పద్మనాభ స్వామి లక్ష కోట్లు ఎవరికి చెందుతాయి?

Anantha Padmanabha Swamy Property belongs to...

 

అనంత పద్మనాభ స్వామి ఆలయంలోని బంగారు నాణాలు, ఆభరణాలను లెక్కించగా లక్ష కోట్లకు పైగా విలువ చేస్తాయని తేలింది. అమెరికన్ డాలర్లలో చూస్తే 22 బిలియన్ డాలర్లు. లక్ష కోట్ల విలువైన అనంత పద్మనాభ స్వామి ఆలయం ఇప్పుడు అందరికీ చర్చనీయాంశంగా ఉంది. అనేక శతాబ్దాలుగా మహారాజులు సమర్పించిన వజ్రం, గోమేధికం, పుష్యరాగం లాంటి అమూల్య రత్నాలు పొదిగిన స్వర్ణాభరణాలు, 530 కిలోల బంగారు నాణాలు చూట్టానికి రెండు కళ్ళూ చాలవు. అవి మహోజ్జ్వలంగా, దేదీప్యమానంగా ఉండి కళ్ళు జిగేల్మంటున్నాయి.

 

పద్మనాభ స్వామి ఆలయంలోని ఈస్ట్ ఇండియా కంపెనీ, నెపోలియన్ కాలం నాటి బంగారు నాణాలు, అసంఖ్యాకమైన ఆభరణాలు, కిరీటాలు - వీటన్నిట్నీ ఇన్నాళ్ళూ ఎందుకు నిగూఢంగా ఉంచినట్లు? వెయ్యేళ్ళ చరిత్ర గల తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామి ఆలయ సంపదల గురించి అసలు రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏముంది?

 

తిరుమల వేంకటేశ్వర స్వామికి వచ్చే కానుకలు, భారీ విరాళాల గురించి ఎక్కడా దాపరికం ఉండదు. ఎప్పటికప్పుడు స్వామివారి ఆస్తుల వివరాలను ప్రకటిస్తారు. ఏరోజుకారోజు నిన్నటి ఆదాయాన్ని సుస్పష్టంగా తెలియజేస్తారు. తిరుమలేశుని ఆదాయాన్ని విద్య, వైద్యం లాంటి ప్రజా ప్రయోజనాల కోసం ఖర్చుపెడతారు.

 

మరి అనంత పద్మనాభస్వామి సంపదలను ఇన్నాళ్ళూ ఎందుకు రహస్యంగా ఉంచినట్లు? ఇది వ్యక్తుల ఆస్తి కాదు. నల్లధనం కాదు. స్వామివారికి రాజులు, ఖజానాలు ఇచ్చిన సంపద. మరి దీన్ని రహస్యంగా దాచి ఉంచడంలో అర్ధం ఏమిటి? ''బి'' సెల్లార్లో ఉన్న బంగారు రాశులను ఇంకా లేక్కబెట్టనేలేదు. దాని విలువ ఇంకా ఎంత ఉంటుందో! స్వామివారి ఈ లక్ష కోట్లకు పైగా సంపదకు కాపలా పెట్టినప్పటికీ భద్రంగానే ఉంటుందా?

 

ఇంతకీ ఈ లక్షకోట్లు ఎవరికి చెందుతాయి? ప్రభుత్వానికా? రాజకుటుంబాలకా? లేక దేవాలయానికా? ఈ విషయం ఇంకా పూర్తిగా తేలలేదు. సుప్రీంకోర్టు ఉత్తర్వు మీద ఆధారపడి ఉంటుంది.

 

ఒకవేళ పద్మనాభస్వామి ఆలయ సంపద ఆ ఆలయానికే చెందినట్లయితే ఆ సొమ్మును ఎలా వినియోగిస్తారు? ప్రజా ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారా? లేక అందులో దుర్వినియోగం జరుగుతుందా?

 

కేరళ అనంత పద్మనాభస్వామి ఆలయ లక్ష కోట్ల సంపాదనకు సంబంధించి అన్నీ ప్రశ్నలే. మన సందేహాలన్నీ నివృత్తి కావాలంటే ఈ అంశమై కోర్టు ఏం తీర్పు ఇవ్వనుందో వేచి చూడాల్సిందే!


Trivandrum Anantha Padmanabha Swamy Property, Kerala Anantha Padmanabha Swamy Temple Property, Anantha Padmanabha Swamy gold belongs to, Anantha Padmanabha Swamy 1 lakh crore belongs to, Anantha Padmanabhaswamy issue Supreme Court


More Punya Kshetralu