సముద్రుడికి, రాముడికి మధ్య సంభాషనేంటి?

సుకుడు పక్షి వేషంలో వచ్చి ఆకాశంలో నిలబడి, సుగ్రీవుడిని ఉద్దేశించి రావణుడు చెప్పిన మాటలని చెప్పాడు. ఇదంతా విన్న సుగ్రీవుడు  "దుర్మార్గ దురాత్ముడు అయిన రావణుడు నిజంగా అంత శక్తి కలిగినవాడైతే, రామలక్ష్మణులు లేని సమయంలో సీతమ్మని ఎందుకు అవహరించాడు. రాముడి కోదండ  పాండిత్యము ముందు రావణుడు నిలబడలేడు. వాడి స్నేహము, వాడి సందేశము నాకు అక్కరలేదు" అన్నాడు.

ఈలోగా అక్కడున్న వానరాలు గూఢచారిని విడిచిపెట్టకూడదని చెప్పి, అందరూ పైకి ఎగిరి ఆయన రెక్కలు విరిచేస్తున్నారు. అప్పుడా సుకుడు 'రామ రామ' అని ఏడిస్తే, రాముడు వెంటనే ఆ వానరాలని శాంతింపచేసి సుకుడుని విడిపించాడు. కాని వానరములు సుకుడిని బందీగా పట్టుకుని ఉంచాయి.

ఏమిచేస్తే ఈ సముద్రం మనకి దారి ఇస్తుంది అని విభీషణుడిని అడుగగా, ఆయన అన్నాడు "రాముడు శరణాగతి చేస్తే సముద్రం దారి ఇస్తుంది" అన్నాడు.

చందనము మొదలైన వాటి చేత ఒకనాడు అలదబడినటువంటి బాహువు, కోట్ల గోవులని దానము చేసిన బాహువు, మణులతో కూడిన కేయూరములు మొదలైనవాటితో అలంకరింపబడ్డ బాహువు, అనడమంది స్త్రీలచేత స్నుసింపబడ్డ బాహువు, ఒకనాడు సీతమ్మ తలగడగా వాడుకున్న బాహువుని ఈనాడు తనకి తలగడగా చేసుకొని రాముడు సముద్రానికి శరణాగతి చేసి సముద్రపు ఒడ్డున పడుకున్నాడు. మూడు రాత్రులు గడిచిపోయినప్పటికి సముద్రుడు రాకపోవడం వలన రాముడికి ఆగ్రహం వచ్చి లక్ష్మణుడితో అన్నాడు "పౌరుషం ఉన్నవాడు తన పౌరుషాన్ని ప్రకటించకుండా మంచితనాన్ని ప్రకటిస్తే చేతకానివాడిగా చూస్తుంది ఈ ప్రపంచం. ఈ సాగరం దారి ఇవ్వకపోతే నేను వెళ్ళలేను అనుకుంటుంది. బ్రహ్మాస్త్రం చేత ఈ సాగరాన్ని ఎండించేస్తాను. ఇందులో ఉన్న తిమింగలాలని, మొసళ్ళని, పాములని, రాక్షసులని నిగ్రహిస్తాను. ఒక్క ప్రాణి బతకకుండా చేసేస్తాను. ఈ బ్రహ్మాస్త్రం విడిచిపెట్టిన తరువాత ఇక్కడ నీరు ఉత్తర క్షణం ఆవిరయిపోయి ధూళి ఎగురుతుంది. అప్పుడు వానరులందరూ భూమి మీద నడుచుకుంటూ లంకని చేరుకుంటారు" అని చెప్పి, కోదండాన్ని తీసి బ్రహ్మాస్త్రాన్ని అనుసంధానం చేశాడు.

అలా చేసేటప్పటికి పర్వతాలన్ని కదిలిపోయాయి, వ్యాకులంగా గాలి వీచింది. అగ్నిహోత్రపు మంటలు సూర్యుడి నుండి కిందపడ్డాయి, ప్రాణులన్నీ దీనంగా ఘోష పెట్టాయి, రెండు యోజనముల దూరం సముద్రము వెనక్కి వెళ్ళిపోయింది. ఆ సమయంలో సముద్రుడు లోపలినుండి బయటకి వచ్చాడు.

ఆ సముద్రంలో పుట్టిన అనేకమైన బంగారములు, రత్నములతో కూడిన ఒక పెద్ద హారాన్ని సముద్రుడు వేసుకొని ఉన్నాడు. శ్రీ మహావిష్ణువు ధరించే కౌస్తుభానికి తోడపుట్టిన ఒక మణిని మెడలో వేసుకొని ఉన్నాడు. పైకి కిందకి వెళుతున్న తరంగ సద్రుస్యమైన వస్త్రాన్ని ధరించి ఉన్నాడు. గంగ, సిందు మొదలైన నదులన్నీ స్త్రీల స్వరూపాన్ని పొంది ఆయన వెనుక వస్తున్నాయి.

పైకిలేచిన సముద్రుడు రాముడికి నమస్కరించి "భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశములు అనే పంచ భూతములు ఉన్నాయి. వీటన్నిటికీ ఒక స్వభావం ఉంటుంది, ఆ స్వభావాన్ని ఈ పంచ భూతములు అతిక్రమించలేవు. సముద్రం అంటే అగాధంగా ఉండాలి. లోతుగా ఉండాలి, అందులోకి దిగినవాడికి ఆధారం చిక్కకూడదు, సముద్రంలో ఏదన్నా పడితే మునిగిపోవాలి, వ్యాకులితమైన తరంగాలతో ఒడ్డుని కొడుతూ ఉండాలి. ఇలా ఉండకపోతే దానిని సముద్రము అనరు. అందుకని ఈ సముద్రాన్ని ఎండింపచెయ్యడం, సముద్రంలో నుండి దారి ఇవ్వడం నాకు వెలువడే విషయం కాదు.. నువ్వు అభిమంత్రించిన బ్రహ్మాస్త్రాన్ని నా మీదకి వెయ్యకు. 

నీ దగ్గర ఉన్న వాసరములలో విశ్వకర్మ కుమారుడైన నలుడు ఉన్నాడు. విశ్వకర్మ గొప్ప గొప్ప కట్టడములను నిర్మిస్తూ ఉంటాడు. అటువంటివాడి తేజస్సు కనుక ఈ నలుడికి సేతువు నిర్మాణం తెలుసు. మీరు నా మీద సేతువుని నిర్మించుకోండి. అందుకని వానరులు తెచ్చి పడేసిన చెట్లు, బండలు మొదలైనవి అటూ ఇటూ చిమ్మకుండా నా తరంగముల చేత తేలేటట్టు చేస్తాను. నాలో ఉన్న ఏ క్రూర మృగము వలన వారధిని దాటేటప్పుడు వానరములకి ఎటువంటి భీతి లేకుండా నేను కాపాడతాను. సేతు నిర్మాణం వెంటనే ప్రారంభించండి. ద్రుమకుల్యము అని ఉత్తర తీరంలో ఉంది. అక్కడుండే జలాలని ఆభీరులు, దాస్యులు అనే వారు తాగేస్తుంటారు. సముద్రాన్ని క్షోభింప చేస్తుంటారు. అందుకని నువ్వు ఈ బ్రహ్మాస్త్రాన్ని ఇక్కడి నుండి అక్కడికి ప్రయోగించు" అన్నాడు.

                                      ◆నిశ్శబ్ద.


More Punya Kshetralu