Home » VASUNDHARA » Trick Trick Trick
"ఇప్పుడు మా డ్యూటీ ఏమిటో తెలుసా? నువ్వు మాతో ఫైటింగ్ చేయడానికి ఒప్పుకునేదాకా నిన్ను తన్నడం...."
గోపీ కంగారుగా- "ఒప్పుకున్నా అదే జరుగుతుంది కదా-" అన్నాడు.
"ఒప్పుకుంటే నిన్ను తపస్సుకు పంపిస్తాం?"
"అంటే?"
"ఫైటింగ్ లో నీకు శిక్షణ...."
తాత్కాలికంగా ఆ వస్తాదుల బారినుంచి రక్షించుకోవడం కోసం గోపీ వెంటనే ఒప్పుకున్నాడు.
"శబాష్!" అన్నాడో వస్తాదు. వెంటనే పెద్ద చప్పుడయింది. ఆ గదిగోడల్లో ఒకదానికి ద్వారం ఏర్పడింది.
"అందులోంచి వెళ్ళు-" అన్నాడు వస్తాదు.
గోపీ బెరుకు బెరుకుగా ఆగదిలోంచి మరో గదిలోకి వెళ్ళాడు. అతడి వెనుకనే పెద్ద చప్పుడుతో గోడలోని ద్వారం-మాయమైంది.
* * * *
ఆగదిలో ఒక కుర్చీ, కుర్చీలో అయిదడుగుల సన్నని వ్యక్తి కూర్చున్నాడు. అతడు గోపీని చూస్తూనే చేత్తో సైగచేసి దగ్గరకు రమ్మన్నాడు.
గోపీ అతడిని సమీపించగానే అతడు నెమ్మదిగా-"నాకు కాళ్ళు నొచ్చుతున్నాయిరా-కాస్త నెమ్మదిగా నొక్కుతావా?" అన్నాడు.
గోపీ ముందు తెల్లబోయాడు. తరువాత తల అడ్డంగా ఊపాడు.
అతడు కోపంగా-"చచ్చు ఘటానివి. ఈ పనీ చేయకపోతే దేనికి పనికొస్తావురా?" అన్నాడు.
గోపీ అతడిని ఒక్క క్షణం పరిశీలనగా చూసి మనసులో బలాబలాలు అంచనావేసి చటుక్కున చేయి జాపి కుర్చీలోంచి బలంగాలాగాడు. అతడు నేలమీద పడిపోతూ- "నన్నెందుకు లాగావురా?" అన్నాడు.
"మర్యాదిచ్చి మర్యాదపుచ్చుకో-" అన్నాడు గోపీ.
"సమ ఉజ్జీలకే తప్ప మర్యాద ఇవ్వను నేను-" అన్నాడతను.
"నువ్వు నాకు సమ ఉజ్జీవెలాగూ కాలేవు. మర్యాదివ్వకపోతే మాత్రం నిన్ను చావదంతాను- అన్నాడు గోపీ.
సన్నపాటి వ్యక్తి ఇంకా లేచే ప్రయత్నంకూడా చేయలేదు-"నన్ను తన్నాలన్న నీకోరిక మంచిదే! కానీ నాతో కనీసం ఒక్కక్షణం పోరాడాలన్నా అందుకు నువ్వు నానుంచి నాలుగురోజుల శిక్షణ పొందాలి. నా శిక్షణలేకుండా నాతో ఎలా పోరాడుతావురా వెర్రినాయనా-" అన్నాడతను.
గోపీ అతడిని సమీపించి- "నీకు వాగుడెక్కువలాగుంది. నీకు మర్యాదగా ఎలా మాట్లాడాలో శిక్షణ ఇస్తాను. లేచి కూర్చో!" అన్నాడు.
"డైలాగు బాగుంది. శభాష్!" అన్నాడు సన్నపాటి వ్యక్తి.
వెంటనే పెద్ద చప్పుడై గోడలో ఇందాకటి ద్వారం మళ్ళీవెలిసింది. అందులోంచి నలుగురు వస్తాదులూలోపలకు వచ్చారు.
సన్నపాటివ్యక్తి చటుక్కున లేచాడు. మెరుపు వేగంతో గాలిలోకి ఎగిరాడు. ఒక్కక్షణం తనకనుల ముందు ఏమీ జరుగుతున్నదీ గోపీకి తెలియలేదు. కానీ అతడిచెవులకు ఏవేవో చప్పుళ్ళు వినిపించాయి. ఆ చప్పుళ్ళు ఆగేసరికి నలుగురు వస్తాదులూ నేలమీద పడి ఉన్నారు. సన్నపాటివ్యక్తి వారి మధ్యన నిలబడి ఉన్నాడు.
"ఫూల్స్! నా అనుమతి తీసుకోకుండా నా గదిలోనికి వస్తారా - ఇంకెప్పుడూ ఇలా చేయకండి-" అన్నాడు సన్నపాటివ్యక్తి.
వస్తాదులు నలుగురూ అతికష్టం మీద నెమ్మదిగా నడుచుకుంటూ తమగదిలోకి వెళ్ళిపోయారు. అప్పుడు సన్నపాటి వ్యక్తి గోపీవంక తిరిగి "ఇప్పుడు చెప్పు నువ్వు నా శిష్యుడివౌతావా, నేను నీ శిష్యుణ్ణికావాలా?" అన్నాడు.
గోపీ చటుక్కున అతణ్ణి సమీపించి- "మన్నించండి గురూ-నేను మీ శిష్యుడిని అవుతాను. ఆ వస్తాదుల్నెలా మట్టికరిపించాలో నాకుచెప్పండి" అన్నాడు.
"అందుకు తపస్సు అవసరం. నాతో వస్తావా?" అన్నాడావ్యక్తి.
"తప్పకుండా వస్తాను. ఇంతకీ తమరెవరు స్వామీ!" అన్నాడు గోపీ.
"నన్ను ఋషి అంటారు-" అన్నాడావ్యక్తి.
6
ఋషి కారణంగా గోపీ మానసికంగానూ, శారీరకంగానూ శిక్షణకుసిద్దపడ్డాడు. యుద్ధవిద్యలు ఎవరైనా సాధించవచ్చుననీ, వాటి సాయంతో ఎదుటివారు ఎంత బలాధ్యులైనా ఎదిరించి గెలువవచ్చుననీ, లక్ష్యం ఏకాగ్రతల కారణంగా మనిషి యుద్ద విద్యలలో ప్రత్యేకమైన నేర్పును సంపాదించగలడనీ గోపీకి బాగా నమ్మకం కుదిరింది. ఋషిమాట అతడికి వేదవాక్కు అయింది.
ముందు ఏ ఆయుధాలూ ఉపయోగించకుండా చేతులూ, కాళ్ళనూ మాత్రం ఉపయోగించే కరాటే విద్యలోని కొన్ని సులువులు. ప్రాధమిక సూత్రాలు నేర్చుకున్నాడు. అటుపైన కుస్తీపట్లు తెలుసుకున్నాడు. ఇంకాబాక్సింగ్ వగైరాలు.....ఆత్మరక్షణ, ప్రత్యర్ధిపై దెబ్బతీయడం-ఈ రెండూ ప్రధానాంశాలుగా-ఆ విద్యలనెలా ఉపయోగించాలో అతడుతెలుసుకున్నాడు ఆరంభంలో అతడికి కాస్త కస్టమనిపించినా ఏకాగ్రత కుదిరేసరికి-మూడు మాసాల్లో అతడొక స్థాయిని చేరుకోగలిగాడు.
"సైన్సు తెలిసినవాడు బాంబు కనిపెట్టాడు. కానీ బాంబు తయారుచేయడానికి సైన్సు తెలియక్కర్లేదు. యుద్ద విద్యలనుకళలుగా అభ్యసించేవారుంటారు. వారిలో నువ్వు పోటీపడలేవు. కానీ ఆవిద్యలను ప్రాక్టికల్ గా ఎలా ఉపయోగించుకోవాలో తెలిస్తే-నిజజీవితంలో నువ్వు వారినిమించిన వాడివౌతావు-" అన్నాడు ఋషి.
ఆ కారణంగానే తనకు స్వల్పకాలంలో చాలా సులువుగా పట్టుబడ్డాయని గోపీ అనుకున్నాడు.
అటుపైన షూటింగు : అప్పటికి బాగా ఏకాగ్రత కుదిరి ఉండడం వల్ల గోపీ వారంరోజుల్లోనే కొంత ప్రగతి సాధించి-రెండువారాలు గడిచేసరికి అందులో పూర్తిగా నిష్ణాతుడైనాడు. ముందు పెద్ద పెద్ద టార్జెట్స్ తో ప్రారంభించి చివరకు గాలిలో వ్రేలాడే గోలీలను కూడా దూరంనుంచి షూట్ చేయగల సామర్ధ్యం సంపాదించాడు. అటుపైన కనులు మూసుకుని శబ్దాన్నిబట్టి గురిచేయడమూ, వేగంగా కదిలేవస్తువులను గురిచేయడమూ అభ్యసించాడు.





