Home » Dr S V S Kishore Kumar » First Crush
వర్రీ కావాలసిన పనిలేదు. రాజు గారు ముందు జాగ్రత్తగా నే ఉన్నారు. అందుకే పెద్ద ఆపద తప్పింది.
వినీల్ కి డౌట్ వచ్చి యశ్వంత్ ని అడిగాడు. వాళ్ళు ఇలాంటివి రిపీట్ చేస్తే కష్టం కదా. ఎన్ని రోజులని ఇలా జాగ్రత్తపడాలి. ఎటునుంచి ఏమైనా చెయ్యొచ్చు కదా అన్నాడు.
నువ్వు చెప్పింది నిజమే వినీల్. అందుకే రేపు పొద్దున మళ్ళా నేను వస్తాను. అప్పటికి రాజు గారు స్పృహలోకి వచ్చి మాట్లాడుతారు కాబట్టి ఆయనతో డీటెయిల్ గా మాట్లాడి వాళ్ళ మీద తగు చర్య తీసుకుంటాను.
నేరస్థులను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. దీనిపై సమగ్ర రిపోర్ట్ కూడా డీ జీ పీ గారికి ఇవ్వడం జరిగింది.
ఆయన కూడా సీరియస్ గా ఉన్నారు. మాకు ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి కూడా రాజు గారికి ప్రత్యేక రక్షణ కల్పించామని ఆదేశాలు ఉన్నాయి.
అందుకే ఆరునెలలుగా ఆయన కారు వెంటే మా ఎస్కార్ట్ వెళుతూ ఉంటుంది. రాజు గారి ఇంటి వద్ద కూడా మఫ్తీ లో పోలీస్ నిఘా ఉంచాము.
కాకుంటే శత్రువులు ఓక టెండర్ విషయములో రాజు గారికి అది రావడంవల్ల కోపం గా ఉన్నారు.
వారిని పూర్తిగా హెచ్చరించాము. ఇక భయమేమీ ఉండదు. మీరేమీ కంగారు పడకండి. లీగల్ గా వారిపై ఎలా ఆక్షన్ తీసుకోవాలని ఆల్రెడీ ప్లాన్ చేసాము. వారంలోపే వారందరి మీదా ఛార్జ్ షీట్ వేస్తాము అని చెప్పాడు.
మరి నేను వెళతాను. రేపు ప్రొద్దున మీకు ఫోన్ చేసి వస్తాను అని విజిత నెంబర్ తీసుకున్నాడు యశ్వంత్.
అందరూ లేచారు ఆ రూమ్ నుంచి బయటకు వచ్చారు.
ఇంకేంట్రా వినీల్ ఏంటి విశేషాలు అని అడిగాడు యశ్వంత్. ఎంతవరకు వచ్చింది నీ మ్యారేజ్ ప్రొపొసల్స్ అని ఆప్యాయంగా నీల్ ని దగ్గరకు తీసుకుని అడిగాడు.
డాడీ చూస్తున్నారు అన్నయ్య అని చెప్పాడు వినీల్.
మళ్ళీ ఆ జాతకాల గోలేనా. త్వరగా చేసుకోరా బాబు ఎవరినో ఒకరిని చూసుకుని.
దగ్గరలోనే కూర్చుని ఉన్న విజిత వీరి సంభాషణ వింటోంది ఆసక్తిగా.
తప్పకుండా అన్నయ్య. కానీ నీకు తెలుసు కదా. నాన్నకు ఎదురు వెళ్లలేము అన్నాడు.
తెలుసురా. అందుకే మీ అన్నయ్య విషయంలో జాతకం కుక్ అప్ చేసి పంపాము మీ నాన్నకు. చక్కగా కుదిరిందని పెళ్లి చేసాడు. ఈ రోజుకూ తెలీదు అవి కుదిరాయో లేదో. వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉన్నారు కదా అన్నాడు నవ్వుతూ.
అవునా. హే ఇది నాకు తెలీదు అన్నయ్యా అన్నాడు యశ్వంత్ తో.
అవునురా. నీకు ఎవరైనా అమ్మాయి నచ్చితే చెప్పు. జాతకాలు నేను కుదిరిస్తా అని కన్నుగీటాడు వినీల్ వైపు చూస్తూ.
సరే అన్నయ్యా థాంక్స్ అంటూ రెండు చేతులూ జోడించాడు నవ్వుతూ.
ఈ సండే ఇంటికి లంచ్ కి రారా. మీ వదిన నన్ను పోరు పెడుతోంది నిన్ను పిలవమని. ఆవిడ చెల్లెలు కూడా ఉందిగా మ్యారేజ్ కి. నీకు అడుగుదామని ఆవిడ ప్రయత్నం అన్నాడు నవ్వుతూ. నీకు చాలా డిమాండ్ ఉంది. నువ్వే ఆ సాఫ్ట్వేర్ లో పడి రొమాన్స్ మర్చిపోయావు అన్నాడు.
యశ్వంత్ మాట్లాడిన తీరుకు మొహమాటంగా నవ్వుతూ తప్పకుండా వస్తానన్నయ్యా అని చెప్పాడు.
సరేరా వెళతాను. రేపు నువ్వు ఇక్కడే ఉంటె మళ్ళీ కలుస్తాను అన్నాడు.
వారి మాటలు వింటూ మనసులో నవ్వుకుంటోంది విజిత, జాతకాలు గురించి యశ్వంత్ చెప్పిన టిప్స్ గురించి.
అందరూ మాటల్లో ఉండగా డాక్టర్ బయటికి వచ్చి చెప్పాడు.
ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. రిబ్స్ కొద్దిగా మాత్రమే విరిగాయి. బ్యాండేజ్ వేసాము.
రెండు నెలలు పూర్తి రెస్ట్ అవసరము అని చెప్పాడు విజిత, మాధవి తో.
ఐ సి యూ కి షిఫ్ట్ చేసాము. మీరు వెళ్లి చూడొచ్చు. ఇంకా స్పృహ రాలేదు. ఒక గంట పడుతుంది. జనరల్ అనేస్తేషియా ఇచ్చాము కదా. కొంచెం టైం పడుతుంది అని చెప్పాడు.
అందరూ అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు.
వీర్రాజు గారి భార్య గౌతమి అందరికి స్నాక్స్ ఇంటినుంచి తెచ్చింది. ఆమెతో పాటు వాళ్ళ పని పిల్లాడు కారేజ్ లు పట్టుకొచ్చాడు.
విజిత వాటిని రూమ్ లో పెట్టమని చెప్పింది అతనితో.
మాధవి, విజిత, వీర్రాజు, గౌతమి అందరూ ఐ సి యూ లోకి వెళుతున్నారు.
విజిత వెనక్కు తిరిగి వినీల్ ని కూడా పిలిచింది. నీల్ నువ్వూ రా అంటూ.
ఇంతమంది లోపల అంటే పేషెంట్ కి ఇబ్బంది విజిత అన్నాడు.
ఫరవాలేదు రా అంది. తప్పదన్నట్లు లోపలి వెళ్ళాడు వాళ్లతో.
అది వి ఐ పి ఐ సి యూ కావడంతో చాలా పెద్దదిగా వెంకటరాజు గారు ఒక్కరే బెడ్ లో ఉన్నారు . ఆయనకీ ఇంకా స్పృహ రాలేదు. పక్కనే డాక్టర్, నర్స్ ఉన్నారు.
అందరూ ఆయన దగ్గరికి వెళ్లారు. విజిత బ్యాండేజ్ అవి చెక్ చేసింది.
తల్లితో భయం ఏమీ లేదు మమ్మీ. త్వరలోనే కోలుకుంటారు.
కాకుంటే డాక్టర్ చెప్పినట్లు రెండు నెలలు ఇంటినుంచి కదలకుండా ఉంటె మంచిది అని చెప్పింది.
తమ్ముడిని అలా చూడగానే వీర్రాజు కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఆయన ఆస్తులు కూడా వెంకటరాజు గారే మేనేజ్ చేసి బాగా డెవలప్ చేసాడు. వీర్రాజు కు అంత బిజినెస్ అనుభవం లేదు. తమ్ముడే కొండంత అండ అతనికి. ఆయన ఇద్దరు కూతుళ్లు పెళ్ళిళ్ళయి ఫారిన్ లో సెటిల్ అయ్యారు. ఆయనకు ఏ సమస్య వచ్చినా వెంకటరాజు చూసుకుంటూ ఉంటాడు. అలాంటి తమ్ముడు ఇలా ఉన్నాడంటే ఆయనకు గుండె లోతుల్లో దుఃఖం పొంగుకొచ్చింది. గౌతమి భర్త కళ్ళలో నీళ్లు చూసి ఊరుకోండి. బావగారు త్వరలోనే కోలుకుంటారు అని ఓదార్చింది.
వినీల్ ఆయన త్వరగా కోలుకోవాలని మనసులో అనుకున్నాడు. కాకుంటే ఈ రెండు నెలలు విజిత అన్ని బిజినెస్ వ్యవహారాలూ చూసుకోవాలి. వెంకట రాజు గారి వ్యాపార సామ్రాజ్యం చాలా పెద్దది. ఆయన కాబట్టి తనదైన శైలిలో అభివృద్ధి చేస్తూ వస్తున్నాడు. తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. మన దేశంలోనే కాక విదేశాలలో కూడా ఆయన వ్యాపారం ఉంది. ఆమ్మో ఇంత బిజినెస్ విజిత ఎలా చూస్తుందో, ఎలా నెగ్గుకొస్తుందో అని ఉలిక్కిపడ్డాడు.
****
అప్పుడు టైం పది దాటింది.
రాజు గారు స్పృహలోకి రావడానికి ఇంకో గంట పైనే పడుతుంది.
అందరూ ఐ సి యూ నుంచి బయటకు వస్తుంటే మాధవి తను అక్కడే కూర్చుంటాను అని చెప్పింది.
కాస్త ఏదైనా తినేసి వచ్చి కూర్చోమ్మా మాధవి అంది గౌతమి.
నేను ఇంటి నుంచి అందరికీ టిఫిన్ తీసుకు వచ్చాను అని చెప్పింది.
సరే అని అందరూ బయటికి వచ్చారు.
అక్కడే వెయిట్ చేస్తున్న మృణాల్, ఆఫీస్ స్టాఫ్ ఎలా ఉంది అని అడిగారు వినీల్ ని.
బాగానే వున్నారు మృణాల్. స్పృహలోకి రావడానికి ఇంకో గంట పడుతుంది అని చెప్పాడు వినీల్.
సరే వినీల్. మేము రేపు వచ్చి కలుస్తాము రాజు గారిని అని చెప్పి వాళ్ళు బయలుదేరారు.
వీర్రాజూ వినీల్ ని తీసుకుని రూములోకి వెళ్ళాడు.
ఆడవాళ్లు ప్లేట్స్ లో స్నాక్స్ పెడుతున్నారు.
ఎవరికీ ఆకలి లేదు. అందరూ డల్ గా ఉన్నారు. ఎదో మొక్కుబడిగా ఆ పూటకు తినాలి కాబట్టి తప్పట్లేదు.
వినీల్ రాత్రి ఫ్రూట్ డైట్ కాబట్టి కొన్ని ఫ్రూప్ట్స్ తీసుకున్నాడు థాంక్స్ చెప్తూ.
ఇదేదో బాగుందే అని అందరూ వినీల్ నే ఫాలో అయ్యారు. ఎందుకంటే ఎవరికీ తినే మూడ్ లేదు.
తినడం అయిందనిపించి కాఫీ తెప్పించుకున్నారు.
వీర్రాజు ని గౌతమి ని ఇంటికి వెళ్ళమని చెప్పింది విజిత. వీర్రాజు గారు అప్పటికే బాగా డల్ గా ఉన్నారు. ఆయనకీ కొంత అనారోగ్యం కూడా ఉంది. సమయానికి మందులు వేసుకుని ఎర్లీ గా పడుకోవాలి. అందుకే ఎక్కువ శ్రమ తీసుకోరు. వెంకటరాజు గారి మీద ఆధారపడుతున్నారు ఎక్కువ భాగం.
ఫరవాలేదు రా విజ్జీ ఇక్కడే ఉంటాం ఇవాళ అన్నాడు.





