నవ రాత్రులలో లక్ష్మీ కటాక్షం కావాలా? ఈ పనులు చెయ్యండి చాలు..!

 


లక్ష్మీ దేవి అందరి మోములలో సంతోషాన్ని, ఇంటికి అదృష్టాన్ని తీసుకొచ్చే దేవత.   అష్ట లక్ష్ములలో మహా లక్ష్మి కూడా ఒకరు. అయితే రూపం వేరు అయినా ఆ అమ్మ శక్తి మాత్రం ఒకటే అంటారు.  ప్రతి ఒక్కరూ జీవితంలో సంతోషంగా ఉండాలి అంటే లక్ష్మీ దేవి అనుగ్రహం ఉండాల్సిందే.. అయితే కొందరు ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతుంటారు. దుర్గాదేవి మహాలక్ష్మి స్వరూపమే అని..  దేవీ నవ రాత్రులలో కొన్ని పనులు చేయడం వల్ల లక్ష్మీ దేవి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.  అవేంటంటే..

నాణెం..

చాలామంది ఇంట్లో వెండి నాణం లేదా బంగారు నాణెం ఉంటే సాక్షాత్తూ లక్ష్మీదేవి ఇంట్లో ఉన్నట్టే భావిస్తారు.  ఒక వేళ వెండి లేదా బంగారు నాణెం ఇంట్లో లేకపోతే ఈ దేవీ నవ రాత్రులలో అమ్మవారి నాణెం ఇంటికి తీసుకువచ్చి దేవుడి గదిలో ఉంచి పూజించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది.  బంగారం కొనలేనివారు వెండి నాణెం కొనుగోలు చేయవచ్చు.  ఇలా చేస్తే ఆర్థిక పరమైన ఇబ్బందులు తగ్గుతాయి.

తులసి..

తులసిని మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు.  కనుకనే మహా విష్టువు కూడా తులసి ఉన్న చోట కొలువై ఉంటాడట. నవ రాత్రులలో ఇంట్లో తులసి మొక్కను నాటడం వల్ల మహాలక్ష్మి కృప లభిస్తుందట. తులసి మొక్కను నాటి రోజూ తులసి మొక్క దగ్గర దీపం పెడుతుంటే ఆర్థికంగా ఎదుగుదల బాగుంటుంది. ఇంటిల్లిపాది సంతోషంగా ఉంటుంది.  ఆర్థిక బాధలు, ఇతర సమస్యలు తొలగుతాయి.

మర్రిచెట్టు..

ఆర్థిక సమస్యలు ఎదుర్కునేవారు వాటి నుండి ఉపశమనం కోరుకుంటే మర్రి చెట్టు ద్వారా ఉపశమనం పొందవచ్చు. మర్రిచెట్టు చిన్న వేరును తీసుకుని వచ్చి దాన్ని ఇంటి దేవుడి గదిలో అమ్మవారి ముందు ఉంచి ఆర్థిక సమస్యల నుండి విముక్తి కలిగించమని అమ్మవారికి చెప్పుకుని ఆ వేరును దేవుడి గదిలో భద్రంగా ఉంచాలి.  ఇలా చేస్తే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయట.

కనకధార స్తోత్రం..

కనకధార స్తోత్రం ఆది శంకరాచార్యులు వారి నోటి నుండి ఎంతో అశువుగా ఆవిష్కరించబడిన స్తోత్రం. కానీ దీని మహిమ మాత్రం అమోఘం.  దేవీ నవరాత్రుల సమయంలో ప్రతి రోజూ ఉదయాన్నే లేచి స్నానం చేసి, ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని అమ్మవారికి నైవేద్యం వండి, ధూప దీపాలతో అమ్మవారికి పూజ చేసుకుని అమ్మవారి ముందు కూర్చుని కనకధార స్తోత్రాన్ని పఠించాలి.  అలాగే శ్రీసూక్తం కూడా పారాయణ చేయాలి.  శ్రీసూక్తాన్ని, కనకధార స్తోత్రాన్ని 108 రోజులు నిష్టతో పారాయణ చేస్తే ఎలాంటి ఆర్థిక సమస్యలు అయినా పరిష్కారం అవుతాయట. అంతేకాదు నవరాత్రుల సమయంలో ప్రతిరోజా సాయంత్రం అమ్మవారికి హారతి ఇచ్చే సమయంలో కనకధార స్తోత్రాన్ని 9సార్లు పారాయణ చేయాలి.  ఇది ఆర్థిక సమస్యలు తొలగిస్తుంది.

దీపం..

నవరాత్రుల సమయంలో రావి చెట్టు దగ్గర నెయ్యి దీపం వెలిగించాలి.  దీని వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అమ్మవారికి తామర పువ్వులు అంటే చాలా ఇష్టం.   శుక్రవారం రోజు తామర పువ్వు తీసుకుని ఎర్రని వస్త్రంలో చుట్టి డబ్బు ఉంచే ప్రదేశంలో  ఉంచాలి.  ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది.


                                                *రూపశ్రీ.


More Dasara - Navaratrulu