లేవండి.. మేల్కొనండి.. గమ్యం చేరేవరకు ఆగకండి
(Arise! Awake and stop not till you reach the goal)
వివేకానందునికి ఇష్టమైన మాట!
వివేకానందుని తల్చుకోగానే అసంకల్పితంగా ఈ మాటలు కూడా గుర్తుకువస్తాయి. ఈ మాటలు వివేకానందులవారు అన్నవి కాదు కానీ, తనవే అన్నంతగా ఆ మాటలను ఆయన సొంతం చేసుకున్నారు. ఈ మాటలకు మూలం భగవద్గీతతో పోల్చదగిన కఠోపనిషత్తులో కనిపిస్తుంది. అసలు కఠోపనిషత్తు ఉద్భవించడానికి కారణంగా చెప్పుకునే కథే ఒక అద్భుతం.
పూర్వం నచికేతుడు అనే బాలుడి మీద కోపం వచ్చిన అతని తండ్రి ‘నిన్ను యమునికి దానం చేస్తున్నాను ఫో!’ అనేస్తాడు. తండ్రి మాటను జవదాటని నచికేతడు ఎవరెంత వారిస్తున్నా వినకుండా, నరకలోకానికి బయల్దేరి, తనను గ్రహించమంటూ యముడిని వేడుకుంటాడు. నచికేతుని పితృవాక్పరిపాలనకు ముచ్చటపడిన యముడు అతన్ని మూడు కోరికలు కోరుకొమ్మని వరమిస్తాడు. అందులో ఒక కోరికగా నచికేతుడు జనన మరణ రహస్యాలను తెలుసుకోగోరతాడు. ఆ బ్రహ్మవిద్యకు బదులుగా మరే కోరికనైనా కోరుకొనమని యముడు ఎంతగా ప్రలోభ పెట్టినా, నచికేతుడు తన పట్టుని వీడడు. చివరికి నచికేతుని పట్టుకి లొంగి, యముడు చేసిన బోధ ఆధారంగా కఠోపనిషత్తు సాగుతుంది.
వివేకానందునికి ఈ కఠోపనిషత్తు అన్నా, అందులోని ముఖ్య పాత్ర అయిన నచికేతుడన్నా చాలా ఇష్టం. కఠోపనిషత్తులోని మూడో అధ్యాయంలోని 14వ శ్లోకంలో కనిపించే ‘ఉత్తిష్ఠత! జాగ్రత! ప్రాప్యవరాన్ నిబోధత’ అన్న వాక్యాలను ఆయన నిరంతరం స్మరించేవారు. స్వాతంత్ర్య పోరాటం దగ్గర నుంచి, జీవిత గమనం వరకూ ఈ వాక్యాలు మానవుని ప్రతి లక్ష్యసాధనకూ ప్రోత్సాహంగా నిలిచాయి. కాస్త జాగ్రత్తగా గమనిస్తే ఇందులోని ప్రతి మాటలోనూ ఓ నిగూఢార్థం ధ్వనిస్తుంది. లేవండి అంటే కేవలం నిటారుగా నిల్చోవడం కాదు, లక్ష్యసాధనకు సంసిద్ధులుగా ఉండటం. మేల్కొనండి అంటే నిద్ర నుంచి లేవడం కాదు, బద్ధకాన్ని వదిలి... విచక్షణతో, జాగరూకతతో మెలగడం. ఇక ఆరంభశూరత్వంతో ప్రారంభపు అడుగులు వేసి కూలబడిపోకుండా, గమ్యాన్ని చేరేవరకూ విశ్రమించకూడదని హెచ్చరిస్తోంది వాక్యంలోని చివరిభాగం. అంటే మనసా, వాచా, కర్మణా లక్ష్యాన్ని సాధించేందుకు ప్రయత్నించండి అని సూచిస్తోంది ఈ ఉపనిషత్ శ్లోకం. ఆధునిక భారతావనికి ఇంతకంటే గొప్ప సూక్తి మరేముంటుంది! మరి అలాంటి మాటను వివేకానందుడు పదేపదే స్మరించి, బోధించడంలో ఆశ్చర్యం ఏముంది!
- నిర్జర