ఉగాదినాడు నువ్వుల నూనెతో స్నానం చేసి తీరాలా!
ఈ సృష్టి ప్రారంభం అయ్యింది చైత్రమాసంతోనే అని పెద్దల నమ్మకం. ఆ నమ్మకానికి అనుగుణంగానే ప్రకృతిలోని అణువణువూ ఉగాది సమయానికి కొత్త చిగుర్లు వేస్తుంటాయి. అలా చైత్ర మాసపు తొలిరోజు యుగాదిగా స్థిరపడిపోయింది. ఉగాది రోజున ఆచరించాల్సిన విధులలో మొదటిది తైలాభ్యంగనం అని చెబుతారు పెద్దలు. అంటే ఒంటి నిండా నువ్వుల నూనెను దట్టించి, శనగపిండితో స్నానం చేయడం. ఇలాంటి స్నానంతో మన చర్మంలోని ప్రతి స్వేదరంధ్రమూ శుభ్రపడుతుంది. మున్ముందు వేసవిలో వచ్చే చర్మ సమస్యలని ఎదుర్కొనేందుకు సిద్ధపడుతుంది.
ఇక తైలాభ్యంగనం కోసం నువ్వుల నూనెని వాడమని చెబుతుంటారు. ఇందుకు కారణం లేకపోలేదు. నువ్వుల నూనె మిగతా నూనెలకంటే చిక్కగా ఉంటుంది. దాంతో ఒంటి మీద పేరుకుపోయి ఉన్న మలినాలను శుభ్రపరుస్తుంది. పైగా నువ్వుల నూనె సాంద్రత వల్ల ఒంటికి మర్దనా చేసినప్పుడు, చర్మంలో ఉన్న సున్నితమైన రక్తనాళాల పనితీరు మెరుగుపడతుంది. చర్మానికీ, జుట్టుకి అవసరమయ్యే విటమిన్ ఇ, కె నువ్వులనూనెలో సమృద్ధిగా ఉంటాయి. ఇక నువ్వుల నూనెతో మర్దనా వల్ల కఫ వాత, కఫ దోషాలను నివారించవచ్చని ఆయుర్వేదం చెబుతోంది. అంటే శరీరం శుభ్రంగా ఉండాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా... చర్మమూ, జుట్టు నిగనిగలాడాలన్నా తైలాభ్యంగనం గొప్ప ఔషధంగా పనిచేస్తుందన్నమాట.
కానీ ఉరుకుల పరుగుల జీవితంలో తైలాభ్యంగనం చేయడం వల్ల సమయం వృధా అవుతుందని భావిస్తాము. అందుకే కనీసం పక్షం రోజులకి ఓసారైనా తైలాభ్యంగనం చేయమని సూచిస్తుంటారు పెద్దలు. అదీ కుదరదంటారా... కనీసం ఉగాది, సంక్రాంతి, నరకచతుర్దశి, మతత్రయ ఏకాదశి వంటి సందర్భాలలో అయినా తైలాభ్యంగనం చేయమంటారు. ఏదీ కుదరకపోతే సంవత్సరం ఆరంభం అయిన ఉగాది రోజైనా తైలాభ్యంగనం చేసి తీరాలి. ఇక ఉగాది రోజున కూడా తైలాభ్యంగనం చేయనివారికి ఏం చెప్పగలం! అందుకే ఉగాది రోజున తైలాభ్యంగనం చేయనివాడు నరకానికి పోతాడని శపిస్తుంటారు పెద్దలు. పైన ఉన్న నరకం సంగతేమో కానీ... పెద్దలు సూచించిన ఆరోగ్య సూత్రాలను పాటించకపోతే నిజంగానే నేలమీదే అనారోగ్యం అనే నరకాన్ని చూడాల్సి వస్తుంది మరి!
- నిర్జర.