Home » VASUNDHARA » Vasundhara Kadhalu - 13
"ఎక్కడికి వెడుతున్నావ్?"
"కొట్టుకండి...." అందామె.
ఇద్దరూ పక్క పక్కన కొంతదూరం నడిచారు. చుట్టూ జనసంచారం లేదు.
"ఒక్కసారి బాబుని ఎత్తుకుని ముద్దాడొచ్చా?" అన్నాడతను.
"అయ్యో-తీసుకోండి-" అంది పనిపిల్ల.
అతడు చేతులు చాపిందే తఃడవుగా బాబు నవ్వుతూ వచ్చేశాడు.
"బాబుకి కొత్తలేదు. అంతా తనవాల్లె ననుకుంటాడు" అంది పనిపిల్ల.
అతడు నటిస్తున్నాడు కానీ దృష్టి కుర్రాడిమీద లేదు.
ఉన్నట్లుండి స్కూటర్ ఒకటి వచ్చింది. అందుమీద యిద్దరున్నారు. వెనకాల కూర్చున్నవాడు కిడ్నాపర్ చేతిలోంచి బాబుని తీసుకున్నాడు. స్కూటర్ వెళ్ళి పోయింది.
"అరే!" అన్నాడతను.
పనిపిల్ల కంగారుగా-"అయ్యా బాబోయ్-అయ్యాగారు నన్ను చంపేస్తారు-" అంది.
అతను నిట్టూర్చుతూ-"బాబు నా చేతిలో బదులు నీ చేతిలో వుండాల్సిందేమో-నీ దగ్గర్నుంచి లాక్కోవడం కష్టమయ్యేది-" అన్నాడు.
పనిపిల్ల ఈ లోకంలోకి వచ్చింది-"కొంతలో కొంత యిదీ మెరుగే. నా చేతుల్లోంచీ బాబు మాయమయితే...." అని ఆమె మాటలు పూర్తిచెయ్యలేక పోయింది. బాబు పోయాడన్న బాధ కంటే శిక్ష గురించిన బెంగ ఎక్కువగా వుంది ఆమెకు.
"నువ్వేం కంగారుపడకు-'అన్నాడతను. వున్నట్లుండి అతడు మళ్ళీ-"అరే!" అన్నాడు. అతడి చేతిలో ఏదో కాగితముంది-బాబు నెత్తుకొనిపోయిన వాళ్ళతడి చేతిలో యేదో వుత్తరం యిచ్చారు. "నేను గమనించనే లేదు-" అన్నాడతను.
అతను ఉత్తరాన్ని పైకి చదివాడు.
"ఈ వుత్తరం అందిన వెంటనే పి.పి. రావు పేరున అయిదువేలకు డ్రాఫ్టు తయారు చేయించి- యిందులో యివ్వబడిన అడ్రసుకు పోస్టు చేస్తే-మీ బాబు మీకు క్షేమంగా జేరుతాడు. లేనిపక్షంలో బాబు శవమే మీకు లభిస్తుంది-"
పనిమనిషి మళ్ళీ ఘొల్లుమంది. కిడ్నాపర్ ఆమెను తీసుకుని వాళ్ళింటికి వెళ్ళాడు. నెమ్మదిగా జరిగింది చెప్పాడు. వాళ్ళను సముదాయించాడు. కంగారు పడవద్దన్నాడు.
ఇంట్లో రకరకాల చర్చలు బయల్దేరాయి. కిడ్నాపర్ పోలీసులకి రిపోర్టివ్వడంలోని ప్రమాదం గురించి చెప్పాడు. అందువల్ల దొంగలు బయటపడవచ్చు. కానీ బాబు దక్కక పోవచ్చు.
"అయిదువేలు ఒక్కసారి ఎలావస్తుంది?" ఇంటాయన వాపోయాడు.
"అది నేను చెప్పలేను. ఏదో దారినపోయే ధనయ్యగా సలహా ఇచ్చాను. పాపం-ఇందులో ఈ పిల్ల తప్పేమీలేదు. అది-చెప్పడానికే వచ్చాను-" అన్నాడు కిడ్నాపర్.
ఎవరూ కిడ్నాపర్ ని అనుమానించలేదు. అతడు ఆ యింట్లో సంభాషణ వింటున్నాడు. ఒక్కసారి అయిదు వేలంటే వాళ్ళకు చాలా కష్టం అని గ్రహించాడు.
2
"ఈవేళ మాకు వీడు దొరికాడు-" అన్నాడు ఒక అతను నవ్వుతూ.
విశ్వంభరం ఆశ్చర్యంగా ఆ కుర్రాడివంక చూశాడు. ఇంత చిన్న కుర్రాడిని కిడ్నాప్ చేయడం తమ గ్యాంగుకు ఇదే ప్రథమం.
"మీ యిల్లే వీడికి శరణ్యం. ఈ ఒక్కరోజూ మీరు వీడితో గడపాలి. ఆ తర్వాత అయిదువేలూ తీసుకుని హాయిగా కొత్త పిట్టతో వారం రోజులు గడుపవచ్చు-" అన్నాడు రెండో అతను.
"చంటి పిల్లలంటే నాకు బోరు..." అన్నాడు విశ్వంభరం.
"వారం రోజుల సౌఖ్యంకోసం-ఒక్కరోజు తప్పదు మరి...."
విశ్వంభరం చంటి పిల్లల్నెన్నడూ చేరదియ్యలేదు. ఆయనకు వాళ్ళంటే చాలా చిరాకు. ఈ కుర్రాడితో ఒక రోజంటే ఆయనకు తలచుకుంటే బెంగగా వుంది.
"ఈ ఫ్లాస్కు నిండా పాలున్నాయి. రెండోది-ప్యాకెట్-ఇందులో బిస్కట్లు, బిళ్ళలు వగైరాలున్నాయి. డబ్బు దండగని బొమ్మలు కొనలేదు. మీ యింట్లో ఏమైనా వుంటే చూసి యివ్వు-మరి మేము వస్తాం...." అన్నారు వాళ్ళిద్దరూ.
విశ్వంభర పిల్లవాడిని అందుకుందుకు చేతులు చాపాడు. వాడాయనకేసి చూసి నవ్వి-"తాత......తాత...." అని చప్పట్లు కొట్టాడు.
ఆ మాటలు, నవ్వు యేదో కొత్త అనుభూతినిచ్చాయి. ఆయన చటుక్కున వాడిని యెత్తుకుని ముద్దు పెట్టుకున్నాడు.
బాబు వెంటనే రెండో బుగ్గ చూపించి ముద్దు ముద్దుగా -"మరొక్కతీ..." అన్నాడు. విశ్వంభర అప్రయత్నంగా ఆ బుగ్గమీద కూడా ముద్దు పెట్టుకున్నాడు.
అప్రయత్నంగా ఆయనకు క్లబ్బుసుందరి గుర్తుకు వచ్చింది.
ఈ రోజుకు వీణ్ణి భరిస్తే-ఆ సుందరిని కూడా తనిలాగే వారం రోజులు ఎడతెరిపి లేకుండా ముద్దులాడవచ్చు. విశ్వంభరం వళ్ళు జలదరించింది.
వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. అక్కడ విశ్వంభరం, బాబు మిగిలారు. వాళ్ళు వెళ్ళిపోతూంటే బాబు "టాటా!" అంటూ చేతులూపాడు అప్రయత్నంగా వెళ్ళిపోతున్న వాళ్ళు కూడా బాబుకి టా టా చెప్పారు.
బాబు విశ్వంభరం చంక దిగాడు. అక్కడున్న వస్తువులు చక్కబెట్టడం మొదలు పెట్టాడు. విశ్వంభారం కాసేపు ఆలోచనల్లో వున్నాడు. తర్వాత ఏదో చప్పుడై ఈ లోకంలోకి వచ్చాడు.
బాబు అక్కడున్న స్టూలుని లాగి మీద పడేసుకున్నాడు. దెబ్బ తగిలిందో ఏమో ఏడుపు లంకించుకున్నాడు.
"ఈ పిల్లలతో ఇదే బాధ-ఇట్టే నవ్వుతారు. ఇట్టే ఏడుస్తారు...." అనుకున్నా డాయన. నవ్వినప్పుదైతే ఫరవాలేదు. ముద్దుగానే వుంటారు. ఏడిస్తేనే చిరాకు.
బాబు ఏడుస్తున్నాడు. ఏడ్చి ఏడ్చి వాడే ఊరుకుంటాడులే అనుకుంటూ ఆయన ఆలోచనల్ని దారి మళ్ళించడం కోసం అటూ యిటూ చూడసాగాడు. అప్పుడాయన దృష్టి హఠాత్తుగా గోడకు వ్రేలాడుతున్న ఓ పటం మీదకు మళ్ళింది. అందులో విశ్వంభరం తల్లి వుంది, ఆ తల్లి చంకలో విశ్వంభరం. అప్పుడు విశ్వంభరం వయసు రెండేళ్ళే ఉంటుంది.
విశ్వంభరం తల్లి ఫోటోని తన డ్రాయింగ్ రూంలో వుంచాలని చాలాకాలంగా అనుకున్నాడు. ఇంట్లో ఆవిడ ఫోటో ఒక్కటీ లేదు. ఆరా తియ్యగా తియ్యగా మేనమామల ఇంట్లో ఈ ఫోటో దొరికింది దాన్ని పెద్దదిగా మళ్ళీ తీయించి ఇక్కడ తగిలించాడు. అతడికి ఆరేళ్ళ వయస్సులోనే తల్లిపోయింది. కానీ ఈ ఫోటోని చూస్తే అతడిలో ఏవో జ్ఞాపకాలు వస్తాయి. తను ఏడ్చినపుడల్లా తల్లి హృదయానికి హత్తుకోవడం అతడికి లీలగా గుర్తొస్తూంటుంది. ఆ అనుభూతి అతడి కందించే ఆనంద మింతా అంతా కాదు.
అప్పుడు విశ్వంభరానికి మళ్ళీ వినబడింది-బాబు ఏడుపు.
వాడింకా ఏడుపు ఆపలేదు. ఇల్లదిరిపోయేలా ఏడుస్తున్నాడు. విశ్వంభరం చటుక్కున వాడిని సమీపించి స్టూలు పక్కగా లాగాడు-"ఏమ్మా ఏమయింది?" అన్నాడు జాలిని కంఠంలో ధ్వనింపచేస్తూ.
వాడు చెయ్యి చూపించి-"అయి-" అన్నాడు.
ఈమాత్రం భాష ఆయనకు అర్ధమవుతుంది. ఏం చేయాలా అని ఆయన ఆలోచిస్తూండగా వాడే-"ఊదు" అన్నాడు. ఆయన వాడు చూపిన చోట ఊదాడు. వాడు ఉత్సాహంగా లేచి "తగ్గిపోయిందీ" అన్నాడు.





