Home » Dr S V S Kishore Kumar » Midunam


                                               మిధునం                                                                                                                                                                                                                                                        డా.యస్.వి.యస్.కిషోర్ 

                                                    


                      టైం పదవుతోంది... 
కోర్ట్ కు బయలుదేరుతున్నాడు కృష్ణమోహన్ ఇంతలో ఫోన్ మోగింది. ఏదో కొత్త నెంబర్ లా ఉందే అంటూ ఆన్సర్ చేసాడు అటునుంచి  ఓ వ్యక్తి చెప్తున్నాడు. సర్ నా పేరు సతీష్. సాయంత్రం మీ అపాయింట్మెంట్  కావాలి. ఎన్ని గంటలకి రమ్మంటారు ? ఏడుగంటలకు రండి అని ఫోన్ పెట్టేసి డ్రైవర్ ని కారు తీయమన్నాడు. కృష్ణమోహన్ ముప్పై ఐదేళ్లు బ్యాంకు లో పనిచేసి మూడేళ్ళ క్రితం భార్య చనిపోవడంతో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని తన కిష్టమైన లీగల్ ప్రొఫెషన్ లోకి మారాడు. అరవై ఏళ్ళకి రెండేళ్ల దూరంలో ఉన్నా హుషారుగా కుర్రాడిలా తిరుగుతుంటాడు యాక్టివ్ గా పదేళ్ల క్రితం బ్యాంకు లో పనిచేసేప్పుడు చదివిన ‘లా’ అంటే అతనికి ఎంతో ఇష్టం. అందుకే బ్యాంకు లో డిప్యూటీ జనరల్ మేనేజర్ హోదాలో ఉన్నా భార్య ఆకస్మికంగా చనిపోవడంతో బ్యాంకుకు బై చెప్పి న్యాయవాద వృత్తి చేపట్టాడు. తన ఇద్దరు కూతుళ్లు అమెరికా లో ఎం.ఎస్ చేసి అక్కడే పని చేస్తున్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ లు గా భార్య ఉండగానే ఇద్దరికీ పెళ్లిళ్లు చేసాడు. వారి భర్తలు కూడా అమెరికాలోనే పనిచేస్తున్నారు. 

హైదరాబాద్ లో కృష్ణమోహన్ తన సొంత ఇంట్లో పైన నివాసముంటూ క్రింద తన ఆఫీస్ పెట్టుకున్నాడు.మూడేళ్లలోనే న్యాయవాదిగా మంచి పేరు సంపాదించాడు. తనకున్న అనుభవంతో, సాంకేతిక నిపుణతతో చక చక అన్ని రకాల కేసులు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. అందుకోసం ఆ వయసులో కూడా రాత్రిళ్ళు బాగానేచదువుతూ, ఆకళింపచేసుకుంటూ,  కష్టపడుతూ అనుభవాన్ని సంపాదిస్తున్నాడు.ఓ నలుగురు జూనియర్స్ కూడా తన దగ్గర పని చేస్తున్నారు. వారికి కూడా చేతినిండా పని. వారికి చక్కటి పేమెంట్ ఇస్తూ జాగ్రత్తగా చూసుకుంటాడు కృష్ణమోహన్.  అందుకే అతని వద్ద జూనియర్స్ గా చేరేందుకు చాలా మంది క్యూ లో ఉంటారు.ఇక వంటకి, ఇంటిపనులు చూసుకునేందుకు ఓ భార్యాభర్తల జంట అతని దగ్గరే ఉంటారు.పెద్ద ఇల్లు కావడంతో ఆఫీస్ వెనుకభాగంలో వాళ్ళు నివాసముంటున్నారు. అలా అన్నీ ఏర్పాటు చేసుకుని ఏ ఆటంకము లేకుండా తన వృత్తి లో ముందుకు దూసుకెళుతున్నాడు. రోజూ కూతుళ్లతో రాత్రి వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడి నిద్రకు ఉపక్రమిస్తాడు. ఫోన్ చేసినప్పుడల్లా కూతుళ్లు సతాయిస్తారు డాడీ ఎందుకు అక్కడ అలా ఒంటరిగా. ఇక్కడకి రండి మాతో ఉండొచ్చు అని అదృష్టం కొద్దీ చాలా మంచి అల్లుళ్ళు దొరికారు కృష్ణమోహన్ కి. మామగారిని నెత్తినపెట్టుకుంటారు. 

మామ అంటే వారికి ఎంతో ప్రేమ, అనురాగం, గౌరవం కూతుళ్లకంటే కృష్ణమోహన్ కి అల్లుళ్ళ ఒత్తిడి ఎక్కువయింది అమెరికాకి రమ్మని, ఒంట్లో శక్తి ఉన్నంత కాలం ఈ వృత్తిలోనే ఉంటాను అని వారి అభ్యర్ధనని మర్యాదపూర్వకంగా త్రోసిపుచ్చుతాడు ఎప్పటికప్పుడు ఆరోగ్య విషయములో చాలా జాగ్రత్తగా ఉంటాడు కాబట్టి కూతుళ్ళకు కొంత నిశ్చింత. అప్పటికీ వాళ్ళు తండ్రికి తెలీకుండా ఇంట్లో ఉండే వంటావిడకి ఫోన్ లు చేస్తుంటారు డాడీ ఎలా ఉన్నాడు అని ఆమె ద్వారా తండ్రి గురించి, ఆయన ఆరోగ్యం గురించి వాకబు చేస్తుంటారు రహస్యంగా కూతుళ్లను చిన్నప్పటినుంచి ఎంతో ప్రేమతో పెంచాడు కృష్ణమోహన్. అతని కనుసన్నలలో వాళ్ళు కూడా మంచి వ్యక్తిత్వం సంపాదించుకుని చక్కగా చదువుకుని మెట్టినింటిలో మెప్పు పొందుతున్నారు. సివిల్, క్రిమినల్, సర్వీస్ మేటర్స్ ఇలా అన్ని కేసులు చూడడంతో అన్ని రకాల కేసులు అతని దగ్గరకు వస్తుంటాయి. రోజంతా బాగా బిజీ గా ఉంటాడు.  
                                                   *****
 అనుకున్నట్లుగా రాత్రి ఏడుగంటలకు సతీష్ వచ్చాడు.కొత్త క్లైంట్స్ ను ముందుగా కృష్ణమోహన్ రిసీవ్ చేసుకుని వివరాలు తెలుసుకుంటాడు. తరువాత జూనియర్స్ కి అప్పచెప్తాడు ఏమేమి చెయ్యాలో చెప్తూ సతీష్ అతని తమ్ముడు రాఘవ్ ని కూడా పరిచయం చేసాడు కృష్ణమోహన్ కి ఎందుకొచ్చారో వివరాలు అడిగాడు కృష్ణమోహన్ సతీష్ చెప్పాడు. రెండేళ్ల క్రితం వారి తండ్రి చనిపోయాడు, ఆయనకి సంతానం వారిద్దరే  కొడుకులు, కోడళ్ల ఆంతర్యం గ్రహించిన ఆయన ముందు చూపుతో తన ఆస్తి అంతా భార్యకే చెందుతుందని, ఆమె తదనంతరం పిల్లలకి చెరి సమానంగా పంచమని వీలునామా రాసి మరీ చనిపోయాడు అందుచేత వారికి ఆస్తి చేజిక్కించుకునే అవకాశం లేదు. వారి భార్యల ఒత్తిడి ఎక్కువయ్యింది ఎలాగైనా అత్తగారి దగ్గరనుంచి ఆస్తి తమ చేజిక్కుంచుకోవాలని సతీష్, రాఘవ్ చదువులు అంతంత మాత్రమే అవడంతో ఉద్యోగాలు చిన్నవే. ఆస్తి ఎంత ఉన్నా అనుభవించే హక్కు తమకు లేదు అందుచేత కృష్ణమోహన్ దగ్గరికి వచ్చారు. ఎలాగైనా తమ తల్లి ఆస్తి తమకు వచ్చేలా చూడమని వారిచ్చిన పత్రాల కాపీలు తీసుకుని చూసాడు కృష్ణమోహన్. ఆస్తి బాగానే ఉంది. మొత్తం విలువ ఆరు కోట్ల పైనే ఉంటుంది. కానీ అంతా వారి తల్లి పేరుతోనే వీలునామా రిజిస్టర్ చేయబడి ఉంది. వీళ్లకు ఆమె తదనంతరం మాత్రమే హక్కులు వస్తాయి ఆమె పేరు చూసాడు సత్యభామ అని ఉంది. 

ఈ పేరు ఎక్కడో విన్నట్లుందే అనుకున్నాడు. మాటల్లో అడిగాడు ఏ వూరు మీది అని సతీష్ చెప్పాడు వారి తండ్రిది విజయవాడ. తల్లిది కావలి సతీష్ బ్రతిమిలాడుతూ అడిగాడు ఎలాగైనా ఆస్తి మాకు దక్కేలా చూడండి సార్. మీరు అడిగిన ఫీజు ఇస్తామని మీ తల్లి గారు మీతోనే ఉంటున్నారా అన్నాడు లేదు సర్. మా భార్యలకు ఆవిడంటే పడదు. అందుకే వనస్థలిపురం శారదాంబ వృద్ధాశ్రమంలో చేర్చాము అన్నారు ఇద్దరూ ఒకే మాటగా పేపర్స్ మళ్ళీ ఒక మారు చూసాడు. ఆవిడ వయసు యాభై రెండేళ్లు విషయం అర్ధమయ్యింది కృష్ణమోహన్ కి అందరూ బలవంతంగా ఆమెని వృద్ధాశ్రమంలో చేర్చినట్టున్నారు మరి ఇప్పుడు మీరు సొంత ఇంట్లోనే ఉన్నారుగా. ఇంకేంటి సమస్య అన్నాడు ఎలాగైనా ఆస్తి తమ పేరున వస్తే స్వతంత్రంగా ఉంటుంది కదా. ఇప్పుడు ప్రతిదీ అమ్మని అడగాలి. అందుకు మా భార్యలు ఒప్పుకోవడం లేదు. మీరే ఎలాగైనా ఉపాయంతో మా ఆస్తి అమ్మ నుంచి మా పేరుతో మారేట్లు చెయ్యాలి అన్నారు.  అడిగితే ఎంతైనా ఇచ్చేట్లున్నారు ఫీజు తప్పకుండా చూస్తాను. రెండు రోజులు టైం ఇవ్వండి అలోచించి మీకు ఫోన్ చేస్తాను అన్నాడు కృష్ణమోహన్ వాళ్ళు వెళ్లిన తరువాత వనస్థలిపురం శారదాంబ వృద్ధాశ్రమం అడ్రస్ గూగుల్ లో వెతికాడు. అడ్రస్, ఫోన్ నెంబర్ రెండూ దొరికాయి ఆ రోజు మిగతా క్లయింట్స్ తో మాట్లాడి డిన్నర్ చేసేప్పటికి పది దాటింది.  కూతుళ్లు, అల్లుళ్లతో ఓ గంట మాట్లాడి పడుకున్నాడు.                                                                       *****
పొద్దున్నే యోగా, ధ్యానం, స్నానం, పూజ ముగించుకుని వచ్చేసరికి ఎనిమిదయ్యింది రోజూ తొమ్మిదింటికి టిఫిన్ చేసి కింద ఆఫీస్ లో కూర్చుని పదింటికి కోర్ట్ కి బయలుదేరుతాడు.వంటమనిషి అడిగితే టిఫిన్ రెడీ అని చెప్పింది ఎనిమిదింటికి టిఫిన్ చేసి డ్రైవర్ ని కారు తీయమన్నాడు పొద్దున్న ఎనిమిది గంటలకే ఇద్దరు జూనియర్స్ వస్తారువాళ్లకి  డైరెక్టుగా కోర్ట్ కి వస్తానని చెప్పి కారులో బయలుదేరాడు అడ్రస్ వివరంగా డ్రైవర్ కి చెప్పి  వనస్థలిపురం శారదాంబ వృద్ధాశ్రమంకి వెళ్ళమని చెప్పాడు.
బాగా లోపలికి ఉంది వృద్ధాశ్రమం. కనుక్కోవడం కష్టమయ్యింది అది కూడా   చిన్నదిగా ఎక్కువ ప్రాముఖ్యత లేకపోవడంతో ఎవరికి అంతగా తెలీదు ఎలాగోలా కనుక్కుని చిన్న సందు కావడంతో వీధి చివరే కారు ఆపి తను నడుచుకుంటూ అక్కడికి చేరాడు. బయట వాచ్మెన్ ని అడిగాడు సత్యభామ పేరు గల ఆవిడని పిలవమని వాడికి తన వివరాలు చెప్పాడు.చాలా పురాతనంగా పాడుబడ్డ ఇల్లులా ఉంది అది. ఎక్కువ మంది కూడా లేనట్లున్నారు అందులో అక్కడ కూర్చునేందుకు కూడా ఏమీ లేకపోవడంతో వరండాలో నిలుచొనున్నాడు ఇంతలో వాచ్మెన్ వెనకాలే వచ్చింది ఆమె దగ్గరకు వస్తూనే పోల్చుకోగలిగాడు ఆమెనివస్తూనే నమస్కారం అంది తను గుర్తుపట్టారా అని అడిగాడు కృష్ణమోహన్ ఆవిడ తలెత్తి తేరిపార చూసింది. ఓహ్ మీరా అంది ఆశ్చర్యంగా ఆమె గుర్తుపట్టినందుకు సంతోషపడ్డాడు లోపలి రండి కూర్చుని మాట్లాడుకుందాం అంది చిన్న హాల్ లో ఒక టేబుల్ రెండు కుర్చీలు వేసున్నాయి అతిధులు వస్తే కూర్చునేందుకు ఇద్దరూ కూర్చున్నారుఆమెని చూస్తూనే గతంలోకి జారాడు కృష్ణమోహన్.        

                                                        ****




Related Novels


Midunam

Prema Pelli Vidakulu

Nari Nari Naduma Murari

First Crush

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.