శ్రీ ఉమా సంగమేశ్వరస్వామి ఆలయం, కొప్పోలు
కొప్పోలు తెలంగాణా రాష్ట్రంలో, మెదక్ జిల్లాలో వున్న వూరు. నిజాంసాగర్ వెనకాల వున్న ఈ ఊళ్ళో ఒక గుహాలయం వున్నది.. చిన్న గుట్టమీద వున్న ఈ ఆలయం స్వయంభూ శివాలయం. 50 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతమంతా అడవిలాగా వుండేది. కర్ణాటకలోని బసవకళ్యాణ పీఠాధిపతి శ్రీ మదనానంద సరస్వతి స్వామి ఇక్కడ కొతకాలం తపస్సు చేసుకున్నారు. ఆ సమయంలో ఈ ఆలయాభివృధ్ధికి ఎంతో పాటుపడ్డారు. 1970 ప్రాంతంలో శ్రీ మదనానంద సరస్వతి ఈ ఆలయంలో అనేక విగ్రహాలని ప్రతిష్టించారు. వీటిలో ధ్వజస్ధంబం పక్కనే వున్న అతి చిన్న నంది, గరుడ, ఆంజనేయస్వామి విగ్రహాలు అత్యంత ఆకర్షణీయంగా వున్నాయి.
గర్భాలయం ముందు పెద్ద నంది వున్నది. గర్భాలయం స్వతఃసిధ్ధంగా ఏర్పడిన గుహ. ఇందులో కొలువు తీరిన శ్రీ ఉమా సంగమేశ్వరస్వామి భక్తుల కోర్కెలు తీర్చే చల్లని తండ్రి. ఇక్కడి విశేషమేమిటంటే ఈ స్వామికి అభిషేకించిన నీరు గర్భాలయంలోనే భూమిలో ఇంకిపోతుంది. బయటకి రాదు. ఎటు వెళ్తందో తెలియదు. ఇంకొక విశేషం…శ్రావణ మాసంలో గర్భగుడిలో కిందనుంచి వచ్చిన నీరుతో గర్భాలయమంతా నిండిపోతుంది. ఒక్కోసారి ఆనీటితో శివలింగం కూడా మునిగిపోతుంది. తర్వాత మళ్ళీ ఆ నీరు దానంతట అదే తగ్గిపోతుంది.
ఆలయం బయట శ్రీ మదనానంద సరస్వతి, దుర్గా పంచాయతనం, శనేశ్వరుడు, కోటి లింగేశ్వరస్వామి, నటరాజులకు ఉపాలయాలు వున్నాయి.
మన రాష్ట్రంనుంచేకాక మహారాష్ట్ర, కర్ణాటకనుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. ఇక్కడ వుండదల్చుకున్న భక్తులకోసం ఆలయంవారు ఏర్పాటు చేసిన వసతి సౌకర్యం వున్నది.
శ్రావణమాసంలోను, శివరాత్రికీ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి.
దర్శన సమయాలు
ఉదయం 6 గంటలనుంచీ సాయంత్రం 6 గంటలదాకా.
-పి.యస్.యమ్. లక్ష్మి
(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)