కాలాష్టమి ఎప్పుడు? కాలాష్టమి రోజు శివుడిని పూజిస్తే ఎలాంటి ఫలితాలుంటాయంటే!
భారతీయ హిందూ ధర్మంలో ప్రతి రోజుకు ఒక ప్రత్యేకత ఉంటుంది. చెట్టు పుట్టను, పక్షులు, జంతువులను, పంచభూతాలను దైవంగా భావించి పూజించే సంస్కృతి హిందూ ధర్మానిది. ప్రతి మాసంలో ఎన్నో ప్రత్యేక రోజులు వస్తుంటాయి. వైశాఖ మాసంలో అష్టమి తిథికి కూడా ప్రత్యేకత ఉంది. వైశాఖ మాస అష్టమిని కాలాష్టమి అని అంటారు. మే 01 తేదీన వచ్చిన ఈ కాలాష్టమి తిథి ప్రత్యేకత, ఆ రోజు శివుడిని పూజిస్తే ఏం జరుగుతుంది తెలుసుకుంటే..
కాలాష్టమి రోజున శివుడిని పూజిస్తారు. అలాగే శివుడు ఉగ్రరూపంలో ఉన్నప్పుడు ఆయన హూంకారం నుండి జన్మించిన కాలభైరవుడిని పూజిస్తారు. కాలభైరవుడిని కాలాష్టమి రోజు పూజిస్తే అన్ని రకాల దుఃఖాలు, బాధలు తొలగిపోతాయని మత విశ్వాసం. ఈ కాలాష్టమి రోజునే కుజుడు ప్రవేశిస్తాడు. చాలామందికి కాలసర్పదోషం ఉంటుంది. ఈ కాలాష్టమి సందర్భంగా ఈ కాలసర్పదోషం తొలగించుకునే పూజలు కూడా చేయిస్తారు.
కాలాష్టమి రోజు శివుడిని భక్తితో పూజించాలి. గంగాజలం లేదా పచ్చిపాలలో నల్లనువ్వులను కలిపి శివుడికి అభిషేకం చేయాలి. శివుడి స్తోత్రాలను పఠించాలి. ఇలా చేస్తే కాలసర్ప దోషం తొలగిపోతుందని అంటారు. ఈరోజున నాగస్తోత్రాన్ని పఠించినా మంచి జరుగుతుంది.
బ్రహ్మ తానే అధికుడు అనే అహంకారంతో విర్రవీగినప్పుడు శివుడికి కోపం వస్తుంది. ఆ కోపంలో శివుడు బ్రహ్మకు ఎంత నచ్చజెప్పినా బ్రహ్మ అస్సలు వినడు. దాంతో శివుడు బ్రహ్మకు బుద్ది చెప్పాలని గట్టిగా హూంకరిస్తాడు. ఆ హూంకారం నుండి ఒక భారీకాయం పుడుతుంది. ఆ వెంటనే ఆ భారీ కాయుడు శివుడి ఢమరుక ధ్వనికి నాట్యం చేస్తూ నేను ఎందుకు పుట్టాను? ఏం చేయాలి? అని అడుగుతాడు. అప్పుడు శివుడు బ్రహ్మ అహంకారాన్ని అణచమని చెప్తాడు. ఆ భారీ కాయుడు తన చిటికెన వేలి గోరుతో బ్రహ్మకున్న ఒక తలను గిల్లేస్తాడు. అది తూర్పువైపు వెళ్లి పడుతుంది. దాన్నే బ్రహ్మకపాలం అని పిలుస్తున్నారు. శివుడి హూంకారం నుండి పుట్టినవాడు, భయంకరంగా ఉన్నవాడు అయినందున ఆ భారీకాయుణ్ణి కాలభైరవుడు అని శివుడు పిలిచాడు. కాలం దోషాలను ఈయన పరిష్కిస్తాడని నమ్మకం. అలాగే కాలాష్టమి రోజున కాలభైరవునికి ప్రతిరూపంగా చూసే కుక్కలకు ఆహారం పెట్టినా ఎంతో పుణ్యం వస్తుంది.
*నిశ్శబ్ద.