మట్టెలు ఎందుకు ధరిస్తారు!

 

 

హిందూ వివాహ సంప్రదాయంలో కాలిమట్టెలకు ఉన్న ప్రాధాన్యత అంతాఇంతా కాదు. వివాహం జరిగిన దగ్గర్నుంచి మంగళసూత్రంతో పాటుగా, కాలిమట్టెలు కూడా ఆమె సౌభాగ్యానికి చిహ్నంగా మారతాయి. ఇంతకీ కాలిమట్టెలు ఎందుకు ధరిస్తారు. వీటి వెనుక ఏవన్నా అంతరార్థాలు ఉన్నాయా అంటే కొన్ని కారణాలు కనిపించకపోవు...

 

వెండితోనే ఎందుకు?

బంగారం లక్ష్మీదేవితో సమానం కాబట్టి నడుము భాగం నుంచి కిందకి ధరించే ఆభరణాలు బంగారంతో చేయించకూడదన్నది ఒక నమ్మకం. ఇక బంగారంతో పోల్చుకుంటే వెండికి విద్వుద్వాహకత చాలా ఎక్కువ. తద్వారా భూమికీ, శరీరానికీ మధ్య ఒక అనుసంధానంగా కాలిమట్టె పనిచేస్తుందనీ... ధరిత్రి మీద నుంచి వెలువడే శక్తి తరంగాలను శరీరానికి అందచేస్తుందని నమ్మకం.

 

రెండో వేలికే ఎందుకు?

మన శరీరంలోని నాడులన్నీ చేతులు, కాలి వేళ్లల్లో కేంద్రీకృతమయ్యాయని ప్రాచీన వైద్యం చెబుతోంది. కాబట్టి మన చేతులు, కాళ్లలోని ఒకో ప్రాంతం మీదా ఒత్తిడి తీసుకురావడం వల్ల ఒకో అవయవం పనితీరుని ప్రభావితం చేయవచ్చునంటారు. అలా కాలికి ఉండే రెండో వేలి మీద ఒత్తిడి ఏర్పడినప్పుడు గర్భాశయపు పనితీరు మెరుగుపడుతుందని చెబుతున్నారు. తద్వారా రుతుసంబంధమైన సమస్యలు, సంతానం కలగడంలో ఏర్పడుతున్న ఇబ్బందులు తొలగిపోతాయంటున్నారు.

 

పెళ్లి తరువాతే ఎందుకు?

స్త్రీకి వివాహం అయ్యిందని తెలిపేందుకు కాలి మెట్టెలు ఒక చిహ్నం. ఆమెను తల్లిగా భావించాలనీ, ఆమెతో మర్యాదగా మెలగాలనీ ఒక సూచన. పైగా కొన్ని ప్రాంతాలలో భర్త చనిపోయినా కూడా ఆమె సోదరులు ఎవరన్నా జీవించే ఉంటే రెండు మట్టెలలో ఒకటే తీసివేసే సంప్రదాయం ఉంది. ఆమెకు రక్షగా ఇంకా ఆమె సోదరుల ఉన్నారన్న హెచ్చరిక ఇందులో కనిపిస్తుంది.

 

భారతీయులలోనే ఎందుకు?

హైందవ సంప్రదాయంలో వేల ఏళ్లుగా మట్టెలు ధరించే ఆచారం కొనసాగుతోంది. వైదిక సాహిత్యంలో దీని ప్రస్తావన లేకపోయినా, పురాణాలలో మాత్రం మట్టెల గురించిన ప్రస్తావన అక్కడక్కడా కనిపిస్తుంది. ఇలా మట్టెలు ధరించే అలవాటు ఈజిప్టు వంటి ఇతర ప్రాచీన సంస్కృతుల దగ్గర్నుంచీ నేటి పాశ్చత్య దేశాల వరకూ కనిపించినా... అవి అలంకారం కోసమే కానీ సౌభాగ్యానికో, ఆరోగ్యానికో ఉపయోగించడం తక్కువే! అయితే రోజురోజుకీ నాడీవ్యవస్థకూ, కాలివేళ్లకూ మధ్య ఉన్న సంబంధం గురించి ప్రచారం పెరిగిపోతోంది. అందుకనే ‘Magnetic Toe rings’ పేరుతో రకరకాల మట్టెలు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. కానీ అలాంటి ప్రచారం ఏదీ అవసరం లేకుండానే వివాహ ఆచారంలో భాగంగా భారతీయ స్త్రీలు తరతరాలుగా మట్టెలను ధరిస్తూనే వస్తున్నారు.

 

- నిర్జర.


More Enduku-Emiti