Home » Dr S V S Kishore Kumar » First Crush
వద్దు పెదనాన్న. మమ్మీ నేను ఉంటాము. వినీల్ ని కూడా రిక్వెస్ట్ చేసాను. అతను తోడుగా ఉంటాడు. డాడీకి స్పృహ వచ్చేప్పటికి ఇంకా గంట పడుతుంది. ఏదైనా ఉంటె నేను మీకు కాల్ చేస్తాను అంది.
సరే అని ధైర్యం చెప్పి వీర్రాజు గౌతమి ఇద్దరూ లేచారు.
వీర్రాజు వినీల్ దగ్గరకి వచ్చి కొంచెం శ్రమ అనుకోకుండా చూసుకో బాబు అని చేతులు పట్టుకున్నాడు.
అయ్యో సర్. భలేవారే. నేను చూసుకుంటాను. ఏమీ ఫరవాలేదు. రాజు గారు త్వరగా కోలుకుంటారు. నాదీ పూచీ అన్నాడు భరోసా ఇస్తూ.
చాలా మంచివాడవయ్యా నువ్వు అంటూ వినీల్ భుజం తట్టి బయలుదేరారు.
మాధవి ఐ సి యూ లోకి వెళ్ళింది రాజుగారి దగ్గరికి.
విజిత కళ్ళుమూసుకుని అక్కడే కూర్చొనుంది. తండ్రి ఆక్సిడెంట్ తో బాగా డిస్టర్బ్ అయ్యింది. మొహం బాగా వాడిపోయింది.
వినీల్ తండ్రితో ఫోన్ లో మాట్లాడి విజిత దగ్గరికొచ్చి కూర్చున్నాడు.
విజ్జీ ఆర్ యూ ఓకే అని అడిగాడు.
ఏమీ అర్ధం కావటంలేదు వినీల్. డాడీ వెనుక ఇంత కుట్ర జరుగుతుందంటే భయం గా ఉంది.
అదేమీ వర్రీ ఒద్దు విజ్జీ. యశ్వంత్ అన్న చెప్పాడు కదా. మీ నాన్నగారు పోలీస్ డిపార్ట్మెంట్ ని ఎప్పుడో అలెర్ట్ చేశారు. అందుకే ఇవాళ సేఫ్ గా ఉన్నారు. రేపు మార్నింగ్ యశ్వంత్ వస్తే ఎలా వాళ్ళని శిక్షించాలో ఆలోచిస్తారు. అప్పుడు వాళ్లకు భయం కలుగుతుంది. అంతా బాగానే ఉంటుంది. నువ్వు ఎక్కువ ఆలోచించకు ఈ సమయంలో అన్నాడు.
నాకు నీ సహాయం కావాలి నీల్ అంది. నాన్నగారు కోలుకునేందుకు కనీసం రెండు నెలల పైనే అవుతుంది. పెదనాన్నగారు కూడా అంత ఆరోగ్యంగా లేరు. మా వాళ్ళను ఎవ్వరినీ నమ్మాలంటేనే భయంగా ఉంది. ఈ సమయంలో నా మనిషి అంటూ ఒకరు ఉండాలి నాకు తోడుగా. అది నువ్వైతే నాకు ధైర్యంగా ఉంటుంది. ప్లీజ్ ఉంటావా అంది.
నేను మీ పక్క ఇంట్లోనే ఉంటాను కదా విజ్జీ. నీకు ఎప్పుడు ఏ అవసరమున్నా వెంటనే వస్తాను అన్నాడు.
అలా కాదు నీల్. నా కోసం రెండు నెలలు లీవ్ పెట్టు. మా ఇంట్లోనే ఉండు. ఈ బిజినెస్ వ్యవహారాలు నాకు అంతగా తెలీవు. నాన్నగారు కదిలే పరిస్థితి లో లేరు కదా. నేనే అంతా చూసుకోవాలి. నువ్వు నా పక్కనే ఉంటె నాకు ఈజీ గా ఉంటుంది. ప్లీజ్ కాదనకు.
ఆమ్మో రెండు నెలలు నా జాబ్ వదిలేసి నీతో ఉండి మీ బిజినెస్ చూడాలా ఆశ్చర్యంగా అడిగాడు వినీల్. నా ఉద్యోగం ఉండదు విజ్జీ. ఇప్పుడున్న ప్రాజెక్ట్స్ లో అతి కీలకమైనవి నా చేతిలో ఉన్నాయి. నేను వారం లీవ్ పెట్టినా కంపెనీ ఊరుకోదు.
వాళ్ళు సంవత్సరానికిచ్చే జీతం నేను నెలకు పే చేస్తాను వినీల్. ప్లీజ్ నన్నర్ధం చేసుకో. నీకెలా చెప్పాలో తెలీటల్లేదు. ఈ రెండు నెలలు చాలా ఇంపార్టెంట్. నేను చాలా టైం వేస్ట్ చేసాను. నాన్నతో అసోసియేట్ అయ్యుంటే ఇప్పటికి కొంత తెలిసుండేది. అంతా నా తప్పే అంటూ బాధపడుతోంది. రేపు నాన్నగారు ఇవన్నీ నాకు అప్పచెప్తారు. నేను బిక్క మొహం వెయ్యాల్సి ఉంటుంది. ఆయన ను చాలా ఇబ్బంది పెట్టాల్సి వస్తుంది.
ఈ కంపెనీలో ఇప్పుడు జాబ్ వదిలేస్తే నాకు అమెరికాలో గ్రీన్ కార్డు అవి అన్నీ కోల్పోవాల్సి వస్తుంది విజ్జీ. నేను చాలా ఇబ్బంది పడాలి.
మరి మనకు పెళ్ళైతే నువ్వు ఇండియా లో ఉండక అమెరికా వెళ్తావా అనుమానంగా అడిగింది విజిత.
అయ్యో విజితా ! అసలు ఏమీ లేకుండానే నువ్వు గాలిమేడలు కట్టేస్తున్నావు. పెళ్లివరకు వెళ్ళిపోయావు.
మీ అన్నయ్య వదినల జాతకాల మాదిరి నువ్వూ ప్లాన్ చెయ్యొచ్చు కదా.
ఓహ్ నువ్వు అంతా విన్నావా అని నవ్వాడు.
నాకైతే మీ నాన్నగారు మన పెళ్ళికి ఒప్పుకుంటారని నమ్మకంలేదు విజ్జీ. కానీ నేను ఎప్పటికీ నీ బెస్ట్ ఫ్రెండ్ ని. నా ఉద్యోగం, మీ బిజినెస్ రెండూ రెండు నెలల పాటు చూడాలంటె మటుకు చాలా కష్టం అవుతుందేమో చూడాలి. కానీ ముందు మీ నాన్నగారు క్షేమంగా ఇంటికి వచ్చి హ్యాపీ గా ఉంటె ఆయనతో అలోచించి ఎలా చెయ్యాలో ప్లాన్ చేద్దాం. ఆయన మైండ్ లో ఏముందో మనకు తెలీదుగా. ఆయన ఇంకెవరికైనా తన బాధ్యత అప్పగిస్తారేమో అన్నాడు. ఇప్పటికి ఈ టాపిక్ వదిలేద్దాం. మీ డాడ్ ఆరోగ్యం, ఆయన శత్రువుల మీద ఆక్షన్ అనేవి మనముందున్న ముఖ్య భాద్యతలు. పద మనమూ లోపలి వెళదాం. ఈ పాటికి మీ నాన్నగారు స్పృహలోకి వచ్చి ఉంటారు.
ఇద్దరూ లేచి ఐ సి యూ లోకి వెళ్లారు.
****
వెంకటరాజు గారు స్పృహలోకొచ్చారు.
ప్రక్కనే డాక్టర్, నర్స్ రీడింగ్స్ చెక్ చేస్తున్నారు.
కొన్ని మందులు ఇంట్రా వీనస్ లో ఎక్కిస్తున్నారు నొప్పి తెలియకుండా ఉండేందుకు.
మాధవి భర్తతో చిన్నగా ఎదో చెపుతోంది.
విజిత వినీల్ ఆయన దగ్గరికి వెళ్లారు.
వారిద్దరిని చూసి పలకరింపుగా నవ్వాడు.
అప్పటివరకు ఉగ్గబట్టుకున్న ఏడుపు విజిత నుంచి పొంగు కొచ్చింది. వస్తున్న కన్నీళ్లకు కొంగు అడ్డు పెట్టుకుంది.
ఏయ్ విజ్జీ ఏంట్రా ఇది. నేను బాగానే ఉన్నాను కదరా. ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు ఆయన.
మాధవి కూడా కన్నీళ్లను ఆపుకొని ఉంది. విజితను దగ్గరికి తీసుకొని ఊరుకోరా అమ్మలూ అంది.
చాలా థాంక్స్ వినీల్. మాధవి అంతా చెప్పింది అన్నారు ఆయన.
అయ్యో ఇప్పుడవన్నీ ఎందుకు సర్. మీరు కోలుకున్నారు. అది చాలు.
డాక్టర్ విజిత కి సైగ చేసాడు. ఎక్కువ మాట్లాడకండి అని.
ఓకే అని సరే డాడీ రెస్ట్ తీసుకోండి. మేము ఇక్కడే ఉంటాము. వినీల్ ఇక్కడే ఉంటాడు మాకు తోడుగా. పొద్దున్న వస్తాము. ఇప్పుడు మాట్లాడితే మీకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి తల్లిని, వినీల్ ని తీసుకుని బయటకు నడిచింది.
ఆ ఫ్లోర్ లో వి ఐ పి లకు కేటాయించే రూమ్స్ ఉన్నాయి.
ఐ సి యూ లో ఉన్న పేషెంట్ కు తోడుగా ఉండేందుకు వి ఐ పి రూమ్స్ ఉన్నాయి.
ఆరోజు వి ఐ పి పేషెంట్ ఒక్క రాజుగారు కాబట్టి ఆ ఫ్లోర్ అంతా ఖాళీగా ఉంది.
ఒక రూమ్ విజిత వాళ్లకు మరో రూమ్ వినీల్ కి కేటాయించారు.
అప్పటికే టైం పన్నెండు కావడంతో అందరూ అలసిపోయి ఉన్నారు.
విజిత మాధవి తమ రూమ్ లోకి వెళ్లారు పడుకునేందుకు.
అక్కడంతా ఖాళీ గానే ఉండటంతో ఓ పెద్ద సోఫా లో కూర్చున్నాడు వినీల్ తన లాప్టాప్ పెట్టుకుని. అతనికి రాత్రి మేలుకోవడం అలవాటే. తను సబ్మిట్ చేసిన ప్రాజెక్ట్ మీద మెయిల్స్ చూస్తున్నాడు. కొన్ని చేంజ్ రిక్వెస్ట్ లు ఉన్నాయి కోడింగ్ లో. అవి సరి చేస్తూ కూర్చున్నాడు.
అక్కడే కాఫీ వెండింగ్ మెషిన్ ఉండటంతో అబ్బా గ్రేట్ అనుకుంటూ కాఫీ పట్టుకుంటున్నాడు. వెనుకనే విజిత కూడా నిలబడి ఉంది. నాకు కూడా ఇవ్వు అంది.
హే ఇంకా నువ్వు పడుకోలేదా అన్నాడు వినీల్.
లేదు వినీల్. కొంచెం టెన్స్ గా ఉంది.
అబ్బా ఎందుకంత. డాడీ ఓకే నే కదా. అంతా ఓకే అయితే మీ నాన్నగారు రేపు డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చేస్తారు. జరిగినదానికి కొంత బాధ ఉంటుంది. తప్పదు. నేను చెప్పినంత సులువు కాదు. కానీ అదృష్టం కొద్దీ ఆయనకేమీ కాలేదు. అది గాడ్స్ బ్లెస్సింగ్స్.
ఒక కాఫీ విజితకిచ్చి తనొక కాఫీ తీసుకున్నాడు.
ఇద్దరూ సోఫాలో కూర్చుని సిప్ చేస్తున్నారు.
మమ్మీ పడుకున్నారా.
కళ్ళు మూసుకొని ఉంది. నాకు డౌట్. ఆమె కూడా ఆందోళనగానే ఉంది.
కానీలే. ఈ రాత్రి ఇలా గడవనీ. బాధపడటం తప్పదు అన్నాడు వినీల్ ఓదార్పుగా. నువ్వు ఒక్కతే చైల్డ్ కాబట్టి మీ పేరెంట్స్ ని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నీది. అందులోనూ మీ బిజినెస్ ఎంపైర్ కి కూడా నీవే రాణివి. ఈ రాణి గారికి పెళ్లయి రాజు గారు వచ్చే వరకు ఒంటరి పోరాటం తప్పదు అన్నాడు నవ్వుతూ.





