Home » VASUNDHARA » ఆపరేషన్ మేడిపండు


    సత్యం తన బల్లమీద నుంచి రెండు లీటర్ల బీకరోకటి తీశాడు. చెత్తో పట్టుకుని "ఇది పగిలినా ఏమీ కాదనటానికి ఒక్కటే రుజువు. ఇది నా పేరుమీద వున్న బీకరు అంటూ చటుక్కున దన్ని చేతిలోంచి జారవిడిచాడు.
    బీకరు నేలమీద  పడి ముక్కలయింది.
    రాజుకు గుండె పగిలినట్లయింది. సత్యం మాత్రం నవ్వుతూ, "కొట్టకదా-నీకింకా అలాగే వుంటుంది" అన్నాడు.
    గాజుసామాను విషయంలో సత్యానికి స్వేచ్చ వుందని రాజుకు అర్థమయింది నమ్మకం కూడా కుదిరింది. కానీ సత్యం చెప్పిన పద్ధతి అతడికి నచ్చలేదు. 'ఈ స్వేచ్చను నేను మాత్రం ఈ విధంగా  ఉపయోగించుకొను' అనుకున్నాడతడు.
    ఇద్దరూ లాబొరేటరీ అంతా తిరిగారు.సత్యం  రాజుకు స్టోర్సు, అడ్మినిస్ట్రేటివ్, అకౌంట్ సెక్షన్లు కూడా చూపించాడు.
    అయితే రాజును విపరీతంగా ఆకర్షించింది మాత్రం ఇన్ స్ట్రుమెంట్స్ సెక్షన్. ఆ విభాగం రీసెర్చి సైంటిస్టుల  కలలపంటలా వుంది. అక్కడ ఒక్కొక్కటి కోటిరూపాయలు విలువ చేసే పరికరాలు కూడా వున్నాయి.
    'దియా మామూలు సంస్థ కాదు. సైంటిస్టుల నందనవనం' అనుకున్నాడు.
                                                                *    *    *
    దియాలో తిరుగుతూనే రాజు తనకు పరిచయమవుతున్నవారందర్నీ శ్రద్దగా  గమనిస్తున్నాడు. వారిలో  అతడికి నాయుడమ్మ భవనం  సైంటిస్టు కనబడలేదు. అతడిగురించి  ఎలా ఆరాతీయాలా అని ఆలోచిస్తూండగా అతడికో అనుమానం  కూడా వచ్చింది.
    ఆ మనిషి నిజంగా దియాలో సైంటిస్టేనా? లేక తనకు  అబద్దం చెప్పాడా?
    సిబిఐ సాయంతో తనిక్కడ తడుగుపెట్టాడు. తనిక్కడ ఏమీ సాధించలేకపోతే ఈ అవకాశం  ఎంతోకాలం వుండకపోవచ్చు.
    రీసెర్చి చేసి ఏదో సాధించాలని తన కోరిక. సిబిఐ పరిశోధనలు తనవల్లకాదు చేతకాని పని చేస ఎవరిని మెప్పించగలడు? అందువల్ల వచ్చిన ఈ అవకాశాన్నుపయోగించుకుని రీసెర్చిలో ఏదైనా సాధిస్తే  అది తాన్  భావిజీవితానికి బాట వేస్తుంది.
    ఏం సాధించినా తనకున్న గడువు తక్కువ వీలైనంత త్వరగా ప్రతిభ చూపాలి.
    ప్రొఫెసర్ అజేయ్ ప్రతిభావంతులును ప్రోత్సహిస్తాడు. ఆయన ప్రస్తుతంఅపహరించాబడినా-తొందరలోనే  బయటకు వస్తాడు. అప్పుడు  తన ప్రతిభను గుర్తిస్తాడు.అందుకు.
    అజేయ్ తన ప్రతిభను గుర్తించే సబ్జక్టు ఏదైనా తీసుకోవాలి!
    రాజు బాగా ఆలోచించాడు. అతడు చివరకు-అజేయ్ రీసెర్చి స్కాలర్స్  ను కలుసుకుంటే ఆయన దృష్టిలో ఏయే ఫీల్ద్సున్నాయో తెలుస్తాయి- అనుకున్నాడు.
    అతడు సత్యానికీ విషయం చెప్పగానే-
    "అయితే ముత్యాలమ్మను కలుసుకో....అజేయ్ కి పెట్" అన్నాడు
    "పెట్-అంటే!?"
    "తెలుగులో చెప్పనా-పెట్ట!" అన్నాడు సత్యం కన్నుకొడుతూ.
    ఒక మాట చెప్పడానికి వందరూపాయల బీకర్ని బద్దలుకొట్టిన సత్యం సంస్కారంపై రాజుకు అంతగా  గురి కుదలేదు. అతడా మాట పట్టించుకోకుండా, నేనాయన స్కాలర్స్ నందర్నీ ఒకచోట కలుసుకుని మాట్లాడతాను. రోజూ వాళ్లే సమయంలో ఎక్కడ కలుసుకుంటూంటారు?" అన్నాడు.
    "రీసెర్చిస్కాలర్స్ ఒకరికొకరు కలుసుకుని మాట్లాడుకోవటమా- ఈ లాబోరిటరీలో సైంటిస్టులే ఒకరితొ ఒకరు మాట్లాడుకోరు" అన్నాడు సత్యం నవ్వుతూ.
    'పరిచయంలోనే ఇలాంటివాడు దొరికాడమిటి?' అనుకున్నాడు రాజు. ప్రతి విషయానికీ బొమ్మా బొరుసూ వుంటుంది. వెలుగూ నీడా వుంటాయి. సత్యం బోరుసునూ, నీడనూ మాత్రమే చూసే టైపులా వున్నాడు.
    "మరి మీతో చాలామంది మాట్లాడారే" అన్నాడు రాజు వాదనకు దిగుతూ.
    "నేను ప్రొఫెసర్ కు టెక్నికల్ సెక్రటరినీ-అందుకని తప్పదు"
    "ఓహ్"అన్నాడు రాజు. దియాలో టెక్నికల్ వ్యవహారాలు చూడ్డానికి అజేయ్ పెట్టుకున్న సెక్రటరీ సత్యం. అంటే అతడికి అజేయ్ గురించి చాలా తెలిసేవుండాలి.
    "అయితే ప్రొఫెసర్ కిడ్నాప్ కు కారణం మీకు  తెలిసేవుండాలి"
    సత్యం నవ్వి. "మా సంబంధం ఆఫీసులో మాత్రమే! ఆయన ఆఫీసులో కిడ్నాప్ లేదు.ఆఫీసు కిడ్నాప్ కాలేదు" అన్నాడు.
    'అమ్మో-టెక్నికల్ పాయింటు చెబుతున్నాడు' అనుకుని-"మనదేశంలో కిడ్నాపైన మొదటి సైంటిస్టు ప్రొఫెసర్" అన్నాడు రాజు.
    "కాదు" అన్నాడు సత్యం.
    "అయితే-ఇంతకుముందు ఎవరు?" అన్నాడు రాజు కుతూహలంగా.
    "నాకు తెలిసి ఎవరూ లేరు"
    "అయితే నేనన్నది కాదన్నారేం?"
    "నువ్వేమన్నావో ఆలోచించుకో-నీకే అర్థమవుతుంది"
    రాజు ఆలోచించుకున్నాడు. కానీ అర్థంకాలేదు. ఇక ఆలోచించలేక, "నా రీసెర్చికి నేను ఎవర్ని కలుసుకుని మాట్లాడాలో  సలహా  ఇవ్వండి" అన్నాడు .
    "ముత్యాలమ్మది-ది మోస్ట్ బ్రిలియంట్...."
    రాజుకు ఆడపిల్లను కలుసుకోవడం ఇష్టంలేదు. అందుకని ఇంకెవరి పేరైన చెప్పమన్నాడు.
    "ఎవరు నీకు సలహా ఇచ్చినా-ఆ తర్వాత  ఇబ్బందుల్లో పడతావు. నా మాట విని  ముత్యాలమ్మను కలుసుకుని మాట్లాడు. ప్రొఫెసర్ ఉగ్రనరసింహావతారమైనప్పుడు అంతా ఆ చెంచులక్ష్మినే ఆశ్రయిస్తారు...." యథాలాపంగా అన్నాడు సత్యం. రాజుకి తరహ సంభాషణ నచ్చలేదు. అతడు ముత్యాలమ్మను కలుసుకోవాలనుకున్నాడు.
                                 *    *    *
    బిల్డింగ్ రెండోఫ్లోర్లో తొమ్మిదో నెంబరు గది తలుపు తట్టాడు రాజు. తర్వాత కొద్దిగా తోశాడు.
    "ఎస్-కమిన్" తియ్యని గొంతు వినిపించింది.
    రాజు ఆ గదిలో అడుగుపెట్టాడు.
    చిన్న గది. ఒక గోడవారగా ప్రయోగాల బల్ల వుంది. బల్లమీద ప్రయోగాలకు లాబొరేటరీ వున్న సదుపాయాలన్నీ వున్నాయి. ఆ పక్కనే వాష్ బేసిన్.
    గోడకు ఇంకోపక్కన ఒక చిన్న  టేబిల్ వెనుక కుర్చీలో కూర్చుని వుంది ముత్యాలమ్మ ఆమె పక్కన అద్దాల బీరువా ఒకటి పుస్తకాలతో నిండివుంది.
    ముత్యాలమ్మ వయసు ఇరవైకీ  పాతిక్కీ మధ్యలో వుంటుంది. మనిషి మెరుపుతీగల  వుంది. దియాలో అంత అందమైన అమ్మాయిని రాజు ఊహించలేదు.
    "నాపేరు రాజు-కొత్తగా చేరాను-రీసెర్చికి-అజేయ్ వద్ద...."
    "యూ మీన్ ప్రొఫెసర్  అజేయ్ సర్ ...." అంది ముత్యాలమ్మ.
    ఆమె తనను సవరించడానికే ఆ మాట అన్నట్లు  గ్రహించాడతడు.
    "అవును-అజేయ్ సర్ వద్ద ...." అన్నాడు రాజు.
    ముత్యాలమ్మ తృప్తిగా  తలాడించి "ప్లీజ్ కమిన్ అండ్ సిట్ డౌన్" అంది.
    రాజు వెళ్లి ఆమె ముందు కూర్చుని, "మీరు  తెలుగే కదా" అన్నాడు.
    ఆమె నవ్వి, "నేను తెలుగే-నన్ను మీరు అనక్కర్లేదు. నువ్వు అను. నేను నిన్న లా అంటాను" అంది.
    "కానీ మనం అపరిచితులం"
    "అపరిచితులమైనా మనం కలిసి పనిచేయబోతున్నాం. అందువల్లపలకరింపులోనే దూరముండడం మంచిది కాదు. అదీకాక మనం మనం మీరనుకుంటే అజేయ్  సర్ ని మీరనడంలో ప్రత్యేకత వుండదుకదా" అని మనోహారంగా నవ్వింది ముత్యాలమ్మ.
    రాజుకా నవ్వు ఎంతో ఆహ్లాదంగా అనిపించింది. అజేయ్  అదే అజేయ్  దియాలో చాలా ఆహ్లాదకరమైన వాతావరణం  సృష్టించాడు. హేట్సాఫ్ టూ హిమ్!
    "వాట్ కెనై డూ ఫర్వూ" అంది ముత్యాలమ్మ అతిడ్ మౌనాన్ని  భంగపరుస్తూ.
    రాజు తను వచ్చిన పని  చెప్పాడు.
    "నీ గురించి సర్ ఒకసారి చెప్పారు. అయితే  అపాయింట్ మెంట్ ఆర్డరు పుంపుతున్నట్లు తెలియదు నాకు. నేను చేరాక ఇంతవరకూ నాకు తెలియకుండా ఈ  సెక్షన్లో ఎవరికీ అపాయింట్ మెంట్ ఆర్డరు వెళ్ళాలేదు. సర్ లేని సమయంలో ఆయన ఎవరైనా  చేరడం కూడా ఇదే ప్రథమం. కాస్త ఆశ్చర్యమే....." అంది ముత్యాలమ్మ.
    సిబిఐ గురించి తెలుసు కాబట్టి రాజుకు ఆశ్చర్యం లేదు అయినా ఆ విషయం చెప్పక, "సర్ కిడ్నాప్ కావడం మాత్రం-ఇంకా ఆశ్చర్యం కదూ" అన్నాడు.
    "ఈ దేశంలో ప్రతిభావంతులకు రక్షణ లేదు" అని నిట్టూర్చింది ముత్యాలమ్మ.
    "సర్  కిడ్నాప్ కావడానికి నీకు కారణం తెలుసా?" అన్నాడు రాజు కుతూహలంగా.
    "చెప్పానుగా-అదే"
    "ఆ విషయం సర్  కిడ్నాపవడానికి ముందే తెలుసా నీకు?"
    "తెలుసు-ఏం?"
    "అయితే సర్ దగ్గర రీసెర్చికెందుకు చేరావు?" అన్నాడు రాజు.
    "నువ్వెందుకు చేరావిప్పుడు?" ఎదురు ప్రశ్న వేసింది ముత్యాలమ్మ.
    "ప్రతిభావంతులకు రక్షణ లేని దేశమిది అని నాకు  తెలియదు"
    "అయితే?"
    "సర్ దగ్గర చేరితే మనమూ  ప్రతిభావంతులంఅవుతామనుకున్నాను. కానీ అప్పుడు మనకూ రక్షణవుండదు  అన్న విషయం నాకిప్పుడుకదా తెలిసింది....."
    "ప్రతిభావంతులకు రక్షణ లేదంటే  నీకర్థమైనదిదా?" అందామె.
    "మరేమిటి?"
    "ఆలోచించు- నీకే అర్థమవుతుంది"
    రాజు ఆలోచించాడు. నీకు అర్థమైతీరాలి"
    రాజుకు అర్థంకాలేదుకానీ ఆడపిల్ల ముందు ఆ విషయం ఒప్పుకోలేక. "ఆఁ.... అర్థమైంది" అన్నాడు.
    "ఏమర్థమయింది?" అంది ముత్యాలమ్మ అనుమానంగా.
    "నీకర్థమయిందే నాకూనూ" అన్నాడు రాజు.
    "గట్టివాడివే" అని నవ్వి-" ఇంతకీ నిన్ను నా దగ్గరకెవరు పంపారు?" అందామె.
    రాజు సత్యం పేరు చెప్పాడు. అప్పుడు  ముత్యాలమ్మ ముఖం కోపంతొ ఎర్రబడింది.
    "అయితే అతగాడు నా గురించి నీ దగ్గర అవాకులూ చవాకులూ పేలివుండాలి. మన్నాడో చెప్పు" అందామె.
    "ది మోస్ట్ బ్రిలియంట్ అన్నాడు" అన్నాడు రాజు.
    "అది వ్యంగ్యం. ఎమ్మోస్సీలో నాకు సెకండ్ క్లాసోచ్చిందని వెటకారం"
    "నీకు ఏమ్మెస్సీలో సెంకడ్ క్లాసోచ్చిందా-ఐనా దియాలో రీసెర్చికి సీటోచ్చిందా?" రాజు ఆశ్చర్యంలో నిజాయితీ వుంది.
    ముత్యాలమ్మ నిట్టూర్చి, "అందం శాపం. మా ప్రొఫెసర్ అంటే అజేయ్ సర్ కాదు- ఎమ్మెస్సీలో ప్రొఫెసర్-నాకు ప్రాక్టికల్స్ మినిమిమ్ మార్కులు వేశాడు. ఈ విషయం చాలామందికి తెలుసు" అంది.
    ముత్యాలమ్మ అందంగా వుంటే ప్రొఫెసర్ మార్కులెందుకు తక్కువేశాడూ అని రాజు అడుగలేదు. ఆమాత్రం ఊహించగల లోకజ్ఞానమతడికుంది. అందులోనూ  ఇప్పుడతడు సిబిఐ మనిషి.
    "ఈ విషయం సత్యానికీ తెలుసా?"
    "ఎందుకు తెలియదూ? కానీ  ఒప్పుకోడుగా. థియారీలో ఆన్సరుషీట్లు మార్చడం  తెలికత. ప్రాక్టికల్స్ ఎక్ట్సర్నల్ టఫ్ ట. నా అందం నాకు వరమై సెకండ్ క్లాస్ తెచ్చిపెట్టిదిట. మన దేశంలో ఆడదాని ప్రతిభకు రంగులు పులమనివారెవరు?"
    రాజుకు ఆమె మాటలు నమ్మాలని వుంది. కానీ దియాలో సీటు?
    "అజేయ్ సర్ పద్దతులే  వేరు ఆయన ప్రతిభను గేలంవేసి పడతారు. నాకు  సెకండ్ క్లాసిచ్చిన ప్రోఫేసర్నే  నా ఇంటర్వ్యూబోర్డు మెంబర్ని చేశారు.  ఆయన చేతనే  నన్ను సెబాషనిపించేరు"
    "ఈ విషయం సత్యానికి తెలుసా?"
    "తెలుసు. ఆడదాని ప్రతిభ అందంలోనే వుందంటాడు" అందామె.
    బాగా ఆలోచిస్తే  సత్యం మాటల్లోనూ నిజముందనిపిస్తుంది. ఈ విషయంలో మాత్రమే బాగా ఆలోచించగలిగినందులకు సిగ్గుపడుతూ, "కొందరంతే-వాళ్ళ ఆలోచనలు వంకర దారిలో మాత్రమే  నడుస్తాయి. బాధపడకూడడు" అన్నాడు రాజు.
    నేను చాలా పాజిటివ్. నాలో ఎ గొప్పతనాన్నీ చూడలేని సత్యం ఏ కారణంవల్ల నైతేనేం నేను అందగత్తెననైనా ఒప్పుకున్నాడుకదా" అంది ముత్యాలమ్మ.
    "సత్యమేమిటి-ఆ విషయం ఎవరైనా ఒప్పుకుంటారుకదా" అన్నాడు  రాజు అప్రయత్నం గా ఆమెనే చూస్తూ.
    ముత్యాలమ్మ అదోలా అతడివంక చూసింది.
    రాజు సిగ్గుపడ్డాడు. ఉన్నట్లుండి తన దృష్టి ఆమె అందంమీదకు  మళ్ళిందేం?అందుక్కారణం-తనలోని  పురుషుడా? లేక ముత్యాలమ్మ కావాలనే  అలా చేసిందా?
    అది నిజమో-లేక రాజులోని పురుషుడో- వారి మధ్య సంభాషణను విశ్లేషించి తొలి పరిచయంలో ఓఅక ఆడది మగాడికి చెప్పనవసరం లేని విషయాలను ముత్యాలమ్మ రాజుకు చాలానే చెప్పిందని తేల్చడం జరిగింది.
    సంభాషణను మార్చడం కోసం రాజు మళ్ళీ రీసెర్చి సబ్జక్టు గురించి అడిగాడు .
    "యూ మీట్ డాక్టర్ బ్రహ్మం -హి ఈజ్ రియల్లీ  ది మోస్ట్  బ్రిలియంట్ " అందామె .
    "అంటే నువ్వు కాదా?" అన్నాడు రాజు.
    "ఆ విషయం బ్రహ్మనే అడిగి తెలుసుకో" అంది ముత్యాలమ్మ.
    "అతడు నాకింకో పేరు చెప్పడుకదా" అన్నాడు రాజు అనుమానంగా.
    "చెబితే నా పేరే చెబుతాను. నేను తన పేరు చెప్పానని చెప్పు" అందామె.
                                *    *    *
    అదే ప్లోర్లో రూమ్ నెంబర్ పదమూడు.
    ఆ గదీ తొమ్మిదో నంబరు గదిలాగే వుంది. ఎటొచ్చీ ముత్యాలమ్మ స్థానంలో బ్రహ్మం వున్నాడు. అతడి చేతిలో రీసెర్చి జర్నల్ వుంది.
    "డాక్టర్ బ్రహ్మం" అన్నాడు రాజు లోపల అడుగుపెట్టెక.
    "ఎస్-అయాం బ్రహ్మం" అని ప్రశ్నార్థకంగా చూశాడతడు.
    రాజు తనను తాను పరిచయం చేసుకున్నాడు.
    బ్రహ్మం అతడికి సీటు చూపించి, "ముత్యాలమ్మను కలిశావా?" అన్నాడు.
    అతడు నువ్వన్నందుకు రాజు ఆశ్చర్యపడలేదు. సత్యం ముత్యాలమ్మ ఆ తర్వాత బ్రహ్మం.....మరి  అజేయ్  సర్ ని  మీరనడంలో ప్రత్యేకత నిలబడాలికదా!
    "ఆమె నీ పేరు చెప్పింది"
    "గుడ్" అంటూ బ్రహ్మం తన చేతిలోని జర్నల్ ను టేబుల్ మీద పెట్టి, "నువ్వు ప్రస్తుతం చేస్తున్న వర్క్  గురించి చెప్పు" అన్నాడు.
    "నేను ఆంధ్రాయూనివర్సిటీ-ఇనార్గానిక్ కెమిస్ట్రీ-ప్రొఫెసర్ రావు స్టూడెంట్ ని...." అన్నాడు రాజు.
    "రావు అంటే వీరేశ్వర్రావేనా?"
    "ఊఁ" అన్నాడు రాజు.
    వీరేశ్వర్రావు పేరు జగద్విదితం. అందుచేత బ్రహ్మం ప్రశ్న మార్చుతూ, "నీకే సబ్జక్టు మీద ఆసక్తి వుందో చెప్పు" అన్నాడు.
    "ఇక్కడ జరుగుతున్న వర్క్ లో ఫిట్ కావాలని ఆశ" అన్నాడు రాజు.
    "అంటే పిహెచ్ డితో సరిపెట్టుకోక దియాలో శాశ్వతంగా ఫిట్ కావాలని- ఆవునా" అంటూ నవ్వాడు బ్రహ్మం.
    "దిసీజే వండ్రపుల్ ఇన్ స్టిట్యూట్. ఇక్కడ రీసెర్చికి చేరడమే డ్రీమ్ కమింగ్ ట్రూ"
    "యూ ఆర్ కరెక్ట్...." అన్నాడు బ్రహ్మం.
    "ప్రొఫెసర్ అజేయ్ సర్  ఈజే  వండ్రపుల్ సైంటిస్ట్. ఆయన దగ్గర పనిచేసే అవకాశం రావడం  నా భవిష్యత్తుకే పెద్ద మలుపు" అన్నాడు రాజు.
    "ఆయన కిద్నాపయ్యారు తెలుసుకదా"
    "ఊఁ"
    "సర్ వచ్చేదాకా ఆగితే బాగుంటుందేమో..."
    "ఎందుకని?"   




Related Novels


Vasundhara Kadhalu - 15

Vasundhara Kadhalu - 14

Vasundhara Kadhalu - 13

Vasundhara Kadhalu - 12

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.