Home » VASUNDHARA » Vasundhara Kadhalu - 13
మాటలు బాగానే వచ్చు వాడికి స్పష్టంగా లేకపోయినా అర్ధమవుతున్నాయి. వాడలా అనగానే విశ్వంభరానికి ముద్దు ఇచ్చి- బుగ్గమీద ముద్దు పెట్టుకున్నాడు. వెంటనే వాడు రెండోబుగ్గ చూపించి-"ఇక్కలో!" అన్నాడు.
విశ్వంభరం ఇంక తన్ను తాను అదుపు చేసుకోలేక పోయాడు. వాణ్ణి ముద్దులతో ముంచెత్తాడు. ఆ తర్వాత చాలాసేపు ఈ ప్రపంచాన్ని మరచిపోయి వాడితో ఆడుకున్నాడు.
బాబు చాలా చలాకీ అయినవాడు. తాతగారి మంచి తనాన్ని ఆసరాగా తీసుకుని వాడు చాలా అల్లరి చేశాడు. ఆయన్ని గుర్రాన్నిచేసి మీద ఎక్కాడు.
వాడు ఆకలి అంటే ఆయనోసారి పాలు ఇచ్చాడు. మరోసారి బిస్కట్ పెట్టాడు. ఇంకోసారి చాక్లెట్ పెట్టాడు. వాడు విశ్వంభరాన్ని లోకువకట్టి వరుసగా ఆకలి అనసాగాడు. ఆయనా అది గ్రహించి వాణ్ణి మరో ఆటలోకి మార్చి మరిపిస్తూండేవాడు. విచిత్రమేమిటంటే ఆయనకు ఆకలి గుర్తు రావడం లేదు.
అంతా వాడితో అయిదారు గంటలాడుకున్నాక బాబు అలసిపోయి నిద్రకు పడ్డాడు. నిద్రపోతున్నవాడి ముఖం ఎంత అమాయకంగా వున్నదో! ఆయన చాలాసేపు వాడి ముఖం వంకే చూస్తూ కూర్చున్నాడు. మధ్య మద్య్యలో కలలు వస్తున్నాయో ఏమో-ఉన్నట్లుండి వాడు నవ్వుతున్నాడు. ఆ నవ్వు ఎంతో మనోహరంగా వుంది.
తన్ను చూడగానే వాడు "తాత....తాత...." అనడం గుర్తు వచ్చిందాయనకు. ఆయన మనసు పరిపరివిధాలపోయింది. అవును....తనూ తాతేగదా మరి! తనకు మనుమలున్నారు.
ఆయన చటుక్కున ఉత్తరాల ఫైలు తీశాడు. తన కొచ్చిన ఉత్తరాలన్నీ ఫైల్లోకి వేసేయడం ఆయన అలవాటు. వాటిని మరీ అంత శ్రద్దగా చదవడం ఆయనకు అలవాటు.
ఇప్పుడాయన ఆ ఉత్తరాలు చదువుతున్నాడు. అవి భార్య రాసినవి. తన కోసం తన వాళ్ళ నందరినీ వదులుకుని వచ్చి కొన్ని దశాబ్దాలు తనతో గడిపి - ఆపైన తన సాహచర్యం పనికిరాదని తెలిసి కొడుకులవద్ద కాలం వెళ్ళబుచ్చుతున్న ఓ ఇల్లాలు రాసిన ఆ ఉత్తరాల నాయన కనీసం శ్రద్దగా కూడా చదవలేకపోయాడు.
ఇప్పుడా ఉత్తరాలు చదువుతూంటే ఆయన మనసు చలించి పోతోంది. వాటినిండా ఆప్యాయత రంగరించబడి వుంది. ఏ పండుగ జరిగినా, ఏ వేడుక జరిగినా భర్త గురించి ఆమె, తండ్రి గురించి బిడ్డలు తల్చుకుంటూంటారు. విశ్వంభరం కూడా తమ మధ్యన వుంటే బాగుండునని అనుకుంటూంటారు. వాటిలో మనవళ్ళ ముచ్చట్లు కూడా ఎన్నో వున్నాయి.
వాటినాయన ఎన్నడూ పట్టించుకోలేదు. ఇప్పుడు చదువుతూంటే-తానేం పోగొట్టుకున్నాడో అర్ధమవుతోంది.
విశ్వంభరం కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఆయనకు ఏడుపు కూడా రాబోతోంది. ఆ సమయంలో గదిలో ఏడుపు వినిపించింది.
బాబు నిద్ర లేచాడు.
"ఏమమ్మా ఏడుస్తున్నావు!" విశ్వంభరం అడిగాడు.
"అమ్మ.....అమ్మ కావాలి...." అన్నాడు వాడు ఏడుపు ఆపకుండానే.
"బిస్కట్ యివ్వనా?"
"వద్దు.....అమ్మ కావాలి...." వాడింకా ఏడుపు ఆపలేదు.
విశ్వంభరం వాణ్ణి మురిపించడానికి కొన్ని ప్రయత్నాలు చేశాడు. వాడు మరిచిపోయినట్లే మరిచి మళ్ళీ కొద్ది క్షణాల్లోనే "అమ్మ కావాలి...." అంటున్నాడు.
ఆయన వాదినేత్తుకుని డ్రాయింగ్ రూంలోకి తీసుకెళ్ళి గోడకు తగిలించిన ఒకో బొమ్మే చూపిస్తూ-వాటి గురించి ఏమేమో వివరిస్తూ తన తల్లి బొమ్మదాకా వచ్చి మాటలు రాక ఆగిపోయాడు.
ఫోటోలో అమ్మ.....అమ్మని హత్తుకుని తాను.....
అమ్మను హత్తుకున్న తన కళ్ళలో ఎంత ఆనందం.....ఎంత తృప్తి....
అప్రయత్నంగా ఆయన బాబు కళ్ళలోకి చూశాడు. వాడి కళ్ళలో దిగులు, విచారం....అందుక్కారణం......వాడికి అమ్మ కావాలి......వాడికి నగలు వద్దు......డబ్బువద్దు బొమ్మలు వద్దు.....పాలువద్దు.....బిస్కట్లు వద్దు...."
అమ్మ కావాలి!
మరోసారి ఫోటోలో తన ముఖం చూసుకోబోయాడు. కానీ అతడి కళ్ళు ఫోటోలోని తల్లని గమనించాయి. ఆమె తనవంక క్రూరంగా చూస్తోంది "ఛీ! నీచుడా! అన్నెం పున్నెం యెరుగని పసిపాపను అమ్మకు దూరం చేస్తావా?" అని గద్ధిస్తోంది.
ఆయన బాబు వీపునిమిరి "అమ్మ కావాలా?" అన్నాడు సానునయంగా. బాబు ఊఁ అన్నాడు-"తీసుకువెడతానేం మరి బుద్దిగా వుంటావా?" అన్నాడు.
"ఇప్పులే!" అన్నాడు బాబు.
విశ్వంభరం మరి జాప్యం చెయ్యలేదు. చెప్పాలంటే బాబుకంటే ఆయనకే తొందరగా వుంది. చిరునామా ఆయన దగ్గర వుంది. వెంటనే ఆయన వాళ్ళింటికి బయల్దేరాడు.....
3
బాబుకి తన యిల్లు చూడగానే సంతోషంవచ్చి పెద్ద గొంతుతో "అమ్మా!" అని కేకపెట్టాడు. ఆ పిలుపుకే ఆ యింటి తలుపు తెరుచుకుంది. గుమ్మంలో వున్న స్త్రీని బాబు తల్లిగా ఊహించాడు విశ్వంభరం.
బాబు తన శాయశక్తులా ప్రయత్నించి విశ్వంభరంని విడిపించుకుని దిగి పరుగున తల్లిని చేరాడు. ఆమె వాణ్ణి ఒక్క ఉదుటున హృదయానికి హత్తుకుంది.
అప్పుడు విశ్వంభారానికి తన డ్రాయింగ్ రూంలోని ఫోటోను చూస్తున్నట్లే ఉంది. ఆయన ఇంట్లోకి వెళ్ళి ఓ కట్టుకథ చెప్పాడు. ఆ కథను వాళ్ళు నమ్మారు. ఆయన్నెంతగానో పొగిడారు.
"వీడినెవరో కిడ్నాప్ చేసి అయిదువేలడిగారు. ఆ డబ్బెలా సంపాదించాలా అని కొట్టుకుపోతున్నాం. అదృష్టంకొద్దీ మీరు దేవుడిలా వీణ్ణి ఆ కిడ్నాపర్ బారి నుంచి రక్షించి అటు డబ్బుబాధా, ఇటు వీడేమయ్యాడోనన్న బాధా తొలగించారు. మీ ఋణం యెలా తీర్చుకోవాలో తెలియడంలేదు....
ఈ మాటలు ఇంట్లో చాలామంది అన్నారు.
ఆయన అక్కణ్ణించి బయటపడ్డాడు. సాయంత్రం ఆయన మిత్రులు ఆయన్ను కలుసుకున్నారు. విశ్వంభరం వారికి జరిగింది చెప్పాడు.
"మన గ్యాంగులో ఇంతవరకూ యిలా యెవ్వరూ ప్రవర్తించలేదు. ఇందుకు నువ్వు సంజాయిషీ యిచ్చుకోవాలి" అన్నాడు ఒకడు.
"అదిసరే నీ నైట్ క్లబ్ పిట్టకు ఏం సంజాయిషీ ఇచ్చుకుంటావు?" అనడిగాడు ఇంకొకడు.
"ఇప్పుడు దాని కౌగిలి నాకు అవసరంలేదు. అంత కంటే అద్భుతమైన అనుభూతినిచ్చే కౌగిలి గురించి నే నిప్పుడు తెలుసుకున్నాను" అన్నాడు విశ్వంభరం.
"ఏమిటది- ఆ చంటికుర్రాడిదా?" వెటకారంగా అన్నాడొకడు.
విశ్వంభరం తమాషాగా నవ్వి "అంత తేలికగా తీసిపారెయ్యకు. మనిషికి మూడు దశలు బాల్యంలో అమ్మ కౌగిలి బాగుంటుంది. యౌవనంలో ప్రియురాలి కౌగిలి అవసరమనిపిస్తుంది. వృద్ధాప్యంలో మనుమలిచ్చే ఆనందం మరెవ్వరూ యివ్వలేరు. నేనిది మరిచిపోయి నా యౌవనాన్నే పునరుద్ధరించాలనుకుంటూ జీవితం గడుపుతున్నాను. అందువల్లనే నాకు తెలియని అసంతృప్తి నన్ను వేధిస్తోంది. ఈ రోజు అనుభవం నాకు నిజం తెలియజేసింది, నేనిప్పుడు నా భార్య దగ్గరకు వెడుతున్నాను...." అన్నాడు.
"అయితే కిడ్నాపింగ్ కి ఇక స్వస్తి చెబుతావా?"
"నౌ ఐ రియలైజ్డ్ దట్ అయామే కిడ్నాపింగ్ ఆఫ్ మై ఓన్ హాపీనెస్ ( నా సంతోషాన్ని నేనే హరిస్తున్నానని నేను ఇప్పుడు గుర్తించాను) ఇంకా కిడ్నాపర్ గా యెలా వుండగలను?" అన్నాడు విశ్వంభరం.
మిగతావాళ్ళు ఆలోచనలోపడ్డారు.
-:అయిపోయింది:-





