయ్య గారికి నేను విషయం చెప్పేస్తాను. తాళి కట్టక పోయినా మా తనువులు ఏకమయ్యాయి. పార్వతి నాకీ రోజే భార్య అయింది. ఇది ఎవ్వరూ కాదనలేని సత్యం."
    ఈ విషయం రాసి క్రింద సంతకం పెట్టాడు కృష్ణ. నిస్సందేహంగా ఆ దస్తూరీ, సంతకమూ- కృష్ణవె అని సుబ్బయ్యకు తెలుసును. పార్వతి ధైర్యానికి కారణం కూడా ఆయనకు తెలిసింది.
    "నువ్వు చేసినది తప్పు పార్వాతీ -ఎంత నమ్మించినా ఆడది మగవాడికి పెళ్ళి కాకుండా భార్య కాకూడదు -" అన్నాడాయన వీలైనంత నిగ్రహంగా ఉండడానికి ప్రయత్నిస్తూ.
    తర్వాత అయన ఆ ఉత్తరాన్ని జేబులో వేసుకుని -- 'ఇంట్లో ఏమీ గొడవ కానివ్వద్దు" అని చెప్పి తను బయటకు నడిచాడు. ఆ నడక తిన్నగా కృష్ణ ఇంటికి.
    అయన వెళ్ళేసరికి కృష్ణ ఇంట్లోనే ఉన్నాడు సుబ్బయ్యను చూస్తూనే నమస్కరించాడు.
    "కృష్ణా -- ఇలా అన్యాయం చేయడం నీకు న్యాయం కాదు. నీకు చేసిన ఉపకారానికి నా కూతురు జీవితంలో ఆటలాడతావా" అన్నాడు.
    "జీవితాలతో ఆటలాడే అలవాటు నాకు లేదు. తప్పు చేసినా ఒప్పు చేసినా అంగీకారంతోనే చేస్తాను" అన్నాడు కృష్ణ.
    "బాగుంది. ఆ అంగీకారం లభించడానికి మోసపు మాటలు చెబితే ...."
    "సుబ్బయ్యగారూ- మగవాడికి ఉద్రేకం ఎక్కువ. ఒంటరిగా ఆడదాన్ని చూస్తె చలించిపోతాడు. అప్పుటికప్పుడు ఏవో మాటలు చెప్పి ఎలాగో అలాగ వశపరచుకోవాలనుకుంటాడు. అయినా అందువల్ల అతనేమీ నష్టపోడు. స్త్రీకి ఉద్రేకం తక్కువ. ఉద్రేక పడడం వల్ల నష్టమూ ఎక్కువ. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త పడలేదంటే ఆ స్త్రీ రిస్కు తీసుకుందనే చెప్పాలి. రిస్కు తీసుకుంటే ఒకోసారి రిస్కులో పడిపోతారు."
    సుబ్బయ్య ఒళ్ళు వేడెక్కింది -- "కృష్ణా - దుర్మార్గంగా మాట్లాడవద్దు. నువ్వు పార్వతిని జీవిత భాగస్వామిని చేసుకుంటానని ఉత్తరం రాశావు. అదే పార్వతిని నమ్మించింది. ఆ ఉత్తారాన్ని కోర్టులో పెడితే ...."
    "సుబ్బయ్యగారూ -- అనవసరంగా ఆవేశ పడకండి. నేను ఆడవాళ్ళను మోసం చేసే స్వభావం కలవాణ్ణి  కాననీ, చాలా మంచివాడిననీ నా గురించి కోర్టులో చెప్పారు. అందువల్ల మీ మాటల ప్రకారం కోర్టులో నేను మోసం చేసే ఉద్దేశ్యంతో ఈ ఉత్తరం రాశానని రుజువు చేయలేరు....అది మొదటి సంగతి...."
    ఆవేశంలో సుబ్బయ్యకు నోటమాట రాలేదు.
    "మీకూ నాకూ తప్ప పరిచయాన్ని గుర్తింపజేయడం కోసం మీరొకసారి నన్నేదో వస్తువు గురించి పొరుగూరు పంపినట్లు కోర్టులో చెప్పారు. అప్పుడు మీ అబ్బాయి తిరుపతి వెళ్ళిన కారణంగా ఆపని చేసి పెట్టడానికి మీకు నాబోటి వాడి సహాయం కావలసి వచ్చింది. ఆరోజు నేనీ ఊళ్ళో లేను. మర్నాడు మధ్యాహ్నం వచ్చాను. ఆ విషయం మీ డైరీలో ఉన్నట్లు కోర్టులో నమోదయింది. అదేరోజున నేనూ పార్వతీ మొదటిసారిగా ఏకమయ్యాం. ఆ తేదీ కూడా ఆ ఉత్తరంలో వేశాను. ఆ ఉత్తరాన్ని మీరు కోర్టులో ప్రవేశపెడితే -- అంతకుముందు మీరు కోర్టులో చెప్పినది తప్పుడు సాక్ష్యమని తేలిపోతుంది ... ఇది రెండో విషయం...."
    సుబ్బయ్య ఆవేశం చల్లారిపోయింది --" నువ్వు చాలా దుర్మర్గుడివి. ఏమాత్రమూ కృతజ్ఞతా లేనివాడివి" అన్నాడు నెమ్మదిగా.
    'అవసరం కోసం మనిషి నేరాలు చేస్తాడు. దొంగనవునో కాదో మీకు తెలియదు. కానీ డబ్బు కోసం తప్పుడు సాక్ష్యం పలికారు. ఆ ఉత్తరం గురించి అట్టే అల్లరి చేయకపోతే మీ కూతురికి సలక్షణంగా పెళ్లవుతుంది. అన్న డబ్బు కంటే ఓ వెయ్యి రూపాయలేక్కువే ఇచ్చాను మీకు, ఎందుకనుకుంటున్నారు? పోనీ - ఇంకో వెయ్యి ఇస్తాను. ఇంకా నా దగ్గరకు రాకండి. ఏ ఆడదానికి నేను ఇంత తక్కువ వాడకంతో రెండు వేలివ్వడం ఇంత వరకూ జరగలేదు" కృష్ణ దురుసుగా అని జేబులోంచి వెయ్యి రూపాయలు తీశాడు.
    ఆ డబ్బు తీసుకుని - కూతురిని కృష్ణకు తార్చానని సరిపెట్టుకోవాలా? వదిలేసి స్వాభిమానపరుణ్ణని సరిపెట్టుకోగలగాలా/ ఉత్తరం దాచేసి కూతురి పెళ్ళి ప్రయత్నాలు చేయాలా? ఉత్తరాన్ని బయటపెట్టి కృష్ణను నడివీధిలో పెట్టాలా?
    వీటిలో - ఏది చేసినా గెలుపు కృష్ణదీ - ఓటమీ తనదీ అని సుబ్బయ్య గ్రహించాడు. అందుక్కారణం వేరే ఏమీ లేదు. నిత్యం తప్పులో తిరిగేవాడి జీవితమే అంత - కానీ చాలా నీతిగా బ్రతుకుతున్నామనుకుంటూ మధ్యలో కక్కుర్తిపడి చిన్న తప్పు చేసేవాళ్ళు అలా మధ్యరకంగానే ఉండిపోతారు. ఇటు నీచులూ, అటు ఉత్తములూ కూడా వాళ్ళని హేళన చేయగలుగుతారు.
    "మొహమాట మెందుకూ , డబ్బు తీసుకోండి -- " అంటున్నాడు కృష్ణ సుబ్బయ్యను చూసి నవ్వుతూ.

                                    --------




Related Novels


Vasundhara Kadhalu - 15

Vasundhara Kadhalu - 14

Vasundhara Kadhalu - 13

Vasundhara Kadhalu - 12

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.