Home » History » ప్రాచీనాంధ్ర క్షత్రియులగు కమ్మవారి చరిత్ర
24. విజయనగర సామ్రాజ్యంలో కమ్మవారు సేనానాయక మంత్రిపదవులు, కోశాధ్యక్ష పదవి అదిగాగల ముఖ్యమైన పదవులను నిర్వహించిరి. శ్రీకృష్ణదేవరాయలకు పెమ్మసాని రామలింగనాయుడు, నాగమనాయుడు సేనానాయకులుగా పనిచేసిరి. ఈ కాలంలోనే పెమ్మసాని, రావెళ్ళ, సూర్యదేవర, రావి, వాసిరెడ్డి, సాయపనేని, మిక్కిలినేని, పరుచూరి, గింజుపల్లి, కిలారి వంశములకు చెందిన ప్రముఖులందరో ముఖ్యమైన అధికార పదవుల నలంకరించిరి.
25. కాకతీయ సామ్రాజ్య పతనానంతరము కాపయ నాయకుని తర్వాత ఓరుగల్లు వెలమవారి స్వాధీనమయ్యెను. అందుచే తమకు అప్పటివరకు సామంతులుగా వుండిన యీ వెలమ, రెడ్డి రాజ్యములందు హెచ్చుగా కమ్మవారు సామంతులుగా నుండక తమ బంధువులగు విజయనగర సంగమ రాజుల వద్దకు పోయి యచట సైనికులుగా సేనాధిపతులుగా నుండిరను భావయ్య చౌదరిగారి యభిప్రాయము పై జెప్పిన చరిత్ర ఆధారములను ధృవపరుస్తున్నది.
26. శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఆయన సేనా నాయకుడైన పెమ్మసాని నాగమ నాయుడు మధురలో తిరుగుబాటునణచి రమ్మని పంపగా తిరుగుబాటునణచి తానే రాజుగా ప్రకటించుకొనెను. నాగమనాయని మదమడంచుటకు శ్రీకృష్ణరాయల సేనా నాయకులలో ఎవరును సాహసము చేయకుండిన సందర్భంలో నాగమనాయని కుమారుడైన విశ్వనాథనాయకుడే అందుకు సాహసించి తండ్రితో హోరాహోరీ పోరాడి తండ్రిని బందీని చేసి యుద్ధ ఖైదీగా శ్రీకృష్ణరాయల ముందునిల్పినాడు. విశ్వనాథనాయుని సాహసానికి, రాజభక్తికి మెచ్చి శ్రీకృష్ణదేవరాయలు విశ్వనాధుని మధుర గవర్నరుగా (పాలకుడుగా) నియమించెను. 1529 నుండి 1564 వరకు 35 సంవత్సరములు విశ్వనాథనాయుడు, అతని తరుపరి అతని సంతతివారు 1736 వరకు అనగా 207 సంవత్సరములు మధుర నాయకరాజులుగా రాజ్యమేలి కళలను, సాహిత్యాన్ని ఎంతగానో అభివృద్ధి చేసిరి. పెమ్మసానివారు కమ్మవారనుటలో సందేహమేమియు లేదుగదా! ఇంతేకాక అచ్యుతనాయకుడు, రఘునాథనాయకుడు, విజయరాఘవ నాయకుడు మొదలుగాగల తంజావూరు నాయకరాజులుగా ప్రసిద్ధిచెందిన తెలుగువారు విజయనగర సామ్రాజ్యానికి సామంతులుగా రెండు వందల సంవత్సరములకు పైగా పరిపాలన చేసి తెలుగు సాహిత్యాన్ని, కళలను, సంస్కృతిని ఎంతో ప్రోత్సహించి అభివృద్ధి పరచిరి. తంజావూరు తెలుగు నాయక రాజుల కాలంలోనే ప్రముఖ సంగీత విద్వాంసులు క్షేత్రయ్య, త్యాగరాజులు వారి ఆస్థాన విద్వాంసులుగా విఖ్యాతి గాంచిరి.



