శిరిడీలో డాక్టర్ పిళ్లే అనే ఆయన నివాసముండేవాడు. ఆయనంటే బాబాకు చాలా ఇష్టం. చాలా విషయాలలో ఆయనను సంప్రదించేవారు బాబా. అలాంటి పిళ్లే ఒకసారి గినియా పురుగులతో తెగ బాధపడసాగాడు. అతని కాలి మీద కురుపుగా మారిన గినియా పురుగులతో పిళ్లేకి నరకం కనిపించసాగింది. ఆ బాధను తట్టుకోలేక ఓసారి పిళ్లే ఈ బాధకన్నా చావు మేలుగా కనిపిస్తోందనీ, పూర్వ జన్మ కర్మ ఫలాన్ని ఎలాగూ అనుభవించక తప్పదు కాబట్టి, ఈ బాధను మరో పది జన్మలకు పంచిపెట్టమనీ... కాకాసాహెబ్ ద్వారా బాబాకు కబురు పంపాడు. దానికి బాబా ‘పదిజన్మల కర్మను పదిరోజుల్లో తీసివేయదగిన తానుండగా, పిళ్లే ఆ పాపకర్మను మోయవలసిన పని లేదు. నిర్భయంగా ఉండ’మని జవాబు పంపారు. అంతేకాదు పిళ్లేను తీసుకువచ్చి మసీదులో కూర్చుండపెట్టమని ఆజ్ఞాపించారు. మసీదుకి చేరిన పిళ్లేతో ‘కాసేపట్లో ఓ కాకి వచ్చి ఆ పుండుని పొడుస్తుందనీ, కంగారుపడవద్దనీ’ అభయమిచ్చారు. సాయి చెప్పినట్లుగానే కాసేపటికి మసీదులో ప్రతిరోజు దీపాలను తుడిచే అబ్దుల్ అనే భక్తుడు వచ్చాడు. దీపాలను తుడుస్తూ అటూఇటూ హడావుడిగా తిరుగుతున్న అబ్దుల్ అనుకోకుండా పిళ్లే కాలుని తొక్కనే తొక్కాడు. ఆ దెబ్బతో పిళ్లే కురుపులో ఉన్నా గినియా పురుగులన్నీ ఒక్కసారిగా బయటపడిపోయాయి.
పిళ్లే బాధ తగ్గిన విషయాన్ని అటుంచితే తాను పది జన్మల పాప ఫలితాన్ని ఇట్టే తీసివేస్తానని చెప్పిన బాబా మాటలు చాలా అమూల్యమైనవి. ఎందుకంటే సంసార చక్రంలో చిక్కుకుని ఉన్నప్పుడే కర్మఫలం అన్న ప్రసక్తి వస్తుంది. ప్రపంచం అనే మోహాన్ని కాలదన్నినప్పుడు, గడ్డిపోచ దగ్థమైనట్లుగా కర్మఫలం కూడా దహించుకుపోతుంది. అలా ఇతరుల కర్మఫలాన్ని స్వీకరించి వాటిని దగ్థం చేయగల సత్తా తనకి ఉందని అభయమిస్తున్నారు బాబా. కర్మఫలాన్ని అనుభవించక తప్పదన్న మాట నిజమే అయినప్పటికీ, దానిని బాబా పాదాల చెంత విడిచినప్పుడు... కర్మా ఉండదు, కర్మ ఫలిమూ మిగలదు.
--నిర్జర