Home » VASUNDHARA » ఆపరేషన్ మేడిపండు


    "నీ ముఖంలో తేజస్సుంది. నాకు నువ్వు చాలా బ్రిలియంటని తోస్తోంది. ఒక స్పెషల్ పైలుని నీ ద్వారా డీల్ చేస్తే బాగుంటుందనిపిస్తోంది. కానీ ఒక్కసారి సర్ ని కన్సల్ట్ చేయడం మంచిది"
    "కానీ సర్ కిడ్నాపయ్యారుకదా!"
    "అయితేనేం వెనక్కు రారా?" నమ్మకంగా అన్నాడు బ్రహ్మం.
    "సర్ వెనక్కి వచ్చేలోగా నా ప్రతిభను  రుజువుచేయాలనివుంది"
    బ్రహ్మం అతడివంక అదోలా చూశాడు.
    "నీ ఉత్సాహం  చూస్తూంటే సర్ వచ్చేదాకా ఆగేలా లేవు. నీకు సహకరించాలని నాకూ అనిపిస్తోంది. ఇందులో కొంచెం రిస్కుంది కానీ తీసుకుంటాను. ఏమో-అందువల్ల సర్ తొందరగా బయటపడే ఆకాశమున్నదేమో!"
    "ప్లీజ్ హెల్ప్ మీ" అన్నాడు రాజు.
    "అయితే ఇప్పుడు సర్ గురించి నీకు కొంత వివరంగా చెప్పాలి" అన్నాడు బ్రహ్మం.
    అజేయ్ గురించి ఎంతైనా వినడానికి సిద్దంగా వున్నాడు రాజు. అజేయ్  శ్రీహరి అయితే  రాజు ప్రహ్లాదుడు. ప్రస్తుతానికి బ్రహ్మం నారదుడు.
    "నన్ను నారదుడితో పోల్చకు. ఆయనకు మనసులో ఒకటుంటుంది. పైకి ఇంకేదో చెబుతాడు. తంపులమారిగా వ్యవహరిస్తూ అంతా లోకకళ్యాణమంటాడు" అన్నాడు బ్రహ్మం.
    "అవి రాజకీయాలు. మనది భక్తిభావం" అన్నాడు రాజు.
    "అలా తేలిగ్గా తీసుకోక-నేను చెప్పే ప్రతిమాటా శ్రద్దగా వినాలి. ఎప్పటికప్పుడు  మనసులో విశ్లేషించుకుంటూ బాగా ఆలోచించాలి. ఇది ఇకముందు చెప్పబోయేవాటికే కాదు-ఇంతవరకూ చెప్పినవాటిక్కూడా వర్తిస్తుంది" అన్నాడు బ్రహ్మం ఉపోద్ఘాతంగా .
    ప్రొఫెసర్ అజేయ్ విదేశాలనుండి ఇండియాకు రప్పించబడ్డాడు. ఆయనకు దేశంలోని సైన్సు ప్రగతి క్షుణ్ణంగా వివరించబడింది. ఆయన కూడా పరిస్థితులను పూర్తిగా  ఆకళింపు చేసుకున్నాడు. తన పరిశీలనా దృష్టితొ ఈ దేశంలోని సైంటిఫిక్ అడ్మినిస్త్రేషన్ ఒక మేడిపండు అని తెలుసుకున్నాడు.
    ఒక సైంటిఫిక్  లాబొరేటరీని ఎలా నడపాలో అందులో శాస్త్రజ్ఞులు ఎలా ప్రోత్సహించాలో ఎవరికీ తెలియదు. పిడుక్కీ బియ్యానికీ ఒకటే మంత్ర మన్నట్లు -పైళ్ళకార్యాలయాలకీ, ప్రయోగశాలలకీ- ఒకే  తరహా నియమావళి విధించారు.
    దీపావళి రాకెట్ తొ ఉపగ్రహాలు తిరగవు.
    దివిటీలా వెలుగుతో కిరణజన్య సంయోగక్రియ జరుగుడు.
    శాసనాలతో ప్రయోగాలు ఫలించవు.
    ఈ విషయాలను విస్మరించడంవల్ల మన ప్రయోగశాలలు దీపావళి రాకెట్లకూ దీవిటీలకూ, శాసనాలకూ పరిమితమైపోతున్నాయి. కానీ కోట్ల ధనం వెచ్చిస్తోంది ప్రభుత్వం. అది బూడిదలో పోసిన పన్నీరు కాకూడదని మేధావులు గగ్గోలు పెడుతున్నారు. అయితే రాజకీయనాయకులకు అది పట్టదు.
    వారు మన శాస్త్రజ్ఞులను కొట్ట టెక్నాలజీ కనిపెట్టామంటారు. దానిని పరీక్షించే అవకాశమివ్వరు. బోఫోర్స్ గన్స్-ఇండియన్సే చేస్తే -కిక్ బాక్స్ ఎలా వుంటాయి?
    అందుకని రాజకీయవాదులు మన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహించకుండా విదేశీ టెక్నాలజీలకు ఎగబడుతున్నారు.
    సాంకేతికంగా మనం వెనుకబడివున్నా తప్పో ఒప్పో మన టెక్నాలజీని మనమే పెంపొందించుకుంటే పరాధీనత వుండదు. తప్పులను క్రమంగా సరిచేసుకోనూవచ్చు. వైనా ఈ విధానాన్నే  అనుసరిస్తూ ఇప్పుడు- వీదేశీయులతో పోటీపడగల టెక్నాలజీలను కొనుక్కుంటూ-మనకు మనంగా  మందుకు వెళ్లే అవకాశాన్ని జారవిడుచుకుంటున్నాం.
    అయితే మన శాస్త్రజ్ఞులు వెనుకబడి లేరు. విదేశీ  సహకారం  లభ్యంకావడం కష్టమైనా కొన్ని రంగాల్లో వారు ప్రభుత్వం ఏది కోరితే అది చేస్తున్నారు. మన ఇన్సాట్ లు సఫలం. అగ్ని సఫలం. అణురియాక్టర్లు సఫలం.
    కానీ అన్ని రంగాల్లోనూ ఇది సాధ్యపడడంలేదు. ఎందుకంటే  ఆయా ప్రయోగఫలితాల పట్ల ప్రభుత్వానికి ఆసక్తి లేదు.
    తాము వెనుకబడిలేమని తక్కిన  శాస్త్రజ్ఞులు రుజవుచేసుకోవాలికదా-అందుకని వారు సూపర్ కండక్టర్లంటారు. వెదురుమొక్కకు పువ్వులంటారు. కేన్సర్ కు మందంటారు. ఎ చెట్టుకైనా  అన్నిరకాల పళ్ళంటారు.
    ఆ పరిశోధన గురించి పేపర్లలో వస్తుంది. ఆ ప్రయోగశాలల గురించి ప్రచారమవుతుంది. కొత్త ప్రచారం రాగానే పాత ప్రచారం పోతుంది. ఏ ప్రచారానికీ  వాడుక వుండదు. లోపం ఎక్కడుంది?
    దేశంలో కొత్తటెక్నాలజీలు వస్తున్నాయి. శాస్త్రజ్ఞుల్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఎన్నో ప్రణాళికలు రూపొందించింది. ఎందరో  శాస్తజ్ఞ్రులకు అవార్డులు వస్తున్నాయి.
    కానీ దేశంలోసైంటిఫిక్ రీసెర్చ్ ఎక్కడ వేశావే గొంగళీ అన్నట్లుంది.
    ఈ విశేషం అజేయ్ లో ఆవేదన కలిగించింది. ఆయనకు  మన దేశ శాస్త్రజ్ఞుల పైన అపారమైన నమ్మకముంది. అన్ని అనర్తాలకూ మూలం- సైంటిఫిక్ అడ్మినిస్ట్రేషన్ అద్భుతం అనిపిస్తుంది.
    దానిని మేడిపండని అంటాడు అజేయ్.
    మేడిపండు చూడు మేలిమైయుండు పొట్ట విప్పి చూడ పురుగులుండు....
    వేమనది ఓటి మాట కాదు. రాజకీయాలు పురుగులు ప్రవేశించని చోటు లేదు మనదేశంలో.
    మనుషులకు ప్రాణాలు పోయాల్సిన ఆస్పత్రులలో రాజకీయాలు.
    మనుషుల్ని మనుషులను చేయాల్సిన విద్యాయాల్లో రాజకీయాలు.
    మనుషుల్లో స్వార్థాన్ని అదుపుచేయాల్సిన దేవాలయాల్లో రాజకీయాలు.
    చివరకు మనిషిని దైవత్వంవైపు నడిపించే పరిశోధనాశాలల్లో రాజకీయాలు.
    మేడిపండు.....మేడిపండు....ఎక్కడ చూసినా మేడిపండే...
    "ప్రొఫెసర్ అజేయ్ ఈ మేడిపండును చేదించాలనుకున్నాడు.
    అప్పుడాయన బుర్రలో వెలసింది-ఆపరేషన్ మేడిపండు....
    ఆపరేషన్ మేడిపండును అమలుచేస్తే మన శాస్త్రజ్ఞానాన్ని వెనక్కి లాగుతున్నవారి రంగు బయటపడుతుంది. అయితే ఆ పథకం ఎవర్నీ దేనికీ  తప్పుపట్టాదు.
    సామాన్య ప్రజానీకం మధ్యకు వెళ్ళినిత్యావసరాల్లో వారి ఇబ్బందులు తెలుసుకుని వాటిని తొలగించడానికి శాస్త్రీయంగా పరిష్కారాలు తెలుసుకుని స్వయంగా అమలుపర్చి- ప్రజల్లో శాస్త్రీయ స్పృహను ప్రవేశపెట్టాలి.
    నేటి రాజకీయాల్లో అన్నింటికీ అందరికీ ప్రజలే ఆయువుపట్టు.
    ఆపరేషన్  మేడిపండు ఆ ఆయువుపట్టును పడుతుంది.
    "ఆపరేషన్ మేడిపండు-చాలా గొప్పగా వుంది. దీనికి అజేయ్ సర్ ఎన్నుకున్న కార్యక్రమాల్లో నేనూ పాల్గొంటాను" అన్నాడు రాజు ఉత్సాహంగా.
    "నా ఉద్దేశ్యం కూడా అదే" అన్నాడు బ్రహ్మం అతడు రాజుతొ కరచాలనం చేసి లేచి నిలబడ్డాడు. తన పక్కనున్న అద్దాల  బీరువా  తలుపులు తెరిచాడు. ముందుకు పెర్చివున్న పుస్తాకాల వెనక్కు  చేయిపెట్టి ఒక ఫైలును బయటకు తీశాడు. మళ్లీ  బీరువా తలుపులు మూశాడు. తన సీట్లో వచ్చి కూర్చున్నాడు. ఫైలు బల్లమీద పెట్టాడు.
    రాజు ఆ ఫైలుని చూశాడు. 'ఆపరేషన్ మేడిపండు' అని ఇంగ్లీషు అక్షరాల్లో రాసివుంది దానిమీద.
    "ఇది సీక్రెట్ ఫైలు. సర్ కి  నామీద నమ్మకం. అందుకే ఇది నా దగ్గరుంది" అన్నాడు బ్రహ్మం గంభీరంగా గంభీర్యంలో కూడా అతడి గొంతులో గర్వం ధ్వనించింది.
    "నేనిది చూడొచ్చా" అన్నాడు రాజు ఆత్రుతగా.
    "చూసి వెంటవెంటనే జీర్ణించుకోవడం కష్టం. ప్రతి పథకమూ కూడా అద్బుతమైనది. ఫలితాలు కూడా అద్భుతంగా వున్నాయి. అందుక్కారణం కూడా ప్రొఫెసర్ చెప్పారు. ప్రాజెక్టు తీసుకున్నా-అది విజయవంతం కావాలంటే కేవలం విజ్ఞానశాస్త్రానికి సంబంధించిన  తెలివి చాలదు. జ్ఞానానికి లోకజ్ఞానం జతపడితేనే టెక్నాలజీ అవుతుందనేవారాయన. తన  ప్రతి ప్రాజెక్టునూ జ్ఞానం, లోకజ్ఞానం సమపాళ్ళలో కలిగినవాళ్ళకే అప్పగిస్తాననేవారాయన. అందుకు తరచుగా ఓ కథ కూడా చెప్పేవారాయన" అన్నాడు బ్రహ్మం.
    ఓ మనిషి వంకర టింకర గొట్టం తెచ్చి దాని ఘనపరిమాణమెంతో చెప్పమని అడిగాడు. న్యూటన్ అనే శాస్త్రజ్ఞుడు వంకర టింకర వస్తువుల ఘనపరిమాణాన్ని కనిపెట్టడమెలాగా  అని అహొరాత్రాలు ఆలోచించి అదేపనిగా కృషిచేసి చివరాకు 'కాల్క్యులస్' అనే కొత్త గణితాన్ని కనిపెట్టాడు. అయితే  లోకజ్ఞాని ఒకడు  ఎప్పుడో ఆ గొట్టం ఘనపరిమాణాన్ని  తెలుసుకున్నాడు. అతడు గొట్టాన్ని ఒక పక్క మూసి  దాన్నిండా నీరు పొసి  ఆ నీటిని ఇతర కొలమానాలతో కొలిచాడు. ఘనపరిమాణం తెలిసిపోయింది. చాలామంది లోకజ్ఞానిని మెచ్చుకుని జ్ఞానిని అపహాస్యం చేశారు.
    అయితే గొట్టం గుజ్జుతో నిండివుండవచ్చు. పూర్తిగా నీరు చొరబడకుండా గొట్టంలో అడ్డంకులుండవచ్చు. జ్ఞాని పరిశోధనవాళ్ల ఎలాంటి  వంకర గొట్టానికైనా ఘన పరిమాణాన్ని కట్టవచ్చు. లోకజ్ఞాని పరిష్కారం తేలిక కావచ్చు. కానీ అశాశ్వతం. జ్ఞాని పరిష్కారం సమయం తీసుకునివుండవచ్చు. కానీ అది శాశ్వతం. జ్ఞానానికి లోకజ్ఞానం కలిస్తే ఏ పరుష్కరమైనా శాశ్వతమూ అవుతుంది. తేలికగానూ వుంటుంది.
    ఈ కథ రాజుకి తెలుసుకానీ దీన్ని టెక్నాలజీపరంగా ఆలోచించలేదు.
    "నాకా ప్రాజెక్టుల గురించి తెలుసుకోవాలనివుంది" అన్నాడతడు.
    "ఆ ప్రాజెక్టుల వివరాలన్నీ ఈ ఫైల్లో వున్నాయి. తెలుసుకోవడం నీకూ మంచిది. ఎందుకంటే ఒకో ప్రాజక్టు ఒకో సాలభంజిక వంటిది. అది చెప్పే  కథ నువ్వు విన్నావంటే ఆపరేషన్ మేడిపండు' అనే విక్రమార్క సింహాసనాన్ని ఎక్కే అర్హత నీకుందో లేదో అంచనా వేసుకుంటావు"
    "సస్పెన్సుకు తట్టుకోవడం కష్టంగా వుంది. మొదటి ప్రాజెక్టు ఏమిటి?"
    "ఏమిటీ అని కాదు. ఎవరిదీ అని అడగాలి. అతడిపేరు సూర్య సుబ్రహ్మణ్యం"
    "తమాషాగా వుంది పేరు" అన్నాడు రాజు. "సూర్య ఇంటిపేరా?"
    బ్రహ్మం తల అడ్డంగా ఊపి, "అతడి పరిశోధనలన్నీ సూర్యకాంతి మీదా, సూర్యతేజం మీదా ఆధారపడివున్నాయి. అందుకని అంతా అతణ్ణి సూర్యసుబ్రహ్మణ్యం అంటారు" అన్నాడు.
    రాజుకు నవ్వొచ్చింది. "అంటే ప్రాజెక్టును బట్టి పేరు మార్పు" అన్నాడు.
    "అంతేకాదు-ప్రాజెక్టుకూ పేరుమార్పు" అన్నాడు బ్రహ్మం.
    మనది ఉష్ణదేశం. రోజులో చాలా భాగం సూర్యుడు మనని వేధిస్తూనే వుంటాడు. వేదనలో శక్తి వుంది. సుబ్రహ్మణ్యం ప్రాజెక్టు  ఆ శక్తిని ప్రజోపయోగం చేయడమే.
    ఆపరేషన్ మేడిపండులో మొదటి ప్రాజెక్టు సౌరశక్తిపైనే!
    ఇప్పటికే సోలార్ కుక్కర్లున్నాయి, గీజర్లున్నాయి, బ్యాటరీలున్నాయి. కానీ పల్లెటూళ్ళలో వాటికి తగిన ప్రచారం రాలేదు.
    ప్రొఫెసర్ అజేయ్ ప్రకారం ఒక గ్రామాన్ని దత్తత చేసుకున్నారు. ఆ గ్రామంలో సమస్త శక్తీ సూర్యుడినుంచే రావాలి. ఆ ఊరికి  సూర్యాపురం అని పేరుపెట్టారు. సుబ్రహ్మణ్యం ఆ ఊళ్ళో మకాం పెట్టాడు. గ్రామప్రజలు విరివిగానూ, సులభంగానూ,ఫ వాడుకునేవిధంగా అతడు సౌరశక్తితొ పనిచేసే పొయ్యిలు, కుంపట్లు, దీపాలు, గీజర్లు, బ్యాటరీలు వగైరాలు తయారుచేశాడు. గ్రామపౌరులు వాటికెంతగా ఆకర్షించబడ్డారంటే- ఏడాదిలో ప్రతి ఒక్కరూ అవే కావాలనసాగారు. వాటినే వాడసాగారు.
    సుబ్రహ్మణ్యం ఆ ఊళ్ళో ఎంతగా  ప్రచారం పోందాడంటే-అతడు తయారుచేసిన వస్తువులను అతడి పేరుతోనే పిలవడం రివాజయింది. ఆ విధంగా ఆ ఊరినిండా సుబ్బ పొయ్యిలు, సుబ్బ కుంపట్లు, సుబ్బ దీపాలు వెలిశాయి.అసలా ఊరినే చాలామంది సుబ్బాపురం అనసాగారు.
    సుబ్రహ్మణ్యానికి వచ్చిన పేరు ఇంతా అంతాకాదు. ఊరంతా అతణ్ణి సన్మానించింది. ఇతర గ్రామాల నుంచి అతడికి ఆహ్వానాలందుతున్నాయి. శక్తి వినియోగానికిసంబంధించిన కొన్ని సంస్థలతడికి అవార్డులిచ్చాయి. రాష్ట్రాలనుంచి ఆయనకు ఆహ్వానాలు వస్తున్నాయి-అక్కడా గ్రామాలను దత్తత తీసుకుని ఏమైనా చేయమని!
    అదీ ఆపరేషన్ మేడిపండులో మొదటి ప్రాజెక్టు కథ!
    చెప్పాలంటే రాజు థ్రిల్లియ్యాడు.
    ఒకో టెక్నాలజీకి ఒకో గ్రామమూ ఒక సుబ్బాపురం అవుతుంది. సుబ్బాపురం కాదు- రాజాపురం. ఒక ప్రాజెక్టు తను  తీసుకుంటే మరి ఊరికి తన పేరేగా?
    రాజాపురం పేరు తల్చుకోగానే అతడి తనువు పులకరించింది. ఆ ఊళ్లో అజేయ్  సర్ శిలావిగ్రహం ప్రతిష్ఠంచబడుతున్నట్లుగా చిన్న కలాదృశ్యం కూడా అతడి కనులముందు  మెదిలింది. "ఇక రెండో ప్రాజెక్టు గురించి  తెలుసుకోవాలనుంది" అన్నాడు రాజు.
    బ్రహ్మం నవ్వి, "మొదటి ప్రాజెక్టు గురించి బొమ్మ విన్నావు. బొరుసు తెలుసుకోలేదుగా" అన్నాడు.
    "దీనికి బోరుసేమిటి?" ఆశ్చర్యంగా అన్నాడు రాజు.
    "దేనికైనా బొరుసుంటుంది. సుబ్బాపురంలో సుబ్బ సంస్కృతి వెలసింది. అయినా  అది గ్రామగ్రామాలకూ ఎందుకు పాకలేదు"? దేశమంతటా ఎందుకు విస్తరించలేదు. అవార్డులకే తప్ప ఆచరణకెందుకు నోచుకోలేదు?" అన్నాడు బ్రహ్మం.
    "అడిగే పద్ధతి చూస్తూంటే సమాధానం నీకు తెలుసనిపిస్తోంది"
    "లౌకిక జ్ఞానం వున్నవాడికెవరికైనా ఇట్టే తెలుస్తుంది. మనదేశంమీద మల్టీనేషనల్స్  దాడిచేస్తున్నారు. వాళ్ళు విత్తనాలను కూడా మేమే తయారుచేస్తాం, కొనుక్కోండి అంటారు. సుబ్బసంస్కృతి సుబ్బాపురంతోనే ఆగిపోతుంది"
    "మరి ప్రొఫెసర్ అజేయ్  సర్ ఊరుకుంటారా?" అన్నాడు  రాజు.
    "ఊరుకొబెట్టడానికి కొన్నిప్రయత్నాలు జరిగేవుంటాయి. అవి ఫలించకపోతే...." అర్ధోక్తిలో ఆగాడు బ్రహ్మం.
    "ఫలించకపోతే....?" అన్నాడు రాజు కుతూహలంగా.
    "ఏం జరగాలో అదే జరుగుతుంది..."
    రాజు ఉలిక్కిపడ్డాడు.
    అవును-తనా దారిలో ఊహించనేలేదు.
    ప్రొఫెసర్  అజేయ్  సర్ కిడ్నాపయ్యారంటే అందుక్కారణం ఆపరేషన్ మేడిపండులో మొదటి ప్రాజెక్టే కావచ్చు. ఈ విషయం  గజపతికి చెబితే మిగతాది అతడే చూసుకుంటాడు.
    "ఇంకా నీకు ఈ పైల్లో రెండో ప్రాజెక్టు ఏమిటో తెలుసుకోవాలనుందా?"
    "ఊఁ" అన్నాడు రాజు తడుముకోకుండా.
    "అయితే సరే-రెండ్రోజులాగు"
    "రెండ్రోజులెందుకు?"
    "ఆపరేషన్ మేడిపండు బొమ్మా బొరుసూ అవగాహన కావాలంటే ఆ మాత్రం సమయం అవసరం" అన్నాడు  బ్రహ్మం.
    బొరుసు అనగానే రాజుకు కిడ్నాప్ గుర్తుకొచ్చింది. "ప్రొఫెసర్  అజేయ్  సర్ ను  అపహరించిన వాళ్ళిప్పుడేం చేస్తూంటారు?" అన్నాడు.
    "అజేయ్ సర్  సమాన్యులు కారు. భయపెట్టి ఆయన్నెవరూ లొంగదీయలేరనే నా నమ్మకం. కాబట్టి వాళ్ళిప్పుడేం చేస్తూంటారు?" అన్నాడు.
    "అజేయ్  సర్  సమాన్యులు కారు. భయపెట్టి ఆయన్నెవరూ లొంగదీయలేరనే నా నమ్మకం. కాబట్టి అపహరించినవాళ్లాయనపై మాయా మోహజాలాన్ని విసురుతారు...."
    "మాయా మోహజాలమంటే?"
    "ఎంతవారాలైనా ఎవరి దాసులో ఎవరికెరుక కాదు?" నవ్వాడు బ్రహ్మం.
                            *    *    *
    అదే గది. అదే మనిషి. అదే అసహనం. అవే పచార్లు.
    ఉన్నట్లుండి గదిలో ఓ మూలనుంచి-"ప్రొఫెసర్ అజేయ్ -అటెన్షన్ ప్లీజ్" అనే స్వరం వినిపించింది.
    అజేయ్ అటు చూశాడు. అంటే ఆ మూల ఎక్కడో మైక్రోఫోన్ వుండివుండాలి.
    "ప్రొఫెసర్ అజేయ్ -అటెన్షన్  ప్లీజ్" ఈసారి గొంతు మరోవైపునుంచి. 




Related Novels


Vasundhara Kadhalu - 15

Vasundhara Kadhalu - 14

Vasundhara Kadhalu - 13

Vasundhara Kadhalu - 12

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.