Home » VASUNDHARA » Vasundhara Kadhalu - 12


 

                                                           11
    మర్నాడుదయం సీత హోటలుకు వెళ్ళి తండ్రిని కలుసుకుంది. ఇద్దరూ ఏకాంతంగా చాలాసేపు మాట్లాడుకున్నారు. తర్వాత ఇద్దరూ బ్యాంకుకు వెళ్ళారు. అక్కడ చాలాసేపు వ్యవహారాలు చేశారు. ఆ తర్వాత ఇద్దరూ విడిపోయారు. సీత తిన్నగా ఆఫీసుకు వెళ్ళి భర్తను కలుసుకుంది.
    "మీ కోరిక నెరవేరింది. మీరు కోరిన విధంగా మీరు మీ సీతను మెయింటైన్ చేయగల్గుతారు" అంది సీత.
    "ఏం జరిగింది ?" అన్నాడు జనార్దనం ఉత్సాహంగా.
    "ఏముంది ? మా నాన్న గారు నిజంగానే మారిపోయారు.  ఆ విషయం ఈ రోజే గ్రహించాను నేను. ఆ షేర్లు ఆ డబ్బూ అన్నీ తిరిగిచ్చేశారు. ఇప్పుడు నా పేరు మీద బ్యాంకులో అయిదు లక్షలు ఫిక్సిడ్ డిపాజిట్లో వేశారు. నెలనెలా మనకు కొన్ని వేలు వడ్డీగా వస్తుంది. కరెంట్ అకౌంట్లో మూడు లక్షలు క్యాషు వేశారు. సాయంత్రంలోగా కారు మీ ఆఫీసుకు వస్తుంది. ఇదీ పరిస్థితి! వ్యవహారం పూర్తీ చేసుకు వచ్చాను" అంది సీత.
    జనార్దనం ముఖంలో చాలా ఆనందం కొట్టొచ్చినట్లు కనబడింది. అతను బదులుగా ఏమీ మాట్లాడక పోవడం చూసి "మీ కళ్ళెం చెబుతున్నాయి మీ సంతోషాన్ని అక్కడ నాన్నగారి కళ్ళూ అంతే . పాపిష్టిదాన్ని ఇంత కాలం మీ ఇద్దరినీ ఇంతటి ఆనందానికి దూరం చేశాను" అంది సీత.
    'అంత మాటనకు సీతా!" అన్నాడు జనార్దనం.
    "మరి నేను వస్తాను. ఈ శుభవార్త మీకు చెవులారా వినిపించిపోవాలని నా నోటితోనే స్వయంగా వీలైనంత తొందరగా చెప్పాలనీ ఇలా వచ్చాను. ఇంటికి వెళ్ళి మీ కోసం ఎదురు చూస్తూ వుంటాను త్వరగా వచ్చేయండి."
    "ఎందుకీ అఫీసింక , రిజైన్ చేసి వచ్చేస్తాను" అన్నాడు జనార్దనం.
    'ఆ పని మాత్రం చేయకండి. ఇది మన కృషితో సంపాదించుకున్న ఉద్యోగం. అయాచితంగా వచ్చిన డబ్బును దర్జాగా ఖర్చు చేయడంలో తప్పు లేదు కానీ, కేవలం దాని మీదనే అధారపడకూడదన్నది నా అభిప్రాయం " అంది సీత.
    "సరదాకన్నాను కాని, ఉద్యోగాన్నెందుకు వదులుకుంటాను ?' అన్నాడు జనార్దనం.
    సీత అక్కణ్ణించి కదిలింది. ఆమె అంత ఉత్సాహంగా లేదు, తండ్రి ఇచ్చిన డబ్బు గురించి భర్త అంతగా ఉత్సాహపడటం ఆమెకు నచ్చలేదు.
    ఆమె ఇంటికి వెళ్ళేసరికి వీధి తలుపులు బార్లా తీసి వున్నాయి. హంతకుడు వీధి గదిలో కూర్చుని వున్నాడు.
    "ఎన్నడూ లేనిది, చెల్లాయ్ ఈరోజు చాలాసేపు పెత్తనాలు చేసి వచ్చిందే !" అన్నాడు హంతకుడు ఆశ్చర్యన్నభినయిస్తూ.
    "నిజమే కానీ,ఇది నీ స్థలం కాదు గదా, నీకోసమని వేరే గది ఏర్పాటు చేసినపుడు నువ్విక్కడెందుకు కూర్చున్నావ్ ?' అంది సీత చిరాగ్గా.
    "బాగుంది ఇదేమన్నా హోటలా, నా గదిలో తప్ప మసలకూడదనడానికి . ఈ ఇంటికి అతిధిగా వచ్చాన్నేను. నాకో గది ఇచ్చారు పడుకునేందుకూ, ప్రయివేటు వ్యవహారాలకూ ఆ గది తప్పితే మిగతా ఇంట్లో మసలకూడదని లేదు గదా" అని ఒక్క క్షణం ఆగి, "చెల్లాయ్ ఈరోజు నాకే పనీ లేదు. మీ ఆయనతో పాటు నువ్వు బయటకు వెడితే ఇంత సేపటి దాకా రావనుకోలేదు. ఏం తోచలేదు. ఓగంట క్రితమే వీధి తలుపులు తీసుకుని కూర్చున్నాను" అన్నాడు.
    సీత ఏమీ మాట్లాడలేదు.
    "పొద్దున్న మీతో పాటు చేసిన భోజనం ఒట్టుగా ఇంకేమీ తినలేదు. హోటలుకు వేదదామంటే నీ చేతి వంట రుచి చూచినప్పట్నించి హోటలు కూడు తినలేకుండా వున్నాను. నువ్విప్పుడు పకోడీలు వేస్తానంటే తింటాను. లేదంటే టిఫిన్ మానేస్తాను అంతే!" అన్నాడు హంతకుడు.
    సీత నవ్వుకుంది. హంతకుడికి వాక్చాతుర్యం వుంది. ఆమె మరి మాట్ల్దాకుండా లోపలకు వెళ్ళి తన పనులలో నిమగ్నురాలైంది. నిజంగా, మనస్పూర్తిగా పకోడీలు తయారు చేసింది. అవి రెడీ ఆయె సమయానికి ఆఫీసు నుండి భర్త కూడా వచ్చాడు.
    జనార్దనం వస్తూనే సినిమా ప్రోగ్రాం అన్నాడు. సీత కాదనలేదు కానీ, హంతకుడు తనూ వస్తానన్నాడు. జనార్దనం ఏమీ అనలేదు. అందరూ త్వరగా తెమిలి సినిమాకు బయల్దేరారు.
    సినిమా మధ్యలో హంతకుడు లేచి జనార్దనం భుజం తట్టి "అనుకోని బేరం తగిలింది. నేను వెడుతున్నాను" అని వెళ్ళిపోయాడు. జనార్దనం సంతోషించాడు. తను సీతతో మరింత ఫ్రీగా కబుర్లు చెప్పవచ్చునని అతనికి తోచింది.
    ఇంటర్వల్లో ఒకతను సీతను పలకరించాడు. జనార్ధనానికి అతనెవరో తెలియలేదు. కానీ, సీత అతన్ని గుర్తు పట్టి పలకరించింది. హల్లో మళ్ళీ దీపాలారేక సీత అతని గురించి చెప్పింది. అతనిది సీత ఊరేనట. సీతను ప్రేమించాడట. తనకు పెళ్ళయ్యేవరకూ ప్రేమిస్తూనే వున్నాడట.
    'ఇప్పుడు పెళ్ళయిందా అతనికి?" జనార్దనం కుతూహలంగా అడిగాడు.
    "లేదు అతని సంగతి నాకు పూర్తిగా తెలుసు, బాగా డబ్బున్న ఆడదాన్ని వల్లో వేసుకోవాలని చూస్తున్నాడతను. అతని ప్రేమ నామీద కాదు , నా డబ్బు మీద. ఆ సంగతి నాకు తెలియదని అతని ఉద్దేశం. డబ్బున్న అమ్మాయి దొరికితే రెండో పెళ్ళిదాన్నయినా ఆఖరికి పిల్లల తల్లినైనా సరే చేసుకునేందుకు సిద్దం" అంది సీత నవ్వుతూ.
    జనార్దనం ఆలోచనలు మరో విధంగా పోయాయి. సీత ఇప్పుడు ఇదివరకటి సీత కాదు. ఆమె పేరున చాలా డబ్బుంది. ఆమె ఇదివరకులా ప్రవర్తించక పోవచ్చు. ఆమెను తనేమీ వారించకపోవచ్చు. డబ్బున్న ఆడదాన్ని ప్రవర్తన ఎలాగుంటుంది?
    అతనికి లలితారాణి గుర్తుకొచ్చింది!
    ఆ తర్వాత అతను సినిమా సరిగా చూడలేకపోయాడు.
    ఇద్దరూ ఇల్లు చేరుకునే సరికి సుమారు పదయింది. బయట హోటల్లో భోం చేసి వచ్చేశారు. తలుపు తీసుకుని లోపలకు ప్రవేశించారు.
    హంతకుడు గదిలోంచి మాటలు వినిపిస్తున్నాయి. ఇద్దరికీ ఎవరోచ్చారా అని కుతూహలం కలిగింది. సాదారణంగా హంతకుడి గదిలోకి రెండే రెండు రకాల మనుషులు వస్తారు. ఒకరు చంపానుకునేవారు, రెండు చావబోయేవారు.
    మంచినీళ్ళిచ్చె వంకతో జనార్దనం హంతకుడి గది దగ్గరకు వెళ్ళారు. లోపలకు వెళ్ళేముందు కాసేపు ఆగాడు. ఎందుకంటె ఇంకా వారిద్దరూ మాట్లాడుకుంటున్నారు. మాటల్లోని రెండో కంఠం స్త్రీది.
    "నిజమేనంటావా అన్నయ్య " అంది స్త్రీ కంఠం.
    'అవునమ్మా ఏ ముహూర్తాన నిన్ను చెల్లాయని పిలిచానో ఆ క్షణం నుంచీ నీ మీద ఒక ఆత్మీయత ఏర్పడింది. అందుకే ఈ నిజం చెబుతున్నాను --" అంది హంతకుడి కంఠం.
    "నమ్మలేకుండా వున్నావన్నయ్యా నా మీద హత్య ప్రయత్నమా?"
    "మరి నిన్న జరిగిన సంఘటన కాకతాళీయమంటావా?"
    "నీ మాటలు వింటుంటే కాదనే అనిపిస్తోంది . కాఫీ పొడుం లో విషముంటుందని ఎలాగనుకుంటాను? అలా కాఫీ తయారు చేసి బయటకు వచ్చాను. కింద పడ్డ కాఫీ తాగి పెంపుడు పిల్లి చచ్చిపోయింది. దానికి మేమే కాఫీ అలవాటు చేసాం. ఈ సంఘటన జరగ్గానే అయన వణికిపోయారు."
    'చూడమ్మా సినిమాహాల్లో నువ్వూ మీ అయన తటస్థ పడడం మంచిదే అయింది. నేను హంతకుడినే కావచ్చు మీ ఇంట్లో రెండు నెలలుండి నా హత్య కార్యక్రమాలు నెరవేర్చుకుని ఉండవచ్చు. కానీ, అయిన వాళ్ళను రక్షించుకునే పద్దతి నాకు తెలుసు. నీకిక్కడ పూర్తీ రక్షణ లభిస్తుంది. ఈ రాత్రి నువ్విక్కడ వుంటావు. నేను మీ హోటలు గదిలో వుంటాను."
    "అవునన్నయ్యా , నువ్వు చెప్పేదాకా నన్ను చంపడానికి బెదిరింపు ఉత్తరాలు వస్తున్నాయని కూడా నాకు తెలియదు. ఆయనకు నామీద ఎంత ప్రేమో - అందుకే గత పది హీను రోజులుగా నన్ను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు" అందా స్త్రీ.
    "అవును మరో మగాడైతే కిమ్మనాస్తిగా ఊరుకునేవాడు. నా అనుమానం ఎవరో ఆడది ఈ పనులన్నీ చేస్తోందని. దానికి నీ మొగుణ్ణి పెళ్ళాడాలని ఉండవచ్చు. నువ్వు పొతే నీ ఆస్తి కూడా ఆయనకు దక్కుతుంది కదా ఒక దెబ్బకు రెండు పిట్టలు కదా."
    "నా ఆస్తి ఎప్పుడూ ఆయనదే దానికి నేను కూడా చావాల్సిన అవసరం లేదు."
    జనార్దనం తలుపులు తట్టాడు. లోపల మాటలు ఆగిపోయాయి. రెండు నిమిషాల సేపు గదిలో ఏదో హడావుడి జరిగినట్లయింది. మంచం లాగిన చప్పుడు అవీ ఇవీ పడుతున్న చప్పుడు అయ్యాయి. తర్వాత తలుపులు తెరుచుకున్నాయి.
    జనార్దనం ఆశ్చర్యముగా లోపలకు చూశాడు. గదిలో ఇంకెవరూ లేరు. హంతకుడు తప్ప.
    "మంచినీళ్ళ గురించి మళ్ళీ రాత్రి వచ్చి మమ్మల్ని లేపుతావేమోనని " అన్నాడు జనార్దనం.




Related Novels


Vasundhara Kadhalu - 15

Vasundhara Kadhalu - 14

Vasundhara Kadhalu - 13

Vasundhara Kadhalu - 12

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.