Home » VASUNDHARA » Trick Trick Trick
"శభాష్!" అన్నాడు ఋషి. అతడలా అన్న వెంటనే పెద్దచప్పుడై గోడలో ద్వారం ఏర్పడింది-"నువ్విప్పుడు వెళ్ళిపోవచ్చు-" అన్నాడతడు.
గోపీ ఋషికి పాదాభివందనంచేసి ఆ ద్వారంలోంచి పక్కగది లోనికి వెళ్ళగానే ఆ ద్వారం పెద్దచప్పుడుతో మాయమైంది.
అప్పుడు ఆ గదిలో నలుగురు వస్తాదులున్నారు. వాళ్ళు గోపిలో "తఃపస్సు పూర్తిచేసుకుని వస్తున్నావా." అనడిగారు.
"అవును-" అన్నాడు గోపీ.
"అయితే సిద్దమేనా?" అన్నాడో వస్తాదు.
"ఊఁ" అన్నాడు గోపీ. అతడు మాటను పూర్తి చేస్తూనే గాలిలోకి ఎగిరాడు. అతడు శరవేగంతో కదులుతూ నోటితో ఏవో శబ్దాలు చేస్తున్నాడు. అవి పూర్తయేసరికి నలుగురు వస్తాదులూ నేలమీద ఉన్నారు.
"సరదాతీరిందా?" అన్నాడు గోపీ.
వాళ్ళు జవాబిచ్చేలోగా పెద్దచప్పుడయింది. ఆ గదిగోడలో మరో ద్వారం వెలసింది. గోపీ ఆద్వారం గుండా బయటకు వచ్చారు. గోపీ వెనుకనే ద్వారం మాయమయింది.
అప్పుడు చూశాడు గోపీ! అతడి ఎదుట డీఐజీ చంద్రశేఖర్ నిలబడి ఉన్నాడు.
"నేననుకున్నకంటే చాలా ముందువచ్చావు-" అన్నాడు చంద్రశేఖర్.
గోపీ నవ్వి-"నేను హీరోని కదా!" అన్నాడు.
"అవును. ఈరోజునుంచీ నీ పేరు గోపీకాదు. హీరో?" అన్నాడు చంద్రశేఖర్. అతడి కనులలో ఏదో కొత్త వెలుగు.
7
ఒక చిన్న కుర్రాడు.....వాడికి ఎనిమిదేళ్ళుంటాయేమో.....వాడో యింట్లోకి వెళ్ళి-"రామంగారున్నారా?" అనడిగాడు.
రామం బయటకు వచ్చి-"ఎవర్నువ్వు?" అనడిగాడు.
"సుబ్బారావు మిమ్మల్ని అర్జంటుగా పార్కుకు రమ్మన్నాడు...." అన్నాడు ఆ కుర్రాడు.
"ఎందుకు?" అన్నాడు రామం
"ఏమో-అక్కడే చెబుతారుట...." అన్నాడా కుర్రాడు.
"సరే-" అన్నాడు రామం. అతడు లోపలకు వెళ్ళగానే ఆకుర్రాడు సుబ్బారావు ఇంటికి వెళ్ళాడు. శంకర్రావు పార్కుకు రమ్మంటున్నాడని సుబ్బారావుకు చెప్పాడు. శంకర్రావింటికి మురళి రమ్మంటున్నాడని చెప్పాడు.
మొత్తంమీద ఆ కుర్రాడి ధర్మమా అని అయిదుగురు మిత్రులూ కొంచెం కొంచెం వ్యవధిలో పార్కుకు చేరుకున్నారు. అందరూ ఒకచోటుకు చేరుకున్నాక ఒకరినొకరు పలకరించుకుని విషయం అర్ధం చేసుకునేందుకు కొంతసేపుపట్టింది.
"ఎవరో మనతో నాటకమాడేడు అన్నాడు రామం.
"కానీ ఎందుకు? ఈరోజు ఏప్రిల్ ఫస్టుకూడా కాదే!" అన్నాడు శంకర్రావు కంగారుగా.
అప్పుడు ఆ సమయంలో అక్కడ ఆ అయిదుగురే ఉన్నారు. వారిలా మాట్లాడుకుంటూండగా-"డియర్ ఫ్రెండ్స్-మిమ్మల్ని ఇక్కడికి రప్పించిన వాణ్ణి నేను-" అన్నమాటలు వినపడ్డాయి.
స్నేహితులు ఆ మాటలు వచ్చిన వైపు చూశారు.
అక్కడొక క్రోటన్సుమొక్కల గుబురు ఎత్తుగా ఉన్నది. అటువైపుగా మాటలు వస్తున్నవి. మిత్రులు అయిదుగురూ అటువైపుకు వెళ్ళారు.
అక్కడ గోపీ ఉన్నాడు. అతడు వారికి అభిముఖంగాలేడు. అయినప్పటికీ అతడి చేతిలో గోలీ ఆడుతున్నది. తన వెనుకనున్న అయిదుగురినీ చూసి-" రామం, సుబ్బారావు, శంకర్రావు, మురళి, మూర్తి-మొత్తం అందరూ వచ్చారన్నమాట-" అన్నాడు.
మిత్రులు ఆశ్చర్యంగా-"ఎవర్నువ్వు?" అన్నారు.
గోపీ చటుక్కున వెనుతిరిగి-"నన్ను గుర్తుపట్టారా?" అన్నాడు.
మురళి ఆశ్చర్యంగా-"గోపీ!" అన్నాడు.
"గోపీ కాదు-హీరో" అన్నాడు గోపీ.
సుబ్బారావు చిరాగ్గా-"మమ్మల్నెందుకు రప్పించావిక్కడికి?" అన్నాడు.
"మీరు నన్ను హీరో కమ్మని గోలపెడుతూండేవారు. మీకోరికను మన్నించినేనిప్పుడు హీరోనయ్యాను. కాబట్టి మీ సలాములందుకుని పోదామని వచ్చాను. త్వరత్వరగా నాకు సలాంచేసి వెళ్ళిపొండి...." అన్నాడు గోపీ.
"వాడ్డూయూమీన్!" అన్నాడు రామం.
"ఐమీన్ వాట్టేసే?" అన్నాడు గోపీ.
"నీకేమైనా పిచ్చెక్కిందా?" అన్నాడు మూర్తి.
"నాకు పిచ్చెక్కేలోగా సలాములు చేసిపొండి-" అన్నాడు గోపీ.
"గురూ-గురిడికి వైద్యం చేయాల్సొచ్చేలా ఉంది-" అన్నాడు రామం మిత్రులవంకచూసి కన్నుకొడుతూ.
గోపీ వాళ్ళను మాటలలో మరింత రెచ్చగొట్టాడు. వాళ్ళు రెచ్చిపోయారు. అతడి శక్తి సామర్ధ్యాలు తెలియక అతడిపై చేయి చేసుకోబోయారు అప్పుడు గోపీవారికి తన ప్రతాపం చూపించాడు.
"అయిదుగురూ అయిదుమూలలకు పడిపోయారు. గోపీ వారి మధ్య నవ్వుతూ నిలబడ్డాడు.
మిత్రులైదుగురూ అతికష్టంమీద లేచి కూర్చుని-" అంతామాయగా ఉంది. మేము చూస్తున్నది గోపీయేనా?" అన్నాడు ఏకకంఠంతో.
"గోపీకాదు-హీరో!" అన్నాడు గోపీ.
"మానుంచి ఏం కావాలి నీకు?" అన్నాడు శంకర్రావు భయంగా.
"మీసలాములు-"
"ఎందుకు?"
"ఒకప్పుడు హీరో కాలేదని నన్ను మీరు ఎగతాళి చేశారు. అందుకే కష్టపడి హీరోనయ్యాను. నేను హీరోనైతే ఎలాగుంటుందో మీకు తెలియాలిగదా...."
"నువ్వు హీరోవైతే నీ ప్రతాపం మామీదకాదు. ఫిరంగిపురం వెళ్ళి చూపించు-" అన్నాడు మురళి.
"ఫిరంగిపురం తప్పకుండా వెడతాను. ఎందుకంటే అది హీరో లుండేచోటు. నా ప్రతాపం అక్కడి వారిపై చూపించను. అక్కడివారిలో ఒకణ్ణి కావడానికి చూపిస్తాను. అదీ నా ఆశయం" -అన్నాడు గోపి.





