బుధ ప్రదోషవ్రతం.. పొరపాటున కూడా ఈ పనులు చేయకండి..!

ప్రతి నెల పూర్ణిమ తర్వాత వచ్చే త్రయోదశని ప్రదోషవ్రతంగా చేసుకుంటారు. ఈ రోజు పరమేశ్వరుడిని ఆరాధించడానికి చాలా పవిత్రమైన రోజు. శివుడిని ఆరాధించడానికి సోమవారం, మాస శివరాత్రి, మహా శివరాత్రి, ప్రదోషవ్రతం రోజు.. చాలా శ్రేష్ఠమైనవిగా భావిస్తారు. ఆగస్ఠు నెలలో ఈ ప్రదోషవ్రతం ఆగస్టు 20, బుధవారం రోజు వచ్చింది. బుధవారం రోజు వచ్చింది కనుక దీన్ని బుధ ప్రదోషవ్రతం అని అంటారు. ప్రదోష వ్రతాన్ని ఆచరించడం వల్ల పరమేశ్వర అనుగ్రహంతో జీవితంలోని బాధలు, దుఃఖాలు, వ్యాధులు, పాపాలు నశిస్తాయని చెబుతారు. ప్రదోష ఉపవాసం పాటించి వ్రతం చేసుకునేవారు కొన్ని ప్రత్యేక నియమాలు పాటించాల్సి ఉంటుంది. అలాగే ఈ రోజు పొరపాటున కూడా చేయకూడని పనులు కొన్ని ఉంటాయి. అవేంటో తెలుసుకుంటే..
ప్రదోష వ్రతం రోజు.. వ్రతం చేసే వాళ్ళు పాటించాల్సిన నియమాలు తెలుసుకోవడం వల్ల వ్రత ఫలితం పొందవచ్చు. లేకపోతే ఉపవాసం ఉన్నా, వ్రతం చేసినా దానికి తగిన ఫలితం లభించదు.
ప్రదోష వ్రతం రోజున మాంసాహారం తినడం, మద్యం సేవించడం, సిగరెట్లు వంటి మత్తు పదార్థాలు తీసుకోవడం చేయకూడదు.
ప్రదోష వ్రతం చేయాలి అనుకునేవారు ఆ రోజున ఆలస్యంగా నిద్ర లేవడం, ఆలస్యంగా నిద్రపోవడం వంటివి చేయరాదు.
ప్రదోష వ్రతం రోజు ఏవైనా మొక్కలు లేదా ఆకులను కోయరాదు,చెట్లను పీకరాదు, పక్షులక, జంతువులకు.. ఇట్లా మూగజీవులను అస్సలు ఇబ్బంది పెట్టకూడదు.
వృద్దులను, స్త్రీలను, నపుంసకులను ఎట్టి పరిస్థితులలోనూ అవమానించడం అశుభంగా పరిగణించబడుతుంది.
ప్రదోష వ్రతం రోజు నల్లని దుస్తులు ధరించడం కూడా అస్సలు మంచిది కాదు. దీని వల్ల శివుడు ఆగ్రహిస్తాడని చెబుతారు.
ప్రదోష వ్రతం రోజు పార్వతీ పరమేశ్వరులను కలిపి పూజించాలి.
*రూపశ్రీ.



