శని దేవుడికి నువ్వుల నూనె ఎందుకు సమర్పిస్తారో తెలుసా?

 

జ్యోతిషశాస్త్ర విశ్వాసాల ప్రకారం శనిని కర్మ ప్రదాత అంటారు.  వ్యక్తులు  చేసే పనులను బట్టి శని దేవుడు ఫలితాలు ఇస్తాడు. అందుకే శనిదేవుడు  న్యాయమూర్తిగా పరిగణిస్తారు. ఎక్కడ చూసినా శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి నువ్వుల నూనెతో అభిషేకం, నువ్వుల నూనె దీపారాధన చేయడం చూస్తుంటాం. ఇక శని దోషం, జీవితంలో సమస్యలు ఉన్న వారు అయితే శనిదేవుడికి నువ్వుల నూనె సమర్పించడంలో ముందుంటారు.  అసలు నువ్వుల నూనెతో శనిదేవుడికి దీపారాధన, అభిషేకం ఎందుకు చేస్తారు? దీని వెనుక ఉన్న కారణాలు ఏమిటి? హిందూ మత పురాణాలలో దీని గురించి ఏముంది తెలుసుకుంటే..

పురాణ కథనాలు ఇవీ..

పురాణాల ప్రకారం రావణుడు తన శక్తితో గ్రహాలన్నింటినీ బంధించాడని చెబుతారు. శనిదేవుడిని రావణుడు తన దురహంకారంతో తలకిందులుగా వేలాడదీశాడు. అదే సమయంలో.. హనుమంతుడు శ్రీ రాముని దూతగా తల్లి సీతను వెతుకుతూ లంకకు వెళ్ళాడు. రావణుడు హనుమంతుని తోకకు నిప్పంటించినప్పుడు హనుమంతుడు లంక మొత్తాన్ని తగలబెట్టాడు. మొత్తం లంకా దహనం చేయడం వల్ల గ్రహాలన్నీ స్వేచ్ఛగా మారాయి కానీ శనిదేవుడు తలకిందులుగా వేలాడుతూ ఉండడంతో శనిదేవుడు విముక్తి పొందలేక తలకిందులుగా ఉండటం వల్ల శరీరం దెబ్బతినింది.  శని బాధను తగ్గించడానికి హనుమంతుడు తన శరీరానికి నూనెతో మర్థనా చేసి శనిదేవుడిని నొప్పి నుండి విముక్తి చేశాడు. అప్పుడు శనిదేవుడు భక్తితో నాపై నూనెను పూసేవాడు అన్ని సమస్యల నుండి విముక్తి పొందుతాడు అని చెప్పాడట.  అప్పటి నుండి శని దేవుడికి నూనె సమర్పించే సంప్రదాయం మొదలైంది.


మరొక కథ..

మరొక కథ ప్రకారం రామాయణ కాలంలో  శని దేవుడు తన బలం,  ధైర్యం తలచుకుని  గర్వపడేవాడు. హనుమంతుని ధైర్యసాహసాల గురించి తెలుసుకున్న శనిదేవుడు  ఆయనతో  పోరాటానికి బయలుదేరాడు. శని దేవుడు హనుమంతుడిని  చేరుకున్నప్పుడు హనుమంతుడు నిశ్శబ్ద ప్రదేశంలో కళ్ళు మూసుకుని కూర్చుని  శ్రీరాముని భక్తిలో మునిగిపోయి ఉన్నాడు. అయితే గర్వంతో మునిగిపోయిన శనిదేవుడు హనుమంతుడిని యుద్దానికి రమ్మంటూ గట్టిదా పిలిచాడు. అయితే  ఇది సరికాదని, నేను శ్రీరాముడి ధ్యానంలో ఉన్నానని శని దేవుడికి  హనుమంతుడికి వివరించాడు. కానీ శని దేవుడు హనుమంతుడు చెప్పినదానికి ఒప్పుకోలేదు. యుద్దం చెయ్యాల్సిందేనని మొండి పట్టు పట్టాడు. దీంతో హనుమంతుడు యుద్దానికి దిగక తప్పలేదు.

చివరికి శనిదేవుడిని హనుమంతుడు  తన తోకకు చుట్టి  బాగా దెబ్బలు తగిలేలా కొట్టాడు.   ఈ పోరులో శనిదేవుడు గోరంగా ఓడిపోవడమే కాకుండా.. బాగా గయపడ్డాడు కూడా. దీని తరువాత శనిదేవుడు నొప్పితో మూలుగుతూ హనుమంతునికి క్షమాపణలు చెప్పాడు.   శ్రీరాముడు,  హనుమంతుని భక్తులను తాను ఎన్నటికీ వేధించనని హామీ ఇచ్చాడు. శ్రీరాముడిని,  హనుమంతుని పూజించే భక్తులపై తన ఆశీర్వాదాలను కురిపిస్తానని మాట ఇచ్చాడు.దీని తర్వాత హనుమంతుడు  శనిదేవునికి నూనె రాయడంతో శనిదేవుడి గాయాల బాధ తగ్గిందట. అందుకే ఎవరైతే హృదయపూర్వకంగా నాకు నూనె సమర్పిస్తారో, నేను అతని బాధలన్నీ పోగొట్టి కోరికలన్నీ తీరుస్తాను అని శనిదేవుడు మాట ఇచ్చినట్టు పురాణాలలో చెప్పబడింది. ఇవీ శనిదేవుడికి నూనె సమర్పించడం వెనుక ఉన్న కథనాలు.

                                                   *నిశ్శబ్ద.

 


More Purana Patralu - Mythological Stories