భోజేశ్వరాలయం.. భోజ్ పూర్

 

 

మధ్య ప్రదేశ్ రాజధాని భోపాల్ నుంచి 28 కి.మీ. ల దూరంలో బేత్వానది (బేత్రవతి) ఒడ్డున వున్న గ్రామం భోజ్ పూర్.    పక్కనే లోతైన లోయలో ప్రవహించే బేత్వానది.  11వ శతాబ్దంలో ఈ ప్రాంతంలో బేత్వానది ప్రవాహాన్ని మళ్ళించటానికి ఇక్కడ రెండు ఆనకట్టలు కట్టి పెద్ద సరస్సు నిర్మించారు.  తర్వాత దాడులలో ఒక ఆనకట్ట పూర్తిగా ధ్వంసమయింది.  రెండవదాని శిధిలాలు ప్రస్తుతం చూడవచ్చు. 1000లో ఈ ప్రాంతాన్ని పాలించిన పరమార వంశీయుడైన భోజ రాజు పేరు మీద ఈ ఊరుకి భోజపూర్ అని పేరొచ్చింది. ఇక్కడ భోజరాజు నిర్మించిన ప్రఖ్యాతి చెందిన శివాలయం వున్నది.  ప్రఖ్యాతి చెందటానికి కారణం ఇందులో భారత దేశంలో అతి పెద్ద లింగం వున్నది.  18 అడుగుల ఎత్తు, 7.5 అడుగుల చుట్టుకొలత వున్న ఈ లింగం ఒకే రాతిలో చెక్కబడింది.  ఈ నిర్మాణం ఆర్కియాలాజికల్ సర్వే అఫ్ ఇండియా సంరక్షణలో వున్నది.  ఎత్తయిన పీఠం మీద, ఇంకా ఎత్తయిన ఆలయం దూరంనుంచే కనిపిస్తుంది.  అయితే అప్పటికీ, ఇప్పటికీ ఈ ఆలయ నిర్మాణం మాత్రం పూర్తికాలేదు.  అయివుంటే తప్పకుండా ఇది ఒక అద్భుత ఆలయంగా పేరు పొందేది.

 

 

పూర్తికాని దేవాలయమే ఇంత అద్భుతంగా, ఇన్ని వందల ఏళ్ళ తర్వాత కూడా ఇంతమంది సందర్శకులను ఆకర్షిస్తున్నదంటే ...  ఆ ఆలయ నిర్మాణం పూర్తయితే ఎలా వుండేదో!! కానీ దురదృష్టం.  కళ్యాణి, గుజరాత్ చాళుక్యులు, కాలాచూరి వంశస్ధులైన లక్ష్మి-కర్ణలతో కలిసి భోజరాజు రాజ్యంపై దండెత్తారు.   తన రాజ్యాన్ని రక్షించుకోవటానికి చేసిన ఆ భీకర పోరులో భోజరాజు చనిపోయాడు.

ఆలయ నిర్మాణం: ఈ ఆలయ నిర్మాణం అసంపూర్తిగా వుండిపోయినా అద్భుతమైన ఆలయం ఇది.  ఆలయం 106 అడుగుల పొడుగు, 77 అడుగుల వెడల్పు, 17 అడుగుల ఎత్తు వున్న ఎత్తయిన పీఠం మీద నిర్మింపబడటంతో దూరంనుంచే సందర్శకులను ఆకర్షిస్తుంది.  ఆలయం చేరుకోవాలంటే ఈ ప్లాట్ ఫాం కి వున్న 16 మెట్లు ఎక్కాలి.  పదహారేకదా అనుకోకండి..అవి చాలా ఎత్తుగా వున్నాయి, గుడి సైజుకి తగ్గట్లు.  గర్భగుడి దగ్గర కూడా కొన్ని మెట్లు ఎక్కాలి.  గర్భ గుడి గుంటలో వున్నట్లు వుంటుంది.  అక్కడ దిగే మెట్లూ ఎత్తుగానే వుంటాయి.  దిగలేనివాళ్ళు ఆ మెట్లమీదనుంచే శివ దర్శనం చేసుకోవచ్చు.

 

 

గర్భ గుడి నిర్మాణం  చాలామటుకు పూర్తయింది.  గర్భగుడికి నాలుగు అత్యంత బలిష్టమైన పెద్ద స్తంబాలమీద రాళ్ళతో కప్పు వేశారు.  బయట గోడలు, మిగతా ఆలయం అసలు నిర్మింపబడలేదు.  రాతి దూలాలతో నిర్మింపబడ్డ దర్వాజా 10 మీటర్ల ఎత్తు, 5 మీటర్ల వెడల్పు వుంటుంది.  గర్భగుడిలో 7 మీటర్ల ఎత్తున్న ఇసుకరాతి పీఠంమీద అత్యున్నతమైన శివలింగం దర్శనమిస్తుంది.  శివలింగం దగ్గర పూజ చెయ్యటానికి వీలుగా ఇనుప నిచ్చెన వున్నది.  ఇక్కడ పూజారుల స్ధానంలో మనుషులున్నా వారు పూజలు చేయించరు.  మనంతట మనం తీసుకెళ్ళిన పూజా సామగ్రి స్వామికి సమర్పించవచ్చు. ఇదివరకు పై కప్పుమీదనుంచి పెద్ద రాయి శివలింగంయొక్క యోనివట్టంమీద పడి అది రెండుగా పగిలింది.  రాయి పడిపోయిన తర్వాత కప్పులో ఖాళీకూడా అలాగే వుండి, సూర్యకాంతి, వాన శివ లింగం మీద పడేవి.  తర్వాత పానవట్టంమీద పగులు కనిపించకుండా అతికించారు.  పైన కప్పుకూడా దాదాపు పూర్వపు డిజైన్ నమూనాతో  వేశారు.

వాస్తు శాస్త్రం ప్రకారం నిర్మింపబడిన ఈ ఆలయానికి ప్రవేశంలో ఆర్చి వున్నది.  ఆర్చి వున్న ప్రధమ ఆలయం ఇదేనంటారు.  ఆలయం ముఖద్వారానికి ఇరు పక్కల గంగ, యమునల విగ్రహాలున్నాయి.  లోపల స్ధంబాల మీద ఉమా మహేశ్వరులు, లక్ష్మీ నారాయణులు, బ్రహ్మ సావిత్రిలు (సరస్వతి), సీతారాముల విగ్రహాలు అందంగా మలచబడ్డాయి. ఇక్కడివారి నమ్మకం ప్రకారం ఈ ఆలయాన్ని పాండవులు తమ తల్లి కుంతీదేవి వూజ చేసుకోవటంకోసం నిర్మించారంటారు.  అక్కడివారి కధనం ప్రకారం కుంతీదేవి శివ భక్తురాలు.  నిత్యం శివాభిషేకాలు, పూజలు చేస్తూ వుండేది.  అప్పట్లో మనుషులు చాలా ఎత్తుగా వుండేవారుట.  కుంతీ దేవి ఎత్తు 25 అడుగులని కూడా చెప్తారు.  ఆవిడ గర్భగుడిలో నేలమీద నుంచుని ఆ విగ్రహానికి అభిషేకం చేసేదిట.  నమ్మేవాళ్ళు నమ్మవచ్చు.

 

 

ఈ ఆలయ నిర్మాణంకోసం చెక్కబడిన శిలలు అక్కడవున్న క్వారీలలో ఇప్పటికీ కనబడతాయి.  క్వారీలో వున్న రాళ్ళమీద, గుడిముందు పరచిన రాళ్ళమీద చెక్కిన ఆలయ నిర్మాణ ప్రణాళికా చిత్రాలను సందర్శకులు ఇప్పటికీ చూడవచ్చు.  వాటిని చూస్తే పూర్వం కట్టడం నమూనాలను ఇలా రాళ్ళమీద చెక్కేవారనిపిస్తుంది.

ఆలయం వెనక మట్టి, రాళ్ళతో నిర్మింపబడిన రేంప్ వున్నది.  దానిని చూస్తే ఆ కాలంలో ఆలయ నిర్మాణానికి అంత పెద్ద పెద్ద రాళ్ళని పైకి ఎలా ఎత్తగలిగారో అర్ధం చేసుకోవచ్చు.  అంటే ఆ రేంప్ మీద నుంచే లాగి వుండచ్చు. శివాలయానికి ఎదురుగా దాదాపు 2 కి.మీ.ల లోపు పార్వతీ గుహ వున్నదన్నారు.  దీనిని రోడ్డు మార్గం ద్వారా, పడవ ద్వారా కూడా చేరుకోవచ్చు. భోజపూర్ లో వున్న ఇంకొక అసంపూర్ణ ఆలయం జైన్ దేవాలయం.  ఇందులో 6 మీటర్ల ఎత్తయిన శాంతినాధ్ భగవాన్ విగ్రహం, ఇరుపక్కల భగవాన్ పార్శ్వనాధ్, భగవాన్ సుపార్శ్వనాధ్ విగ్రహాలను దర్శించవచ్చు.  (ఈ రెండు ఆలయాలనూ ముందు మాకు తెలియకపోవటంవల్ల దర్శించలేక పోయాము.)
భోజరాజు రాజ ప్రాసాదం, మట్టి డాం శిధిలాలని చూడవచ్చు.

ఉత్సవాలు:

శివరాత్రికి ఇక్కడ పెద్ద తిరుణాల జరుగుతుంది.
భోజన, వసతి సదుపాయాలు
ఇక్కడ తినటానికి చిప్స్ వగైరాలు దొరుకుతాయి.  భోజన సదుపాయం, వసతి సదుపాయం లేదు.  భోపాల్ దగ్గరే.  అక్కడ అన్ని సదుపాయాలూ వుంటాయి.
దర్శన సమయాలు
ఉదయం నుంచి సాయంకాలందాకా.
ప్రవేశ రుసుము
ఒక్కొక్కరికి 10 రూ.లు.

మార్గము: భోపాల్ నుంచి మండిదీప్ వెళ్ళే బస్ లో కొంత దూరం వెళ్ళి అక్కడనుండి వేరే బస్ కానీ షేర్డ్ ఆటోల్లోకానీ వెళ్ళవచ్చు.  కానీ ఇది చాలా ప్రయాసతో కూడిన పని.  స్వంత వాహనాల్లో వెళ్ళి రావటం తేలిక.

 

- పి.యస్.యమ్. లక్ష్మి
(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)


More Punya Kshetralu