పరమేశ్వరుడు ధరించే సర్పం, ఢమరుకం, త్రిశూలం వెనుక ఇంత అర్తముందా?
త్రిమూర్తులలో లయకారుడు అయిన పరమేశ్వరుడు నిరాడంబరుడు. ఆయన అవతారం ఎప్పుడూ నిరాడంబరంగా ఉంటుంది. ఆయన్ను అందరూ భోళా శంకరుడు అని అంటుంటారు. కానీ కేవలం భోళా శంకరుడే కాదు.. భోళా నాథుడు కూడా. మంచివారిని దుష్టుల నుండి కాపాడటానికి ఆయన ఎప్పుడు ముందుంటాడు ఇక పరమేశ్వరుడు మెడలో ధరించే సర్పం, చేతిలో ఆయుధం అయినా త్రిశూలం, ఢమరుకం మొదలైనవి కూడా చాలా లోతైన అర్థాన్ని తెలుపుతాయి..
సర్పం..
పరమేశ్వరుడు శరీరంపై సర్పాలను ధరిస్తుంటాడు. విషయాలకు సర్పం ప్రతీక. విష దంతాలను పీకివేశాక సర్పం ఏ హానీ చేయలేదు. అలాగే నిర్విష విషయాలు కూడా హానికరాలు కావు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలన్న ఈ వికారాలు పోయేవి కావు. వాటిని వశంలో ఉంచుకోగలిగితే అవి హాని చేయవు. వాటితో సునాయాసంగా ఆడుకోవచ్చు. సర్పం లాంటి స్వభావం ఉన్న వ్యక్తుల ద్వారా కూడా కార్యాలను సాధించుకోవచ్చు. విషస్వభావులని పేరుబడ్డ వ్యక్తులు కూడా మహాపురుషుల సన్నిధానంలో కార్యసాధకులై పడి ఉండడం మనం చూస్తుంటాం.
త్రిశూలం..
మహాదేవుని హస్తంలో త్రిశూలం శోభిల్లుతూ ఉంటుంది. ఆయన చేతిలోని త్రిశూలం సజ్జనావళికి అభయ ప్రదానం చేస్తూ, దుర్జనులను భయకంపితులను చేస్తూ ఉంటుంది.
డమరుకం..
పాణిని మహర్షికి వ్యాకరణ బీజమంత్రాలు డమరుక నాదం ద్వారానే లభించినట్లు మనీషులు చెబుతుంటారు. పరమేశ్వరుడు డమరుకాన్ని పాణిని మహర్షి చెవి దగ్గర వాయించి జ్ఞానాన్ని అతనికి ప్రసాదించాడట. సృష్టిలో ఇలాంటి రహస్యాలెన్నిటినో భగవానుడు సృష్టి శోధకుల కర్ణరంధ్రాల దగ్గర డమరుక నాదం ద్వారా తెలియజేస్తుంటాడు. ప్రపంచంలోని అధికాధిక అనుసంధానాలు ఈశ్వరకృప ద్వారానే మానవ మాత్రులకు ప్రాప్తమయ్యాయి. పాణినిలో ఉన్న అచంచల ఆత్మ విశ్వాసం, భగవత్కృపా వైభవం లాంటి విషయాలు ఇతరులలో మనకు కనిపించవు.
*నిశ్శబ్ద.