Home » VASUNDHARA » Trick Trick Trick
మిత్రులైదుగురూ అతడివంక భయం భయంగా చూశారు. తమకు తెలిసిన గోపీ సుమారు సంవత్సరంలో ఎంతలా మారిపోయాడు? ఏం జరిగిందతడికి? ఏదైనా దుష్టశక్తి ఇతడిని ఆవహించిందా? లేదా ఇతడే సమాజానికి దుష్టశక్తి కాబోతున్నాడా?
"తొందరగా సలాములుచేసి వెళ్ళండి. అవతల నాకు చాలా పనులున్నాయి-" అన్నాడు గోపీ.
మిత్రులు సందేహించలేదు ఒక్కరొక్కరే గోపీకి సలాములు చేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత గోపీ వారికి కనిపించలేదు కానీ గోపీ ఫిరంగిపురం గూండాలతో కలిసిపోయాడన్న పుకారు ఒకటి ఆ వీధిలో దుమారంలా లేచింది.
8
అక్కడ చాలా హడావిడిగా వుంది. వందలాది కార్మికులు ఇటికలను పెట్టెల్లో సర్దుతున్నారు. ఇసుకను బస్తాల్లోకి ఎక్కిస్తున్నారు. దూరంగా కొన్ని లారీలు సరుకుమోసుకుని పోవడానికి సిద్దంగా వున్నాయి.
"ఇసిక్కీ, ఇటికలకీ ఇంత హడావుడేమిటీ-" అన్నాడో కార్మికుడు తోటివాడితో.
"హడావుడంటే హడావుడే మరి- ఈ సరుకు అరబ్బు దేశాలకు వెడుతుంది. వాళ్ళు బోలెడు డబ్బిచ్చి కొంటారుట ఇవి-" అన్నాడు తోటివాడు.
"ఏం విదేశాలో-అక్కడ బొత్తిగా ఇసుకా,ఇటికలూ దొరక్కుండా ఉన్నాయన్నమాట. నీళ్ళైనా దొరుకుతాయో దొరకవో మరి!" అన్నాడింకో కార్మికుడు.
"అందుకే నేనంటాను. ఒరేయ్-నువ్వు వెయ్యి చెప్పు. లక్ష చెప్పు. అన్ని దేశాలకంటే మన దేశమే నయం-" అన్నాడో
ముసలి కార్మికుడు.
"ఏయ్-కబుర్లు కాదు. పనిమీద దృష్టి ఉంచండి. లోడింగ్ ఆలస్యమైపోతుంది-" అన్నాడు అజమాయిషీ చేస్తున్న వీరభద్రం.
పనివాళ్ళు కబుర్లు కట్టిపెట్టి నిశ్శబ్దంగా అయిపోయారు. అందుకు కారణం వీరభద్రం అజమాయిషీ కాదు. అసలు వీరభద్రం పనివాళ్ళను అజమాయిషీ చేయడానికే పనివాళ్ళ కబుర్లు కారణం కాదు.
అప్పుడే అక్కడ నాయుడు అడుగు పెట్టాడు.
వేటగాడిని చూసిన పక్షుల్లా, పులివాసన పసిగట్టిన దుప్పుల్లాఅందరూ నిశ్శబ్దమైపోయారు. ఎందుకంటే నాయుడు క్రమశిక్షణలేని వారిని సహించలేడు. అతడికి కోపంవస్తే ఎలా ఉంటుందో చాలామందికి తెలుసు. రోజంతా అధార్టీచేసినా భద్రం సాధించలేనిదీ-ఒక్కక్షణం అక్కడ నిలబడి నాయుడు సాధించగల్గుతాడు.
"వీరభద్రం-ఇలారా-" అన్నాడు నాయుడు. అతడి నోటివెంట మాట ఇలా వెలువడేసరికి అలా అతడిముందుకు వచ్చాడు వీరభద్రం.
"అన్నీ సక్రమంగా జరిగిపోతున్నాయా?"
"ఎస్ బాస్!"
"లోడింగులో ఇబ్బందులేవీ లేవు గదా-"
"ఇప్పటికి పది లారీలు వెళ్ళాయి బాస్ ఈ రోజు...."
"వెరీ గుడ్...." అని- "మరి అన్ లోడింగ్ సంగతి...."
"అన్నింటికీ ఏర్పాట్లు జరిగిపోయాయి బాస్..."
"పోలీసులు, కస్టమ్సు..."
వీరభద్రం వినయంగా- "అందవలసిన విధంగా అందరికీ వారి వారి వాటాలు అందుతున్నాయి బాస్...."
"వెరీ వెరీ గుడ్.....మరి నిజాయితీ పరుడైన వాడెవడూ తగల్లేదా అందరూ వాటాలుచ్చుకుని ఊరుకుంటున్నారా?"
"లేదు బాస్.....కొందరు తగిలారు. వాళ్ళుఇసుక బస్తాల్ని చెక్ చేశారు. ఇటుకల్ని విరిచి చూశారు. మన శాంప్లింగ్ తిరుగులేనిదీ-ఎక్కడా ఎవరికీ దొరకం-"
నాయుడు భద్రంవంక తమాషాగాచూసి- "ఇలాంటి పనుల్లో నెగ్గుకు రావాలంటే కాన్ఫిడెన్సుండాలి. కానీ ఓవర్ కాన్ఫిడెన్సు పనికిరాదు. నీకున్నది ఓవర్ కాన్ఫిడెన్సయితే మాత్రం నీ పనిఓవర్-అదిగుర్తుంచుకో-" అన్నారు.
వీరభద్రం మాట్లాడకుండా తలవంచుకున్నాడు. నాయుడు మళ్ళీ ఏదో అనబోతూండగా ఒక వ్యక్తి అక్కడకు వచ్చి- "బాస్! మీ కోసం సతీష్ వచ్చాడు-" అన్నాడు. నాయుడి ముఖం అదొకలాగై పోయింది.
"ఎలాగున్నాడు?"
"చాలా కోపంగా కనబడుతున్నాడు బాస్!"
"నా దగ్గరకు కోపంగా వస్తాడా-తన కోపమే తన శత్రువు అని పాపం- వాడికి తెలియదు-సరే పద.....కారు సిద్దంగా వుందా?" అన్నాడు నాయుడు.
"ఎస్ బాస్....'
"పని జాగ్రత్తగా చూసుకో-" అని వీరభద్రాన్ని హెచ్చరించినాయుడు అక్కణ్ణించి కదిలి కారెక్కాడు. కారు రివ్వున చూసుకునిపోయి ఓ యింటిముందాగింది నాయుడు లోపలకు ప్రవేశించగానే గదిలో అటూ ఇటూ పచార్లుచేస్తున్న ఓ యువకుడు అతడివంక తీవ్రంగా చూశాడు.
"ఓ-సతీష్ బాబా-ఏమిటలా చురుగ్గా చూస్తున్నావ్? చుక్కేసుకుని వచ్చావా?" అన్నాడు నాయుడు.
"లేదు-నీకు చుక్కలు చూపిద్దామని....."
"చుక్కలు చూడడం నాకు కొత్తేంకాదు కానీ - ఒకళ్ళు చూపిస్తే చుక్కలుచూసే రకం కాదు నేను.....అతితెలివిమాటలు తగ్గించి వచ్చినపని చెప్పు...."
సతీష్-చటుక్కున జేబులోంచి పిస్టల్ తీసి- "నువ్వు డబ్బిస్తావన్న నమ్మకం నాకులేదు. అందుకే నీ ప్రాణాలు తీసుకుని పోదామనివచ్చాను-" అన్నాడు.
నాయుడు తమాషాగా నవ్వి- "నాయుడి గదిలో నాయుణ్ణి చంపాలను కుంటున్నావా-ఇది కాన్ఫిడెన్సా! ఓవర్ కాన్ఫిడెన్సయితే నీ పని ఓవర్-" అన్నాడు.
"అన్నింటికీ సిద్దపడే వచ్చాను....." అన్నాడు సతీష్.
"నా యింటికి నువ్వు అన్నింటికీ సిద్దపడి వచ్చావూ - నా యింట్లో నేను దేనికీ సిద్దపడి లేనూ-దించవయ్యా-ముందా పిస్తోలు దించు. చూస్తేనే భయమేస్తోంది-" అన్నాడు నాయుడు వెటకారంగా.
"నీ కబుర్లకు నా బుద్ది మారదు. ఈ రోజు నా చేతిలో నీ చావు తప్పదు-"





