ప్రదక్షిణ యొక్క ప్రాముఖ్యత మరియు లాభాలు ?
ఇంట్లో పూజ అంతా అయినాక ప్రదక్షిణం చేయటం అలవాటు. “ ఆత్మ ప్రదక్షిణ నమస్కారం ” అంటాం దీనిని. దేవాలయానికి వెళ్లినప్పుడు దైవ దర్శనానికి ముందుగా ప్రదక్షిణం చేస్తాం. మామూలుగా మూడు మార్లు గుడి చుట్టూ తిరుగుతారు. తరువాతనే గుడి లోపలికి ప్రవేశించటం ఉంటుంది. దర్శనము, పూజాదికాలు అయిన తరువాత ఆత్మ ప్రదక్షిణ నమస్కారం చేస్తాం. తన చుట్టూ తానే గిర్రున కుడి వైపుగా తిరగటం ఆత్మ ప్రదక్షిణం. దీనిని నమస్కారం అని అంటున్నాం. నమస్కార ముద్రతో గుడి చుట్టూ తిరిగితే మాత్రం ప్రదక్షిణం అని మాత్రమే అనటం జరుగుతోంది.
ప్రదక్షిణం అంటే కుడి వైపుగా కదలటం. సూటిగా వేడితే ముందుకి కదలటం జరుగుతుంది. ఒక వైపు కదలకుండా ఒక వైపు మాత్రమే కదిలితే కదలిక సరళ రేఖలో కాక వృత్తాకారంగా ఉంటుంది. ఆ వృత్తానికి కేంద్రంగా ఎడమ ప్రక్కని ఉంచి కుడి ప్రక్కని మాత్రమే కదిపితే అది ప్రదక్షిణం అవుతుంది. ఇలా చెయ్య వలసిన అవసరం ఏమిటి? స్థిరంగా ఉన్న వస్తువులో శక్తి అంతర్నిహితంగ, నిద్రాణంగా ఉంటుంది. కదిలితే చలన శక్తిగా వ్యక్తమౌతుంది. గుండ్రంగా తిరగటం వల్ల వస్తువు శక్తివంత మౌతుంది. పిల్లలు ఆడుకొనే బొంగరమే ప్రత్యక్ష నిదర్శనం. కదలనప్పుడు దానికేమాత్రం శక్తి ఉన్నట్టు కనపడదు. దానిని గుండ్రంగ తిప్పి వేస్తే ఆ వేగానికి భూమిని చీల్చుకుంటూ రంధ్రం చేయగలదు. వర్తులంగా అంటే గుండ్రంగా తిరగటం వల్ల అయస్కాంత శక్తిని పుంజుకోవటం జరుగుతుంది.
ఈ ప్రక్రియకి భూమి, గ్రహాలే నిదర్శనం. ఈ తిరగటం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి తన చుట్టూ తాను తిరగటం. రెండవది సూర్యుని చుట్టూ తిరగటం. దానితో రెండు రకాలైన అయస్కాంత శక్తులు వస్తాయి. సూర్యుడికి గ్రహాలకి ఉన్న పరస్పర ఆకర్షణా శక్తి కారణంగా అవి అంతరిక్షంలో చెల్లా చెదరు కాకుండా తమ తమ నిర్దిష్ట కక్ష్యలలో తిరుగుతున్నాయన్నది అందరకూ తెలిసిన విషయమే. వాటికి ఆ ఆకర్షణ శక్తి రావటానికి తమ చుట్టూ తాము తిరగటం, సూర్యుని చుట్టూ తిరగటమే కారణమని కూడా అందరకూ తెలిసినదే. సూర్యుని చుట్టూ తిరగటం వల్ల సౌర శక్తి కారణంగా గ్రహాలు శక్తివంతాలవుతున్నాయి. తమ చుట్టూ తాము తిరగటం వల్ల తమలోని శక్తిని ప్రచోదనం చెయ్యటం లేక ఉత్తేజ పరచటం జరుగుతుంది. భూమి తన చుట్టూ తాను తిరగటాన్ని భ్రమణం (rotation) అని, సూర్యుని చుట్టూ తిరగటాన్ని పరిభ్రమణం(revolution) అని అంటారు.
భూమి ఏ విధంగా నయితే శక్తిని పొందుతోందో అదే విధంగా భూమిపై జీవిస్తున్న మానవుడు కూడా భ్రమణం, పరిభ్రమణం చేస్తే శక్తిమంతుడవుతాడుతాడు. ప్రతి మనిషి లోనూ దైవ శక్తి అంతర్నిహితంగా ఉంటుంది. అది ఆత్మ స్వరూపంగా ఉంటుంది. దానిని కేంద్ర బిందువుగా చేసుకుని గిరగిరా తిరగటం వల్ల అయస్కాంత శక్తి కలుగుతుంది. ఏదైనా వస్తువుని దూరంగా గిరవాటు వేయటానికి చేతిని గుండ్రంగా తిప్పి వేస్తారు. అప్పుడది చాలా వేగంగా చాలా దూరం వెళ్ళ గలుగుతుంది మామూలుగా వేసినప్పటికన్న. తన చుట్టూ తాను తిరిగితే అలవాటు లేని వారికి శక్తిని తట్టుకోలేక కళ్ళు తిరగటం చూస్తూనే ఉంటాం.
ప్రదక్షిణంలో తనకన్న ఎక్కువ శక్తి గల దాని చుట్టూ తిరగటం ద్వారా శక్తి మంతులు కావటం ఉంటుంది. గ్రహాలన్ని శక్తికి నిధానమైన సూర్యుని చుట్టూ తిరిగి శక్తిని పొందుతాయి . అలాగే మనిషి దైవం చుట్టూ తిరిగి అంటే ప్రదక్షిణం చేసి తనలో దైవీ శక్తిని పెంపొందించుకుంటాడు. దేవాలయంలో గర్భగుడి ధ్వజ స్తంభాల చుట్టూ ఉంటుంది ప్రదక్షిణం. అరుణా చలం వంటి క్షేత్రాలలో కొండ మొత్తానికి ప్రదక్షిణం చేస్తారు. దానిని గిరి ప్రదక్షిణం అంటారు. దీనిని మొదట ప్రారంభించింది శ్రీకృష్ణుడే అని చెప్పవచ్చు. ఇంద్ర యాగం మానిపించి గోవర్ధన పర్వతానికి ప్రదక్షిణ చేయమని చెప్పి చేయించాడు. దానివల్ల ఎంతటి సత్ఫలితం వచ్చిందో స్పష్టమే కదా! అలాగే పెద్దలకి ప్రదక్షిణ చేయటం కూడా మేలు కలిగిస్తుంది. తల్లి తండ్రులకి ప్రదక్షిణం చేస్తే ఎంతటి ఉత్కృష్టమైన ఫలితం లభిస్తుందో గణపతి కథ మనకి తెలియ చేస్తుంది.
సాధారణంగా మూడు మారులు ప్రదక్షిణం చేయటం సంప్రదాయం. మూడు సంఖ్య సత్త్వ రాజస్తమోగుణాలని, భూర్భువస్సువర్లోకాలని, స్థూల సూక్ష్మ కారణ శరీరాలని సూచిస్తుంది. మామూలుగా ప్రదక్షిణం చేసేప్పుడు చేతులు రెండు జోడించి నమస్కార ముద్రతోనే చేస్తారు. గబగబా నడవటం కాక పాదానికి పాదం తగిలే విధంగా చూసి, చూసి అడుగులు వేస్తూ ప్రదక్షిణం చేస్తారు మొక్కు ఉన్నవారు. ప్రదక్షిణం చేసేప్పుడు మనస్సు దేవుడి మీద నిమగ్నం చేసి ధ్యానం చేస్తూనో ఆ ధ్యానం కుదరటానికి జపమో, స్తోత్రమో చేస్తూనో ఉంటారు. ఇవి మామూలు అయితే, తిరుపతిలో కనిపించే విశిష్టమైన ప్రదక్షిణం అంగ ప్రదక్షిణం. తడి బట్టలతో నేల మీద సాష్టాంగ పడి గుడి చుట్టూ దొరలటం. ఇది తమంతట తాము చెయ్యటం చాలా కష్టం. ఒకరు నేల మీద సాష్టాంగ పది ఉంటే మరొకరు వారిని దొర్లిస్తూ ఉంటారు. ఇది కష్టమైనదే. అంతకు మించిన ఎంతటి కష్టం ఆ స్వామి వారికి తొలగించి ఉంటాడో మరి!
ప్రదక్షిణం చేసే సమయంలో ఎప్పుడు ఎలా వచ్చిందో తెలియదు గాని ఒక శ్లోకం చెప్పటం అలవాటయింది. పూజ ప్రారంభంలో ఇష్ట దైవాన్ని తనలో ఆవాహన చేసుకుని, పవిత్ర భావంతో పూజ అంతా పూర్తి చేసుకొని దైవ స్వరూపంగ పరిణమించిన సమయంలో “ పాపోహం పాప కర్మాణం పాపాత్మ పాప సంభవ” అంటే నాలో దైవం ఆవాహన అయితే నేను పాపిని, ఇప్పటి వరకు నేను చేసిన పూజ పాప కర్మ, నా ఆత్మ పాపంతో నిండి ఉంది ( పూజ చేస్తున్నంత సేపు నా అంతరాత్మలో దైవ భావన ఉంది ) , నేను పుట్టింది పాపం నుండి ( ఆ పాపం నేను చేసిన పనుల ఫలమా? పుట్టుకకి కారణ మైన తల్లితండ్రులా?) అని చెప్పటం ఎంత సమంజసం? ఇది కొన్ని ప్రభావాల కారణంగా మధ్య కాలంలో వచ్చి చేరింది. మనని శక్తి మంతులుగా చేయటానికి పెద్దలు ఏర్పాటు చేసిన ప్రదక్షిణం అనే కార్యక్రమాన్ని నిర్వీర్యం చేయటానికి ఉపయోగించటం సరైనదేనా? ఏం చెయ్యాలన్నది మన విజ్ఞత మీద ఆధార పడి ఉంది.
- Dr Anantha Lakshmi