Home » VASUNDHARA » Trick Trick Trick
గురి విషయం అటుంచితే గోపీకి కత్తినిపట్టడంలో ప్రత్యేకమైన శిక్షలు ఇవ్వబడింది. ముందు గోపీ చేతికి ప్రత్యేకమైన గ్లోవ్స్ తొడుక్కుని ఈ విద్యను అభ్యసించాడు. కత్తిని ఎటునుంచి విసిరినా, ఎంత దూరంనుంచి విసిరినా, ఎంత ఒడుపుగా విసిరినా ఒడుపుగా చేత్తో కత్తిని పట్టుకోగలగాలి, చేతికి గాయం కాకుండా పిడిని మాత్రమే పట్టుకోగలగాలి.
ఒకరోజంతా శ్రమించినాక గోపీ తనకా విద్యవచ్చినట్లే భావించాడు. అప్పుడు ఋషి-"నీకు బాగా నమ్మకం కుదిరితే గ్లోవ్స్ లేకుండా ప్రయత్నిద్దాం-" అన్నాడు.
గ్లోవ్స్ లేకుండా అనగానే గోపీకి భయంవేసింది. ఋషి అతడి ముఖంలోని భయాన్ని కనిపెట్టి- "సరే రేపుకూడా మరికాసేపు గ్లోవ్స్ తోనే ప్రయత్నిద్దాం-" అన్నాడు.
మర్నాడు ఓ గంటసేపు ప్రాక్టీసు జరిగాక ఋషి అతడిని సమీపించి-"ఏదీ నీ చేతులు చూపు...." అన్నాడు.
గోపీ అప్పుడు తన చేతులవంక చూసుకుని ఆశ్చర్యపోయాడు రెండుచేతులూ రక్తసిక్తాలై ఉన్నవి. అతడు ఆశ్చర్యంగా- "ఏమయింది నాకు?" అన్నాడు. అప్పుడే అతడి చేతుల్లో మంటపుట్టసాగింది.
ఋషినవ్వి- "ఒడ్డున కూర్చుని ఎంత నేర్చుకున్నా- ఈత రావాలంటే నీటిలోకి దిగక తప్పదు. నీ చేతికి గ్లోవ్స్ ఉండగా ఈ విద్య పట్టుబడదు. గ్లోవ్స్ ఉన్నాయన్న అశ్రద్దలో నువ్వు కత్తిని పట్టడంలో పిడినే పట్టాలను కోవడంలేదు. ఈరోజు నేను నీకిచ్చిన గ్లోవ్స్ పలుచటివి-" అన్నాడు.
గోపీకి ఋషి చెప్పిన మాటల్లో నిజం కనబడింది.
"నీచేతికి గాయాలు మానేక మళ్ళీ ప్రారంభిద్ధాం-" అన్నాడు ఋషి.
"వద్దుగురూ! ఇలాగే కొనసాగిద్దాం-" అన్నాడు గోపీ.
అతడిలో పట్టుదల వచ్చింది. చేతికి తగిలిన గాయాలకు మందులు పూసుకుని తన ప్రాక్టీసు కొనసాగించాడు. ఆరోజులోనే అతడెటువంటి ప్రగతిని సాధించాలంటే అటుపైన అతడి చేతికున్న గాయాలు మానడమే తప్ప కొత్తగాయం ఒక్కటికూడా కాలేదు.
ఈ విద్య ముగిసేక గోపీ కొన్ని ట్రిక్స్ తెలుసుకున్నాడు.
అతడిప్పుడు ఊపిరిబంధించి కొద్దిక్షణాలసేపు శవంలాపడి ఉండగలడు, కుక్క, పిల్లి. ఆవు, గేదె, గాడిదవంటి సామాన్యజంతువులవీ చిలక, కాకి, పిచికవంటి పక్షులవీ అరుపులను అనుకరించడం నేర్చుకున్నాడు. ఆ అరుపులను పలికించడంలో ఒక ప్రత్యేకత ఉన్నది. గోపీ తనే అరిచినా అది ఏ మూలనుంచో వచ్చిన అనుభూతి కలిగిస్తాడు. ఎదుటి వాడిని చూసి కుక్కలా మొరిగితే- అది తన పక్కనే ఉన్న కుక్క మొరిగిందని ఎదుటివాడికి అనుభూతి కలుగుతుంది. టేపు రికార్డరు సహాయంతో ఈ విద్యను గోపీ సుమారు వారంరోజులపాటు శ్రమపడి సాధించాడు.
ఇలా ఎన్నో విద్యలు నేర్చుకున్నాక ఋషి ఒకరోజున అతడితో ఇప్పుడు నీ ఏకాగ్రత తారస్థాయిని చేరుకున్నది. ఇప్పుడు నీ వళ్ళంతా కళ్ళుచేయగల కొత్త విద్యను నేర్చుకునేందుకు నీ మెదడు సన్నద్ధమై ఉన్నది-" అన్నాడు.
"వళ్ళంతా కళ్ళా?" అన్నాడు గోపీ ఆశ్చర్యంగా.
అవును అంటూ ఋషి అతడినొక పెద్ద హాల్లోకి తీసుకునివెళ్ళాడు. ఆ హాలు మధ్యలో ఒక పెద్దగోళం ఉన్నది. ఆ గోళం నిండుగా అద్దాలు బిగించబడి ఉన్నవి. హాల్లోకి ఎవరువచ్చినా ఆ అద్దాల్లో ప్రతిబింబిస్తారు.
"నీవు నిలబడి ఈ గోళం వంకనే చూస్తూండాలి. హాల్లోకి ఎవరడుగుపెట్టినా వారిపైకి గురిపెట్టి కత్తిని విసరాలి-" అన్నాడు ఋషి.
అద్దంలోని ప్రతిబింబాన్ని చూసి అర్ధం చేసుకుని గురి చూడడం అలవాటు చేసుకునేందుకు గోపీకి ఒక గంట పట్టింది. హాల్లోకి అడుగుపెట్టే మనుషులు ప్రత్యేకమైన కవచాలు ధరించి ఉన్నారు. అతడికి గురికుదిరాక ఒక్కటీ తప్పలేదు.
ఋషి అతడిని మెచ్చుకుని-"ఇదే ఏకాగ్రత నిత్యంచూపించాలి" అన్నాడు.
"ఇదేదో కష్టమైన విద్య అనుకున్నాను-" అన్నాడు గోపీ నవ్వుతూ.
"అప్పుడే ఏమయింది? ఇది నీ విద్యలో మొదటి అడుగు మాత్రమే-ఇంకా చాలా ఉంది. వళ్ళంతా కళ్ళు కావాలంటే అంత సులభంకాదు-" అన్నాడు ఋషి నవ్వుతూ.
"అయితే రెండో అడుగువేయడానికి సిద్దంగా ఉన్నాను నేను-" అన్నాడు గోపీ.
అప్పుడు హాలుమధ్యనున్న పెద్దగోళం స్థానే కాస్త చిన్న గోళం ఉంచబడింది. గోపీ ఆ గోళం ముందు నిలబడ్డాడు. ఇప్పుడు ప్రతిబింబాల సైజు చిన్నవై పోయాయి.
తను నేర్చుకోబోతున్న విద్య ఎటువంటిదో గోపీకి అర్ధమైపోయింది. అతడు దృష్టినంతా ఆ గోళంవైపే కేంద్రీకరించాడు.
గోపీ శిక్షణ కొనసాగుతున్నది. క్రమంగా గోళంసైజు చిన్నదైపోతున్నది. చివరకు ఆ గోళం చిన్న గోలీ సైజుకు వెచ్చింది. గోలీ గోపీ చేతుల్లో! అతడు హాలుకు మధ్యగా!
గోపీ ఆ గోలీని అరచేతిలో ఉంచుకుని ఎగురవేస్తూ హాల్లోకి తన వెనుకనుంచి వచ్చేవారందరినీ గమనించగలగడమే కాక వారిని గురిచూసి కొట్టగలుగుతున్నాడు.
"మిష్టర్ గోపీ-ఇప్పుడు నీకు వళ్ళంతా కళ్ళే!" అన్నాడు ఋషి.
"అంతా మీ చలవ...." అన్నాడు గోపీ.
"అతి తక్కువ వ్యవధిలో నువ్విన్ని విద్యలు నేర్చుకోగలిగావంటే నాకు చాలా గర్వంగానూ, సంతోషంగానూ, ఆశ్చర్యంగానూ ఉంది. ఇప్పుడు నువ్వు కనీసం ఆరునెలలపాటు-మోటార్ సైకిల్ తో ప్రారంభించి విమానంవరకూ అన్ని వాహనాలూ నడవడం నేర్చుకోవాలి. ఆ ప్రయాణసాధనాల గురించి కూలంకషంగా తెలుసుకోవాలి. అని తెలుసుకుంటూ-ఇంతకాలం నువ్వు నేర్చుకున్న విద్యలన్నింటినీ అభ్యసించడం కూడా మరిచిపోకూడదు-" అన్నాడు ఋషి.
గోపీ ఉత్సాహంగా తల ఊపాడు. అక్కడ ఆరునెలలూ అతడికి ఆరురోజుల్లా గడిచిపోయాయి. ఒకరోజున ఋషి అతడిని తన గదిలోనికి తీసుకునివెళ్ళి "నీ తపస్సు పూర్తయింది. ఇప్పుడు నీకెక్కడా ఎదురులేదు-" అన్నాడు.
"ఆ నమ్మకం నాకూ కుదిరింది-" అన్నాడు గోపీ.





