Home » VASUNDHARA » Vasundhara Kadhalu - 13
పిశాచి కోరిక
----వసుంధర
"వచ్చే సోమవారం నాటికి నేను తిరిగి వచ్చేస్తాను. నువ్వు జాగ్రత్తగా ఉండు. భయమనిపిస్తే పక్కింటి వాళ్ళమ్మాయిని పడుకోబెట్టుకో సాయంగా-" అన్నాడు ప్రసాదరావు.
"మీరు పక్కన లేరన్న దిగులు తప్పితే నాకు భయమేమిటండీ-" అంది విమల.
ప్రసాదరావు వెళ్ళిపోయాక విమల తలుపులు వేసుకుని గదిలోనికి వెళ్ళి పుస్తకాల బీరువాలోంచి ఓ నవల తీసింది.
అది ఇంగ్లీషు నవల. పేరు "నైట్ మేర్" రచయిత పేరున్న వాడు కాదు. కానీ పాతపుస్తకాల వాడివద్ద అట్టమీద బొమ్మ చూసి ఆ నవల కొన్నది విమల. అట్ట మీద ఒక భయంకరాకారం ఉన్నది. ఆధునిక దుస్తులు వేసుకున్న భూతంలా వున్నది ఆ ఆకారం. ఆ కారం ముందు అమాయకత ఉట్టిపడే ముఖంతో ఓ అందమైన యువతి ఉన్నది.
విమలకు వళ్ళు జలదరింపజేసే సాహిత్యమంటే ఇష్టం. అలాంటి పుస్తకాలు ఆమె రాత్రిళ్ళు చదువుతుంది. ఏ మాత్రమూ భయపడదు. ఇంకా చెప్పాలంటే ఆమె భర్త ప్రసాదరావుకు చీకటి అంటే భయం. విమల పుట్టింటికి వెడితే పేకాట వంకన అతడు స్నేహితుల నేనా తనింటికి తెచ్చుకుంటాడు. తనైనా స్నేహితుల ఇళ్ళకు వెడతాడు. ఒంటరిగా ఉండలేడతడు. విమల చదివే నవల సారాంశం వినడం కూడా అతడికిష్టముండదు.
విమల భర్త భయాన్ని వేళాకోళం చేస్తుంది. రాత్రి పడుకునేటప్పుడు మామూలు కథలా మొదలుపెట్టి కథలోకి దెయ్యాన్ని తీసుకుని వస్తుంది. ప్రసాదరావు ఒకోసారి భయాన్ని కోపంగా మార్చితే తప్ప అల్లరి భరించ వీలుకాదు.
అయితే విమలకు భర్త అంటే చాలా ఇష్టం. స్వతహాగా చిలిపిది కావడంవల్ల అతడిని ఏడిపిస్తుంది తప్పితే నిజంగా అతడి మనసు నొచ్చుకుంటే ఆమె భరించలేదు.
విమల "నైట్ మేర్" నవలను తెరిచింది. ఆ నవల చాలా భయంకరంగా వుంది. అప్పటికి తను యాభై పేజీలు చదివింది. నవల మొత్తం మూడువందల డెబ్బై ఆరు పేజీలు వుంది. ఆమె ఏ నవలనైనా శ్రద్ధగా చదువుతుంది. ఒకసారి చదివిన నవల నామె మళ్ళీ మర్చిపోదు. కానీ ఏ నవలనూ ఏకబిగిని పూర్తిచేయలేదామె. అందులోనూ ఇంగ్లీషు నవలలైతే చెప్పనే అక్కర్లేదు. ఇంత వరకూ చదివిన ఆ యాభై పేజీలు కూడా-మూడు రోజుల్నించి చదవగా పూర్తయ్యాయి.
ప్రసాదరావుకు ఆఫీసు పనిమీద టూర్ తగిలింది. మళ్ళీ అయిదు రోజుల దాకా రాడతను. ఎనిమిది గంటల ప్రాంతాల రాత్రి భోజనం ముగించుకుని అతడు వెళ్ళి పోయాడు.
'ఆయన వచ్చేలోగా ఈ పుస్తకం పూర్తిచేయాలి-' అనుకుంది విమల మంచంమీద పడుకుంటూ. కానీ ఆ రాత్రికి మాత్రం ఎన్నో పేజీలు చదవలేకపోయింది. పట్టుమని రెండు పేజీలు చదివిందో లేదో నిద్ర ముంచుకు వచ్చిందామెకు. అలా జరుగుతుందన్న అనుమానం ఆమె కున్నది.
ఆ రోజంతా ఆమె ఎంతో శ్రమపడింది. భర్తకు మూడు జతల బట్టలు ఇస్త్రీ చేసింది. పొరుగూరిలో తినడం కోసం స్వీట్సు తయారుచేసింది, మళ్ళీ ఇంటి భోజనం ఎప్పటికోనని ఆ రాత్రి విందు భోజనం ఏర్పాటు చేసింది. ఉదయం లేచింది మొదలు వంచిన నడుం ఎత్తకుండా పనిచేసింది. భర్త వెళ్ళిపోయేదాకా ఆమెకు అలసట తెలియలేదు. అతడు వెళ్ళగానే ఆమె కనులు బరువెక్కినట్లనిపించింది.
అందుకే ఆమె ముందు వీధి తలుపులు వేసింది. ఆ తర్వాతే నవల తీసింది.
ఆమెకు నవల చదవాలనే వున్నది. కానీ అలసట ఆమె కోరికను జయించింది. కొద్ది క్షణాల్లోనే వళ్ళెరుగని నిద్ర ఆమెను ఆవహించింది.
2
ఒక రాత్రివేళ ఉన్నట్లుండి విమలకు మెలకువ వచ్చింది. గదిలో బల్లమీద నుంచి ఏదో గ్లాసు జారిన చప్పుడయింది.
విమల కళ్ళు తెరిచింది. వెంటనే ఆమెకు ఏమీ కనిపించలేదు. ఒక్క నిమిషం కళ్ళు నులుముకుంది. అప్పుడు మంచంమీద లేచి కూర్చుంది. బెడ్ లైట్ వెలుతుర్లో ఆమెకు అన్నీ కనిపిస్తున్నాయి.
ఉన్నట్లుండి విమల ఉలిక్కిపడింది.
గదిలో ఓ మనిషి అటూ యిటూ పచార్లు చేస్తున్నది.
భయమంటే ఎరుగని విమల గుండెలు ఒక్కసారి గుభేలుమన్నాయి. ఎందుకంటే ఆమె చూస్తున్నది సినిమా దృశ్యం కాదు. కథలోని కల్పన కాదు. వాస్తవం!
ఆ మనిషి విమలను చూడలేదు.
తెల్లచీర కట్టుకున్నది. జుత్తు విరబోసుకుని వున్నది. మనిషికి సుమారు యాభై సంవత్సరాలుండవచ్చునని పిస్తుంది. కళ్ళు ఎటో శూన్యంలోకి చూస్తున్నట్లున్నది.
ఆమె అటూ యిటూ తిరుగుతున్నది. అలా తిరగడంతో ఒకసారి బల్లకు కాలు తగిలి దానిమీద గ్లాసు క్రిందపడినట్లున్నది. గ్లాసు ఇంకా నేలమీదనే వున్నది. ఆ ముసలిదీ విషయం పట్టించుకున్నట్లు లేదు.
ఇంకా అలా అటూ యిటూ తిరుగుతూనే వున్నది.
ఎవరామె? ఈ గదిలోకి ఎలా వచ్చింది? తను అన్ని వైపులనుంచీ తలుపులు వేసింది. అయినా లోపలకు ఎలా రాగలిగింది? గదిలో అర్ధం లేకుండా పచార్లు చేస్తున్నదేం?
విమలకు చాలా సందేహాలు కలిగాయి. ఆమె గొంతు పెగలడానికి కొంతసేపు పట్టింది.
"ఎవర్నువ్వు?" అంది విమల.
ఆ ముసలిది వినలేదు. ఆమె అటూ యిటూ పచార్లు చేస్తూనే ఉన్నది.
"ఎవర్నువ్వు?" మరి కాస్త గట్టిగా అన్నది విమల.
ముసలిది ఉలిక్కిపడి విమలవైపు చూసింది. ఆమె కాళ్ళు కదలడం ఆగిపోయినవి.
"మెలకువ వచ్చిందా తల్లీ!" అందామె. ఆ కంఠం చాలా తమాషాగా ఉంది, అయితే అందులోంచి ఆప్యాయత ధ్వనిస్తున్నది.
"ఎవర్నువ్వు? ఈ గదిలోకి ఎలా వచ్చావు?" అంది విమల.
ముసలిదామె మంచాన్ని సమీపించింది. తనూ మంచం మీద విమలకు దగ్గరగా కూర్చుని-"నా పేరు చంద్రమ్మ" అంది.
"ఊఁ" అంది విమల. ఆమె మనసుకింకా పూర్తిగా ధైర్యం చిక్కుబట్టలేదు. ఆమె మేకపోతు గాంభీర్యాన్ని వహించింది.
"నన్ను చూస్తే నీకు భయంగా వుందా?" అంది చంద్రమ్మ.
"భయమెందుకు?" అంది విమల.
"నా అదృష్టంకొద్దీ నువ్వు దొరికావు. నువ్వు తప్పక నా కోరికను తీర్చగలవు-" అంది చంద్రమ్మ.
"అసలు నువ్వెవరివి?" అంది విమల మళ్ళీ.
"ఎవరినని చెప్పను? పుట్టకముందు నువ్వెవరివో నీకు తెలుసా? పోయాక నువ్వెవ్వరివో నీకు తెలుస్తుందా?" అన్నది చంద్రమ్మ.
"నేను చావుపుట్టుకుల గురించి అడగడంలేదు. ఇప్పుడు నువ్వెవరివో చెప్పు!" అంది విమల.
"పుట్టుకకూ చావుకూ మధ్య నా పేరు చంద్రమ్మ. అందుకని ఇప్పుడూ అదే పేరు చెబుతున్నాను. కానీ ఇప్పుడు నేనెవరికంటే నేనేం చెప్పను?"





