అమ్మవారి కరుణకు నియమాలు!!
మేము వేలు లక్షలు జపం చేయలేము, హోమాలు చేయలేము, దానధర్మాలు చేసే స్థితిలో లేము కాబట్టి మాకు అమ్మవారి అనుగ్రహం దొరకదు అని చాలా మంది అనుకుంటూ వుంటారు. నిజానికి మంత్రం, జపం, యాగం, హోమం, పూజ, ఇవన్నీ ఏ దేవుడికి అయినా చేస్తాము. అయితే ఇవి ఆ దేవుళ్లకు మనుషులు దగ్గరగా వెళ్ళడానికి కొన్ని మార్గాలు. అంటే ఇవన్నీ చేయడం వల్ల శ్రద్ధ, ఓర్పు పెరుగుతుంది తద్వారా భక్తి మెరుగవుతూ ఆ దైవం మీద నమ్మకం కలుగుతుంది. ఆ నమ్మకం క్రమంగా మనల్ని నడిపించే ఒక శక్తిగా మారుతుంది. అయితే అలాంటివి ఏమీ లేకుండా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మీ సమయం వృధా కాకుండా ధర్మవర్ధిని అయిన జగన్మాత కరుణను అపారంగా పొందవచ్చు. అయితే దానికి కొన్ని నిమాయలు, ఎంతో ధర్మబద్ధమైన విషయాలు ఉన్నాయి
ఈర్ష్య ని వదిలేయాలి తమకన్నా ఉన్నతంగా ఉన్నవారిని చూసి ఆనందపడకపోయిన పర్వాలేదు కానీ అసూయ పడకూడదు. ఎందుకంటే మనిషి ఎదగనివ్వని గుణాలలో ఈర్ష్య కూడా ఒకటి. అలాంటి గుణం ఉంటే మనిషిలో ధర్మబద్ధంగా ఆలోచనలు నశిస్తాయి.
చాడీలు చెప్పడం ఒకరి గురించి తప్పుగా పుకార్లు పుట్టించడం కల్పించి మాట్లాడటం, విడగొట్టడం లేనిపోనివి కల్పించి ఒకరి బాధకు కారణం కావడం ఇటువంటివి చేసే వారు ఎన్ని పూజలు చేసిన ఉపయోగం లేదు. ఒకరి బాధకు కారణం అయ్యే ఎవరూ బాగుపడిన, సంతోషపడిన విషయాలు మన చుట్టూ కానీ ఏ గ్రంథాలలో కానీ రాసినట్టు లేదు.
కొంతమంది మూర్ఖులలాగా విసిగిస్తూ ఉంటారు. వాళ్లు మీ పట్ల ద్వేషాన్ని, అసహ్యన్ని ప్రదర్శిస్తూ మానసికంగా బాధపెడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ గురించి పట్టించుకోవడం మనేయాలి కానీ తిరిగి వారిని ఏదో అనడం, చేయడం సమంజసం కాదు. బాధపెట్టడం వాళ్ళ ఉద్దేశ్యమైనపుడు దాన్ని వదిలేయడం ఉత్తమం కానీ బాధపడితే వాళ్ళ ఆనందాన్ని పెంచినట్టే కదా. కాబట్టి మానసిక రోగులు అనుకుని జాలి పడి వారి ప్రవర్తన గురించి ఆలోచిస్తూ మీ మన శాంతిని కోల్పోకూడదు.
కష్టానికి తగ్గ ఫలితాన్ని మాత్రమే ఆశించాలి, నిజాయితీగా పనిచేయాలి, ఇంకొకరి కష్టాన్ని లాక్కోకూడదు దొంగతనంగా ఏది తీసుకోకూడదు, ఇతరుల డబ్బుకు, వస్తువులకు ఆశపడకూడదు. అడ్డదారిలో డబ్బు సంపాదించే ఆలోచనలు, పనులు చేయకూడదు.
మీరు తిని మిగిలింది పడేయకుండా వీధి కుక్కలకు అయినా పెట్టచ్చు, ఆహారాన్ని వృధా చేయకూడదు. వంద నీతి వాక్యాలు చెబుతూ బతకడం కంటే ఒక మంచి పని అయినా చేస్తూ బతకడం ఎంతో గొప్పది.
ఇంట్లో ఎక్కడా దుమ్ము ధూళి మాసిన బట్టలు , తిన్న ఎంగిలి గిన్నెలు, నిద్ర లేచిన పడకలు, భూజు, ధూళి నిండిన దేవుని పటాలు పసుపు లేని గడపలు, ఇంట్లో వెంట్రుకలు విరబోసుకుని తిరిగే ఆడవాళ్లు ఇంట్లో అన్నిటిలో రాలిన వెంట్రుకలు, పాచి పట్టి జారే బాత్రూమ్ లు పగిలిన అద్దాలు, ఆగిపోయిన గోడ గడియారాలు, స్టీల్ సామాన్లు కోసం దాచి పెట్టె వెంట్రుకలు.నిల్చో బెట్టిన చీపురు కట్ట. ఎప్పుడూ భర్తని బిడ్డలను అరుస్తూ ఏడుస్తూ తిట్టుకుంటూ కసురుకుంటూ. ఓపిక లేని ఆడవాళ్లు ఇవన్నీ ఇంటికి దరిద్రమే. ఇవి ఆడవాళ్ళలో మాత్రమే ఉన్నాయని అనడంలేదు, వీటిలో మగవాళ్ళు చేయదగిన పనులు కూడా ఉంటాయి. వాటిని అందరూ కలసి చేసుకుని ఇంటిని శుభ్రంగా పెట్టుకోవాలి. ఇవన్నీ మార్చుకుని తర్వాత ఏదైనా పూజ కానీ సాధన కానీ చేస్తే ఫలిస్తుంది.
భర్తను పదిమందిలో దిగజార్చి మాట్లాడే ఆడవాళ్లు, అలాగే భార్యని చులకనగా చూసే భర్త వీరి ప్రవర్తన వల్ల ఒకరి మనసు కష్ట పెట్టడం వల్ల ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిలబడదు
పరాయి స్త్రీని కానీ పరాయి వాళ్ళ భర్తను కానీ ఆశిస్తే, ఇంకొకరికి ద్రోహం చేయడంతో పాటు నమ్మిన జీవిత భాగస్వామికి ద్రోహం చేసిన వారు అవుతారు. వ్యక్తిత్వం కోల్పోతారు.
ఇలాంటివన్నీ ఉన్న కుటుంబాలలో ఆ దేవుళ్ళకు దగ్గరగా వెళ్లగలిగే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి పైన చెప్పుకున్నవి అన్ని చదివి అర్థం చేసుకుని జీవితాలను, ఇంటి పరిస్థితులను, ఆలోచనలను మార్చుకుంటే ఆ తల్లి కరుణ తపకుండా లభిస్తుంది.
◆వెంకటేష్ పువ్వాడ